గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, జులై 20, 2015

ఇదే...మన అచ్చమైన తెలంగాణ వేడుక...!!!

దక్షిణాయణ ప్రారంభంలో వరుణుడు కరుణించి ప్రకృతి మాత పులకించగా, వ్యవసాయంపై ఆధారపడిన ప్రజలు, భక్తి ప్రపత్తులతో మహాశక్తిని విభిన్న రూపాలలో కొలుచుకోవటం అనాదిగా వస్తోంది. శక్తి ఆరాధనలలో ఇదీ ఒక భాగమే. తెలంగాణలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం...బోనాల పండుగ.


bonalu

ప్రపంచవ్యాప్తంగా ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. అచ్ఛమైన తెలంగాణ తెలుగువారి పండుగగా దీనిని అభివర్ణిస్తారు. 
ప్రత్యేకించి మన హైదరాబాద్ నగరంలో అయితే, ప్రతీ కూడలిలో కొలువుదీరిన అమ్మవారి దేవాలయాలు ఆకుపచ్చని తోరణాలతో, విద్యుద్దీప కాంతులతో తళుకులీనుతుంటై. కనీసం ఆ ఒక్క రోజైనా నిఖార్సయిన గ్రామీణ వాతావరణాన్ని కన్పింపజేయడం బోనాల పండుగలోని విశిష్టతగా చెప్పాలి. బోనం అంటే భోజనమే. భక్తులు అమ్మవారికి తమ మొక్కుల్ని తీర్చుకోవడమే కాదు, తమకు అన్నాన్నిస్తున్న ఆ తల్లికి కృతజ్ఞతా సూచకంగా, పవిత్రమైన బోనం కుండలో భోజనాన్ని వండి సమర్పించుకోవడం కూడా. ఇదే ఇందులోని పరమార్థం.


పిల్లల సంరక్షణలో అమ్మవారు


జాతరలో కొందరు మొక్కుబడి చెల్లించుకునేందుకు వెళ్తారు. మరి కొందరు ఉత్సాహం ముప్పిరి గొనగా దైనందిన జీవితం నుండి మార్పు కోరి తమ వాళ్ళతో కలిసి సరదాకు వెళ్తారు. ఇంకొందరు భక్తి ఆవేశం తన్మయించగా జాతరలో తామే ఒక భాగంగా మారుతారు. ప్రధానంగా బోనాల జాతర అంతరార్థం మరోటి ఉంది. చిన్న పిల్లలకు మశూచి, అమ్మవారు వంటి భయానక వ్యాధులు రాకుండా ఉండాలని, అందుకు అమ్మవారు వారికి రక్షణ కవచంగా ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసమే ప్రజలను ఇలా ప్రతి ఏడూ బోనాలు సమర్పించుకొనేలా చేస్తున్నట్టు తెలుస్తోంది. 


bonalu2

తెలంగాణా సంస్కృతికి అద్దం పడుతూ, హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో అసంఖ్యాకంగా హిందువులు జరుపుకొనే పెద్ద పండుగలలో ఒకటి బోనాలు. దీనిని ఆషాడ జాతర అనీ అంటారు. తెలంగాణలోని అంతటా వివిధ తేదీలలో జరుపుకుంటారు. హైదరాబాద్ పాతబస్తీలోని షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహాకాళీ ఆలయం, పాతబస్తీలోని లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారు, సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవాలయాలలో అయితే అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. 


bonalu

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి గుడులను సందర్శించడం ఒక మహాజాతరను తలపిస్తుంది. ఈ బోనాల ఆచారం ప్రాచీనకాలంలోనూ ఉన్నదనేందుకు శ్రీనాథుని హరవిలాస కావ్యంలోనే చక్కని ఉదాహరణ ఉంది. నానావిధ పాకములుగ/ నానాలుగ జేసి నాలుగై దట్టికలన్/ బోనాము దొంతి బేర్చిరి అంటారందులో. ఈ ఆధునిక కాలంలోనూ ఏ మాత్రం తీసిపోని విధంగా జాతర జరుగుతుంది. ఈ పండుగ సమయాలలో ఇంటి ద్వారాలకు, వీధులకు, వేపమండలతో అలంకరణ చేసుకోవడం ఓ ప్రత్యేకతగా కనిపిస్తుంది.


ఈ సందర్భంగా నిర్వహించే వివిధ కార్యక్రమాల విశేషాల మాలిక ఇక్కడ-


ఘటోత్సవం:


అమ్మవారికి ఎదురువెళ్ళి పుట్టింటి నుండి తీసుకొని వచ్చే ఎదురుకోళ్ళతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది. ఘటం అంటే కలశం. కలశంతో అమ్మవారికి స్వాగతం పల్కడం. పూర్ణకుంభ స్వాగతమన్న మాట. 

bonalu

ప్రత్యేకమైన కలశంలో అమ్మవారు ఆవాహన చేయబడి పురవీధులలో ఊరేగుతారు. అసలైన బోనాల ఉత్సవం ముందు రోజు వరకు ఉదయం, సాయంత్రం అమ్మవారు ఘటంపై సూక్ష్మరూపంలో ఆసీనురాలై పురవీధుల గుండా సంచారం చేస్తూ, భక్తుల పూజలు అందుకుంటారు. ఘటోత్సవం ద్వారా అమ్మవారి పూజలు ప్రారంభమైనట్లు లెక్క. ఆలయానికి వెళ్ళ లేని వృద్ధులు, వికలాంగులు తమ ఇండ్ల వద్దకు తరలివచ్చిన అమ్మవారిని సేవించి, మొక్కులు తీర్చుకొని తరిస్తారు. 


సాక సమర్పణ:


సాక అంటే శాఖ. అంటే చెట్టుకొమ్మ. వేపమండను పసుపు నీటి సాకలో ఉంచి, అమ్మవారికి సమర్పించడం. దీనినే సాకివ్వడం లేదా శాఖ సమర్పణం అంటారు. వేపాకు ఉంచిన పసుపు నీరు చల్లి సాక సమర్పిస్తే, ఆ తల్లి తమను చల్లగా చూస్తుందని ప్రజల నమ్మకం.


ఫలహారపు బండ్లు:


బోనాల పండుగ రోజున భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇండ్లలో తయారు చేసుకొని, వాటిని బండ్లలో పెట్టుకొని బయల్దేరుతారు. ఆలయం చుట్టు ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి కొంత సమర్పించి, మిగిలింది తమ ఇంటికి తెచ్చుకొంటారు. కుటుంబ సభ్యులంతా దానిని మహాప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా వేల సంఖ్యలో భక్తులు బండ్లపై ప్రసాదాలు సమర్పించడం ఆనవాయితీ. వీటినే ఫలహారపు బండ్లుగా పిలుస్తారు.


పోతురాజుల వీరంగం:


బోనాలలో వీరొక ప్రత్యేకత. పోతురాజులు వీరంగం చేస్తూ అమ్మ ఆలయానికి తరలి వెళతారు. శరీరమంతా పసుపు రాసుకొని, లంగోటి (వస్త్రము) కట్టుకొంటారు. కాళ్ళకు గజ్జెలు, కళ్ళకు కాటుకతో నుదుట కుంకుమ దిద్దుకొంటారు. నోట్లో పచ్చటి నిమ్మకాయలు పెట్టుకొంటారు. నడుం చుట్టూ వేపమండలు చుట్టుకొంటారు. పసుపుతాడుతో చేసిన కొరడాను ఝుళిపిస్తూ, తప్పెట్లు వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ మహాభక్తి పారవశ్యంతో కదలి వెళతారు. అమ్మ వారికి సోదరుడైన పోతురాజు గ్రామాన్ని సంరక్షిస్తూ తమకు అండగా ఉంటాడని ప్రజల నమ్మకం. బోనాల పండుగ రోజున వేలాది మంది పోతురాజులు పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులను తమ అభినయాలతో, నృత్యాలతో రంజింపజేయడం ఒక అపూర్వ సన్నివేశం. పోతురాజులతో కలసి, నృత్యాలు చేస్తూ, చిందులు వేస్తూ తెలంగాణ యాసలో పాటలు పాడుతూ, తన్మయత్వంతో కదలి వెళ్ళే జనాలను ప్రపంచం తనివి తీరా చూడాల్సిందే తప్ప వర్ణించ మాటలు రావు.


రంగం వేడుకలు:


రంగం అంటే భవిష్యవాణి వినిపించడం. బోనాల పండుగ ప్రతి ఏడూ నిర్ణీత ఆదివారం నాడే జరుగుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం ముఖమండపంలో మాతంగేశ్వరి ఆలయం వద్ధ అమ్మవారికి ఎదురుగా ఒక అవివాహిత స్త్రీ వచ్చి కుండపై నిలబడుతుంది. దేవతా అమ్మవారి వంకే తదేకంగా చూస్తూ ఆమె కళనంతా ఆవహింపజేసుకొంటుంది. భవిష్యత్తులో జరిగే పరిణామాలను, ముఖ్య విశేషాలను ఆమె నోటి ద్వారా ఆ దేవతే వెల్లడిస్తుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ భవిష్యవాణిని వినడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. రంగం కార్యక్రమంలో పాల్గొనే స్త్రీ (మాతంగి) జీవితం అమ్మవారికే అంకితం. ఒక కత్తికి మాంగల్య ధారణ చేసి జీవితాంతం అవివాహితగానే ఉండిపోతుంది. బోనాల జాతర జరిగే ప్రతి ఆలయానికి ఒక మాతంగి ఉండవచ్చు. లేదా ఒకే మాతంగి కొన్ని ఆలయాల బోనాల ఉత్సవాలకు రంగం వేడుకలో పాల్గొనవచ్చు.


గావు పట్టడం:


వంశపారంపర్యంగా వస్తున్న పోతురాజులు ఉదయం 9 గంటల ప్రాంతంలో విలయతాండవం చేస్తూ, ఉద్వేగంతో ఊగి పోతూ ఆలయం చుట్టూ నాట్య విన్యాసాలు ప్రదర్శిస్తారు. అమ్మవారికి ఎదురుగా, మేళతాళాల మధ్య, లయబద్ధంగా నాట్యం చేస్తున్నప్పుడు అమ్మవారు వారిపై ఆవహిస్తుందని అంటారు. ఈ సందర్భంలో సొరకాయ, గుమ్మడికాయలను బలి ఇస్తారు. ఈ కాయలను పోతురాజు నోటితో కొరకటమే గావు పట్టడం. అంతకు పూర్వం జంతుబలులు ఉండేవి. ఇప్పుడు వీటిని నిషేధించారు. ఈ కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు చూసి తరిస్తారు.


సాగనంపు:


గావు పట్టడం పూర్తయ్యాక అమ్మవారి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై ఉంచి, మంగళవాయిద్యాలతో పురవీధుల గుండా ఊరేగించుకుంటూ తీసుకొని వెళతారు. ఇలా ఆమెను సాగనంపి ఉత్సవాన్ని ముగిస్తారు.


వ్యాస రచయిత: వనిత విజయకుమర్ ద్యాప


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి