గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 11, 2015

పాలమూరులో వజ్రాల గనులు..

diamond

-రాయ్‌చూర్ మార్గంలో డైమండ్ జోన్లు?
-నారాయణ్‌పేట్, గుర్మిట్కల్, అమ్మిరెడ్డిపల్లె, దామరగిద్ద, నిడుగుర్తి గ్రామాల్లో నిక్షేపాలు
-నల్లగొండ జిల్లా చండూరులోనూ వజ్రాలు, పుత్తడి
-విశిష్ఠస్థానం పొందిన గోల్కొండ వజ్రాలు
-ఇప్పటికీ ప్రాశస్థ్యం ఉందన్న పరిశోధకులు


పాలమూరు!! ఈ పేరు చెబితే చాలు.. కరువు కాటకాలు.. ఆకలి మంటలు.. వలసలు.. ఇవే గుర్తుకు వస్తాయి! కానీ.. జిల్లాలోని బీడు భూములకింద అపారమైన వజ్రాల నిల్వలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. మరింత పరిశోధన, కృషి జరిపితే ఈ ప్రాంతంలో వజ్రాలను వెలికి తీయవచ్చునని చెప్తున్నారు. తెలంగాణలోని ఒకప్పటి గోల్కొండ సామ్రాజ్యం కోహినూరు, హోప్‌డైమండ్ వంటి అపురూపమైన వజ్రాలకు వినుతికెక్కిన విషయాన్ని.. ప్రపంచ స్థాయిలో వజ్రాల విపణిగా గోల్కొండ భాసిల్లిన సంగతినీ చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. ఇప్పటికీ ఈ ప్రాంతానికి అంతే విశిష్ఠత ఉందని అంటున్నారు నేటి పరిశోధకులు. 


గోల్కొండను ఆనుకొని ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో వజ్రాల నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జీ రాందాస్ చెప్పారు. రాందాస్ నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ జియోఫిజిక్స్ అండ్ ఎక్స్‌ప్లొరేషన్ కేంద్రానికి చెందిన డాక్టర్ ఏ సుభాష్ బాబు, ఎం ప్రీతి ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఫ్రొఫెసర్ రాందాస్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ, మహబూబ్‌నగర్‌తో పాటు జిల్లాను ఆనుకొని ఉన్న కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్ పరిధిలోని గ్రామాల్లో కనీసం రెండు డజన్ల వజ్రాల జోన్లను గుర్తించామని తెలిపారు. మహబూబ్‌నగర్, రాయచూర్ రోడ్డు మార్గంలో వజ్రాలు లభించడానికి ఆస్కారమున్న ప్రాంతాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. 


కొన్ని చోట్ల వీ ఆకారంలోనూ, మరికొన్ని చోట్ల క్యారెట్ ఆకారంలో ఉన్న ప్రాంతాలలో వజ్రాలు ఉన్నట్లు తెలిపారు. నారాయణ్‌పేట్, గుర్మిట్కల్, అమ్మిరెడ్డిపల్లె, దామరగిద్ద, నిడుగుర్తి గ్రామాల్లో వజ్రాలు లభించవచ్చని అన్నారు. మక్తల్ నుంచి రాయచూర్ వరకు పరిశోధనలు చేసి ఈ నిక్షేపాలు గుర్తించడం జరిగిందన్నారు. మహబూబ్‌నగర్ నుంచి చెన్నైవరకు అక్కడక్కడ భూమి పగుళ్లు గుర్తిస్తూ వీటి ఆధారంగా తమ పరిశోధన కొనసాగించామని వారు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వజ్రాల లభ్యతపై గతంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. 


కానీ వజ్రాల లభ్యతకు ఆస్కారమున్న 21 జోన్లను గుర్తించడం ఇదే మొదటిసారి. గతంలో, కృష్ణా -భీమా నదుల మధ్య, అలాగే కృష్ణా-తుంగభద్ర-పెన్నా నదుల మధ్య అక్కడక్కడా వజ్రాలు అధికంగా లభించే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించారు. ప్రస్తుతం కనీసం ఆరు ప్రభుత్వ, వాణిజ్య సంస్థలు పాలమూరు జిల్లాలో వజ్రాల వేట సాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని 1,999 చదరపు కిలోమీటర్ల పరిధిలో విహంగాయస్కాంత (ఏరో మాగ్నెటిక్) అధ్యయనం చేసిన ప్రొఫెసర్ రాందాస్ భూగర్భంలో 400-1200 మీటర్ల లోతున డైమండ్ జోన్లు నిక్షిప్తమై ఉన్నాయని, మరింత పరిశోధన జరిపితే వెలకట్టలేని రాళ్లను వెలికితీయవచ్చని పేర్కొన్నారు. తాము 21 ప్రాంతాల్లో కింబర్‌లైట్ పైప్‌లను కనుగొన్నామని ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. 


ఈ ప్రాంతాల్లో వజ్రాలు నిక్షిప్తమై ఉన్న ప్రదేశాలను అన్వేషించడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా చండూరు ప్రాంతంలో కూడా వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని, వాటిపై పరిశోధనలు చేస్తున్నామని జీ రాందాస్ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతాలలో బంగారు నిక్షేపాలను గుర్తించామన్నారు. తాము పరిశోధనలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం వారు సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు.


వజ్రాలకు ప్రసిద్ధిగాంచిన గోల్కొండ


వజ్రాలకు సంబంధించి గోల్కొండకు ప్రపంచంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్, హోప్ డైమండ్, నస్సాక్ డైమండ్‌లు గోల్కొండ సంపదే. కోహినూర్ ప్రస్తుతం ఎలిజబెత్ రాణి కిరీటంలో ఒదిగిపోగా, హోప్ డైమండ్ వాషింగ్టన్‌లోని మ్యూజియంకు చేరింది. ఇక నస్సాక్ వజ్రాన్ని చివరిసారి 1970లో గ్రీన్‌విచ్, కనెక్టికట్‌కు చెందిన ఓ ట్రక్కుల యజమాని కొనుగోలు చేశాడు. వాటితోపాటు ప్రసిద్ధి చెందిన అనేక రత్నాలు ఇక్కడ ఉత్పత్తి అయ్యాయి. గోల్కొండ ప్రాంతం ఒకప్పుడు వజ్రాల గనిగా పేరొందింది. వాస్తవానికి వజ్రాల వ్యాపారానికి గోల్కొండ వాణిజ్య విపణి అంటారు. అనేక గనుల నుంచి రత్నాలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయించేవారట.


వర్షాకాలం వజ్రాలు కురుస్తాయి?


మహబూబ్‌నగర్‌ను ఆనుకొని ఉన్న కర్నూలు జిల్లాలోని అనేక గ్రామాల్లో వర్షాకాలంలో వజ్రాలు భూమిపై కనిపిస్తాయి. ఒక్క వర్షం చాలు సామాన్యులు సంపన్నులైపోవడానికి అని ఈ గ్రామాల ప్రజలు అంటుంటారు. వర్షం కారణంగా భూమి పొరలు కొట్టుకుపోయి వజ్రాలు పైకి కనిపిస్తుంటాయి. గత జూన్ నెలలో ఓ మహిళకు రూ.17 లక్షల విలువైన వజ్రం లభించింది. 


ప్రతి వర్షాకాలం స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా వచ్చి ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కర్రలు లేదా వట్టి చేతులతోనే వీరు మట్టిని తవ్వుతుంటారు. అందరికీ వజ్రాలు దొరకకపోయినా, ఇక్కడ లభించే రంగు రాళ్లకు కూడా మార్కెట్‌లో బాగానే ధర పలుకుతుంది. ఇక్కడ కింబర్‌లైట్ రాళ్ల ఫలితంగా వజ్రాలు లభిస్తున్నాయని పరిశోధకులు చెప్పారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి