గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, జులై 21, 2015

వినిపిస్తలేదా.. గోదావరి గోస?!

dam


గోదావరి పుష్కరాలు ఒక విషయాన్ని ప్రజలముందు సాక్ష్యాధారాలతో పెట్టాయి. సమైక్య ప్రభుత్వాలు తెలంగాణకు గోదావరి నదిలో ఆఖరుకు ఏం మిగిల్చాయో కళ్లకు కట్టాయి. మహారాష్ట్రలోని నాసిక్, నాందేడ్‌లో పుష్కరాలకు బోలెడు నీళ్లున్నాయి. ఏపీలోని రాజమండ్రిలో పుణ్యస్నానాలకు ప్రవాహాలున్నాయి. కానీ తెలంగాణలో ప్రాజెక్టుల నీళ్లు ఇవ్వాల్సి వచ్చింది. అంటే ముందుభాగంలో మహారాష్ట్ర ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఒడిసిపట్టింది. వెనుక భాగంలో ఏపీ కడుపునిండా నీళ్లు మళ్లించుకుంది. మధ్యలో ఉన్న మనమే అన్యాయమై పోయాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నపుడే ఎగువన ఉన్న మహారాష్ట్ర వరుస బ్యారేజీలతో వాటాను మించి గోదావరి నీటిని ఆపుకుంది. 

-పైన.. కింద రాష్ర్టాలు కళకళ
-మధ్య తెలంగాణకెందుకీ విలవిల
-వరుస బ్యారేజీలతో ఒడిసిపట్టిన మహారాష్ట్ర
-ప్రాజెక్టులతో వాటా భద్రపరుచుకున్న ఏపీ
-అనాథల్లా మిగిలిన తెలంగాణ ప్రాజెక్టులు
-కుట్రపూరిత అంతర్‌రాష్ట్ర ఒప్పందాలు
-నీళ్లులేని చోట ప్రాజెక్టులు కట్టిన పాలకులు
-బ్యారేజీ డిజైనే లేకుండా కాల్వల నిర్మాణాలు
-స్వరాష్ట్రంలో సవరణలకు సర్కారు యత్నాలు
-రాజకీయ కక్కుర్తితో మోకాలడ్డుతున్న ప్రతిపక్షాలు

అవి పూర్తవుతున్నా సమైక్య ప్రభుత్వాలు చోద్యం చూశాయి. ఓట్ల అవసరం వచ్చినపుడు డ్రామాలు చేశాయి. అంతే తప్ప ఆ రాష్ట్రంతో పోటీపడి ఇక్కడ ప్రాజెక్టులు నిర్మించి నీళ్ల మీద హక్కులు, వాటాలు సాధించేందుకు యత్నించలేదు. కలిసి ఉన్నంత కాలం గోదావరి అంటే ధవళేశ్వరం బ్యారేజీయే అంటూ కృత్రిమ చరిత్రను మనపై రుద్దిన సమైక్య పాలకులు... సీమాంధ్ర ప్రాంత వాటా జలాల్ని మాత్రం చుక్క నష్టపోకుండా జాగ్రత్త పడ్డారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాకుండా సర్వశక్తులు ఒడ్డడం ద్వారా తమకు వచ్చే నీటికి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. 


తెలంగాణలో గోదావరి ఘోష విన్న పాపాన పోలేదు. చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఇపుడైనా మన హక్కులు సాధించుకునేలా గోదావరి మీద ప్రాజెక్టులు కట్టుకుందామంటే ఇపుడు దానికి బయటివాడికి తోడు ఇంటివాడూ అడ్డుపుల్లలు వేస్తున్నారు. డిజైన్లు.. డిమాండ్లు.. అంటూ ఇక్కడి నాయకులు కూడా భగీరథ యత్నాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. నవ్వెటోళ్ల ముందు జారిపడేలా... తమ రాజకీయాలతో తెలంగాణ ప్రజల కంటో వేలు పెట్టి పొడుస్తున్నారు. 


తన వాటా తాను చూసుకున్న ఆంధ్ర నాయకత్వం..


మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకంలో పుట్టే గోదావరి 1,465 కిలోమీటర్ల మేర ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఈలోగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మీదుగా తన ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మహారాష్ట్రకు 888.90 టీఎంసీలు, కర్ణాటక 19.90 టీఎంసీలు, మధ్యప్రదేశ్ 625.46 టీఎంసీలు, ఒరిస్సా 292.96 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1480 టీఎంసీలు కేటాయింపు ఉంది. ఈ లెక్కన ఉమ్మడి రాష్ట్రంలోని కేటాయింపుల్లో తెలంగాణ దాదాపు 945 టీఎంసీల గోదావరి జలాలను వినియోగించుకోవాలి. ఇది ఈ ప్రాంత హక్కు. మహారాష్ట్ర తన వాటా జలాల్ని వినియోగించుకునేందుకు భారీ ఎత్తున ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో అనేకం పూర్తికాగా... మిగిలినవి చివరి దశలో ఉన్నాయి. 


బాబ్లీ పై ఏకంగా 12 వరుస బ్యారేజీలు కట్టి గోదావరిని ఒడిసిపట్టింది. జైక్వాడ్, ఎస్సారెస్పీ మధ్య 79 టీఎంసీలను వాడుకోవాల్సిన మహారాష్ట్ర 102 టీఎంసీలను వాడుకుంటున్నది. 12 బ్యారేజీలు కట్టినపుడు సమైక్య పాలకులు పట్టించుకోకపోవడంతో తెలంగాణ 23 టీఎంసీల నీటిని కోల్పోయింది. అయితే నాటి పాలకులు ఆంధ్ర ప్రాంతానికి మాత్రం నష్టం రానివ్వలేదు. ఇక ఇప్పటి ఆంధ్రప్రదేశ్ తన వాటా 535 టీఎంసీల్లో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 230 టీఎంసీల వరకు నీటిని వాడుకుంటున్నది. పోలవరం, పట్టిసీమ పేరుతో 272-300 టీఎంసీల గోదావరి జలాల్ని వాడుకునేందుకు యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టుకున్నాయి. అంటే తనకు రావలిసిన వాటా కంటే ఎక్కువగానే నీటిని వాడుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. 


జలసంఘం అంచనాలే...


అధికారంలో ఉన్నన్నాళ్లూ తెలంగాణకు గోదావరినదిలో హక్కులను రక్షించడం చేతకాని పార్టీలు.. ఇపుడు తెలంగాణ ప్రభుత్వం గోదావరినదిలో గరిష్టంగా ప్రయోజనం పొందేలా ప్రాజెక్టులు రీ డిజైన్ చేస్తుంటే గగ్గోలు పెడుతున్నాయి. మహారాష్ట్ర అంగీకరించనని తేల్చి చెప్పినచోట ప్రాజెక్టు ఎలా కడతారో..ఎలా పూర్తి చేస్తారో వారికో తెలియాలి. వివాదాలున్నచోటే కట్టితీరాలనడం ఏం విజ్ఞతో వారే చెప్పాలి. కేంద్ర జల సంఘం అధికారిక లెక్కల ప్రకారం.. 1965 నుంచి 2010 వరకు పెరూర్ దగ్గర దాదాపు 1500 టీఎంసీల గోదావరిజలాలు అందుబాటులో ఉన్నాయి. ఎగువ ప్రాంతం నీటిని వాడుకున్న తర్వాత 600 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంటుంది. అందుకే ప్రభుత్వం వృథాగా సముద్రంలో కలుస్తున్న మూడు వేలకుపైగా టీఎంసీల నీటిని సాగుకు మళ్లించేందుకు భగీరథ యత్నం మొదలుపెట్టింది. 


అంతకంటే మంచి ప్రదేశం ఉందా?


గోదావరిలో ప్రాణహిత కలిసేచోట నీటిని లెక్కిస్తే వెయ్యి టీఎంసీలకు పైగా లభ్యత ఉంటుందనేది అంచనా. ఇందులో ఎగువ ప్రాంతం వారు వాడుకుంటే మేడిగడ్డ వద్ద 522 టీఎంసీల నీటి లభ్యత ఉందని వ్యాప్కోస్ తేల్చింది. వాస్తవానికి ఎగువ ప్రాంతం వారు తమ వాటాలను వినియోగించుకోవడం లేదు. దానివల్ల జలాల లభ్యత వ్యాప్కోస్ చెప్పినదానికంటే ఎక్కువగానే ఉంటుంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడితే పుష్కలమైన నీటిని మళ్లించవచ్చనేది వ్యాప్కోస్ నివేదిక. 


అందువల్లనే ప్రభుత్వం నీటి లభ్యత, ఎక్కువ రోజులు నీరు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో దానికి అంగీకరించింది. కానీ రాజకీయ కోణంలో ప్రతిపక్షాలు దీన్ని చూస్తూ చేజేతులా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కంతనపల్లి ద్వారా దేవాదులకు పుష్కలమైన నీటిని అందించాలని సర్కారు వ్యూహాన్ని రచిస్తుంటే సర్వే సమయంలోనే ప్రతిపక్షాలు, స్వయం ప్రకటిత మేధావులు కాళ్లలో కట్టెలు పెడుతున్నారు. 


తెలంగాణకు నీళ్లు ఇవ్వని నాడు ఇంట్లో పండుకున్న వారు ఇపుడు ప్రాజెక్టులకు కదలిక తెస్తుంటే యుద్ధ ప్రకటనలు చేస్తున్నారు.ఓవైపు కళ్ల ముందు ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నది. అవినీతి ఆరోపణలు తప్ప అక్కడి ప్రతిపక్షాలు ప్రాజెక్టును ఆపాలని మాత్రం అనడం లేదు. ఆ సోయి తెలంగాణలోని ప్రతిపక్షాలకు లేక పోయింది. సర్వే స్థాయిలోనే నిర్ణయాలు జరిగినట్టు రచ్చరచ్చ చేసి రాజకీయలబ్ది కోసం ప్రయత్నిస్తున్నాయి.


తెలంగాణలో తడిసిన భూములెన్ని?


పేరుకు గోదావరి నది తెలంగాణలో సుదీర్ఘంగా ప్రవహిస్తున్నా.. దానిపై కట్టిన ప్రాజెక్టులెన్ని? కట్టిన వాటిలో నిల్వ ఉన్న నీరెంత? అవి పొలాల్ని తడిపినదెంత? పరిశీలిస్తే గుండె చెరువవుతుంది. సమైక్య పాలనలో కట్టింది ఒక్క శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మాత్రమే అదీ పూర్తి చేయనేలేదు. మిగిలిన ఒకటి రెండూ పూర్తిగా అంతర్‌రాష్ట్ర వివాదాల్లోకి నెట్టి చేతులు దులుపుకున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు మొదటి దశలో 12 లక్షలు, రెండో దశలో ఆరు లక్షలు,మొత్తంగా 18 లక్షల ఎకరాలకు నీరు అందించాలి. ఇప్పటికీ కనాకష్టంగా ఏడున్నర లక్షల ఎకరాలకు నీరందడం లేదు. 


1975లో లెండి ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటి వరకు పూర్తికాలేదు... నాలుగు దశాబ్దాల కింద మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న లోయర్ పెనుగంగ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప అడుగు ముందుకు పడలేదు. సింగూరు రిజర్వాయర్‌పై 4.8.1978లో కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దీన్ని మొదలు పెట్టి నిజాంసాగర్ 58 టీఎంసీల సామర్థ్యానికి ఎసరు తెచ్చారు. చారిత్రక ఇచ్చంపల్లి ప్రాజెక్టుది కన్నీటి గాథ. నిజాం హయాంలో పనులు మొదటిపెట్టి అప్పట్లో ప్లేగు వ్యాధి విజృంభించడంతో పనులు నిలిపివేశారు. దీనిపై 7.8.1978న మహారాష్ట్రతో ఒప్పందం కూడా జరిగింది. ప్రాజెక్టుకు ఎఫ్‌ఆర్‌ఎల్ నిర్ధారించక ఆగి పోయింది. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రం ఎఫ్‌ఆర్‌ఎల్ 150 మీటర్లుగా నిర్ధారించారు. దేవాదుల ప్రాజెక్టు.. చెప్పింది వేరు. కట్టింది వేరు ఇపుడు పట్టుమని పదివేల ఎకరాలకు కూడా సాగునీరు అందని దుస్థితి. 


ఇక ప్రాణహిత ప్రాజెక్టుపై 6.10.1975, 7.8.1978ల్లో రెండు పర్యాయాలు మహారాష్ట్రతో ఒప్పందాలు జరిగాయి. కానీ నలభై ఏండ్లయినా ప్రాజెక్టు సామర్థ్యం, ఎఫ్‌ఆర్‌ఎల్ చర్చలు కొలిక్కి రాలేదు. మహారాష్ట్ర అంగీకారం లేకుండా, కనీసం మెయిన్ డ్యాం డిజైన్ కూడా రూపొందించకుండా కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టుకు కాల్వలు కట్టి ప్రజలకు సినిమా చూపించారు. సమైక్య ప్రభుత్వం తీరు చూసి ఒళ్లుమండి 2013లో అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఈ ప్రాజెక్టు మాకు అంగీకారం కాదు. మీరు చేస్తున్న వ్యయం మొత్తం నీళ్లలో పోసినట్టే.. జాగ్రత్త అంటూ ఘాటుగా లేఖ రాసినా పట్టించుకోలేదు. 

వరుస బ్యారేజీలు అవసరమని చెప్పిన హనుమంతరావు ...


సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజినీరు హనుమంతరావు గతంలో తన సుదీర్ఘ అనుభవంతో గోదావరిపై నీటి లభ్యత ఆధారంగా వరుస బ్యారేజీల ప్రణాళిక ప్రకటించారు. తెలంగాణలో ఎనిమిది చోట్ల బ్యారేజీలను ప్రతిపాదించారు. అందులో పెద్ద బెల్లాల , సూరారం, కంతనపల్లి ఉన్నాయి. ఆయన ప్రతిపాదించిన సూరారం అనే బ్యారేజీయే ఇపుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మేడిగడ్డ. తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ చేస్తున్న రీడిజైన్ ప్రణాళికలను చూసి కేసీఆర్‌కు నేను తెలియదు. కానీ ఆయన గోదావరిపై రూపొందిస్తున్న ప్రణాళిక చాలా బాగుంది. హ్యాట్సాఫ్... అని గోదావరి ప్రాజెక్టులపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ రిటైర్డ్ ఇంజినీర్ చెప్పారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి