-పదేండ్ల దాకా ఒక్క పోస్టూ రాదు దిక్కుతోచని స్థితిలో తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు
-ఇష్టారాజ్యంగా పదోన్నతులు..రెండింతలైన అధికారులు
-ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్పీ పోస్టుల సంఖ్య 473.. ప్రస్తుతమున్నది 986
-ఏడాది పొడువునా పదుల సంఖ్యలో రిటైరయినా పదేండ్లు ఆగాల్సిందే
-సుప్రీంకోర్టు కేసు పేరిట నానాయాగీ చేసిన సీమాంధ్ర డీజీపీలు
-ఇష్టారాజ్యంగా పదోన్నతులు..రెండింతలైన అధికారులు
-ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్పీ పోస్టుల సంఖ్య 473.. ప్రస్తుతమున్నది 986
-ఏడాది పొడువునా పదుల సంఖ్యలో రిటైరయినా పదేండ్లు ఆగాల్సిందే
-సుప్రీంకోర్టు కేసు పేరిట నానాయాగీ చేసిన సీమాంధ్ర డీజీపీలు
రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన డీజీపీలు చేసిన పాపం తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు శాపంగా మారింది. ప్రాంతీయ దురభిమానంతో తమ అనుంగు శిష్యులకు ఎడాపెడా ఇచ్చిన డీఎస్పీ పదోన్నతుల ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతను ఆందోళనలో పడేసింది. విభజన నాటి నుంచి గ్రూప్1 నోటిఫికేషన్ వస్తే డీఎస్పీ అయి పోలీస్ డ్రెస్ వేసుకొని సమాజసేవ చేద్దామనుకున్నవారి కల కలగానే మిగిలిపోయేలా పరిస్థితులు నెలకొన్నాయి. డీజీపీలుగా వ్యవహరించిన ఆంధ్రా ప్రాంతానికి చెం దిన ఐపీఎస్ అధికారులు చేసిన నిర్వాకం మరో పదేండ్ల దాకా రెండు రాష్ర్టాల్లో డీఎస్పీ పోస్టులు ఖాళీ అవకుండా చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే ఏడాదిన్నరగా ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగులకు ఈ విషయం అశనిపాతంగా పరిణమించింది.
నిబంధనల ప్రకారం చేసిఉంటే..: ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష ద్వారా డీఎస్పీలు అయినవారు ఇప్పటికే తంటాలు పడుతున్నారు. 2007 నుంచి 2012 వరకు జరిగిన రిక్రూట్‌మెంట్ డీఎస్పీలు పూర్తిగా అంధకారంలో పడిపోయారు. నిబంధనల ప్రకారం ప్రతీ ఏటా పోలీస్ శాఖలో ఖాళీ అయ్యే డీఎస్పీ పోస్టులను రెండు విధాలుగా భర్తీచేయాలి. ఒకటి ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీగా పదోన్నతి కల్పించడం, మరొకటి గ్రూప్-1 విధానం ద్వారా నేరుగా డీఎస్పీలను భర్తీ చేసుకోవడం. ఇది ఆనవాయితీగా జరిగే ప్రక్రియ. కానీ రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన డీజీపీలు ఇచ్చిన పదోన్నతులు ఇప్పుడు ఇరకాటంలో పడేశాయి. 331/2 శాతం డైరెక్ట్ డీఎస్పీలు, 662/3 ప్రకారం ప్రమోటీలను గుర్తించి నియామకాలు జరపాలి. ప్రతీ ఏటా డైరెక్ట్ రిక్రూట్ డీఎస్పీ స్థానాల్లో ఆయా రేషియో ప్రకారం ఖాళీల పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ప్రభుత్వం ద్వారా పంపించి నియామకాలు జరుపుతారు. కానీ ఆంధ్రా పోలీస్ పెద్దలు తమ సామాజికవర్గానికి చెందినవారికి, లేదా తమ శిష్యులకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇచ్చుకుంటూ వెళ్లడంతో రేషియో ప్రకారం రావాల్సిన డైరెక్డ్ పోస్టులు ఖాళీలు లేకుండాపోయాయి. ఇలా సమస్యను జటిలం చేసి నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లారు.
ఆర్టీఐ దెబ్బతో బయటపడ్డ ఆంధ్రా ఘనకార్యం..
డీఎస్పీ ఆశావహులు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఆంధ్రా అధికారుల నిర్వాకం బయటపడింది. పోలీస్ శాఖలో డీఎస్పీ పోస్టులెన్ని ఉన్నాయి? వాస్తవంగా ఉన్న ఖాళీలెన్నీ, ఇంకా రెండు రాష్ర్టాల మధ్య క్యాడర్ పోస్టుల విభజన కాలేదు కాబట్టి వివరాలు కావాలని వారు ఆర్టీఐ కింద కోరారు. దీనికి లభించిన సమాధానంలో నమ్మలేని, వాస్తవానికి అందని నిజాలు బయటపడ్డాయి. 1978 నుంచి 2009 వరకు డీఎస్పీ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అందించింది. ఆ వివరాల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్పీ క్యాడర్ పోస్టులు కేవలం 473 మాత్రమే. కానీ ఆంధ్రా ప్రాంత డీజీపీలు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అడ్‌హాక్, ఆగ్జిలియరీ పదోన్నతుల దెబ్బతో డీఎస్పీల సంఖ్య 986కు చేరింది. ఇది కూడా విభజనకు ముందు ఆంధ్రా పోలీస్ పెద్దలు తయారుచేసిన 108 జీవో ఆధారంగానే బయటపడ్డ లెక్కలని ఆర్టీఐ దరఖాస్తులో ఆంధ్రప్రదేశ్ అడ్మిన్ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇచ్చిన పత్రాల్లో స్పష్టమైంది.
ఖాళీ అయ్యేదెప్పుడు.. నోటిఫై చేసేదెప్పుడు?
986 మంది డీఎస్పీల్లో ఏడాది పొడువునా పదిమంది చొప్పున పదవీ విరమణ చేసినా డైరెక్ట్ డీఎస్పీ పోస్టులు నోటిఫై కావన్నది తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్న వాస్తవం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి మంజూరైన పోస్టులు కేవలం 473 మాత్రమే. కానీ 986 మందిలో సగానికి పైగా అధికారులు పదవీ విరమణ చేస్తే తప్ప ఖాళీలు ఏర్పడవు. అయితే పదవీ విరమణ విషయంలో కూడా ఇప్పుడు సమస్య ఏర్పడింది. పదవీ విరమణ పొందే వాళ్లంతా ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందిన వారే ఉంటారు. వీరు పదవీ విరమణ పొందినా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం డైరెక్ట్ డీఎస్పీ కోటాలో ఉద్యోగం పొందిన వారు పదవీ విరమణ చేస్తేనే వారిస్థానంలో వేకెన్సీ డీఎస్పీ పోస్టు నోటిఫై అవుతుంది. 2007 నుంచి రిక్రూట్ అయిన డీఎస్పీ పదేండ్ల వరకు కూడా పదవీ విరమణ పొందలేరు. దీనితో డీఎస్పీ పోస్టులు ఖాళీ అయ్యేదెప్పుడు.. ఆ పోస్టులు నోటిఫై అయ్యేదెప్పుడన్నది పోలీస్ శాఖకే అర్థం కానీ సమస్యగా మారిపోయింది.
సమస్య ఇలా మొదలైంది..
ఒక ఏడాదిలో 10 మంది డీఎస్పీలు పదవీ విరమణ పొందితే ఆ ఖాళీల్లో 7 ప్రమోటీ అధికారులు, మరో 3 డైరెక్డ్ రిక్రూట్ డీఎస్పీలను భర్తీ చేయాలి. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ లెక్క పాటించలేదు. గ్రూప్-1 నోటిఫికేషన్ రాని ఏడాదిలో డైరెక్డ్ రిక్రూటీస్ పోస్టులను ప్రమోటీ అధికారులతో నింపేశారు. ఇలా నింపడంలో పెద్దగా సమస్యలేదు. కానీ మరుసటి ఏడాది గ్రూప్-1 డీఎస్పీ రిక్రూట్ అయితే నియామకమైన అభ్యర్థిని డైరెక్ట్ రిక్రూటీ స్థానంలోనే అపాయింట్ చేయాలి. కానీ విభజన ముందు వరకు ఏ డీజీపీ కూడా ఇలాంటి నిబంధనలను పాటించలేదు. దీనితో 2007 తర్వాత జరిగిన నియామకాల్లో ఎంపికయిన 2010, 2012 బ్యాచ్ డీఎస్పీలకు పోస్టులు లేకుండా పోయాయి.
ఒక సమస్యతో మరో సమస్య..
డైరెక్ట్ డీఎస్పీ స్థానంలో ప్రమోటీ అధికారిని నియమించడంతోపాటు సీమాంధ్ర డీజీపీలు మరో కొత్త సమస్యను సృష్టించి పెట్టారు. పాపాలు చేయడం తమకున్న పేటెంట్ హక్కుగా భావించి తెలంగాణ పోలీస్ భవిష్యత్‌ను సర్వనాశనం చేశారు. డైరెక్ట్ రిక్రూటీ స్థానంలో పదోన్నతి పొందిన అధికారి పేరును ఏకంగా సీనియారిటీ లిస్ట్‌లో డైరెక్ట్ డీఎస్పీల స్థానాల్లో చేర్చారు. దీనితో మరో కొత్త సమస్య ఏర్పడింది. సీనియారిటీ జాబితాలో నిబంధనల ప్రకారం ప్రమోటీ అధికారులు, డైరెక్ట్ డీఎస్పీలు వారి వారి శాతాలను బట్టి ఉంటారు. కానీ ఇక్కడ డైరెక్ట్ డీఎస్పీ బ్యాచ్‌ల్లో 2007, ఆ తర్వాత ఎంపికైన అధికారులు అట్టడుగున చేరిపోయారు. దీనివల్ల ఐపీఎస్ పదోన్నతి పొందాల్సిన అధికారులు వెనక్కి వెళ్లడం, మరో రెండేండ్లలో రిటైర్ అయ్యే అధికారులు ముందుకెళ్లడం జరిగింది.
సుప్రీంకోర్టు కేసు బూచిగా..
2009లోనే ఇన్‌స్పెక్టర్ల నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందాల్సిన 1991 బ్యాచ్ హైదరాబాద్ రేంజ్ ఎస్‌ఐలు పదోన్నతులు రాకపోవడంతో సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఫ్రీజోన్ పేరుతో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు తమకు రావాల్సిన పదోన్నతులను తన్నుకుపోతున్నారని కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో 2009లోనే అత్యున్నత ధర్మాసనం వారికి డీఎస్పీ పదోన్నతి కల్పించడంతో పాటు సీనియారిటీ జాబితా రూపొందించాలని ఆదేశించింది. ఈ తీర్పు వచ్చి ఐదేండ్లు గడిచింది. సీమాంధ్ర డీజీపీలు తాము చేసిన పాపం కడుక్కునేందుకు, తప్పించుకునేందుకు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ నానా తంటాలు పడ్డా కోర్టు అక్షింతలు మాత్రం తప్పలేదు. విభజనకు ముందు 2013 డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఉమ్మడి రాష్ట్ర డీజీపీతోపాటు అప్పటి హోంశాఖ సెక్రటరీని తీవ్రస్థాయిలో మందలించింది. రెండు నెలల్లో పదోన్నతుల ప్రక్రియ ముగించకపోతే జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. దీంతో ఖంగుతిన్న పోలీస్ పెద్దలు అప్పటికప్పుడు పదోన్నతులు కల్పిస్తూ సీనియారిటీ జాబితాను తయారుచేశారు. కోర్టుకు చెప్పిందొక్కటి పోలీస్ పెద్దలు చేసింది మరొకటి. ఎస్‌ఐ టూ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ టూ డీఎస్పీ పదోన్నతికి సీనియారిటీ లిస్ట్ తయారుచేసి కోర్టుకు అందించాలి కానీ, అప్పటి పెద్దలు అత్యుత్సాహానికి వెళ్లి జీవో 108 పేరుతో డీఎస్పీ టూ అదనపు ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ సీనియారిటీ లిస్ట్ తప్పుల తడకగా తయారుచేశారని ఇరు రాష్ర్టాల పోలీస్ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. ప్రమోటీస్ కోటా ప్రకారం వారి వారి పేర్లను, డైరెక్ట్ డీఎస్పీ రేషియా ప్రకారం వారి వారి స్థానాల్లో వారి సీనియారిటీని పెట్టి జాబితా రూపొందించాలి. కానీ పూర్తిగా తప్పుల తడకగా రూపొందించారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు హోంశాఖ కార్యదర్శి ప్రసాదరావుకు లేఖ ద్వారా స్పష్టంచేశారు. ఇలా తప్పుల మీద తప్పులు చేసి తెలంగాణలో డీఎస్పీ కావాలని కలలుగన్న యువత ఆశల మెడకు ఉరివేశారు.
సరిచేయాల్సిందే: ఇరు రాష్ట్ర డీజీపీలు
ఉమ్మడి రాష్ట్రంలో సీనియారిటీ లిస్ట్‌ను తయారుచేసి ఇటు డైరెక్ట్ డీఎస్పీలకు, అటు ప్రమోటీలకు న్యాయం చేయాల్సి ఉంటుందని ఇరు రాష్ర్టాల డీజీపీలు స్పష్టంచేశారు. గత పదేండ్లుగా సీనియారిటీ లిస్ట్‌ను ప్రతీ ఏటా ఆయా రేషియోల ప్రకారం రూపొందించకుండా ఒకేసారి తయారు చేయడం, అడ్‌హాక్ పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వడం, ఇచ్చినా డైరెక్ట్ డీఎస్పీ కోటాలో ప్రమోటీలను భర్తీ చేయడం సమస్యకు ప్రధాన కారణమని ఇరు రాష్ర్టాల పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. జీవో 108, 54పై సమీక్ష, సరిదిద్దేందుకు ఓ కమిటీ వేశామని, త్వరలోనే కమిటీ ఆయా అధికారుల అభ్యంతరాలను స్వీకరించి రెండు రాష్ర్టాల ప్రభుత్వాల ముందుకు సమస్యను తీసుకెళ్తుందని వారు తెలిపారు.
క్యాడర్ పోస్టుల విభజన జరిగినా..
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పోలీస్ పెద్దలు చేసిన ఘనకార్యం క్యాడర్ పోస్టుల విభజన జరిగినా సమసిపోయేలా కనిపించడం లేదు. ఎందుకంటే 58:42 నిష్పత్తి ప్రకారం కేడర్‌పోస్టుల విభజన జరుగుతున్నది. ఇలా లెక్కించినా ఆంధ్రా ప్రాంతానికి చెందిన పలువురు అధికారులు తెలంగాణ ప్రాంతానికి వస్తారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పోస్టుల సంఖ్య 473 వీటిలో రాష్ర్టానికి 42శాతం వస్తాయి. అంటే ప్రస్తుతమున్న 986 మందిలో 42శాతం మంది తెలంగాణకు వస్తారు. ఏ లెక్కన చూసిన అటు పోస్టులుగానూ, ఇటు అధికారుల సంఖ్యలోనూ అదనంగానే ఉన్నారు. ఎలా చూసినా డీఎస్పీ పోస్టులు మరో పదేండ్ల వరకు ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. మరి దీనికి ప్రభుత్వాలు ఎలాంటి పరిష్కారం వెతుకుతాయి? ఎలాంటి చర్యలతో నిరుద్యోగ యువతకు అవకాశం లభిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి