గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జులై 18, 2015

బాబు అతిశయం... దేశానికి అరిష్టం...!!!


రాజమండ్రి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 27 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఒక విషాదం. "నావల్ల తప్పు జరిగివుంటే, క్షమించండి" అని చంద్రబాబు స్వయాన తన తప్పును గుర్తించి క్షమాపణ కోరారు. కానీ, ఆయనఅతిశయాలు, ప్రచారార్భాటాలను నమ్ముకొని రాజకీయాలను ఈదగలనని, పక్క రాష్ర్టాన్ని ప్రత్యర్థిగా భావించి అక్కడి అస్తిత్వ పాలకుడిని తుడిచేయగలనని అనుకున్నంత కాలం.. బాబుకు ఆయనే ఒక సమస్యగా మారుతాడు తప్ప, ఆయన ఎత్తుగడలు మాత్రం నిజం కాలేవు.


చంద్రబాబు తొమ్మిదేళ్లు ఏలిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఒక దేశంగా, దానికి ఆయనో ప్రధానిగా వ్యవహారాలు నడిపిన అనర్థ ధోరణిని ఇప్పటి అవశేష ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగిస్తున్నారు. దీనికి ఇటీవల వికీలీక్స్ బయటపెట్టిన ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలు వ్యవహారమే సాక్ష్యం. 


srinu


అప్పటి వాజపేయి ప్రభుత్వానిది సంకీర్ణ బలహీనత. దాన్ని ఆసరా చేసుకొని చంద్రబాబు అంతర్జాతీయ సంబంధాలను సైతం స్వయంగా నడిపి దేశానికి అనర్థాలు కొనితెచ్చిన సంఘటనలున్నాయి. దేశ భద్రతలోనూ మిత్రునిపట్ల అలసత్వం ప్రదర్శించిన వాజ్‌పేయి ప్రభుత్వ ధోరణి కూడా చంద్రబాబు అతిశయాలకు కారణమని చెప్పాలి. బహుశా 1998 లేదా 99లో కావచ్చు, రక్షణ శాఖ ముందస్తు అనుమతి లేకుండానే కోస్తా తుఫాను తాకిడి ప్రాంతాల చిత్రాలు తీయడానికి చంద్రబాబు ప్రభుత్వం అమెరికా సెటిలైట్ కంపెనీ (ఐకోనస్)తో ఎంవోయూ చేసుకుంది. అంతే.. అది పని కూడా ప్రారంభించింది. కానీ చెప్పిన పని పక్కన పెట్టి హైదరాబాబాద్‌లోని రక్షణ కర్మాగారాలు, వాటి స్థావరాల ఫోటోలు తీసుకెళ్లినట్లు ఆ తర్వాత బయటపడింది. ఆ విషయం అమెరికా మీడియాలో వెల్లడి ఐన తర్వాత మనదేశ మీడియాలోనూ వచ్చింది. ముందస్తుగా కేంద్రం అనుమతి పొందకుండానే ఒక విదేశీ కంపెనీతో ఒప్పందానికి వచ్చి దేశానికి అనర్థం చేసిన ఘన చరిత్ర ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ఉంది. 


అపుడు విషయమంతా తెలిశాక రక్షణ శాఖ చంద్రబాబు ప్రభుత్వానికి తాఖీదు పంపింది. కేంద్రంలో తన పలుకుడి ఉపయోగించి ఆ ఒప్పందానికి మళ్లీ ఆమోదం తెచ్చుకోవడం బాబుగారి ఆ ఎపిసోడ్‌లో కొసమెరుపు. ఎంత సంకీర్ణ ప్రభుత్వమైనా దేశ భద్రత విషయంలో ఇంత అలసత్వం పనికిరాదు. కానీ ఇవాళ సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొనసాగుతున్నది. వాజపేయి లాగ మోదీకి సంకీర్ణ బలహీనత కూడా లేదు. మళ్లీ అదే చంద్రబాబు ప్రభుత్వం మరో అనర్థ ధోరణికి పాల్పడిందని వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఎలా చూస్తున్నదన్నది, ఎలాంటి చర్యలు తీసుకుంటదనేదే కీలకాంశం. మనం ఏ కోణంలో చూసినా వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్‌ను పరిశీలించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిది. 


అంతకన్నా మించి, తెలంగాణ రాష్ట్రం పట్ల ఏడాది కాలంగా ఏనీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని దర్యాప్తు జరిపించాలి. అలాగే దేశ భద్రత దృష్ట్యా ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని ఒక రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు ప్రయత్నించడాన్ని తీవ్రమైనదిగా గుర్తించి దర్యాప్తు జరపాలి.
దేశ సరిహద్దులు కాపాడే ఆర్మీ ఇంటలిజెన్స్ కూడా అలాంటి ట్యాపింగ్ టెక్నాలజీని కేంద్ర హోంశాఖ అనుమతితోనే కొనాలి. ఉదాహరణకు, గతంలో జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులపై నిఘా పెట్టేందుకు వారి ఫోన్లను ట్యాప్ చేయడానికి హార్డ్ వేర్ ఇంటర్‌సెప్షన్ బేస్‌స్టేషన్‌ను ఖరీదు చేసిందట. ఏడాదిన్నర తర్వాత ఈ విషయం కేంద్ర హోంశాఖకు తెలిసింది. ఈ ఆంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకొని అప్పటి జనరల్‌పై పలువురు అధికారులను తీవ్రంగా ఆక్షేపించింది. దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి ట్యాపింగ్ టెక్నాలజీని కేంద్ర అనుమతి లేకుండా ఎవరూ కొనుగోలు చేయరాదని చెప్పడానికి అంతకన్నా మరో నిదర్శనం అక్కర లేదు.


అయితే.. వికీలీక్స్ విడుదల చేసిన ఈ-మెయిల్స్‌లో ఏపీ ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇన్స్‌పెక్టర్ దుర్గాప్రసాద్ హ్యాకింగ్ టీంతో ఈ-మెయిల్స్ ద్వారా జరిపిన సంప్రందిపులు నిజమా కాదా? తమ క్లయింట్ ఏపీ ఇంటలిజెన్స్‌కు ట్యాపింగ్ టెక్నాలజీ కావాలని హ్యాకింగ్ టీం సింగపూర్ ప్రతినిధి మెగ్లీటాకు ఓర్టస్ కన్సల్టింగ్ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి పంపిన ఈ-మెయిల్ నిజమా, కాదా? వాటి వెనకాల ఉన్న ఉద్దేశాలు ఏమిటనేవి బహిరంగపర్చాల్సిన బాధ్యత మాత్రం కేంద్రంపై ఉంటది. 


తెలంగాణ అస్తిత్వ రాజకీయాన్ని బలహీన పరచడమే తన రాజకీయ లక్ష్యంగా పెట్టుకొని ఉండడం వల్లనే ఆయన గత జనవరి నుంచే ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని, ఆ విషయాన్ని వికీలీక్స్ బయట పెట్టిన ఈ-మెయిల్స్ చెబుతున్నాయని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు యాభై లక్షల రూపాయలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాక.. తమ ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నదని చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మనకు తెలిసినంత వరకు తెలంగాణ ఏసీబీ కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా ట్యాపింగ్ చర్యలకు పాల్పడలేదని గమనించాలి. మరి ఇపుడు బయటపడ్డ ఈ-మెయిల్ ప్రకారం ట్యాపింగ్ టెక్నాలజీని చంద్రబాబు ప్రభుత్వం ఎవరి కోసం కొనుగోలు చేయాలనుకునదనుకోవచ్చు? 25 నుంచి 50 మొబైల్ లైన్లను ట్రాక్ చేయాల్సి ఉంటుందని హ్యాకింగ్ టీంకు ఆర్టస్ సీఈవో పంపిన ఈ-మెయిల్స్‌లో వెల్లడైంది. 


అవి తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఫోన్లను ట్యాప్ చేయడానికేనా? అనేది మరో బలమైన అనుమానం. పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు ప్రభుత్వం అలాంటి ట్యాపింగ్ టెక్నాలజీని కొనుగోలు చేయాలనుకున్నట్లయితే.. దాన్ని తీవ్రమైన పరిణామంగా కేంద్రం భావించాలి. చంద్రబాబు రాజకీయ అతిశయాలు, ఆర్భాటాలు అనేక అనర్థాలకు తావిస్తూవుంటాయి. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో అలవాటైన అతిశయ, ప్రచార అర్భాటాలు ఇంకా అతన్ని వీడినట్లు లేదు. కేంద్రం తన జేబులోనే ఉందనే ఒక్కప్పటి తత్వం ఆయనలో ఇంకా కొనసాగుతున్నది. అందువల్లనే ఇలా పక్క రాష్ర్టాన్ని వేధించడమే కాదు, దేశ భద్రత విషయాలు కూడా లెక్కలేకుండా, కేంద్ర అనుమతులు సైతం ఆయనకు తృణప్రాయంగా మారుతున్నాయి.


దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై చాలా కాలమే కావచ్చు. విదేశీ ప్రతినిధులు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపే వెసులుబాటు బాగా పెరిగి వుండొచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడితోనో, బ్రిటన్ ప్రధానితోనే ఏకాంత చర్చలు జరిపే అధికారం కేవలం ఈ దేశ ప్రధానికి, రాష్ట్రపతికి తప్ప మరెవరికీ ఉండదు. కానీ దాన్ని సైతం లెక్కచేయని చరిత్ర చంద్రబాబుకు ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌తో, బ్రిటన్ ప్రధాని టోనీ బ్లేయర్‌తో ఏకాంత చర్చలు జరిపి ఆయన చరిత్ర సృష్టించారు. అప్పటి ప్రతిపక్షనేత ఎంవీ మైసూరారెడ్డి అసెంబ్లీలో చంద్రబాబును నిలదీసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని గుర్తుచేశారు. ఆయా దేశాల అధ్యక్షులతో ఏకాంత చర్చలు జరిపే అధికారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకెక్కడిదని నిలదీశారు. 


అదొక ఘనత అన్నట్లు అప్పట్లో చంద్రబాబు ఆస్థాన పత్రిక, అమాయక జనాల చేత బాబుకు చప్పట్లు కొట్టించే ప్రయత్నాలు చేసేది, కానీ వాటిని రాజ్యాంగ ఉల్లంఘనలని ఏనాడూ చెప్పిన పాపానపోలేదు. అవే బాబు ఆస్థాన పత్రికలు వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్ కథనాలకు ప్రాధాన్యమిచ్చి రాయకపోవడాన్ని గమనించాలి. బాబు అతిశయాలు, ప్రచారార్భాటాలు దేశానికి ఉపయోగపడ్డాయో, అనర్థాలయ్యాయో తెలియదు కానీ ఆయన అతిక్రమణలు, ప్రచారార్భాటాలు మాత్రం మారలేదని వికీలీక్స్ బయటపెట్టిన ఈ-మెయిల్స్‌తో పాటు, మొన్న రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట సంఘటన కూడా చెపుతున్నది.


చివరగా..రాజమండ్రి పుష్కరాలలో జరిగిన తొక్కిసలాటలో 27 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఒక విషాదం. "నావల్ల తప్పు జరిగివుంటే, క్షమించండి" అని చంద్రబాబు స్వయాన తన తప్పును గుర్తించి క్షమాపణ కోరారు. కానీ ఆయన అతిశయాలు, ప్రచారార్భాటాలను నమ్ముకొని రాజకీయాలను ఈదగలనని, పక్క రాష్ర్టాన్ని ప్రత్యర్థిగా భావించి అక్కడి అస్తిత్వ పాలకుడిని తుడిచేయగలనని అనుకున్నంత కాలం.. బాబుకు ఆయనే ఒక సమస్యగా మారుతాడు తప్ప, ఆయన ఎత్తుగడలు మాత్రం నిజం కాలేవు.


వ్యాస రచయిత: కల్లూరి శ్రీనివాస్ రెడ్డి


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


2 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

మధుసూదన్ గారూ,
మీకు బాబు గారంటే ఎంత ప్రేమో ?? ప్రేం నగర్ లో వాణిశ్రీ నాగేశ్వరరావు వెనకాల పడ్డట్లు బాబుగారివెంటే మీరూ,మీ పోస్టులూనూ :)) బాబు గారిని ఇలానే వెంటాడండి.అస్సలు తగ్గవద్దు.


మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నీహారిక గారూ,
మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీరు వ్యంగ్యంగా నన్ను గురించి అన్నా, చంద్రబాబుపై ఎవరిది నిజమైన ప్రేమో స్పష్టంగా ఋజువవుతున్నది సుమా! మాకు చంద్రబాబుపై ప్రేమ ఏనాటికీ ఉండదుగాక ఉండదు. మా తెలంగాణ అభివృద్ధికి అతడు సైంధవుడే. ఇకపోతే అతడు మీ ముఖ్యమంత్రి! ఆమాత్రం ప్రేమ (ప్రేమనగర్‍లో ఉన్నంత కాకున్నా) మీకూ ఉంటుంది! అందుకే వెనకేసుకొస్తున్నారు. నన్ను దెప్పిపొడవడం ద్వారా మీ ప్రేమను వెల్లడిస్తున్నారు. ఆమాత్రం అర్థం చేసుకోలేనివాడినా నేను? సరే, కానీండి! స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి