గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 25, 2015

తెలంగాణ చైతన్య దీపిక...!!!


డాక్టర్ దేవులపల్లి రామానుజరావు 20వ శతాబ్దిలో ఐదు దశాబ్దాల కాలం భాషా సాంస్కృతిక వికాస యుగాన్ని శాసించారు. రేయింబవళ్లు పాటుపడ్డారు. తెలుగునాట రామానుజరావు కవి, రచయితలకు, పండితులకు తలలోని నాలుకగా మసలుకున్నారు. ఎక్కిన ప్రతీ వేదిక మీద కంచుకంఠంతో సారభూతమైన ప్రసంగాలు చేసి విమర్శకులను మెప్పించారు. కవిగా, వక్తగా, పత్రికా సంపాదకునిగా, బహుభాషావేత్తగా, విద్యావేత్తగా నిరంతరం బహుకార్యమగ్నులై సఫలజీవనం గడిపారు.


1942లో తెలంగాణ పేరుతో దినపత్రిక హైదరాబాద్ నుంచి వెలువడింది. ఆ పత్రిక సంపాదకవర్గంలో చేరమని కోరుతూ మాడపాటి హనుమంతరావు రామానుజరావుకు లేఖ రాశారు. అయితే అప్పటికే నాగపూర్‌లో న్యాయకళాశాలలో చేరడంవల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు.


నిజాం కాలంలో పాఠశాలలు తక్కువ. అక్షరాస్యత మరీ తక్కువ. మొత్తం జనాభాలో ఉర్దూ భాషీయులు పదిశాతమే అయినా నిజాం ఉర్దూను అధికార భాషగా అమలు పరిచారు. తెలుగు చదివే అవకాశాలులేవు. పైగా తెలుగు చదవడం, మాట్లాడటం నేరమన్నట్లు చూసేవారు. హిందువులు సైతం షేర్వానీ, పైజామా ధరించేవారు. ఇళ్ళలో, బంధుమిత్రులు, ఇతరులతో ఉర్దూలోనే మాట్లాడేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగును నిలబెట్టడానికి 1943మే 23న ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింది. తొలి అధ్యక్షులు లోకనంది శంకరనారాయణరావు. మలి అధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డి. దేవులపల్లి రామానుజరావు నాగపూర్‌లో న్యాయశాస్త్ర పట్టభద్రులై తిరిగిరాగానే ఆంధ్ర సారస్వత పరిషత్తులో సభ్యునిగా చేరారు. 


పరిషత్తు మొదటి వార్షిక సభలు వరంగల్ కోటలో తెలంగాణ తెలుగు ఆత్మగౌరవ ప్రదర్శకంగా జరిగాయి. ఉదయరాజు రాజేశ్వరరావు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా, కాళోజీ నారాయణరావు కార్యదర్శిగా ఉన్నారు. కోటలో కవి సమ్మేళనం కోసం వేసిన పందిరిని రజాకార్లు తగులబెట్టారు. అయినప్పటికీ జంకక యథావిధిగా కార్యక్రమం నిర్వహించుకోవటంలో రామానుజరావు చేసిన కృషి కీలకమైంది. ఆ సభల్లో ఆయన తెలంగాణలోని ప్రాచీన ఆధునిక సాహిత్యానికి సంబంధించిన పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాశరథి అక్కడే రామానుజరావుకు తొలిసారి పరిచయం కావడమే గాక ప్రదర్శనను ప్రారంభించి అభినందించారు.


నాగపూర్‌లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం చేస్తున్నకాలంలో పి.వి.నరసింహారావు రామానుజరావుకు సహాధ్యాయి. ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు, అవధానాలు, గ్రంథాలయాలు, నవలలు, పత్రికలు రామానుజరావును తెలుగు సాహిత్యం వైపు ఆకర్షించాయి. సికింద్రాబాద్‌లో సత్యహరిచంద్ర నాటక కర్త బలిజేపల్లి లక్ష్మీకాంతం గారిని కలుసుకున్నారు. ఆయన స్వయంగా ఒక పాత్ర ధరించి ప్రదర్శించిన ఆ నాటకాన్ని రామానుజరావు మిత్రులతో కలిసి వీక్షించారు. 1943లో ఆంధ్ర సారస్వత పరిషతుకు అనతికాలంలోనే రామానుజరావు కార్యవర్గ సభ్యుడై, 1949లో ఉపాధ్యక్షుడయ్యారు. పరిషత్తు పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా యావజ్జీవితం పరిషత్తు కోసం, తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం వెచ్చించారు. సారస్వత పరిషత్తు శాఖోపశాఖలుగా విస్తరించింది. రాష్ట్రేతర ప్రాంతాల్లో పరిషత్తు పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 


పరిషత్తు ఎన్నో గొప్ప గ్రంథాలను ప్రచురించింది. నిరంతరం సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. ప్రాచ్యకళాశాల, పండితశిక్షణ కళాశాల ఏర్పాటైంది.1953 జనవరిలో పరిషత్తు సప్తమ వార్షిక సభలు మూడు రోజులపాటు ఆలంపురంలో జరిగాయి. దేవులపల్లి రామానుజరావు పరిషత్తు అధ్యక్షుల హోదాలో సభలకు అధ్యక్షులయ్యారు. నాటి ఉప రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నుంచి శ్రీశ్రీ వరకు మహామహులైన కవి పండితులు సభల్లో పాల్గొన్నారు. చూడటానికి పొట్టివాడైనా సాహిత్యకృషిలో విరాణ్మూర్తిగా పేరుపొందిన రామానుజరావుకు ఈ కృషిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ రెండు భుజాలుగా, రెండు అద్భుత వేదికలుగా ఉన్నాయి.


దేశానికి స్వాతంత్య్రం రాగానే అన్ని రాష్ర్టాల్లో వలెనే 1957లో ఆంధ్రప్రదేశ్‌లోనూ సాహిత్య అకాడమీ ఏర్పడింది. మొట్టమొదట బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులుగా, విశ్వనాథ సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా, దేవులపల్లి రామానుజరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అధ్యక్షులు గొప్ప సాహితీవేత్త అయినా జాతీయస్థాయిలో బహుకార్య నిమగ్నులైవుండటం వల్ల ఆయన పనులను, తమ పనులను రామానుజరావే చూసేవారు. అకాడమీ పక్షాన శతాధిక గ్రంథాలు ముద్రించారు. ప్రముఖుల జయంతులు,వర్ధంతులు నిర్వహించారు. రచయితలు తమ పుస్తకాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సహాయం అందించేవారు. 


ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు బహూకరించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే గోపాలరెడ్డి, రామానుజరావుల సారథ్యంలో సాహిత్యానికి నిత్యకళ్యాణం పచ్చతోరణంలా పండుగలు చేసేవారు. ఆయన తలపెట్టిన, నిర్వహించిన ఏ కార్యక్రమమైనా దిగ్విజయం కావలసిందే. విజయం కోసం రామానుజరావు చూపిన పట్టుదల, చేసిన పరిశ్రమ అలాంటిది. స్వయంగా ఏ సభలోనైనా, ఏ విషయం మీదనయినా క్లుప్తంగా, సారభూతంగా ప్రసంగించి పండితుల మెప్పుపొందే శక్తిమంతులు. 


తెలుగు, ఆంగ్లం, ఉర్దూ తదితర అనేక భాషల్లో పండితులు. సాహిత్యమే గాక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల గురించి సమగ్రమైన అవగాహన కలిగినవారు. స్వతంత్ర వ్యక్తిత్వం. ఎవరికీ లొంగేవారు కారు. ప్రజాస్వామ్యవాది. అధికారాన్ని ఎవరిపైనా చెలాయించక వస్త్వాశ్రయదృష్టితో వ్యవహరించేవారు. సాహిత్యంలో ఆనాటి పరిణామాలు, ధోరణులన్నీ ఆయనకు కరతలామలకం. కవి రచయితల కృషిపై ఎవరూ చెప్పనవసరం లేకుండా సొంతంగా అంచనా కలిగి ఉండేవారు. అందువల్లనే ప్రతిభకు తగిన గుర్తింపు అడగకనే అందేలా చూసేవారు.


రామానుజరావుకు తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితి, జిల్లా గ్రంథాలయ సంస్థ వంటి అనేక ఇతర సంస్థలు, వ్యవస్థలతో సన్నిహిత సంబంధం ఉన్నది. ఆయా సంస్థల కార్యకలాపాల విస్తృతిలో ఆయన ప్రత్యక్ష పాత్రవుంది. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగా పదేళ్లు సేవలందిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సిండికేటు, సెనేట్ సభ్యునిగా వైస్ ఛాన్స్‌లర్‌గా విశ్వవిద్యాలయ విద్యా కార్యక్రమాలపై ప్రభావం చూపారు.


ఐదు దశాబ్దాల పాటు తెలంగాణను కేంద్రంగా చేసుకొని యావత్ తెలుగు నేలలో సమున్నత వ్యక్తిత్వంతో భాసించారు దేవులపల్లి రామానుజరావు. ఆధునిక తెలుగు సాహిత్యానికి 20వ శతాబ్ది స్వర్ణయుగమైతే ఆ బంగారం పండటంలో నీరుపోసి పెంపు చేసిన రైతుపాత్ర రామానుజరావుది. తెలంగాణ వైతాళికుల్లో అగ్రాసనాన నిలపదగిన అతికొద్ది మందిలో రామానుజరావు ఒకరు. తెలంగాణ సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేసిన వారిలో అగ్రగణ్యులు రామానుజరావు. ఆయన పెంచి పెద్ద చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్తు నేటికీ వర్ధిల్లుతూ వారి స్మృతిని పచ్చగా కాపాడుతున్నది.


వ్యాస రచయిత:
- డాక్టర్ జె.చెన్నయ్య


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి