ఒక్కోసారి బయటకు కనబడుతున్న అంశాలకన్నా నిగూఢంగా ఉన్న వాటికే ప్రభావం ఎక్కువ ఉంటుంది. చిత్రంగా.. ప్రజలు, మీడియా కూడా పైపై అంశాలకు, అప్పటికప్పుడు సంచలనం అనుకున్న వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఈ హడావుడిలో లోపల దాగున్న అసలు విషయం చర్చకు రాదు. రేవంత్ రెడ్డి ఎపిసోడ్లో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. బయటకు కనబడుతున్నదానికన్నా తీవ్రమైన అంశాలు చాలానే ఉన్నాయి. వాటిపై పెద్దగా చర్చ జరగట్లేదు. దాని లోతుపాతుల్లోకి వెళితే మాత్రం భయంకరమైన దృశ్యం కనబడుతుంది.
రేవంత్ చర్య ఓ ఎమ్మెల్సీని గెలుచుకోవడం కోసం రాజకీయంగా దిగజారుడుగా సరిపెట్టుకోవచ్చు. ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా చేయవచ్చా అనుకున్నప్పుడు రాజకీయాల పరిస్థితే అలా తయారైందని సమాధానపడవచ్చు. ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించుకున్నప్పుడు, ఓటర్లను కొనుగోలు చేసే రాజకీయం మరింత పరిణతి చెందిందని మనల్ని మనం సముదాయించుకోవచ్చు.
కానీ, అస్సలు సమాధానపడలేని సంగతులున్నాఇందులో. రేపట్నించి ఒక మనిషిని చూస్తే మరో మనిషి అనుమానపడే వాతావరణం కల్పించిన మాటలున్నాయి. కొన్ని కులాలు అనుమానపడేలా, కొన్ని కులాలపై అనుమానాలు కలిగేలా ఉన్నాయి. కొన్ని కులాలు ముఖ్యమంత్రి పదవి కోసమే పుట్టాయి అని భ్రమ కల్పించే విధంగా ఉన్నాయి. అన్నింటికి మించి తెలంగాణ రాష్ర్టానికి వ్యతిరేకంగా సాగుతున్న కుట్ర కోణం ఉంది. కేవలం తెలంగాణకు వ్యతిరేకంగానే కాదు. తెలుగుదేశం పార్టీ రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ద్రోహం తలపెట్టగలమనే సంకేతం ఉన్నది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నామినేట్ చేసిన స్టీఫెన్ సన్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ చేయడానికి ప్రేరేపించే సందర్భంలో జరిగిన సంభాషణలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. మాటల సందర్భంలో రేవంత్ రెడ్డి ఇలా అన్నారు. మీకు ఇక్కడ(తెలంగాణ)లో ఇబ్బంది వస్తే అక్కడ(ఆంధ్రప్రదేశ్)లో ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తాం అన్నారు. నిజానికి నామినేటెడ్ ఎమ్మెల్యే అనే పదవి రాజ్యాంగంలో ఆంగ్లో ఇండియన్లకు కల్పించిన అవకాశం. ఇది రాజకీయ అవసరాల కోసం ఏర్పడే పదవి కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నియమించిన స్టీఫెన్ కూడా టీఆర్ఎస్ కార్యకర్త కాదు. అనేక క్రిస్టియన్ సంఘాలు, ఎన్జీవోలు, ఆంగ్లో ఇండియన్లు ఆయన పేరును ప్రభుత్వానికి ప్రతిపాదించాయి. దాని ప్రకారం ప్రభుత్వం ఆయనను ఎమ్మెల్యేగా నామినేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాగే చేయాలి. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఆంగ్లో ఇండియన్ల ప్రతినిధిగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ ఎమ్మెల్యే పదవిని రాజకీయ వ్యభిచారం చేసే వారికి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. ఇక స్టీఫెన్ హైదరాబాదీ కాబట్టి, ఆయన తెలంగాణ వారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ పౌరుడు కాని వారికి కూడా నామినేట్ పదవి ఇస్తుందట. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కూడా నష్టం కాదా?
చంద్రబాబుకు హైదరాబాద్‌తోనే ఎక్కువ అవసరం ఉంది. కాబట్టి ఇక్కడి రాజకీయాలపై దృష్టి పెట్టాడు అని కూడా రేవంత్ సెలవిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాద్ తో ఏమి పని? ఉమ్మడి రాజధాని అనే అంశం కేవలం కార్యాలయాలకు సంబంధించిందే కానీ, పరిపాలనకు సంబంధించింది కాదు కదా. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని క్రియాశీలం చేసే పనిని తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఓ ఎమ్మెల్యే తన భుజాలమీదికి ఎత్తుకోవడం ఈ గడ్డకు ద్రోహం చేయడం కాదా?
అన్నింటికి మించి, నేను రెడ్డి ప్రతినిధిని. రెడ్డిలకు ఆంధ్రలో ఛాన్స్ లేదు. కమ్మలంతా చంద్రబాబు వెంట, రెడ్డిలంతా జగన్ వెంట ఉన్నారు. అందుకే ఇక్కడ రెడ్డిని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. నాకే పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంత రెడ్డిలకు, టీడీపీలోని రెడ్డిలకు నేనే ప్రతినిధిని. రాయలసీమ, ఆంధ్ర రెడ్డిలు గుంటూరు, కృష్ణాలో ఏమీ చేయలేరు (ఎందుకంటే అక్కడ కమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు) కాబట్టి వారు హైదరాబాద్ వస్తున్నారు. స్థిరపడుతున్నారు. వారికీ నేనే ప్రతినిధిని. నెల్లూరు, కడప, చిత్తూరు తదితర ఆరు జిల్లాల ఆంధ్ర రెడ్డిలు హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. వారికి కేసీఆర్ దగ్గర అప్రోచ్ ఉండదు. కాబట్టి నేనే దిక్కు...ఇలా సాగింది రేవంత్ రెడ్డి మాటల ప్రవాహం. ప్రజాస్వామ్యాన్ని కుల పంచాయితీగా మార్చేశారు. తెలుగుదేశాన్ని కమ్మల పార్టీగా, జగన్ పార్టీని రెడ్డిల పార్టీగా తేల్చేశారు. మరి తెలుగుదేశంలో ఉన్న రెడ్డిలు, జగన్ పార్టీలో ఉన్న కమ్మల పరిస్థితి ఏమిటి? వారు ఎప్పుడూ అపనమ్మకంగా ఉండాలా? లేక వారిపట్ల పార్టీ నాయకత్వం అపనమ్మకంతో ఉండాలా? ఆంధ్ర ప్రాంత రెడ్డిలకు అక్కడి రాజధానిలో చక్రం తిప్పే అవకాశం లేదని కూడా తేల్చేశారు ఇక్కడి రెడ్డి గారు. అందుకే వారు హైదరాబాద్ వస్తున్నారట. అంటే.. అక్కడ అధికారంలో భాగస్వామ్యం కాలేకపోయిన రెడ్డి వారిని రేవంత్ హైదరాబాద్ పట్టుకొచ్చి వారికి పెత్తనం ఇచ్చే బాధ్యత స్వీకరించినట్లా? ఆరు జిల్లాల నుంచి వచ్చిన సెటిలర్ల సంక్షేమానికి కూడా ఈయనే బాధ్యత తీసుకుంటున్నారు. మరి ఆయన మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల ప్రతినిధా? ఆంధ్ర సెటిలర్ల ప్రతినిధా?
కమ్మ కులానికి చెందిన చాలామంది వ్యాపార వేత్తలు హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తున్నారు. రామోజీరావు, రవిప్రకాశ్, రాధాక్రిష్ణ (మీడియా సంస్థల యజమానులు) లాంటి వారు కూడా నాతో కంఫర్ట్‌గా ఉంటారు అని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణలో రెడ్డికి నాయకత్వం అప్పగించాలని, అది కూడా కమ్మ వ్యాపారులకు కంఫర్ట్‌గా ఉండే తనకే అప్పగిస్తారని కూడా రేవంత్ చెప్పారు. రేవంత్ రెడ్డిగారు... రెడ్డి నాయకుడిగా ఎదిగి, కమ్మ వ్యాపారస్థుల ప్రయోజనం కాపాడే బాధ్యత కూడా తీసుకుంటారన్నమాట.
ఆంధ్రలో కమ్మలు తెలుగుదేశంలో, రెడ్డిలు జగన్‌తో ఉన్నారని తేల్చేశారు. తెలంగాణలో కూడా కులాల వారీగా పార్టీలు చీలిపోవాలని కోరుకుంటున్నారు. జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి వారంతా నా బంధువులే. వారి పని అయిపోయింది. రేపు వారి పిల్లలకు భవిష్యత్ కావాలి. జనరేషన్ గ్యాప్‌లో ట్రాన్స్ ఫార్మింగ్ చేసే బాధ్యత కూడా నాపైనే పెడుతున్నారు...అని కూడా రేవంత్ అన్నారు. అంటే తెలంగాణలోని రెడ్డిలంతా ఒకే గూటికిందికి రావాలని కోరుకుంటున్నారు. కుల, మత తారతమ్యం లేకుండా ఉంటున్న తెలంగాణ పౌరుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర కాదా ఇది? రెడ్డిలంతా ఎక్కడున్నా ఒకటిగానే ఉంటారనే ప్రచారం ఎవరికి మేలు చేస్తుంది? ఇది తాను పుట్టిన కులానికి తానే ద్రోహం చేసుకోవడం కాదా?
కులాల గురించి, రాజకీయ అధికారం గురించి రేవంత్ రెడ్డి ఇంత పచ్చిగా మాట్లాడిండు. అప్పుడు తెలుగుదేశం నాయకులు స్పందన ఎలా ఉండాలి. అది రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం. దానితో మాకు సంబంధం లేదు అని ఒక్కరూ ఖండించడం లేదు. పైగా రేవంత్‌ను సమర్థిస్తున్నారు. లంచం ఇవ్వబోయి పట్టుబడిన వ్యక్తిని కాపాడుకునే క్రమంలో తెలంగాణ తెలుగుదేశం నాయకులు మరో తప్పు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలను ఖండించకపోవడం అంటే సమర్థించినట్టే లెక్క. రేవంత్ చెప్పిన కుట్ర వ్యూహాలన్నీ తెలుగుదేశం పార్టీ వ్యూహాలుగానే భావించాల్సి వస్తుంది. కానీ తెలంగాణ సమాజానికి అలాంటి రాజకీయ వ్యవస్థ అవసరం లేదు. కులాల ఆధారంగా ఏర్పడే రాజకీయ వ్యవస్థను తెలంగాణ సమాజం ఎన్నడూ కోరుకోలేదు. అలా కోరుకునే వారిని కూడా క్షమించదు.
కమ్మలు పోతే రెడ్డిలు, రెడ్డిలు పోతే కమ్మలు. మధ్యలో మూడో క్యాస్ట్ ఎంటరయిందని కూడా రేవంత్ ఫీల్ అయ్యాడు పాపం. చంద్రబాబు అధికారంలోంచి వెళ్లిపోతే సీఎం పీఠం తమకే దక్కుతుందని రెడ్డిలు భావించారట. అలా జరగనందుకు బాధ పడుతున్నారు. అసలు సీఎం సీటు లేకపోతే రెడ్డిలు భరించలేరు అన్నట్లు మాట్లాడారు. అసలు సీఎం సీటు ఓ కులానికో, రెండు కులాలకో రిజర్వు చేసి పెడతారా? తమ కులస్తులకు సీఎం సీటు రాకుంటే రగిలిపోతారా? తెలంగాణకు అసలు అలాంటి చరిత్ర ఉన్నదా? అది ఆంధ్ర కల్చర్ అయివుండవచ్చు. దాన్ని తెలంగాణకు ఆపాదించే కుట్ర కాదా ఇది?
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
baga cheppav anna
ధన్యవాదాలు Rajesh K భయ్యా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి