"టాంకు బండు పైన మీరు
గొప్ప గొప్ప వాళ్ళ విగ్ర
హాలు కూల్చుటయె ఒప్పు,
బిల్లు కాల్చుటయె తప్పా?"
అని మీరలు పలుకుచున్న
మాటలలో అహంకార
మున్నదయా, గుర్తింపుడు!
తప్పంతా మీదయ్యా!!
తెలంగాణ అస్తిత్వము
నకు చోటివ్వని విగ్రహ
ములు నెలకొల్పుట మీరల
ఆధిపత్య చిహ్నమయా!
వేయి మంది అమర వీర
బలిదానమ్ములు వలదా?
ప్రాణం లేనట్టి విగ్ర
హాలు మీకు కావాలా?
దౌర్జన్యం మాది కాదు!
ఆవేదన ప్రకటనమ్మె!!
మాకు లేని ప్రాధాన్యం
మీకెందుకు ఉండవలెను?
విగ్రహాలు కట్టవచ్చు,
ప్రాణాల్ తెచ్చివ్వగలరె?
విగ్రహాలకున్న విలువ
ప్రాణాలకు లేదా ఏం?
చిన్నచూపు మమ్ము జూచి,
ఆధిక్యం ప్రదర్శించి,
మమ్ము తప్పనుటను మాని,
ఔన్నత్యం చూపుడయా!
లోకానికి తప్పు, ఒప్పు
లెవరెవరివొ తెలుసయ్యా!
రాష్ట్రపతియె పంపించిన
బిల్లు కాల్ప తప్పు కాదె?
తెలంగాణ ఆకాంక్షల
నిలబెట్టెడి బిల్లు మీరు
అహంకృతిని ప్రదర్శించి
కాల్చివేయ తప్పు కాదె?
తెలంగాణ ఆకాంక్షల
నిలబెట్టెడి బిల్లు మీరు
అహంకృతిని ప్రదర్శించి
కాల్చివేయ తప్పు కాదె?
తెలంగాణ రాష్ట్రమ్మే
శీఘ్రగతిన రానుండగ,
ప్రశ్నించుట మీకెందుకు?
మెప్పించుట మాకెందుకు?
మీకు గొప్పవాళ్ళు ఉన్న,
మాకు గొప్పవాళ్ళు లేరె?
మీ గొప్పను చాటుకొనియు,
మా గొప్పను అణచెదరా?
మీకు గొప్పవాళ్ళు ఉన్న,
మాకు గొప్పవాళ్ళు లేరె?
మీ గొప్పను చాటుకొనియు,
మా గొప్పను అణచెదరా?
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
4 కామెంట్లు:
1934 గోల్కొండ కవుల సంచికలో ప్రచురించబడిన తాతాజీ కవిత్వం గురించిన వివరాలు ఈ కింది టపాలో చూడండి. మీరు కవులు కాబట్టి ఈ విషయంపై ఆసక్తి ఉందనే నమ్మకంతో ఈ వ్యాఖ్య రాస్తున్నాను, అన్యధా భావించవద్దు. మీ బ్లాగులో ప్రచారం చేస్తున్నందుకు క్షమించండి.
http://jaigottimukkala.blogspot.in/2014/01/tatajis-poem-in-1934-compilation_16.html
గొట్టిముక్కలవారూ! 1934సంవత్సరం నాటి గోల్కొండ కవుల వివరాలను తెలుపుతూ, నాటి మన తెలుగు కవుల వర్ణనా నిపుణతను కవిగారి కవితను ప్రతిలిఖించుద్వారా ప్రచారము చేయుట ముదావహము. ఇందులో నేను అన్యథా భావింపనవసరము లేదు. పైపెచ్చు, చాల ఆనందముగానున్నది.
తెలంగాణలో ఎందరో కవులుండిరి. వారు సీమాంధ్ర కవులవలె రాజాశ్రితులు అగుటకు ఇష్టపడమిచే, వారి కావ్యములు వెలుగు చూడకయే నశించిపోయినవి. వాటికి (ధనలేమిచే) అనేక ప్రతులు లిఖించు వారు లేక పోవుటవలననే అట్లు నష్టములైనవని భావింపవచ్చును. చాలా వరకు సురవరంవారు సేకరించి, గోలకొండకవుల సంచిక పేర ప్రచురించి, మన తెలంగాణలో కవులే లేరను అపప్రధను తొలగించినారు.
మొత్తమునకు తమరి వలన మరుగున పడిన ఒక మాణిక్యమును దర్శింపగలిగితిని. ఇట్టి అవకాశమును నాకు కలిగించిన తమరికి అనేకానేక కృజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
మీ ఆదరణ మరియు transliteration తప్పుల సవరణకు చాలా థాంక్సండీ.
జై గొట్టిముక్కలవారి తాతగారు శ్రీ గొట్టిముక్కల రాధాకిషన్ రావుగారి కవిత్వము (1934) ఈ బ్లాగు వీక్షకులకు పఠనార్థము ఈ దిగువ ఈయఁబడుచున్నది. మన తెలంగాణ కవిగారి కవిత్వమును చదివి ఆనందించఁగలరు.
వసంత ఋతువు
కొదమ తుమ్మెద గమి ధనుర్గుణము చేసి
ఫుల్ల చూతాంకురముల నమ్ములనుఁ జేసి
కాముకుల డెందములఁ జీల్పఁగాఁ దలంచి
చాన! చనుదెంచె యోజ వసంతుఁ డదుగొ!
రమ్య దీర్ఘికాంబువులకు రత్నకాంచి
కా వితతికి విలాసినీ గణములకు
సోమ రుచులకు పుష్పిత చూతములకు
నొసఁగు సౌభాగ్యమీ వసంతోదయంబు!
కర్ణములయందు నవకర్ణికారములను
కలిత చంచల నీలాలకమ్ములందు
ఫుల్లనవమల్లికాశోక పుష్పవితతిఁ
దాల్చి వెలయింతురౌ ప్రమదాజనమ్ము!
చందనార్ద్ర హారంబుల స్తనములందు
వలయముల నంగదంబుల బాహులందు
నవ్యకమనీయ కాంచుల నడుమలందు
తరుణులు ధరింత్రు కామసంతప్తలగుచు!
కామశిథిలంబు లైనట్టి గాత్రములను
వాఁడి యుచ్ఛ్వాసచే వీడు బంధములను
గలిగి దగ్గఱనేయున్న కాంతులందు
కమలనేత్రలు కడు ప్రేమఁ గలిగి యుంద్రు!.
(కాళిదాసు ఋతుసంహారమునుండి)
కామెంట్‌ను పోస్ట్ చేయండి