-నిజాలు బయటికొస్తాయనే నిద్రలేమి?
-రేవంత్ చేష్టతో పరువుపోయిందంటున్న సొంత నేతలు
-బాబు-రేవంత్ ధోరణిపై ఏపీ సీనియర్ల కస్సుబుస్సు
-తెలంగాణ వ్యవహారాల్లో వేలెందుకంటున్న జనం
-బీద అరుపుల మధ్య కోట్ల కట్టలెక్కడివని నిలదీత
-రేవంత్‌రెడ్డిపై వేటుకు పలువురి డిమాండ్లు!
-ఎగదోసి.. చెడగొట్టారంటున్న రేవంత్ కుటుంబం
-ముప్పేట దాడిలో ఏపీ సీఎం చంద్రబాబు
-బాబు ప్రమేయంపై ఏసీబీ వద్ద ఆధారాలు?
నామినేటెడ్ ఎమ్మెల్యేను నోట్ల కట్టలతో కొనే ప్రయత్నంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అడ్డంగా బుక్కయిన వ్యవహారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. సొంత పార్టీ నేతల కస్సుబుస్సుల నడుమ.. ఇక్కడి సంగతి చూడకుండా తెలంగాణలో పనికిమాలిన పనులు చేయడమేంటన్న జనాల సూటి ప్రశ్నలతో.. పరువుపోయిందని పార్టీ శ్రేణుల ఆవేదనాగ్రహాలతో.. ఏడాదిగా చచ్చీచెడీ నిలబెట్టుకొచ్చిన పార్టీని తెలంగాణలో పాడెపైకి పంపారంటున్న టీటీడీపీ నేతల ఆగ్రహావేశాలతో.. ఏమీ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
నేను నిద్రపోను.. ఎవరినీ నిద్రపోనివ్వను అనే డైలాగ్‌ను పేటెంట్ చేసుకున్నారని చెప్పే చంద్రబాబు నోటి నుంచి.. నిద్ర రావడం లేదు.. మానసికంగా కూడా ఇబ్బందిగా ఉంది.. అన్న మాట రావడం ఆయనపై ముప్పేట దాడికి నిదర్శనాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలతో అసలే నిద్రలేమిని ఎదుర్కొంటున్న బాబుకు.. ఎమ్మెల్యే కొనుగోలుకు ఆయన ప్రోద్బలంతోనే రేవంత్ ప్రయత్నించారని నిరూపించే సాక్ష్యాలు ఏసీబీ వద్ద ఉన్నాయన్న సమాచారం నెత్తిన పిడుగు పడేస్తున్నది.
మండిపడుతున్న సీనియర్లు:
రేవంత్‌రెడ్డి దొరికిపోవడం టీడీపీ నాయకులకు పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ.. రేవంత్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి.. అసలు గుట్టు బయట పడేస్తూ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆ పార్టీని, పార్టీ అధినేతను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి వ్యవహారంతో పార్టీ ప్రతిష్ఠ మంటగలిసిందని కోడెల శివప్రసాద్ స్థాయిలో ఉండే పలువురు సీనియర్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో విన్పిస్తున్నది. పొరుగు రాష్ట్రంలో.. అందునా గెలవడానికి అవకాశం లేని ఒక ఎమ్మెల్సీ స్థానంకోసం ఐదు కోట్లు వెచ్చించి.. ఇంతటి సాహసం చేయాల్సిన అగత్యమేంటన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డితో కలిసి చంద్రబాబు చేసిన పనితో రెండు రాష్ర్టాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పరువు మంటగలిసిందని సీనియర్ నేతలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఒకవైపు జగన్ అవినీతిపై పెద్ద స్థాయిలో పోరాటం చేసి, ఇప్పుడు అదే జగన్‌కు చేజేతులా అస్ర్తాలు అందించినట్లయిందని అంటున్నారు. అవినీతి గురించి లెక్చర్లు ఇచ్చే నాయకుడే దాన్ని స్వయంగా ప్రోత్సహించి పార్టీ పరువు తీశారని పార్టీ సాధారణ కార్యకర్తలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. 2019 ఎన్నికల సంగతి సరే.. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏం ముఖం పెట్టుకుని ప్రజలవద్దకు వెళ్లాలని టీడీపీ తెలంగాణ నేతలు తలపట్టుకుంటున్నారు.
బీద అరుపుల బాబుకు కోట్లు ఎక్కడివి?
ఏపీలో సాధారణ జనం కూడా చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకవైపు రాష్ర్టానికి డబ్బుల్లేవని చెప్తూ, రాజధానికోసం స్వాధీనం చేసుకున్న భూములకు పైసలు విదిలించేందుకూ కోటి బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు.. టీడీపీ గెలవలేని ఎమ్మెల్సీ స్థానం కోసం ఐదు కోట్లు ముట్టజెప్పేందుకు ఎలా సిద్ధపడ్డారని నిలదీస్తున్నారు. రాష్ట్రం విడిపోయి, సొంత రాజధాని కట్టుకునే పనిలో నిమగ్నం కావాల్సిన చంద్రబాబు.. తెలంగాణలో పనికిమాలిన పనులు ఎందుకు చేస్తున్నారని మండిపడుతున్నారు. సంబంధం లేని రాష్ట్రంలో సొంత ఇల్లు కట్టుకోవాల్సిన పనేంటని ప్రశ్నిస్తున్నారు. దగ్గరుండి రాజధానిని నిర్మింపజేయాల్సిన బాధ్యత ఉన్న పెద్ద మనిషి.. ఇక్కడే ఇల్లు కట్టుకుంటే తమకూ ధైర్యంగా ఉండేది కదా? అని నిట్టూర్చుతున్నారు. ఇవన్నీ వదిలేసి తెలంగాణ వ్యవహారాల్లో వేళ్లు పెట్టి కాల్చుకున్నారని అంటున్నారు.
రేవంత్ కుటుంబీకుల ఆగ్రహం
రేవంత్ కుటుంబంనుంచి కూడా చంద్రబాబుకు విసుర్లే ఎదురవుతున్నాయి. రేవంత్ అరెస్టు అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్లిన పలువురు టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. రేవంత్‌ను ఎగదోసి.. చెడగొట్టారని నేతలను పట్టుకుని దులిపేశారని తెలుస్తున్నది. రేవంత్‌రెడ్డి ఆవేశపరుడు అయితే ఆయనను ఎందుకు ఆపలేదు? అరెస్టు అయిన తర్వాత ఏమీ ఎరగనట్లు ఉండటం ఏమిటి? అంటూ రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు నిలదీయడంతో టీడీపీ నేతలు బిక్కముఖం వేసినట్లు సమాచారం. రేవంత్ కుటుంబీకులు ఇంతగా ఆవేదన చెందటానికి మరో కారణంగా కూడా ఉంది. ఈ నెల 11న రేవంత్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో రేవంత్ అరెస్టు కావడంతో తమ ఇంట్లో జరగాల్సిన శుభకార్యం పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు.
రేవంత్‌ను బలిపశువును చేస్తారా?
పార్టీలో ఎమ్మెల్యే స్థాయి నాయకుడొకరు.. ముఖ్యమంత్రి స్థాయి నాయకుడొకరు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలనే ప్రశ్న ముందుకు వస్తే? ఇప్పుడు సరిగ్గా టీడీపీలో ఇదే సమస్య నెలకొంది. ఎమ్మెల్యేకంటే ముఖ్యమంత్రిని కాపాడుకోవడమే ముఖ్యమంటున్న ఒక వర్గం రేవంత్‌ను బలిపశువు చేసేందుకు ఇప్పటికే డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తున్నది. రేవంత్ వల్ల పార్టీకి నష్టం వాటిల్లిందనే పేరుతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, మంచి పేరు తెచ్చుకుందామని అధినేత వద్ద పలువురు నేతలు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం.
అయితే.. రేవంత్‌ను పంపించింది చంద్రబాబేనని సంభాషణల వీడియోల్లో విస్పష్టంగా తేలిపోతున్నది. ఈ విషయం బయటపడిన తర్వాత కూడా తాను రేవంత్‌పై వేటు వేస్తే కార్యకర్తలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నానన్న అపప్రథ మూటగట్టుకోవాల్సి వస్తుందని బాబు మథన పడుతున్నారని మరో వర్గం నేతలు చెప్తున్నారు. ఈ పరిణామాలతోనే ఆయనకు నిద్ర రావడంలేదనుకోవచ్చన్నమాట!
పలకరింపు కాదు.. దులపరింపు!
చర్లపల్లి జైల్లో ఉన్న రేవంత్‌రెడ్డి బుధవారం తనను కలిసేందుకు వచ్చిన టీడీపీ నేతలతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దీనికి వెనుక పెద్ద కథే ఉన్నదని తెలుస్తున్నది. మంగళవారం చంచల్‌గూడ జైల్లో రేవంత్ ఉన్నప్పుడు పలువురు టీడీపీ నేతలు కలిశారు. పలకరించేందుకు, ధైర్యం చెప్పేందుకు కలిసినట్లు బయట కలరింగ్ ఇచ్చినా.. నిజానికి అది పలకరింపు కాదని, దులపరింపని అంటున్నారు.
రేవంత్ చేసిన పనికి ఆయనను వారు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. ఏడాదిపాటు తెలంగాణలో పార్టీని చచ్చీచెడి కాపాడుకుంటూ వస్తే.. ఉన్న పళాన దానిని చంద్రబాబుతో కలిసి నాశనం చేసిపారేశావని మండిపడ్డారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. రాజీనామా చేసి పార్టీ నుంచి తప్పుకోవాలని ఆగ్రహంతో అన్నారని సమాచారం. దీంతో కంగుతిన్న రేవంత్‌రెడ్డి ముఖం మాడ్చుకున్నారని, అందుకే బుధవారం తనను కలిసేందుకు వచ్చిన నాయకులతో మాట్లాడేందుకు ఇష్టపడలేదని అంటున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి