గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 04, 2015

మేనేజ్ చేయడమే పాలనా?

ప్రజల కోసం మంచి పనులు చేయడమే కాదు, చేసినట్లు కనిపించాలి కూడా అని నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం క్లాసులు చెప్పేవారు. ఈ మాటలను కొంత మంది అసలు పని చేయకున్నా ఫర్వాలేదు, కానీ పనిచేసినట్లు మాత్రం కనిపించాలి అనే అర్థంలో స్వీకరిస్తున్నారు. రాజనీతి శాస్త్ర తత్తవేత్త మాకియవెల్లి తన ద ప్రిన్స్ గ్రంథంలో కూడా పాలకుడు ఎప్పుడూ ప్రజల కోసం ఏదో చేస్తున్నట్లు కనిపించాలి అని సెలవిచ్చాడు. ఈ మాటలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రజలను మేనేజ్ చేయడమే లక్ష్యం అని ఉంది. కానీ మేనేజ్ అనే మాటను మాత్రం వాడలేకపోయారు. శ్రీకృష్ణ కమిటీనే ఆ పుణ్యం కూడా కట్టుకుంది. పాలకులకు మాకియవెల్లిని మించిన నీతులు చెప్పింది. తెలంగాణ నాయకత్వాన్ని పదవులతో ఎలా మేనేజ్ చేయవచ్చో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను డబ్బులతో ఎలా మేనేజ్ చేయవచ్చో, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులతో ఎలా మేనేజ్ చేయవచ్చో, అసలు బయట ప్రపంచానికి సమాచారం అందకుండా మీడియాను ఎలా మేనేజ్ చేయవచ్చో కూడా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది.


శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లే ఆంధ్ర నాయకులు చేశారు కానీ, ఢిల్లీ నాయకత్వమే పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రం విడిపోయాక ఓ విద్యగా మారిన మేనేజ్‌మెంట్ కళను పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రజల కోసం చేసేదేమీ లేకున్నా సరే, ప్రచారంతో మేనేజ్ చేస్తే చాలు అనుకునే పరిస్థితి కొంతమంది నాయకులకు వచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక అవస్థలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ పాలకులు, నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే అసలు పాలన అంటేనే మేనేజ్ చేయడం కాబోలు అనిపిస్తున్నది. సదరు పాలకులకు అండగా కొంత మీడియా కూడా నిలబడుతున్నది. ఒకే సంఘటనను రెండు రకాలుగా చూడడమే కాదు, ఏ ప్రాంత ప్రజలు ఎలా ఆలోచించాలో కూడా వారే మేనేజ్ చేయ ప్రయత్నిస్తున్నారు. 


vijay

మేనేజ్ చేయడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఓ గీత చిన్నదా? పెద్దదా? అని తేల్చడానికి దాని కొలతలతో సంబంధం లేదిప్పుడు. పక్కన గీసే గీతను బట్టి దీని స్థాయి తేల్చే స్థితి వచ్చింది. ఓటుకు నోటు కేసును మసిబూసి మారేడు కాయచేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ ఓ గీత గీశారు. దాన్ని పెద్దగా చూపిస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యను చాలా చిన్నగా చూపడానికి కూడా ఈ మేనేజింగ్ కళను వాడుతున్నారు. మరి కాంగ్రెస్ పాలనలో ఆయేషా విషయాన్ని ఇప్పుడున్న అధికార పార్టే ఓ స్టేట్ ఇష్యూగా మార్చిన చరిత్ర గుర్తుకు కూడా లేనంతగా మీడియా మేనేజ్ చేసింది. వనజాక్షి అనే ఎమ్మార్వోపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి చేస్తే, తప్పు ఎమ్మార్వోదే అని ఉద్యోగ సంఘాలే నోరుమూసుకునేలా మేనేజ్ చేశారు. టీడీపీ పార్లమెంటు సభ్యుడు జాతీయ ఛానళ్‌తో మందు బాటిళ్ల కోసం యువకులు సైన్యంలో చేరుతున్నారని నోరు పారేసుకుంటే, అసలది విషయమే కాదన్నట్లు మేనేజ్ చేయగలిగారు. 


పుష్కర స్నానం చేయాలంటే రాజమండ్రికి పోవాల్సిందే అని భక్తుల మెదళ్లను కొద్దినెలల ముందు నుంచే మేనేజ్ చేయగలిగిన వారే, ప్రమాదం జరిగిన తర్వాత అబ్బే ఒక్క రాజమండ్రికే పోవాలని ఏమీ లేదు అని బుకాయించి రివర్స్ మేనేజ్ కూడా చేయచూశారు. కానీ నేటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ రోడ్ల మీద పెట్టిన హోర్డింగుల్లో గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రికి రండి అని పిలిచే రాతలు కనిపిస్తున్నాయి. 


ఎన్నికల ముందు ఆంధ్రకు ప్రత్యేక హోదా అని ప్రకటించిన బీజేపీ, టీడీపీలు ఇప్పుడు హోదా సాధించకున్నా వారిని తప్పుపట్టలేనంతగా మేనేజ్ చేయగలుగుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నేను లేఖ ఇచ్చాను అని తెలంగాణలో చెప్పుకునే మహానుభావుడే విభజన పాపం కాంగ్రెస్‌ది అని ఆంధ్రలో గొంతు చించుకుంటున్నారు. నాయకుడికి రెండు నాలుకలున్నట్లే ప్రజలకూ రెండు చెవులున్నాయి కాబట్టి, ద్వంద్వనీతి విని రెండింటిలోని సానుకూలతలను అర్థం చేసుకోకుంటే రెండు చెవులుండి ఏమి లాభమని ఎవరిని వారు ప్రశ్నించుకునేలా మేనేజ్ చేయబడుతున్నారు. 


మేనేజ్‌మెంట్ అనేది ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. ఆంధ్రలో ఎవరైనా పార్టీ మారితే దాన్ని ఫిరాయింపు అనుకోవద్దు, తెలంగాణలో పార్టీ మారితేనే ఫిరాయింపు, రాజ్యాంగ ఉల్లంఘన అని అనుకోవాలి. ఆంధ్రలో ఎలాంటి అనుమతులు లేకున్నా పట్టిసీమ కట్టుకోవచ్చు. కానీ తెలంగాణలో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పాలమూరు కట్టుకోవద్దు. తెలంగాణలో జరిగిన దాన్ని తప్పుగా చూడాలి, ఆంధ్రలో జరుగుతున్నదాన్ని అర్థం చేసుకోవాలనే విధంగా మేనేజ్ మెంట్ విద్య బోధిస్తున్నది. 


పురుషులందు పుణ్య పురుషులు వేరని వేమన చెప్పినట్లు.. మేనేజ్‌మెంట్లలో మీడియా మేనేజ్‌మెంట్ వేరు. మీడియా ఎలా మేనేజ్ అవుతున్నదో కళ్లారా చూసే భాగ్యం ఇప్పుడు తెలుగు ప్రజలకు కలుగుతున్నది. తెలంగాణలో మున్సిపల్ కార్మికుల సమ్మె మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించాలి. ఆంధ్రలో అంగన్‌వాడీల ఆకలి కేకలు ఎవరికీ వినిపించవద్దు. తెలంగాణ మున్సిపాలిటీల ముందు వాలడానికే ఓబి వ్యాన్లు కావాలి తప్ప, ఆంధ్ర కలెక్టరేట్ల ముందు అంగన్‌వాడీల వాయిస్ తీసుకోవడానికి మైకులు పెట్టవద్దు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పతాక శీర్షికలు కావాలి, అనంతపురంలో మోగుతున్న మరణమృదంగం టాబ్లాయిడ్ పేజీల్లో కూడా కనిపించవద్దు. రోగుల ప్రాణాలు కాపాడడానికి ఉస్మానియాను కూలకొట్టడంలో వారసత్వ పరిరక్షణ స్ఫూర్తి కనిపించాలి కానీ రాజధాని కోసం వ్యవసాయ భూమిని లాక్కునే విషయంలో మాత్రం రైతుల ఆర్తి ఎక్కడా కనిపించవద్దు. 


ఏసీబీకి పట్టుబడిన ఎమ్మెల్యే హీరోలా చలామణి కావాలి, కానీ తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులకు అనుకూలమైన రాజ్యస్థాపనే నా లక్ష్యం అని ఆయన పలికిన పలుకులకు మాత్రం ప్రచారం లభించకూడదు. ఆంధ్రలో 2050లో పూర్తి చేసేలా వేసిన రాజధాని ప్రణాళికలు ఆహో ఓహో అనిపించాలి. తెలంగాణలో మూడేళ్లలో పూర్తయ్యేలా సిద్ధం చేసే నీటి ప్రాజెక్టుల్లో వంకలు వెతకాలి. రాజమండ్రి పుష్కరాల్లో 27 మంది మరణిస్తే కానరాని తప్పులు, బాసర బురదలో వెతికి పట్టుకుని చూపించాలి. కోటిలింగాలలో అగ్ని ప్రమాదం చిన్నవిషయంగా మారాలి. ధర్మపురిలో ట్రాఫిక్ జామ్ పెద్ద వైఫల్యంగా కనబడాలి. తెలంగాణలో మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, కళ్యాణలక్ష్మి, హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం, రహదారులు.. ఇలా ఎన్నో పథకాలు తెచ్చినా వాటికి పెద్దగా ప్రచారం లభించవద్దు. కానీ ఆంధ్రలో మాత్రం "అన్న షర్టేస్తే మాస్, అన్న ప్యాంటేస్తే మాస్, అన్న గడ్డం పెంచితే మాస్" అనేలా అదరగొట్టాలి. 


ఈ మీడియా మేనేజ్‌మెంట్ అనేది ఇప్పుడే కాదు, సదరు పాలకులను ఎప్పటినుంచో కాపాడుతున్నది. అడ్డదారిలో గుంజుకున్న అధికారాన్ని సుస్థిరం చేసింది ఇదే. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి యత్నించిందీ ఇదే. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్రలో కూడా ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం జరిగింది. కానీ ఆ ఉద్యమాన్ని చూపెట్టకుండా, వార్తలు రాయకుండా మేనేజ్‌మెంట్ జరిగింది. 


ఈ మేనేజ్‌మెంట్ విద్య ఒక్క చంద్రబాబు అండ్ కో కు మాత్రమే కాదు. కేంద్రంలోని నరేంద్ర మోదీకి కూడా బాగా అబ్బింది. ప్రజల వ్యతిరేకతతో తనంతట తానే కొట్టుకుపోతే, ఆ ప్రళయానికి నరేంద్రమోదీ పేరు పెట్టిందీ ఈ మీడియా మేనేజ్‌మెంట్. మతతత్వాన్ని రెచ్చగొట్టి గుజరాత్‌లో సాధించిన విజయాలకు అభివృద్ధి ముసుగు తొడిగిందీ అదే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడం మీద కన్నా, మేనేజ్ చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ ప్రజల కోసం పని చేయడం శాశ్వత ఫలితాలను, మేనేజ్ చేసే చర్యలు తాత్కాలిక ఫలితాలను ఇస్తాయన్న చారిత్రక వాస్తవం కూడా ప్రభుత్వాలను నడుపుతున్న ఈవెంట్ మేనేజర్లు తెలుసుకోవాలి. మేము వెలిగిపోతున్నాం, మేము గొప్పగా పాలిస్తున్నాం అని మేనేజ్ చేయడం కాదు, నిజంగా ప్రజలకు మేలు జరగాలి. 


ఇటీవల రెండు ఘటనలు జరిగాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాసింది. సెప్టెంబరులో చైనాలో జరిగే తమ ఫోరం సదస్సుకు రావాలని, కొత్త రాష్ట్రమైనా అభివృద్ధి పథంలో మీరు దూసుకుపోతున్న తీరు అందరికీ స్ఫూర్తి నింపుతున్నదని ఆ లేఖలో చెప్పారు. నిజానికి కేసీఆర్ పెద్దగా విదేశీ పర్యటనలు చేసింది లేదు. అమెరికా అధ్యక్షుడితో ఫొటోలు దిగాలని ఆరాట పడలేదు. అగ్రరాజ్యాల ముందు అర్రులు చాచింది లేదు. అయినా సరే, తాను చేసిన పనులే కేసీఆర్‌ను ఇప్పుడు అంతర్జాతీయ హీరోను చేస్తున్నాయి. రెండో సంఘటన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు జరిగింది. రమణ్ సింగ్‌కు తెలంగాణకున్న కరెంటు కష్టాలు తెలుసు. అందుకే ఆయన హైదరాబాద్ రాగానే కరెంటు గురించి తెలుసుకోవాలనుకున్నాడు. తన పర్యటనలో గవర్నర్, ముఖ్యమంత్రి మొదలుకుని చాలా మందిని కలుసుకున్నారు. కానీ ఆయన వారిని ఏమీ అడగలేదు. హైదరాబాద్‌కు చెందిన కారు డ్రైవర్‍ను అడిగారు. మీ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంటని? తెలంగాణలో కరెంటు గురించి ఎవరిని అడిగినా ఏం చెబుతారో సదరు డ్రైవరు కూడా అదే చెప్పారు. ఈ డ్రైవర్‌ను కానీ, వరల్డ్ ఎకనమిక్ ఫోరంను కానీ తెలంగాణ ప్రభుత్వం మేనేజ్‌చేయలేదు. మేనేజ్ చేయడం ద్వారా ప్రచారం మాత్రమే వస్తుంది. మేనేజ్ మెంట్ పాలన కాదు. దాంతో ఫలితాలు రావు. ఈ అంశాన్ని సదరు మేనేజ్ చేసే సంస్థలూ, వ్యక్తులూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది!



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి