గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 16, 2015

టీడీపీ అబద్ధాల సాగు!

-ప్రాజెక్టును అడ్డుకోవాలని సీడబ్ల్యూసీకి లేఖ రాయలేదా?
-డీపీఆర్‌లు మాత్రమే అడిగామని టీడీపీ సమర్థన
-తిన్నింటి వాసాలు లెక్కపెడితే పుట్టగతులుండవ్
-టీడీపీ వైఖరిపై తెలంగాణవాదుల ఆగ్రహం
-పాలమూరును చంద్రబాబు అడ్డుకోలేదా?
-అవి కొత్త ప్రాజెక్టులు.. విభజన చట్టానికి వ్యతిరేకం
-వాటి నిర్మాణాన్ని చేపట్టవద్దు
-ప్రజా ప్రయోజనాలకు ఆ ప్రాజెక్టులు విరుద్ధం
-ఇదీ చంద్రబాబు లేఖల సారాంశం
గతేడాది తెలంగాణలో ఎన్నికల పంట ఎండిపోవడంతో ఈసారి అబద్ధాల సాగు మొదలుపెట్టింది టీడీపీ! పసలేని వాదనలు ప్రవహింపజేస్తూ.. కలుపు మొక్కలు పెంచుతున్నది! అసత్యాలు.. బుకాయింపులు.. తెలంగాణ వ్యతిరేకత.. కనికట్టు సమపాళ్లలో జోడించి.. ఎరువుగా వేస్తున్నది! ఒకవైపు టీడీపీ అధినేత, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని బాహాటంగా గొంతు చించుకుంటుంటే.. తెలంగాణ ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని ఢిల్లీకి వెళ్లి మరీ చెప్తుంటే...తెలంగాణలోని టీడీపీ నేతలు ఖండించాల్సింది పోయి.. అబ్బే.. బాబు అసలు అలా అననే లేదు అంటూ బుకాయిస్తున్నారు! బాబుకు ఆ ఉద్దేశమే లేదంటూ వెనకేసుకొస్తున్నారు! 


babu


మరోవైపు పాలమూరును ఉద్ధరించిందే తామని బల్ల గుద్దుతున్నారు! కీలక ప్రాజెక్టులు తామే ప్రారంభించామని గప్పాలు కొడుతున్నారు! ఆ ప్రాజెక్టులు పదేండ్ల టీడీపీ హయాంలో ఎందుకు మూలపడ్డాయి? వాటికి కేటాయించినదెంత? అని నిలదీస్తే.. చల్లగా జారుకుంటున్నారు! సవాలు విసిరి చర్చకు రమ్మన్నా.. రాంరాం అంటున్నారు! తాము తెలంగాణలో ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే తమకు పరమావధని చెప్పకనే చెప్తున్నారు! తమది ఆంధ్ర పార్టీయేనని నిరూపించుకుంటున్నారు! వీళ్ల వ్యవహారం చూసిన తెలంగాణవాదులు.. అసలు వాళ్లు ఈ గడ్డ బిడ్డలేనా? అని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు!!


ఒకవైపు తెలంగాణను ఎండబెట్టాలని, పాలమూరు జిల్లాకు ఉరి వేయాలని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తుంటే.. తెలంగాణ టీడీపీ నాయకులు ఆ ప్రయత్నాలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీ సీఎం తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కండ్ల్లుమూసుకుని.. అవాస్తవాలు వల్లెవేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నవి కొత్త ప్రాజెక్టులని, విభజన చట్టానికి అవి వ్యతిరేకమని, వాటిని చేపట్టరాదని, అవి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని చంద్రబాబు తన లేఖల్లో రాస్తే.. చంద్రబాబు ఆ విధంగా లేఖ రాయలేదని.. అసలు ఆయనకు ఆ ఉద్దేశమే లేదని కళంకిత టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. 


సాక్ష్యాలు కండ్లముందు కనిపిస్తున్నా.. వాటి జోలికి వెళ్లకుండా మాటలతో మాయ చేస్తున్నారు. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు ఆపాలని ఇటీవల చంద్రబాబు సీడబ్ల్యూసీకి లేఖ రాయడం.. దానిపై యావత్ తెలంగాణ సమాజం భగ్గుమనడం తెలిసిందే. చంద్రబాబు ప్రయత్నాలను జనం వ్యతిరేకిస్తున్నారన్న సోయి కూడా లేకుండాపోయిన టీడీపీ తెలంగాణ నేతలు.. బాబు భజన చేయడంపై తెలంగాణవాదులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. 


ఉద్యమకాలంలో రాష్ట్రసాధన ప్రయత్నాలకు చంద్రబాబు గండి కొట్టినప్పుడు ఆయనను వెనకేసుకు వచ్చిన ఆ పార్టీ నేతలు.. ఇప్పటికీ తమ తీరు మార్చుకోకపోగా.. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం పెల్లుబుకుతున్నది. కనీసం అబద్ధాలు ఆడేటప్పుడైనా అతికెటట్లు చూసుకుని ఎన్ని కుప్పిగంతులైనా వేసుకోవాలని, లేదంటే తల బొప్పి కట్టడం ఖాయమని హితవు పలుకుతున్నారు.


ఆపాలన్నది నూరుపాళ్ల వాస్తవం


పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలను ఆపాలని చంద్రబాబు కోరింది నూటికి నూరుపాళ్లు వాస్తవం. సీడబ్ల్యూసీకి రాసిన లేఖ అందుకు తిరుగులేని సాక్ష్యం. కృష్ణానదీ యాజమాన్య బోర్డు, కేంద్ర జలసంఘం, అపెక్స్ కౌన్సిల్ పరిశీలనకు తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లు సమర్పించాలి. సదరు సంస్థలు వాటిపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని అనుమతి ఇవ్వాలి. ఆ అనుమతి వచ్చేవరకు ఆ ప్రాజెక్టుల (పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు) పనులను చేపట్టనీయొద్దు. తెలంగాణ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా ఏవైనా పనులు చేపట్టినట్లయితే వాటిని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం నిలువరించాలి అని చంద్రబాబు తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. 


ఇదే లేఖలోని ఏడో పేరాగ్రాఫ్‌లో అసలు ఈ ప్రాజెక్టులు ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి ఇదే విషయం ఫిర్యాదు చేశారు. కానీ.. దీనికి మసిబూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నించిన టీడీపీ తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి.. పాలమూరు పథకాన్ని నిలువరించాలని చంద్రబాబు చెప్పలేదని నిస్సిగ్గుగా వాదిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపమని చంద్రబాబునాయుడు లేఖ రాయలేదు. కేంద్ర జల సంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు కేవలం డీపీఆర్‌లు మాత్రమే సమర్పించాలని లేఖ రాసిండు అని రేవంత్ బుకాయిస్తున్నారు. టీడీపీ నేతలు చేస్తున్న వాదన పచ్చి బూటకం అనేందుకు మూడు లేఖలు కళ్లముందు ఉన్నాయి. కేంద్ర జల సంఘం, కేంద్ర జలనవరుల మంత్రిత్వ శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఒకసారి లేఖ రాసిన చంద్రబాబు సర్కారు.. ఆపై తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఆ సారాంశంతో మరో లేఖ రాసింది. 


వీటికి తోడు ఏపీ రాసిన లేఖ సారాంశాన్ని ఉటంకిస్తూ కేంద్ర జల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి మరో లేఖ పంపింది. వీటన్నింటినీ పరిశీలిస్తే అర్థమయ్యేది ఒక్కటే.. పాలమూరు, డిండి పథకాలను వెంటనే నిలిపివేయాలనేది ఏపీ సర్కారు డిమాండ్. అక్కడితో ఆగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టులతో ఎగువ రాష్ర్టాల హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ ఇతర రాష్ర్టాలను కూడా తెలంగాణపైకి ఎగదోసే కుట్రకు పాల్పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వలసల జిల్లా అయిన మహబూబ్‌నగర్‌ను సస్యశ్యామలం చేసేందుకు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు విముక్తి కల్పించేందుకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నది. 


కానీ.. అవి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఒకవైపు టీడీపీ అధినేత బాహాటంగా చెలరేగుతుంటే.. టీడీపీ తెలంగాణ నేతలు మాత్రం ఇంకా చంద్రబాబు చర్యలను సమర్థిస్తూనే మాట్లాడుతుండటం విశేషం. పొడిపొడి మాటలతో బుకాయిస్తున్న ఇక్కడి టీడీపీ నేతలు ఈ వాస్తవాలను ఎందుకు గుర్తించడం లేదని తెలంగాణవాదులు నిలదీస్తున్నారు. కేంద్రం, కేంద్ర జల వనరుల శాఖ, ఇతర నీటి సంస్థలకే కాదు.. ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలోనూ పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలు చేపట్టడం పద్ధతి కాదని, అక్రమమని రాశారు. 


కేంద్ర జల సంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆ లేఖల్లో స్పష్టంగా ఉంది. అయినా తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం మంచోడు మా బాబు.. అంటూ ఆయనను వెనకేసుకురావడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా.. చంద్రబాబుకు ఆ ఉద్దేశమే లేకపోతే కేంద్ర జల వనరుల శాఖకు పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై ఎందుకు లేఖ రాశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవిగో సాక్ష్యాలు..


కేంద్ర జల వనరుల శాఖతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్, కేంద్ర జల సంఘం కార్యదర్శికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ నంబర్-13898/ఐఎస్.ఈఏ/2015, తేదీ 11.06.2015 లోని ఆరో పేరాగ్రాఫ్‌లో ఇలా ఉంది.. Until all the said authorities duly grant their approval and duly after considering views of AP on the said DPR, State of Telangana can not undertake any construction work for implementation projects mentioned in news item. Any such act on part of State of Telangana contrary to mandate of A.P. Reorganization Act, 2014 are to be restrained from undertaking such activity.


ఇదే లేఖలో ఏడో పేరాగ్రాఫ్ ఇలా ఉంది. It is a matter of serious concern not only to the State of A.P., but also for the K.R.M.B., Apex Council, CWC and the Central Government and would be contrary to public interest.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి గత నెల 17న ఒక లేఖ పంపింది. 


అందులో... In the letter, Principal Secretary, Govt. of Andhra Pradesh has contended that unilaterally proceeding with construction of any new project on river Krishna without the approval of Krishna River Management Board and the Apex Council would tantamount to violation of principles laid down in A.P. Reorganization Act, 2014. అని ఉంది. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర జల సంఘం రాసిన లేఖలో చంద్రబాబు లేఖ సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పింది. 


కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు కడుతున్నదంటూ ఏపీ వాదిస్తున్నందున, మీ అభిప్రాయాలు చెప్పండంటూ కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ నవీన్ కుమార్ తన లేఖలో కోరారు. కానీ.. ఇవేవీ తెలంగాణ టీడీపీ నాయకులకు కనిపించకపోవడం విశేషం.


అసలు వీళ్లు తెలంగాణ బిడ్డలేనా?!


చంద్రబాబు, ఆయన ప్రభుత్వం రాసిన లేఖలను చూసిన తర్వాత కూడా ఏపీ ప్రయోజనాలకే కొమ్ము కాస్తున్న తెలంగాణ టీడీపీ నేతలు అసలు ఈ గడ్డ బిడ్డలేనా? అని అనుమానం కలుగుతున్నదని టీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లేఖ చూడగానే.. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరైనా చంద్రబాబును నిలదీస్తారని, కానీ టీడీపీ నేతలు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ అడిగేందుకు కూడా సాహసించలేక పోతున్నారని, దీనిని బట్టి వాళ్లెంత బానిస మనస్తత్వంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. చంద్రబాబు ఈ రెండు ప్రాజెక్టులు కొత్తవని చెప్తున్నారని, దీనిపై టీడీపీ తెలంగాణ నేతల వైఖరేంటని వారు డిమాండ్ చేస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి