ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుయుక్తులను పార్లమెంటు వేదికపై బహిరంగ పరిచారు. తెలంగాణలో కూడా రాజకీయ అధికారం చేజిక్కించుకోవడం ద్వారా,హైదరాబాద్ చండీగఢ్ మాదిరిగా ఉమ్మడి సొత్తు చేయాలనే కుత్సితపు బుద్ధి చంద్రబాబుకు ఉన్నదనే అనుమానాలు తెలంగాణవాదులు ఎప్పటి నుంచో వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హైకోర్టునే కాదు, ఉద్యోగుల విభజనను, వివిధ సంస్థల అప్పగింతను సజావుగా సాగకుండా నిరోధిస్తున్నాడు. ఇటువంటి వివాదాలలో కేంద్రం మధ్యవర్తి పాత్రను పోషించి పరిష్కరించాలె. చంద్రబాబు కుట్రలకు సహకరించడం ద్వారా తమ ఔన్నత్యాన్ని కోల్పోకూడదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడాది దాటినా ఇంకా ఉమ్మడి హైకోర్టునే కొనసాగించడం తీవ్ర ఆందోళనకు తావిస్తున్నది. రాష్ట్రంలో వ్యక్తమవుతున్న ఆందోళన పార్లమెంటులో కూడా ప్రతిధ్వనిస్తున్నది. వెంటనే హైకోర్టు విభజన జరపాలంటూ పార్లమెంటులో టీఆరెస్ ఎంపీలు కొద్ది రోజులుగా ఆందోళన సాగిస్తున్నారు. అయినా ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం ఇచ్చిన వివరణ స్పష్టంగా లేదు. హైకోర్టు విభజనకు కట్టుబడి ఉన్నామనే పాత పాటనే వినిపించారు. గతంలో అనేక సార్లు పార్లమెంటులో హామీలు ఇచ్చినా అమలు జరగలేదు. న్యాయ మంత్రి మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు కూడా యాదాలాపంగా హైకోర్టు విభజనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇటువంటి మంత్రుల హామీలు అమలుకు నోచుకోకపోవడం వల్లనే పార్లమెంటు వేదికపై మరింత స్పష్టమైన హామీని కోరవలసి వస్తున్నది. అందువల్ల ప్రధాని మోదీ స్వయంగా హామీ ఇవ్వాలని టీఆరెస్ ఎంపీలు కోరడంలో తప్పేమీ లేదు. ఇటీవల న్యాయశాఖ మంత్రి టీఆరెస్ ఎంపీలతో సమావేశమైనప్పుడు, ప్రధాని సానుకూలంగా ఉన్నారని, ఆందోళన చేయవద్దని కోరారు. దీనికి టీఆరెస్ ఎంపీలు సంతృప్తి చెందక, ఇదే విషయాన్ని ప్రధాని నోట పార్లమెంటులో చెప్పించాలని కోరారు. కానీ ఇప్పటి వరకు ప్రధాని నుంచి హామీ రావడం లేదు. హైకోర్టు కోసం టీఆరెస్ ఎంపీలు మెరుపు సమ్మె చేయడం లేదు. ఎంతో ముందు నుంచి అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. హైకోర్టు విభజన కోసం పార్లమెంటులో ఆందోళన చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు సమావేశాలు ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే హెచ్చరించారు. అయినా పార్లమెంటులో రోజుల కొద్దీ ఆందోళన చేసినా కేంద్రం చలించక పోవడం బాధ్యతారాహిత్యమే.
సొంత హైకోర్టు తెలంగాణకు ఎంత అవసరమో, సీమాంధ్ర ప్రజలకు కూడా అంతే అవసరం. శాసన, కార్యనిర్వాహక శాఖల మాదిరే న్యాయశాఖ కూడా కీలకమైనది. సొంత న్యాయస్థానం ఏర్పాటయితేనే రాష్ట్ర విభజన పూర్తయినట్టు. సొంత న్యాయస్థానం కలిగి ఉండడం రాష్ర్టాల హక్కు, ప్రజల హక్కు. సొంత న్యాయ వ్యవస్థ లేనిదే ప్రజా సార్వభౌమత్వం సంపూర్ణం కాదు. అందువల్ల రెండు రాష్ర్టాలకు విడిగా హైకోర్టులు ఏర్పాటు చేయడంలో కేంద్రం తన బాధ్యతను విస్మరించకూడదు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు కూడా తమ ప్రజల కోసం సొంత హైకోర్టు ఉండాలని కోరుకోవాలె. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సొంత హైకోర్టు కోసం ఆరాటపడుతున్నది. ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేయడానికి పూర్తిగా సహకరిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను హైకోర్టు కూడా గుర్తించింది. అయితే సీమాంధ్ర ప్రాంతంలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇందుకు ఆరు నెలల గడువు విధించింది. తమ ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయాలని విజయవాడ న్యాయవాదులూ డిమాండ్ చేస్తున్నారు. అయినా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేంద్రం కూడా తనవంతు పాత్ర నిర్వహించకుండా అంతా ఏపీపైకి నెట్టివేస్తున్నది. ఏపీకి విడిగా హైకోర్టు ఏర్పాటు చేయాలంటే ఇందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలె. కేంద్రం సూచన మేరకు రాష్ట్రపతి నోటిఫై చేయాలె. రాష్ర్టానికి హైకోర్టును చేయడంలో సుప్రీం కోర్టు పాత్ర లేదని, కేంద్రం పరిధిలోనిదని గతంలో ఇక్కడి ఉమ్మడి హైకోర్టు చీవాట్లు పెట్టినా కేంద్రం వైఖరి మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. తెలంగాణ న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు అన్ని వేదికలపై పోరాటం చేస్తున్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఇంత మొద్దుబారిపోయి ఉండడం ప్రజాస్వామ్య సంస్కృతికి విరుద్ధం.
రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటిన తరువాత కూడా రెండు రాష్ర్టాలకు సొంత న్యాయస్థానాలు ఏర్పడకపోవడానికి కారణం- సీమాంధ్ర శక్తుల కుతంత్రమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతున్నది. సీమాంధ్ర పెత్తందారులు ఉమ్మడి హైకోర్టును ఆసరాగా చేసుకొని తెలంగాణను ఇబ్బందుల్లో పడేయాలని చూస్తున్నారనే వాదన కొట్టిపారేయలేనిది. బుధవారం లోక్‌సభలో టీఆరెస్ ఎంపీలు కూడా ఇదే భావనను వ్యక్తపరిచారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుయుక్తులను పార్లమెంటు వేదికపై బహిరంగ పరిచారు. తెలంగాణలో కూడా రాజకీయ అధికారం చేజిక్కించుకోవడం ద్వారా, హైదరాబాద్ చండీగఢ్ మాదిరిగా ఉమ్మడి సొత్తు చేయాలనే కుత్సితపు బుద్ధి చంద్రబాబుకు ఉన్నదనే అనుమానాలు తెలంగాణవాదులు ఎప్పటి నుంచో వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హైకోర్టునే కాదు, ఉద్యోగుల విభజనను, వివిధ సంస్థల అప్పగింతను సజావుగా సాగకుండా నిరోధిస్తున్నాడు. ఇటువంటి వివాదాలలో కేంద్రం మధ్యవర్తి పాత్రను పోషించి పరిష్కరించాలె. చంద్రబాబు కుట్రలకు సహకరించడం ద్వారా తమ ఔన్నత్యాన్ని కోల్పోకూడదు.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి