కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని అణిచేసేందుకు ఆంధ్ర ప్రభుత్వం, అధికారులు కుట్రల మీద కుట్రలు చేస్తున్నారు. ఓవైపు కరెంట్.. మరోవైపు నీళ్లపై అనవసర రాద్ధాంతాలకు తెరతీస్తున్న సీమాంధ్ర ప్రభుత్వం తాజాగా కార్మికశాఖలో వందల కోట్లు లూటీ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.420 కోట్లను విజయవాడలోని ఒక బ్యాంక్‌కు తరలించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నిధులు తరలించేందుకు ప్రయత్నించామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారే స్వయంగా పేర్కొనడం వారి కుట్ర బుద్ధిని బయటపెడుతున్నది.
-బాబు కుతంత్రం!
-తెలంగాణ సొమ్ము 420 కోట్లు బెజవాడకు మళ్లింపు
-ఆధారాలు దొరక్కుండా ఫైళ్ల మాయం
-కార్మికశాఖ కమిషనర్ అశోక్‌కుమార్ ఫిర్యాదుతో గుట్టు రట్టు
-ఏపీ సచివాలయంలో దాక్కున్న అదనపు కమిషనర్ మురళీసాగర్, మేనేజర్ రామారావు
-నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు
-ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకున్నామన్న అధికారులు
-తెలంగాణ సొమ్ము 420 కోట్లు బెజవాడకు మళ్లింపు
-ఆధారాలు దొరక్కుండా ఫైళ్ల మాయం
-కార్మికశాఖ కమిషనర్ అశోక్‌కుమార్ ఫిర్యాదుతో గుట్టు రట్టు
-ఏపీ సచివాలయంలో దాక్కున్న అదనపు కమిషనర్ మురళీసాగర్, మేనేజర్ రామారావు
-నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్న పోలీసులు
-ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకున్నామన్న అధికారులు
ఉమ్మడి నిధులనుంచి దాదాపు రూ. 609 కోట్లు విజయవాడ బ్యాంక్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దొంగచాటుగా ఇప్పటికే సుమారు రూ. 420 కోట్లు తరలించారు. ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ కృష్ణారావు ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని సమాచారం. మరో రూ.200 కోట్లు తరలించడానికి చేసిన వారి ప్రయత్నం తెలంగాణ కార్మిక సంఘాల అప్రమత్తతతో బెడిసికొట్టింది.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన మురళీసాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావు ఆధారాలు దొరక్కుండా రాత్రికి రాత్రి ఫైళ్లను తరలించారని హిందూ మజ్దూర్ యూనియన్ ఆరోపించింది. ఈ మేరకు గురువారం కార్మికశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. హెచ్‌ఎంఎస్ ఆరోపణతో అప్రమత్తమైన కమిషనర్ అశోక్‌కుమార్ నిధులకు సంబంధించిన ఫైళ్లను వెతికారు.
ఎక్కడ కూడా ఫైళ్లు కనిపించలేదు. దీంతో కార్మికశాఖ కమిషనర్ డాక్టర్ అశోక్ చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీమాంధ్ర అధికారుల అసలు గుట్టు రట్టయింది. అడ్డదారిలో ఉమ్మడి నిధులను ఆంధ్రా ఖాతాలోకి తరలించిన విషయం వెల్లడైంది. తెలంగాణ నిధులకు సంబంధించిన ముఖ్యమైన ఫైళ్లు మాయమైనట్టు కమిషనర్ ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగిన విషయం తెలుసుకున్న మురళీసాగర్ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళ్లారు. డీసీపీ కమలాసన్‌రెడ్డి కోరినా విచారణకు వచ్చేందుకు మొండికేశారు.
చీఫ్ సెక్రటరీ దగ్గర ఉన్నాను.. రాలేనని మొండిగా సమాధానం ఇచ్చారు. దీంతో సచివాలయం గేట్ దగ్గర మాటు వేసిన పోలీసులు మొదట రామారావును, ఆ తర్వాత ఏపీ కార్మికశాఖ కమిషనర్ రామాంజనేయులు కారులో వెళ్తున్న మురళీసాగర్‌ను నాటకీయపరిణామాల మధ్య అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పబ్లిక్ డిపాజిట్ అకౌంట్‌లోని రూ. 452 కోట్లు తెలంగాణ ఖాతాలో వేసి మిగతా నిధులను మళ్లించడానికి జరుగుతున్న ప్రయత్నాలు వివాదానికి దారితీస్తున్నదని నమస్తే తెలంగాణ ఇటీవలే బయటపెట్టింది.
ఇంకా ఆంధ్ర అకౌంట్లలోనే నిధులు..
రాష్ట్ర విభజన జరిగి ఐదు నెలలు గడుస్తున్నా కార్మికశాఖలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్స్ వర్కర్స్ వెల్ఫేర్ నిధులన్నీ ఆంధ్రా అకౌంట్‌లలోనే మగ్గుతున్నాయి. ఈ నెల 17న తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్స్ వర్కర్స్ వెల్ఫేర్‌ను ఏర్పాటు చేస్తూ జీవో విడుదలైంది.
ప్రత్యేక బ్యాంక్ ఖాతా కూడా తెరిచారు. కానీ అందులో ఒక్క రూపాయి ఇప్పటి వరకు జమకాకుండా ఆంధ్ర అధికారులు కుట్రలు చేస్తున్నారు. పైగా దశల వారీగా కోట్ల రూపాయలను విజయవాడ బ్యాంకు ఖాతాకు తరలించడం కార్మికశాఖలో కొన్నిరోజులుగా కలకలం రేపుతున్నది. ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్చన్స్ వర్కర్స్ వెల్ఫేర్ (భవన, ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ) బోర్డు ఖాతాలో ఉన్న దాదాపు రూ. 1468 కోట్లు ఇంకా ఉమ్మడి ఖాతాల్లోనే ఉన్నాయి.
ఆ నిధులను భవననిర్మాణంలో ఇతర రంగంలో పనులు చేస్తూ ప్రమాదానికి గురైన లేదా మరణించిన కార్మికుల కుటుంబసంక్షేమానికి, గర్భవతులైన మహిళా కార్మికులకు, కార్మికుల పిల్లల చదువులకు ఉపయోగిస్తారు. ఇందులో తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం వాటా ఉంటుంది. దీని ప్రకారం తెలంగాణకు దాదాపు రూ. 609 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 859 కోట్లు ఇవ్వాలని లెక్కలు తేలాయి. అధికారికంగా ఇటీవల మరో రూ. 80 కోట్ల సెస్ వసూలైంది. ఉమ్మడి ఖాతాలో దాదాపు రూ. 1500 కోట్లు ఉన్నాయి.
ఇందులో పబ్లిక్ డిపాజిట్స్ అకౌంట్ కింద రూ.452 కోట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పబ్లిక్ డిపాజిట్స్ అకౌంట్‌లోని నిధులను కొన్ని ప్రత్యేక అవసరాలకే వాడాల్సి ఉంటుంది. వాటిని రెగ్యులర్‌గా తీసుకుని వాడుకోవడానికి వీలులేదు. ఆ ఖాతాలో నిధులను తెలంగాణకు కేటాయించి మిగిలిన రూ. 900 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఖాతాలో వేసుకున్నట్లు సమాచారం. కీలకమైన పదవుల్లో ఆంధ్రకు చెందిన వారుండటం, తెలంగాణకు అధికారుల కొరత ఉండటంతో ఆంధ్రప్రదేశ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నాం: డీసీపీ : కార్మికశాఖ కమిషనర్ అశోక్ ఫిర్యాదు మేరకు ఫైళ్ల మాయం ఘటనలో కార్మికశాఖ అదనపు కమిషనర్ మురళీసాగర్, ఫైనాన్స్ మేనేజర్ రామారావులను ఏపీ సచివాలయం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కార్మికశాఖ కార్యాలయంలో స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్టు చెప్పారు. రూ. 420 కోట్లు విజయవాడ బ్యాంక్‌కు తరలించినట్లు విచారణలో తేలిందని చెప్పారు. తనకు సమాచారం లేకుండానే తెలంగాణ కార్మికశాఖకు సంబంధించిన రూ. 420 కోట్లు విజయవాడ బ్యాంక్‌కు తరలించారని సమాచారం రావడంతో చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలంగాణ కార్మికశాఖ కమిషనర్ అశోక్ తెలిపారు.
ఏపీ సర్కార్ ఆదేశాల మేరకే.. : మురళీసాగర్
ఫైళ్లు ఎత్తుకుపోయినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని కార్మికశాఖ అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ, ఇతర సంక్షేమ బోర్డు సెక్రటరీ మురళీసాగర్ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే రూ. 420 కోట్లు విజయవాడబ్యాంకుకు బదిలీ చేశానని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మికశాఖల ఉమ్మడి సమావేశం జరిపిన తర్వాతే ఎవరి వాట ఎంతో తేలుతుందన్నారు.
కమిషనర్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు జవాబును దాటవేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి తెలంగాణకు రావాల్సిన వాటాను తేల్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!