గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, జులై 02, 2015

కమల్ కమాల్...ఆంధ్రా గోల్‌మాల్!

-ఖాళీలు ఆంధ్రాలో.. పోస్టింగ్‌లు తెలంగాణలో
-తెలంగాణ కాకున్నా.. ఆంధ్రాకు కోరినా తెలంగాణకే
-తెలంగాణ పోస్ట్‌లు, పదోన్నతులకు ఎసరు
-వాణిజ్యశాఖలో విభజన కమిటీ గందరగోళం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రాంతీయత ఆధారంగా తెలంగాణకు -ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేయాల్సిన కమల్‌నాథన్ కమిటీ.. తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగులను నింపుతూ గోల్‌మాల్ చేస్తున్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎలాంటి పరిస్థితుల పునాదులపై ఏర్పడిందో అర్థం చేసుకుని ఉద్యోగుల విభజనను పకడ్బందీగా చేయాల్సిన కమల్‌నాథన్ కమిటీ.. ఆంధ్రా ఉద్యోగుల నాటకాలకు వంత పాడుతున్నది. ఏ శాఖను చూసినా అదే పరిస్థితి దాపురించింది. తాజాగా వాణిజ్య శాఖలో విభజన.. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు శాపంలా మారింది. బోగస్ లోకల్ సర్టిఫికెట్లతో కొందరు, తప్పుడు సమాచారంతో ఇంకొందరు ఆంధ్రా అధికారులు తెలంగాణలో తిష్ఠ వేశారు. కమల్‌నాథన్ కమిటీ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్రా ఉద్యోగుల బరితెగింపును చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నది. 

kamal


తెలంగాణ అధికారులపై సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నది. పైగా తెలంగాణకు ఆప్షన్ అడిగిన ఆంధ్ర అధికారులను నిబంధనలు తోసిరాజని తెలంగాణకు కేటాయించడం, ఆంధ్రాకు ఆప్షన్ అడిగినా, వారిని కూడా తెలంగాణకే కేటాయించడం వాణిజ్యపన్నుల శాఖలో గందరగోళానికి దారితీసింది. ఆంధ్రాలో ఖాళీలను అక్కడి స్థానికులతో భర్తీ చేయకుండా తెలంగాణకు కేటాయించిన కమిటీ.. ఇక్కడి పోస్టులను కొందరు స్థానికేతరులతో భర్తీ చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన వారికి కూడా తెలంగాణలోనే పోస్టింగ్ దక్కడం విశేషం. దీంతో తెలంగాణ పోస్టులు, పదోన్నతులకు ఎసరు తెస్తున్నది. కమల్‌నాథన్ ఉల్టా పల్టా కేటాయింపులపై వాణిజ్య పన్నుల శాఖ జేఏసీ ఇప్పటికే పోరాటానికి దిగింది. నిర్దిష్టమైన ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయకపోతే మరో పోరాటం తప్పదని హెచ్చరించింది.


ప్రాంతం ఆంధ్ర.. ఆప్షన్ తెలంగాణ


ఉద్యోగుల విభజనలో కమల్‌నాథన్ కమిటీ ఎటు చూసినా ఆంధ్రావారికి పెద్దపీట వేసి.. తెలంగాణ పోస్టులకు గండి కొట్టినట్లు కనిపిస్తున్నది ఆంధ్రకు చెందిన కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు పీ శ్రీలత, నాగార్జున, జే షద్రక్, పీ సుబ్బారావు, బ్రహ్మనాయుడు, సీహెచ్ వెంకటేశ్‌‍‍లను తెలంగాణకు కేటాయించడం కలకలం రేపుతున్నది. కానీ, ఇదే సమయంలో ఆంధ్రకు ఆఫ్షన్ ఇచ్చిన తెలంగాణ వారికి మాత్రం అక్కడ చోటివ్వక పోవడం గమనార్హం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కమర్షియల్ టాక్స్ ఆఫీసర్(సీటీవో)లు ఆంధ్రాకు ఆఫ్షన్లు ఇవ్వగా, వారిని కూడా ఇక్కడికే కేటాయించడం గమనార్హం. ఎంవీ రమణమూర్తి, పీ కవితరావు, జీ జలశ్రీ, పీ లక్ష్మీ మాధవి, ఏ శివరాంప్రసాద్, షేక్ మీరాసాహేబ్, బీ అశోక్‌వర్ధన్ రెడ్డి, ఏ వెంకట్రాంరెడ్డి స్వచ్ఛందంగా ఆంధ్రా రాష్ట్రానికి వెళ్తామని ఆఫ్షన్ ఇచ్చినప్పటికీ, తెలంగాణకే కేటాయించడం విశేషం.


అసిస్టెంట్ కమిషనర్ల కేటాయింపులోనూ అదే దారి


ఆంధ్ర ప్రాంతానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్లు ఆనంద్‌కుమార్, వీ శ్రీనివాస్‌రెడ్డి, వై శ్రీలత, వీ అమర్‌నాయక్, ఆర్ ఏడుకొండలును తెలంగాణకు కేటాయించడంపై వాణిజ్యపన్నుల శాఖ తెలంగాణ జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తప్పుడు సమాచారంతో తెలంగాణ కోటాలో అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతి పొందారని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారుల జాబితాను జేఏసీ కేంద్రానికి సమర్పించింది. వారి రికార్డులను వెంటనే పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని కోరింది. అడ్డదారిలో అసిస్టెంట్ కమిషనర్ హోదా పొందిన 26 మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారి వివరాలను జేఏసి వెల్లడించింది. 


ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన బీ గీతా మాధురి, పీ జాన్ స్టీఫెన్‌సన్, డీ నాగజ్యోతి, కే రామారావు, ఎం సుధాకర్‌రావు, శ్రీకాకుళంకు చెందిన బీ నాగార్జున రావు, సీహెచ్ వెంకటరావు, ప్రభాకరమూర్తి (కృష్ణా), తూర్పుగోదావరికి చెందిన ఐ హేమ, ఎం ప్రకాశ్‌రావు, ఎన్ వెంకటేశ్వర్, పీ సత్యకుమార్, పశ్చిమగోదావరి జిల్లాకుచెందిన పీ మనోహర్, ఎం సత్యప్రకాశ్, కే నరేంద్రకుమార్, కే శోభనాచలం, కేవీ జగదీశ్వరరావు , పీ హరేంద్రబాబు (చిత్తూరు), గుంటూరుకు చెందిన ఆర్ ఏడుకొండలు, టీ శేషాద్రి, కే చంద్రశేఖరరావు, వై శీలీ ఉన్నారు. వారితో పాటు జాన్ శ్రీనివాసులు (కడప), కే రఘునాథ్ రెడ్డి, జీ సుమతి (అనంతపురం), కే వెంకటేశ్వరరావు (విజయనగరం)లు ఇదే జాబితాలో ఉన్నారు. ఉన్నత స్థాయి నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు విభజన తప్పుల తడకగా మారింది. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసిన లింగారెడ్డిని స్థానిక కోటాలో డిప్యూటీ కమిషనర్‌గా తెలంగాణలో పోస్టింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలున్నప్పటికీ ఆరుగురు నాన్ లోకల్ డిప్యూటీ కమిషనర్లను తెలంగాణకు కేటాయించడంపై జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.


ఆత్మపరిశీలన చేసుకోండి..: వాణిజ్య శాఖ జేఏసీ


తప్పుడు సమాచారంతో తెలంగాణలో పోస్టింగ్ సంపాదించిన వారు వెంటనే తప్పుకోవాలని, ఆత్మపరిశీలన చేసుకుని తమ రాష్ర్టానికి వెళ్లిపోవాలని వాణిజ్యపన్నుల శాఖ విజిలెన్స్ అడిషనల్ డైరెక్టర్, జేఎసీ చైర్మన్ టీ వివేక్, అధ్యక్షుడు టీ వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల విభజనలో జరిగిన లోపాలను వెంటనే సవరించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ వారికి న్యాయం చేయకపోతే మరో పోరాటం తప్పదని వాణిజ్యపన్నుల శాఖ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు కేఎం వేణుగోపాల్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రౌతు కృష్ణమూర్తి హెచ్చరించారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి