- సిటీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై కన్‌ఫ్యూజన్ లేదు
- కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌లో జిల్లా స్థానికులకే అవకాశం
- ఎస్‌ఐల నియామక ప్రక్రియ జోన్ల వారీగా
- మళ్లీ ఫ్రీ జోన్ వదంతులు నమ్మొద్దు: పోలీస్ శాఖ
రాజధానిలో పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై అపోహలు అవసరంలేదని పోలీస్‌శాఖ స్పష్టం చేసింది. ఫ్రీ జోన్ పేరుతో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజంలేదని పోలీస్ ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఫ్రీ జోన్ (14ఎఫ్) ఎత్తివేశారు. దీనితో సిటీ పోలీస్ రిక్రూట్‌మెంట్ మొత్తం ఇక స్థానికులతోనే జరుగబోతున్నదని తెలిపారు. హైదరాబాద్‌లో పుట్టినవారికే ఇక్కడి పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందే అవకాశం రాబోతున్నదని నమస్తే తెలంగాణకు చెప్పారు. దీనిపై అపోహలను, గందరగోళ ప్రచారాన్ని నమ్మవద్దని వారు కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పోలీస్ నియామకాల్లో ఫ్రీజోన్‌వల్ల తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న అభ్యర్థులకు ప్రతీసారి చేదు అనుభవమే ఎదురైంది. 14ఎఫ్ పేరుతో సీమాంధ్రులు కుట్ర సాగించి తమ ప్రాంతపు వారిని రాజధాని పోలీస్ విభాగంలో నియమించుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అప్పట్లో చేసిన పోరాటంతోపాటు తెలంగాణ ప్రాంత పోలీస్ అధికారులు, ఉద్యోగ సంఘాలు పోరాటం చేయడంతో 14ఎఫ్‌ను ఎట్టకేలకు ప్రభుత్వాలు తొలగించాయి. దీనితో ఫ్రీజోన్‌కు చెక్‌పడింది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇకనుంచి 6వ జోన్‌లో భాగంగానే సిటీ పోలీస్ నియామకాలు జరుగనున్నాయి. - కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌లో జిల్లా స్థానికులకే అవకాశం
- ఎస్‌ఐల నియామక ప్రక్రియ జోన్ల వారీగా
- మళ్లీ ఫ్రీ జోన్ వదంతులు నమ్మొద్దు: పోలీస్ శాఖ
జిల్లాల వారీగా కానిస్టేబుళ్లు..
పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల నియామకాలు జిల్లా యూనిట్ల వారీగా జరుగుతాయి. అలాగే ఎస్‌ఐల నియామకాలు మాత్రం జోన్లవారీగా జరుగుతాయి. త్వరలో రాబోతున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో స్థానికులకే పూర్తి అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా 80శాతం అవకాశాలు హైదరాబాద్ జిల్లాలో పుట్టిపెరిగిన వారికే ఉంటాయి. మిగతా 20శాతం కోటాలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారితో పాటు హైదరాబాద్‌వారు కూడా పోటీపడవచ్చు. ఇకపోతే ఎస్‌ఐ నియామకానికి వచ్చేసరికి 6వ జోన్‌లో భాగంగా నియామకాలు జరుగుతాయి. ఆరోజోన్‌లో స్థానికులకు 70శాతం అవకాశం ఉంటుంది. మిగిలిన 30శాతంలో 5వ జోన్‌తో పాటు 6వజోన్‌లోని అభ్యర్థులు కూడా పోటీపడవచ్చని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో ఫ్రీజోన్‌వల్ల సీమాంధ్రులే 80శాతం రాజధాని పోలీస్ విభాగంలో పాతుకుపోయారు. ఇక ఆ సమస్య లేదని, తెలంగాణ ప్రాంత అభ్యర్థులకే పూర్తి ఉద్యోగవకాశాలుంటాయని ఉన్నతాధికారుల స్పష్టంచేశారు.
ఈసారి భారీ స్పందన..
గతంలో సిటీ పోలీస్ నియామకాలకు అంతంత మాత్రంగానే స్థానికులు స్పందించేవారు. కానీ ఈసారి ఫ్రీజోన్ టెన్షన్‌తో పాటు సీమాంధ్రుల కుట్రలు కూడా లేకపోవడంతో భారీస్థాయిలో స్పందన రాబోతున్నదని ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ఉద్యోగవకాశాలు లభిస్తాయని, మళ్లీ ఫ్రీజోన్ అని వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఉన్నతాధికారులు తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా రాజధాని రిక్రూట్‌మెంట్ కోసం శిక్షణ శిబిరాలు, ఉచిత శిక్షణ కూడా ఇవ్వబోతున్నామని ఉన్నతాధికారులు నమస్తే తెలంగాణకు తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి