ఎంతగ నాపుదమన్నను
సుంతయు నాపంగలేరు, చోద్యమిదయ్యా!
వంతలు పాడుచు నడ్డెడి
పంతము మిమ్మే దహించు! వలదీపంతాల్!!
కలహించిన చెడిపోదురు!
తిలకించుచుఁ గేంద్ర మిదియుఁ దేల్చుట తథ్య,
మ్మిల నీ బిల్లునె యాపుట
వలనన్ మీకగును ముప్పు! వలదాపంగన్!!
సమైక్యాంధ్ర తీర్మానము
కుదురదోయి యిప్పుడు!
చర్చలడ్డుచో కలుగును
నష్టమె మీ కెప్పుడు!!
సీమాంధ్రకు వలసినట్టి
వనరులేవొ చర్చింపుడు!
చర్చ సేయకున్నను బిల్
రాష్ట్రపతికి చేరు సుమ్ము!!
చెరువు తెగియు నీరు వెడల,
పిదప కట్ట కట్టినట్లు,
బిల్లు వెడలి పోయిన తరిచింతించిన లాభమేమి?
చర్చలెవ్వరాపుదురో
వారె సమాధాన మపుడు
చెప్పవలసినట్టివార
లగుదురయ్య ప్రజలకున్!
సీమాంధ్ర ప్రయోజనాలు
చర్చలోన దెలుపకున్న,
తెలంగాణ బిల్లు నెగ్గు!
సీమాంధ్రకు నష్టమొసగు!!
సమైక్యాంధ్ర కోరునట్టి
వైసీపీ టీడీపీల్
నష్టపడిన సీమాంధ్రకు
సంజాయిషి నీయవలయు!
నష్టపరచినట్టివారి
నిష్టపడుదురా ప్రజల్?
రాజకీయ ప్రయోజనం
నెరవేరునె మీకప్పుడు?
ప్రజల మంచి కోరి మీరు
చర్చల చేపట్టుడయ్య!
రాజకీయమందు నెగ్గి
పదవులు చేపట్టుడయ్య!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి