గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జులై 26, 2015

బాబూ నీకో దండం! దయచేయండి!!

అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి కానీ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడ్తమంటే ఊరుకునేది లేదు. తెలంగాణలైతే ఏ సుట్టమైన మూటముల్లె సర్దుకుంటడు. ఇది సెక్షన్ 8 గురించి మాట్లాడేటోళ్లకి కూడా వర్తిస్తది. 


హైదరాబాద్ జనం లేటుగా నిద్రపోయేవారు. లేటుగా నిద్రలేచేవారు. కానీ ఎన్టీఆర్ వారికి ఉదయాన్నే లేవడం నేర్పారు ఇదీ చంద్రబాబు నాయుడి వ్యాఖ్య. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తాను ఎన్కట చేసిన కువ్వారం పనులు మర్షిపోయిండు. అది జెప్తలేడు. ఆయన సొక్కని మనిషే ఐతే ఆంధ్రప్రదేశ్ జనాలకు యాడాది సంది ఏం జేసిండో, ఇంకేం జేస్తడో చెప్పాలె. చెప్తే బండారం బైట పడ్తది. అది చెప్పకుంట ఉండేతందుకే కొత్త ముచ్చట చెబుతుండు. నిజంగనే చెప్పదల్సుకుంటే కొత్తగ కట్టాలనుకునే రాజధాని అమరావతికోసం ఇప్పుడున్న ఊళ్లకు ఊళ్లనే మాయం జేయాల్సిఉంటదని చెప్పాలె. 

సొంత ప్రచారం యావతోటి పుష్కర భక్తుల పాణం పిడాత తీశ్న అని జెప్పాలె. పొద్దు లేషిన దగ్గరి నుంచి పండేదాక హైదరాబాద్‌ను కంట్లె పెట్టుకునుడు, ఆడిపోసుకునుడు బాబుకు అలువాటైంది. అయినా బట్టకాల్షి మీదేసుడు ఈనెకు కొత్తేమి గాదు. మాట్లాడితే సాలు హైదరాబాద్‌ను నేను కట్టిన, మామ నిద్రలేపిండు అంటుండు. అస లు హైదరాబాద్‌కు ఈనె గాని ఆంధ్ర నాయకులు గాని చేసిందేమీ లేదు. దోస్కోని దాసుకునుడు, ఉన్నది లూఠి చేసుడు తప్ప.


srinu


70 యేండ్ల పెద్దమనిషి 50 యేండ్ల సంది తెలంగాణ కోసం కొట్లాడుతున్న (అప్పటికి) కొండాలక్ష్మణ్ బాపూజీని జలదృశ్యం నుంచి రాత్రికిరాత్రే బేదఖల్ చేసింది నువ్వు కాదు? తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు వేదిక ఇచ్చినందుకు నువ్విచ్చిన బహుమానం కాదు అది! నెక్లస్ రోడ్డంటూ హుసేన్‌సాగర్ బొండిగ విష్కి నీ మామ సమాధి కట్టింది నువ్వుకాదు? నాళాను ఆక్రమించి భవంతులు/హోటళ్లు కట్టింది మీ వోళ్లు కాదు? మీ ఆంధ్రోల్ల జమానల్నే కదా ట్యాంక్‌బండ్ మీద అన్నీ మీవోళ్లయే విగ్రహాలు పెట్టుకుంది. 


బాగే ఆమ్‌ని మింగి నోరు తిరగరాని తెలుగు లలిత కళాతోరణం కట్టిందీ మీరే గదా! సర్కా రీ నల్లాలన్నీ బంద్ చేసిందీ, భోలక్‌పూర్ వాసులు డ్రయినేజీ నీల్లు తాగి సావడానికీ కారణం మీ లాంటోళ్లే గదా! అయినా మేము హైదరాబాద్‌ను డెవలప్‌జేసినం అంటుండ్రు. మీరు జేసిందంతా రాస్తే సదివెతందుకే ఏండ్లు పడుతది. రింగురోడ్లను రింగయ్యి అష్టావంకర్లు తిప్పిందీ మీరే కదా! ఇగ రాజకీయాల కొస్తే దానికి మతోన్మాదాన్ని కలిపి మారణహోమానికి పాల్పడిందీ మీ ప్రాంత నాయకులే కదా! మీ ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డగా హైదరాబాద్‌ను చేసిన్రు. శ్రీరాములయ్య షూటింగ్ షురువైన రోజూ, ఆ తర్వాత జరిగిన హత్యలు చూస్తే అది ఈజిగనే సమజైతది. అసలు హైదరాబాద్ సంగతి నీకు తెల్వది. ఎందుకంటే నీకు చరిత్ర అన్నా, చరిత్ర పాఠాలన్నా నచ్చవు కద! నాకు తెల్సింది చెబుత. 


మొత్తం ఏషియా ఖండంలోనే 1902లోనే నోబుల్ బహుమతి పొందినోడు రోనాల్డ్ రాస్. ఈయన మలేరియా రోగానికి కారణాల్ని హైదరాబాద్‌లోని బేగంపేట ల్యాబ్‌లోనే పరిశోధన జేసి కనుక్కున్నడు. అంతెందుకు మేమే సదువుకున్నోల్లం అని చెబుతరు కద. మొత్తం ఇండియాలోనే మొట్టమొదటి పీహెచ్‌డీ, డాక్టరేట్ అది దేశాల్లో చేసింది అఘోరనాథ్ చటోపాధ్యాయ. సరోజిని నాయుడు ఈయన బిడ్డే. 


ఆయన నిజాం కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేసిండు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ మొత్తానికి నీళ్ళు, డ్రయినేజీ వ్యవస్థ ఏర్పాటు జేసిండు. అదీ హైదరాబాద్ రాజ్యంలోనే! సరోజిని నాయుడు మొదలు, సంగెం లక్ష్మీబాయి, సుగ్రాహుమాయూన్, టిఎస్ సదాలక్ష్మిలు పాత హైదరాబాద్ రాజ్యంలోనే రాణించిండ్రు. అట్లనే ఇప్పటి వరకూ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవి చేపట్టిన ముస్లిం మహిళ మాసూమా బేగం. ఈమె 1952లోనే బూర్గుల రామకృస్ణారావు మంత్రివర్గంలో పనిచేసిండ్రు.


అవును నువ్ అంటున్నట్లు పొద్దున్నే నిద్రలేవడం తెలియదు. ఎందుకంటే దేశంల (అంటే మీ తెలుగుదేశం కాదు బాబూ!) ముంబయి తర్వాత ఎక్కువ టైమ్ మేల్కతోటి ఉండేది హైదరాబాదే. బట్టల మిల్లులు హైదరాబాద్‌ల నడిశినప్పుడు రాత్‌పైలీ దివస్‌పైలీ ఉండేది. ఫ్యాక్టరీల్లో పనిచేసేటోళ్లు రెండు షిప్టూలూ పనిచేసిండ్రు. ఆల్విన్ కంపెనీల ఆరుగాలం కష్టంపడ్డరు. మీరు పాలన షురు జేసినంక ఆల్విన్ మూతపడ్డది. ఐ.డి.పి.ఎల్‌కూ అదే గతి పట్టింది. రిపబ్లిక్ ఫోర్జ్ కంపెనీని,ఆల్విన్ ఫ్యాక్టరీని మూసేయించితిరి. నిజాం కూడా యిలాజ జేయించుకునే ఉస్మానియా దవఖానను మీ వోళ్ల హాస్పిటళ్లు నడువడం కోసం సావకుండా బత్కకుండ జేస్తిరి. మీ లీలలు ఎన్నని జెప్పేది. అట్లనే మబ్బుల మూడు గంటల నుంచే కూరగాయలు అమ్మెటోళ్లు. మోండా మార్కెట్ల, మిరాలం మండిల, సబ్జీమండిల, గుడి మల్కాపూర్‌ల రైతుల సందడి ఉండేటిది. పాల సప్లయి సరేసరి. అంటే మీ దృష్టిల కంప్యూటర్ జాబ్‌లే ఉద్యోగాలాయె! వాళ్ల కాయకష్టం మీ లెక్కల లేదాయె!


ఎన్టీరామారావు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్‌ల రాత్రి రెండయినా సిటీ బస్సులు తిరిగేవి. ఆయన అధికారంల కొచ్చినంక పది దాటితే బస్సులు బంద్ జేసిండు. హోటల్ చాయ్‌లు 11 దాటితె బంద్ అన్నడు. మస్తుమంది చార్మినార్ ఏరియా నుంచి సికింద్రాబాద్‌ల నౌక్రీ కోసం పొయ్యేది. నౌక్రీ చేసే దుకాండ్లు రాత్రి పదిగంటల దాకా తెరిశే ఉండే. దీంతోటి వాళ్ళు ఇంటికి చేరుకునే సరికి సావుమరణమయ్యేది. అదీ మీ సర్కారు కట్టుకున్న పుణ్యమే! ఇప్పటికీ చార్మినార్ దగ్గర రంజాన్ పండుగైతే సాలు రాత్రి రెండుగొట్టంగ కూడా మార్కెట్ కళకళలాడుతది. మీ దృష్టిల పాతనగరం హైదరాబాద్ కిందికి రాదాయె! 


హైటెక్‌సిటీ మాత్రమే మీకు హైదరాబాద్ నగరం. మరి మాకు మాత్రం మా చార్మినార్ హైదరాబాద్‌కు సంకేతం. అందుకే అసలు హైదరాబాద్ మీకు సమజ్ గాదు. మా హైదరాబాద్ భాష మీకు ఇన్నేండ్లయినా ఒంటపట్టకపాయె. ఎన్కట మీవోళ్లు మాది తౌరక్యాంధ్రం అని ఎక్కిరించిరి. మీరు 40 యేండ్ల సంది హైదరాబాద్‌ల ఉండి ఉర్దూల ఒక్క ముక్క మాట్లాడరాయె. అందుకే మా జిందగీ మీకు సమజ్ గాదు.

మళ్ల జెబుతున్న మాకు మస్కుల లేసేది నీ మామనే నేర్పిండంటే అది దమాక్‌లేని ముచ్చట. ఎన్కటి నుంచి అజహ్ కోసం సలికాలంల కూడా లేషి నమాజ్ జేసింది హైదరాబాదీ ముస్లింలు. 


బ్రహ్మముహూర్తమని పొద్దుగాల నాలుగ్గంటలకు పేపరోల్లకు ఇంటర్వ్యూలు ఇచ్చేది షురూ జేసింది ఎన్టీరామారావే! మబ్బుల నాలుగ్గంటలకు ఇంటర్వ్యూ ఇవ్వాల్నంటే కనీసం ఇంకో గంట ముందుగాల లేవాలె. మరి గప్పుడు లేవాలంటే కనీసం ఆరుగంటల నిద్రన్నా ఉండాలె కద. అందుకే మరి మీరు తొమ్మిది గంటలకు పండుకునే అలవాటు జేస్కోని మమ్మల్ని కూడా తొందరగా పండుకొమ్మని దుకాణాలు షట్టర్లు గుంజేస్తిరి మీ అలవాట్లు మా మీద రుద్ది ఏ గంటో, రెండు గంటలో నిద్రపోయే నగరానికి పొద్దుగాల లేషె అలవాటు జేసినమని తకరారు మాటలు చెప్తున్నరు.


ఈడ పోలిక తీసుక రావద్దు గానీ ఒక విషయం జెప్పాలె. 1970 ఆ ప్రాంతం నాటికి కూడా (ఏలూరు లాంటి పట్టణాల్లో ఇప్పటికీ) విజయవాడ లాంటి పట్టణంలో బహిర్భూమికి కాలువల పొంటనే పొయ్యేది. అట్లా కూసునే పరిస్థితి కల్పించింది మీ ఆంధ్రా ప్రభుత్వాలే. దీన్ని సూడలేక మున్సిపల్ కమిషనర్‌గా వచ్చిన అజిత్‌సింగ్ అనే ఐఏఎస్ అధికారి (ఈయన అప్పటి కేంద్రమంత్రి స్వరణ్‌సింగ్ మేనల్లుడు) ఎక్కడపడితే అక్కడ మరుగుదొడ్లు కట్టించిండు. ఇప్పుడు కొంచెం ఫర్వాలేదు. అంటే మీకు మరుగుదొడ్డి వసతి లేని కాలంలోనే హైదరాబాద్‌ల లండన్ నగరంలో మాదిరిగా డ్రయినేజీ వ్యవస్థ ఉండేటిది. ఐదు లక్షల జనాభా కోసం కట్టిన వ్యవస్థ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అదీ ప్లానంటే. అదీ ముందుసూపంటే!


అందుకే అయ్యా మీరు మా హైదరాబాద్ జోలికి, ఊసుకు రాకుంటేమీకు దండం పెడ్తం. ఇంకో తొమ్మిదేండ్లు సుట్టాల తీరుగ హైదరాబాద్‌ల ఉంటే ఉండ్రుండి కానీ తిన్న ఇంటి వాసాలు లెక్క పెడ్తమంటే ఊరుకునేది లేదు. తెలంగాణలైతే ఏ సుట్టమైన మూటముల్లె సర్దుకుంటడు. ఇది సెక్షన్ 8 గురించి మాట్లాడేటోళ్లకి కూడా వర్తిస్తది. మంచి మనుషులకు మాటల్తో చెప్తే సరిపోతదనే నమ్మకంతో..


వ్యాస రచయిత: సంగిశెట్టి శ్రీనివాస్


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి