గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 17, 2015

జూన్ రెండే మన అసలైన పండుగ...!!!



1948 సెప్టెంబర్ 17. భారతదేశంలో ఒక సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. అయితే ఇది మంచిరోజా, చెడ్డ రోజా అన్నది బేరీజు వేయాలంటే చరిత్ర తెలుసుకోవాలి. ఈ రోజున దీన్ని ఎవరూ ఎలా విశ్లేషిస్తారో దాని వలన వారి మనోగతాలు తెలుసుకోవచ్చు.


నేపథ్యం: దక్కనీ రాజ్యంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణది ఒక విలక్షణమైన చరిత్ర. కాకతీయుల దగ్గరి నుంచి 1948 దాక సుస్థిర రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రాంతం. ప్రకృతి వనరులు పుష్కలంగా ఉండి, ప్రకృతి బీభత్సాలేవీ అంటకుండా ప్రపంచంలోనే అత్యంత సంపన్నంగా అలరారిన చరిత్ర ఉన్న దేశం. ప్రజాహితం కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి ఖ్యాతి గడించిన దేశ ప్రధాన మంత్రి సాలార్జంగ్-1 మరణంతో కష్టాలు మొదలయ్యాయి. ఆయన మరణంతో ప్రధానమంత్రి పీఠాన్నెక్కిన సాలార్జంగ్-2 చేసిన కొన్ని పనులతో స్థానికులకు కష్టాలు మొదలయ్యాయి. బ్రిటిష్ వారిని అభిమానించి, ఇంగ్లీషువిద్య నేర్చిన అతను తండ్రి వ్యతిరేకించిన పనిని చేశాడు. పర్షియన్ భాషను తొలగించి, ఉర్దూను అధికార భాషగా చేయడంతో జరిగిన నష్టానికి భారీగానే మూల్యం చెల్లించాడు. పదవీచ్యుతుడై ముప్ఫై ఏళ్లు రాకుండానే కన్నుమూశాడు. కానీ మిగతా పనులకంతా అతను చేసిన ప్రభుత్వ అధికార భాషా మార్పిడి.. ఈ ప్రాంత చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి, విషాదానికి దారితీసింది. 


ఇది స్థానికులకు అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది. ముల్కీ సమస్యకు దారి తీసింది. స్థానికులకు రాని ఉర్దూ భాషలో విద్య గరపిన ఉత్తర భారత ముస్లింలు, కాయస్థులు పెద్ద సంఖ్యలో నిజాం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడం జరిగింది. అక్కడ మొదలైన భాషా సమస్య, ముల్కీ సమస్యగా మారి అస్థిర పాలన తోడై మిగతా సమస్యలతో కలిసి రాజాకార్ల సమస్యగా రూపుదిద్దుకుంది. ఆ రజాకార్లలో స్థానిక ముస్లింల కంటే తెలంగాణేతర ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. నిజానికి రజాకార్లలో అందరూ ముస్లింలు కారు. వారి పేరు పెట్టుకుని అగ్రకులాల వారు, జమీందార్లు తమ దగ్గర పనిచేసే బీదవారి మీద, ఇతర సామాన్య జనాల మీద అఘాయిత్యాలకు పాల్పడ్డారు. దీన్ని సాకుగా చేసుకుని భారత ప్రభుత్వం చేసిన పోలీసు చర్య (ఆపరేషన్ పోలో) చరిత్రలో జరిగిన పెద్దమోసాలలో ఒకటి. నమ్మక ద్రోహానికి చక్కటి ఉదాహరణ. 


కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కేఎం మున్షీని తమ ప్రతినిధిగా నిజాం (7) రాజు వద్దకు పంపి, అల్లరిమూకలను అణచి తన రాజ్యం తాను ఏలుకునేందుకు సహాయం చేస్తామని నమ్మబలికారు. అది నమ్మి భారత దేశంలో తన దేశం విలీన ప్రతిపాదనకు అంగీకరించిన నిజాంకు జనరల్ చౌదరి తన పనికాగానే పెద్ద షాక్ ఇచ్చారు. నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసుకున్నట్టు, వెంటనే ఈ ప్రాంతం మీద మార్షల్‌లా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించాడు. ఇదంతా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగింది. ఇక ప్రధానమంత్రి నెహ్రూ మున్షీకి ఒక రహస్య సందేశం పంపి తన పాత్ర తాను పోషించాడు. 


అదేమిటంటే విలీన సమయంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు కానీ, నిజాంకు కానీ ఎక్కడా కనపడొద్దని! ఇక భారతదేశ ప్రధానమంత్రి, హోంమంత్రి చేసిన ఈ పనులతో ఈ నాటకం ముగిసింది. ఇది అప్పటిదాకా ప్రజారంజకంగా ఎన్నో పనులు చేసిన నిజాం పాలన నుంచి విమోచనా? ఒకప్పటి భారతదేశ ప్రభుత్వ విద్రోహమా? ఈ ప్రశ్నకు సర్దార్ పటేల్‌ను సమర్థిస్తూ దీనిని విమోచన అనేవారు సమాధానం చెప్పాలి.


ఇక ఆ తరువాత విమోచన నిజంగా జరిగినట్టా అన్నది పరిశీలించాలి. 1948 సెప్టెంబర్ 18నుంచి యథేచ్ఛగా సాగిన మూడేళ్ల కేంద్ర పరిపాలన (పోలీసు పహరా)లో వారు ఇక్కడికి పంపిన పోలీసు అధికారులు, ముఖ్యంగా మద్రాసు నుంచి దిగుమతి అయిన ఆంధ్ర అధికారులు ఇక్కడ చేసిన అఘాయిత్యాలకు అంతేలేదు. (కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి తండ్రి అలా వచ్చినవారే!) ఒక సర్వే ప్రకారం నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలోనూ, తర్వాత జరిగిన రజాకార్ల హింసలోనూ కలిపి చనిపోయిన వారికంటే, కేంద్ర పోలీసు బలగాల చేతిలో 1948 నుంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేదాకా చనిపోయినవారి సంఖ్య దాదాపు మూడు రెట్లు అధికం! ఆ కాలంలో సామాన్య ప్రజలు నిజాం ప్రభుత్వం ఉన్నప్పటి కంటే ఎక్కువ బాధలు, కష్టాలు అనుభవించారు. అంటే 1948లో జరిగింది...ప్రజల దృష్టిలో నిజంగా విమోచ నేనా? కేవలం మతమౌఢ్యం ఉన్నవాళ్ళకు అలా కనిపిస్తుందా? ఇది ఇంకా లోతుగా విశ్లేషించవలసిన అంశం.


ఇక.. విలీనం తెలంగాణను ఒక్కసారి కాదు, రెండుసార్లు కుదిపింది. భారతదేశంలో విలీనమై అష్టకష్టాలు పడి, చివరకు ఒక ప్రభుత్వం ఏర్పడి ఊపిరి తీసుకుంటున్న సమయంలో ఇంకో విలీనం! 

తెలంగాణ...అంబేద్కర్ ఆశయాలకు, సలహాలకు వ్యతిరేకంగా భాషా ప్రయుక్త రాష్ర్టమనే విఫల యత్నానికి బలైంది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో విలీనమై పెనం మీదినుంచి పొయ్యిలో పడింది. ఇక ఆ తర్వాత ఆరు దశాబ్దాల చరిత్ర.. ఈ ప్రాంతవాసులెవరికీ చెప్పనక్కరలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా మొదటి మోసకారి విలీనాన్ని ఎప్పుడూ జరపలేదు. రెండోదైన బలవంతపు విలీనాన్ని నవంబర్ 1న ఘనంగా జరిపాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ఈ రోజులన్నింటిని ఎలా పరిగణించాలి? సీమాంధ్ర వారు, ఒక సిద్ధాంతానికి కట్టుబడి మాట్లాడేవారు ఎలాగూ తెలంగాణ చరిత్ర చదవరు. మిగతా ఈ ప్రాంత వాసులంతా ఈ చరిత్రను తెలుసుకోవలసిన అవసరం ఉన్నది.


విద్రోహంతో ఒకటికి రెండు సార్లు విలీనమైన తెలంగాణ ఇప్పుడు స్వంత ప్రభుత్వంలో ఏ దినాన్ని జరపాలి? దేనిని ఎలా పరిగిణించాలి? సెప్టెంబరు 17ను ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టంగా చరిత్రలో లిఖించాలి. అది ప్రభుత్వ మార్పిడే కానీ విమోచన కాదు. నవంబరు 1ని తద్దినంగా జరుపుకోవాలి. తద్దినం అంటే ముగిసిన కథకు గుర్తు.

జూన్ 2ను సంతోషకరమైన దినంగా పరిగణించాలి. నిజానికి వందల ఏళ్ల రాజరిక పాలనకు, ఆరు దశాబ్దాల పరాయి పాలనకు చరమగీతం పాడి సొంత ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుని, స్వయం పాలన మొదలు పెట్టిన జూన్ 2 మాత్రమే అధికారికంగా జరుపుకోవలసిన పండుగ. దీనిని ఆస్వాదించిన వారు తెలంగాణ ప్రజలు, వ్యతిరేకించినవారు తెలంగాణేతరులుగా గుర్తించాలి. ఇక్కడ మతాలకు, కులాలకు, ఇతర సంకుచిత భావాలకు, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు ఈ రోజు చోటులేదు. తెలంగాణ ప్రజలకు జూన్ 2 అతి ముఖ్యమైన రోజు.

                                                                          - ప్రొఫెసర్ కనకదుర్గ దంటు




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



1 కామెంట్‌:

మనోహర్ చెనికల చెప్పారు...

ఇక్కడ సమస్య సీమాంద్ర పాలనలో ఏం చేసారు అని కాదు, సీమాంధ్ర పాలనలో ఇది జరపట్లేదు, జరపి తీరాల్సిందే అని గొడవచేసి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తిరగెయ్యడం గురించి మాత్రమే

కామెంట్‌ను పోస్ట్ చేయండి