గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 03, 2015

ఆపత్తరణోపాయం...!!!

టీడీపీ మొదలైనప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రపు ప్రాంతీయ పార్టీ. కానీ విభజన అనంతరం అది సాంకేతికంగా ఏమైనప్పటికీ వాస్తవరూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ మాత్రమే. తెలంగాణలో వారికి ఇంకా ఉనికి ఉండవచ్చుగాక, కానీ వారిక్కడ వృద్ధి చెందగల ఆబ్జెక్టివ్ పరిస్థితులు లేవు. ఉనికిని ఈమాత్రపు స్థాయిలో నిలబెట్టుకోగల అవకాశాలు కూడా లేవు. 

tankasala

రేవంత్‌రెడ్డికి బెయిల్.. వరదలో కొట్టుకుపోతున్న మనిషికి పూచికపుల్ల దొరకడం వంటిదే తప్ప వరద నుంచి గట్టెక్కడం కాదని చంద్రబాబుకు తెలుసు. కోర్టు చెప్పినట్లు ఇది మౌలికంగా బెయిల్‌కు అవకాశమున్న కేసే తప్ప, ఏ హత్య వంటిదో కాదు. పైగా నేరుగా రేవంత్‌రెడ్డిని ఏసీబీ విచారించడం, ఆయన నివాసంలో సోదాలు, నాంపల్లి కోర్టులో స్టీఫెన్‌సన్ వాంగ్మూలం నమోదు, వీడియో-ఆడియో టేపులపై ఫోరెన్సిక్ ప్రాథమిక పరీక్షల వంటివి పూర్తయ్యాయి. ఏసీబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్లు మత్తయ్య, సండ్ర వెంకట వీరయ్యల విచారణ ఇంకా జరగకపోవడం, డబ్బు ఆచూకీ తెలియకపోవడం వంటివి ఇంకా మిగిలి ఉన్నాయి. అదే విధంగా ఒకవేళ చంద్రబాబు స్వర నమూనాలను తీసుకోవడం, ఆయనను ప్రశ్నించడం వంటి చర్యలు అవసరమని ఏసీబీ భావించిన పక్షంలో అది కూడా జరగాల్సి ఉన్నది. అయితే ఈ మిగిలిన పనుల కోసం రేవంత్‌రెడ్డిని ఇంకా కస్టడీలో ఉంచవలసిన అవసరం లేదని, తను బయటకు వచ్చినా వాటిని తారుమారు చేయలేరన్నది కోర్టు అభిప్రాయం. ఇటువంటి ఆరోపణల కేసులో ఒక దశ తర్వాత బెయిల్ ఇవ్వడం సాధారణంగా జరిగేదే. దీనిపై ఏసీబీ అప్పీలును సుప్రీంకోర్టు తిరస్కరించినా, యథాతథంగా ఇందులో నిందితుల శిబిరం ఆనందాలను నటించవలసింది ఏమీ లేదు. ఇది చంద్రబాబు వంటి అనుభవజ్ఞునికి తెలియనిది కాదు.


ఆయనకు ఈ సంకటం నుంచి నిజంగా విమోచన లభించాలంటే రెండు స్థాయిల్లో మొత్తం నాలుగు జరగాలి. మొదటి దశలో ఒకటి, రెండవ దశలో మూడు. మొదటి దశలో జరగవలసిన ఒకటి- ఆయన ఈ కేసు నుంచి బయటపడటం. రెండవ దశలో జరగవలసిన మూడింటిలో మొదటిది- తను వెంటనే తమ రాష్ట్ర పరిపాలనపై, అభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం. రెండవది- తన పరిపాలనా కార్యస్థానాన్ని సత్వరమే విజయవాడ-గుంటూరుకు మార్చుకోవడం. మూడవది- తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం మానుకోవడంతో పాటు, నిరంతరం ఏదో ఒక సమస్య సృష్టించే ధోరణి వదిలివేయడం.


ఇవన్నీ జరిగితే తప్ప చంద్రబాబు మనశ్శాంతిగా, తన భవిష్యత్తుపై భరోసాతో పరిపాలన సాగించటం సాధ్యం కాదు. ఈ మాట ఆయన పట్ల వ్యతిరేకభావనతో అంటున్నది కాదు. సావధానంగా ఆలోచించినట్లయితే స్వయంగా ఆయన కూడా ఈ మాటతో ఏకీభవించవలసి ఉంటుంది.


రేవంత్ వీడియో టేపులు ఎట్లున్నప్పటికీ, బాబు ఆడియో టేపులు ఆయనకు ప్రత్యక్ష ప్రమాదమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో ఉన్నవి రెండే మార్గాలు. మొదటిది: చంద్రబాబు అది తన స్వరం కాదని కోర్టు లో నిరూపించేందుకు తన ఫోరెన్సిక్ సలహాదారు సహాయంతో వ్యూహ రచనలు చేస్తుండవచ్చు. అది సఫలమైతే అప్పుడు అది నా స్వరమని ఆరోపించారు తప్ప నేను ఎప్పుడూ అనలేదు గదా అని వాదిస్తూ, కోర్టును మెప్పించి బయటపడవచ్చు. కనుక అటువంటి సాంకేతికమైన వ్యూహాలను విఫలం చేయడం ఏసీబీ సాంకేతిక బృందానికి సవాలు అన్న మాట. ఇది ఒక మార్గం కాగా, రెండవది: కోర్టు ముందు దోషిగా నిరూపితుడై అందుకు తగిన శిక్ష అనుభవించడం. అది జరిగితే, శిక్ష తీవ్రత ఎంతటిదన్న దానితో నిమిత్తం లేకుండా ఇక ఆయన పరిస్థితి, భవిష్యత్తు మౌలికంగా మారిపోతాయి. 


చంద్రబాబుకు నెల రోజులుగా మనసులో మనసు లేదన్నది ఆయన సన్నిహితులు చెప్తున్న మాట. తన మంత్రులు, నాయకులు పైకి ఏమి మాట్లాడినా వారందరి అధైర్యం, అనిశ్చితి అందులో ప్రతిఫలిస్తూనే ఉంది. ఎన్నెన్ని ఉపాయాలు చేసినా కనీసం ఇంతవరకు అవి ఏవీ తనను ఆదుకొనగల ఆశలు కల్పించకపోవడం ఆయనను కుంగదీస్తున్నట్లు కన్పిస్తున్నది. ముఖ్యంగా రెండు వారాలుగా ఛానళ్లలో తన ముఖ కవళికలను, హావభావాలను, గుంటూరు సభ తర్వాత నుంచి కన్పించని చేతి విసుర్లను, చూపుడువేలి సవాళ్లను, మాట ఉచ్చారణలో వేగం-స్థాయి-పదును తగ్గడాన్ని, అస్థిరంగా మారిన నిస్తేజపు చూపులను గమనించినప్పుడు, ఆయన కుంగుబాటు కేవలం ఊహాగానం కాదని ఎవరైనా గ్రహించగలరు. ఈ ఉదంతం కారణంగా తన విశ్వసనీయత రాష్ట్ర ప్రజలతో పాటు దేశమంతటా కుప్పకూలిందన్న స్పృహ ఆయన మనస్సును మరింత బరువెక్కిస్తుండవచ్చు.


ఒకవేళ ఏ అద్భుతమో జరిగి చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడగలిగినా, లేక ఆరోపణలు రుజువై ఎంతో కొంత శిక్షకు గురైనా, ఆ తర్వాత కూడా ఆయన పరిస్థితి చక్కబడేందుకు పైన పేర్కొన్న రెండవ దశలోని మూడు పనులను ఆయన చేయడం అవసరం. లేనిపక్షంలో తనకు ఈ చట్టపరమైన ప్రమాదం తప్పినా తన రాష్ట్ర ప్రజలలో పేరుకుపోతున్న అసంతృప్తి అనే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ అసంతృప్తి వారిలో వివిధ కారణాల వల్ల కొన్ని మాసాలుగా పేరుకుపోతున్నది.


విభజన అనంతరం కొన్ని నెలలు చంద్రబాబు-మోదీ హామీలు కల్పించిన ఆశాభావాలతో గడిచిపోగా, అర్ధ సంవత్సరం దాటిన తర్వాత నుంచి ప్రజల నిరుత్సాహం మొదలైంది. ఏడాది సమీపిస్తుండగా అది నిరాశలు, నిరసనలుగా మారింది. సరిగా ఈ దశలో విస్ఫోటనం వలె రేవంత్ వీడియోలు, చంద్రబాబు ఆడియోల ఉదంతం ప్రజలలోని ఈ వ్యతిరేక భావనల నిప్పుకు గాలినూదింది.


గమనించవలసిందేమంటే, ఒకవేళ చంద్రబాబు కేసు నుంచి బయట పడినా, నిప్పులకు అదనంగా గాలి ఊదటమన్నది నిలిచిపోవచ్చు. కాని, ప్రజల నిరసన భావన అనే అసలు నిప్పులు అట్లాగే ఉంటాయి. రెండవ దశలో చేయవలసిన మూడు పనులు అంటూ పైన రాసింది దీని గురించే.


ఆ మూడు పనులలో...

మొదటిది: చంద్రబాబు తన రాష్ట్ర ప్రజల ఆశాభావాలకు తగినట్లు పాలించడంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ఆయన తన ఆశాభావాలకు, తన వారి ప్రయోజనాలకు తగినట్లు పాలిస్తూ అందులోనే ప్రజల ప్రయోజనాలు ఉన్నట్లు చెప్తున్నారనే మాట అక్కడి సామాన్యుల నుంచి వినవస్తున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయకపోవడం ఒకటికాగా, ఆయన తిరిగి తన గత పాలనా కాలపు ఆర్థిక సంస్కరణల మార్గంలోనే నడుస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తున్నది. ధనిక వర్గాలకు మేలు చేయడంపై దృష్టిని కేంద్రీకరించి రాజధాని గురించి, రాష్ట్రం గురించి జాతీయస్థాయి, ప్రపంచస్థాయి లక్ష్యాలంటూ హోరెత్తిస్తున్నారు తప్ప సామాన్యుల సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుని నెరవేర్చే దిశలో చంద్రబాబు వెళ్లడం లేదన్న విమర్శ క్రమంగా పెరుగుతున్నది. మరొకవైపు తన మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యుల తీరుపై వెల్లువెత్తుతున్న అసంతృప్తి ఆయన దృష్టికి రాలేదనుకోగలమా? కానీ వారిని నియంత్రించగల శక్తి ముఖ్యమంత్రిలో ఒకప్పుడు ఉండినంతగా ఇప్పుడు కనిపించడం లేదనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఇవి ఏవీ కూడా తేలికైన సమస్యలు కావు. అవి బాబుకు రాజకీయంగా పెద్ద ముప్పునే తేగలవు. 


రెండవది: కార్యస్థానం విషయం- తమకు హైదరాబాద్‌పై హక్కులున్నాయని, అక్కడ పదేళ్లూ ఉంటామని, ఆ తర్వాత కూడా ఉంటామని చంద్రబాబు, ఆయన సహచరులు ఆవేశంగా మాట్లాడటం ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజలకు మాత్రం విస్మయం కలుగుతున్నది. మన రాష్ర్టాన్ని మన రాష్ట్రంలో కూర్చుని పరిపాలించుకోవడం గాక, ఇంకా హైదరాబాద్‌లో ఉంటూ పాలించడం ఎందుకన్నది వారి ప్రశ్న. హైదరాబాద్‌ను కోల్పోవడం మొదట కొంత భావోద్వేగాన్ని కలిగించిన మాట నిజం. కానీ అదిపోయి, ప్రజల ఆలోచనలు స్వరాష్ట్ర అభివృద్ధి చుట్టూ కేంద్రీకృతం అవుతున్నాయి. రాజధాని అన్నది ప్రజల దృష్టిలో ఆకాశహర్మ్యాలు, అట్టహాసాలు కాదు. అది స్వీయ పాలనకు ఒక కార్యస్థానం. ఆ పని ప్రాథమికంగా తమ గడ్డపై నుంచి తమ మధ్య నుంచి జరగాలి. అప్పుడే వారికి తమ పాలకులతో, ప్రభుత్వంతో అనుబంధాలు ఏర్పడతాయి. కానీ చంద్రబాబు ఈ వాస్తవాన్ని గుర్తించడం లేదు. హైదరాబాద్ కోసం ఆయన బృందపు కలవరింతలు (సెక్షన్-8 సహా) ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టకపోగా, చిరాకును కలిగిస్తున్నాయి. ఈ కారణంగా ఇరువురి మధ్య దూరం మరింత పెరుగుతున్నది. అందువల్ల చంద్రబాబు నిజంగా ఈ ఆపదల వరద నుంచి గట్టెక్కాలంటే చేయవలసిన రెండవ పని తన ప్రజలతో గల ఈ రెండవ అంతరాన్ని లేకుండా చేసుకోవడం. ఆయన ఈ దిశలో ఒక ఆరంభంగా తీసుకుని వేగంగా విజయవాడ-గుంటూరులకు మారిపోవాలి.


చివరి అంశానికి వస్తే.. టీడీపీ మొదలైనప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రపు ప్రాంతీయ పార్టీ. కానీ విభజన అనంతరం అది సాంకేతికంగా ఏమైనప్పటికీ వాస్తవరూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పార్టీ మాత్రమే. తెలంగాణలో వారికి ఇంకా ఉనికి ఉండవచ్చుగాక, కానీ వారిక్కడ వృద్ధి చెందగల ఆబ్జెక్టివ్ పరిస్థితులు లేవు. ఉనికిని ఈమాత్రపు స్థాయిలో నిలబెట్టుకోగల అవకాశాలు కూడా లేవు. హైదరాబాద్‌లో చంద్రబాబు వర్గానికి ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు గాక, ఆయన తన పార్టీని జాతీయ పార్టీ చేయదలచుకున్న క్రమంలో తెలంగాణపై ఆశలు పెట్టుకోవచ్చు గాక, కానీ, తెలంగాణలో ఈ తరహా రాజకీయ జోక్యాల వల్ల అవన్నీ దెబ్బతింటాయి. స్వరాష్ట్రంలోనూ వ్యతిరేకేత ఏర్పడుతుంది. పరువు ప్రతిష్ఠలు మంటగలవటం, జైలు ప్రమాదాల మాట సరే సరి. కనుక తెలంగాణ నుంచి తన పాలనను ఉపసంహరించుకోవడం...ఆయన గట్టెక్కేందుకు చేయవలసిన మూడవ పని.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


6 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

మీరు మంచిగ చెప్పింన్నన్రీ

Unknown చెప్పారు...

మీరు చాలా మంచిగ చెప్పిన్రు!
కానీ గివన్నీ ఆల్లకు ఎక్కుతయా!

Unknown చెప్పారు...

మీరు చాలా మంచిగ చెప్పిన్రు!
కానీ గివన్నీ ఆల్లకు ఎక్కుతయా!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కాలమే అన్నీ ఎక్కేటట్లు చేస్తుంది. దేనికైనా సమయం రావాలి. అది త్వరలోనే రానున్నది. వేచిచూడండి. స్పందించినందుకు ధన్యవాదాలు. స్వస్తి.

శ్యామలీయం చెప్పారు...

గుండువారూ,

మీరు నా రాకకు ఆక్షేపణ తెలుపరన్న ఆశతో ఈ ఒక్క ముక్కా వ్రాస్తున్నాను.

ప్రస్తుతం కాలంలో జరుగుతున్న పరిణామాలకు కాలంలో పరిష్కారం అన్న సూచనగా నేను ఎప్పటినుండో ప్రస్తావిస్తూనే ఉన్నాను. ఆ విధమైన ఫలోదయ కాలం నేడో రేపో అన్న ఆశ మనుష్యులలో సహజంగా ఉంటుంది. కాలానికి మోహాదులు ఏమీ ఉండవు కాబట్టి జీవులయందును సమాజములందును తత్తక్కర్మఫలానుసారిగా ఫలోదయకాలానికి స్పందిస్తుంది. విస్తరభీతిచే విరమిస్తున్నాను.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఎవరు చేసిన కర్మ వారనుభవిపగ
నెవరికైనను తప్పదన్న!

చేసిన సత్కర్మకు గానీ, దుష్కర్మకు గానీ ఫలితం మాత్రం తప్పక అనుభవించితీరతారు శ్యామలీయంగారూ!

స్పందించినందులకు కృతజ్ఞతలు. స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి