గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, డిసెంబర్ 23, 2014

ముంపు తెలంగాణలో.. పరిహారం ఆంధ్రలో...???!!!

-పులిచింతలలో మునిగిన మన అటవీ భూములపై సీమాంధ్ర కుట్ర
-నల్లగొండ జిల్లాలో ముంపునకు గురైన 375 హెక్టార్లు
-పరిహారంగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూమి కేటాయింపు
పులిచింతల ప్రాజెక్టు.. కృష్ణానదిపై నల్లగొండ-గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో నిర్మితమైన జలాశయం. రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో 13,915 ఎకరాలు తనలో కలిపేసుకున్న ఈ ప్రాజెక్టు మన రాష్ర్టానికి ఒరగబెడుతున్న ప్రయోజనం శూన్యం. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మాత్రం 13 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో దీన్ని నిర్మించారు సీమాంధ్ర పాలకులు. 1988లో ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి శంకుస్థాపన చేసుకుని, 2004లో వైఎస్ చేతులతో మరోసారి శిలాఫలకం వేయించుకుంది. 

pond


2006లో అన్ని అనుమతులూ తెచ్చుకుని కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టుగా పేరు మార్చుకుంది. 2013 డిసెంబర్ 7న అసంపూర్తి నిర్మాణాన్నే ఆగమేఘాల మీద ప్రారంభించారు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. రూ.1850 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురైన నల్లగొండ జిల్లాకు ఉపయోగం లేదు.

నిర్మాణం డిజైన్‌నే తమకు అనుకూలంగా మలుచుకున్న నాటి పాలకుల దుర్బుద్ధి ముంపు ప్రాంతాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం విషయంలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పరిహారం విషయంలో ఇక్కడి ప్రాంతంపై చిన్నచూపు చూడడమే కాదు.. కోల్పోయిన అటవీ భూములకు పరిహారంగాను సీమాంధ్రలో భూములు కేటాయించడం వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలను బలపరుస్తున్నది.

-తెలంగాణకు 375 హెక్టార్ల అటవీ భూమి నష్టం
పులిచింతల ప్రాజెక్టులో నల్లగొండ జిల్లాలోని మేళ్లచెర్వు, మఠంపల్లి, నేరేడుచర్ల మండలాల్లో 13,915 హెక్టార్ల భూమి ముంపునకు గురైంది. మూడు మండలాల్లో 13 గ్రామాలు నిర్వాసిత పల్లెలుగా మారాయి. ఈ ముంపునకు గురైన భూముల్లో జిల్లాలోని 375.27 హెక్టార్ల అటవీ భూములు కూడా ఉన్నాయి. గుంటూరు జిల్లా వైపు సైతం 13 గ్రామాలను ముంపునకు గురి చేసిన ఈ జలాశయం బ్యాక్ వాటర్‌లో అక్కడ కూడా భారీగానే భూములు నీట మునిగాయి. మన రాష్ట్రం వైపు 375 హెక్టార్ల అటవీ భూమితోపాటు ఏపీలోని గుంటూరు జిల్లాలో కూడా 793 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురైంది.

ఎక్కడైనా అటవీ భూములు ప్రాజెక్టుల్లో నీట మునిగినప్పుడు పరిహారంగా డబ్బులు కాకుండా తిరిగి భూమినే ఇవ్వాలని అటవీశాఖ కోరుతున్నది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితుల్లోనే.. నాటి సమైక్య ప్రభుత్వం పరిహారంగా మొత్తం 1168.27 హెక్టార్లకు బదులు 1170 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు అప్పగించింది. అప్పగించిన భూమి మొత్తం ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగపాయ గ్రామంలో 587, 588 సర్వే నంబర్లలో ఉంది. రాష్ట్ర విభజన జరగక ముందు జరిగిన ఈ కేటాయింపుతో తెలంగాణ 375 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయినట్లయ్యింది.

అటవీశాఖకు పరిహార భూ కేటాయింపుల కోసం పులిచింతల ప్రాజెక్టు వ్యయం నుంచి కోట్లాది రూపాయలను నాటి ప్రభుత్వానికి చెల్లించి మరీ 1170 హెక్టార్ల భూమి కొనుగోలు చేశారు. నాటి పాలకులు, అధికారులు కుమ్మక్కై కుట్ర పూరితంగానే ప్రకాశం జిల్లాలో భూ కేటాయింపు చేసినట్లు తెలుస్తున్నది. అనవసరంగా మన రాష్ట్రంలోని వ్యవసాయ భూమిని అటవీశాఖకు ఇవ్వడం ఎందుకన్న ఆలోచనతో ఇక్కడి అధికారులు నాడు మిన్నకుండి పోయినట్లు సమాచారం.

నాటి అలసత్వం ఫలితం.. నేడు తెలంగాణ రాష్ర్టానికి చెందిన 375 హెక్టార్ల అటవీ భూమి పక్క రాష్ట్రం లెక్కల్లోకి చేరిపోయింది. ఉపయోగం అంతా తమ ప్రాంతానికే ఉండడంతో ప్రస్తుతం నల్లగొండ జిల్లాలోని నిర్వాసితుల బాగోగులన్నీ చూసుకుంటున్న ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే.. ప్రకాశం జిల్లాలో కేటాయించిన భూమిలో 375 హెక్టార్లను మన రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదికి బదిలీ చేసుకోవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి