గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఆగస్టు 10, 2015

పనికిరాని చెత్తతో...ఉత్తమోత్తమ ఇం’ధన’ రూపకల్పన!!!

diesel

విశ్వనగర హంగులు అద్దుకుంటున్న హైదరాబాద్ నగరాన్ని పట్టిపీడిస్తున్న చెత్త సమస్యకు త్వరలో స్మార్ట్ పరిష్కారం లభించబోతున్నది. నగరంలో రోజూ టన్నుల కొద్దీ వెలువడుతున్న చెత్తను పడేసేందుకు పెద్ద పెద్ద డంప్‌యార్డ్‌ల నిర్మాణంపైనే గత పాలకులు ఆలోచిస్తే.. ఆ చెత్తను రీసైక్లింగ్ చేసే విషయంపై కొత్త ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే విద్యుత్ తయారీ ప్లాంటుకు చెత్తను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్న బల్దియా అధికారులు సమీప భవిష్యత్తులో ప్లాస్టిక్, కాగితం, గ్లాసు తదితరవాటిని కూడా పునర్వినియోగించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.


-ప్లాస్టిక్ వ్యర్థాలే ముడిసరుకుగా
 జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు
-వ్యర్థాలతో ఇటుకలు, టైల్స్..
-కాగితం, గాజు రీసైక్లింగ్‌కూ చర్యలు
-త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్న
బీబీనగర్ చెత్త విద్యుత్ ప్లాంట్
చెత్తలో లభించే ప్లాస్టిక్‌తో ఏకంగా డీజిల్ తయారుచేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రేటర్‌లో రోజూ మూడున్నర వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా. ఇందులో ప్లాస్టిక్, కాగితం, ఇనుము, గాజు తదితర వ్యర్థాలతోపాటు నిర్మాణ వ్యర్థాలు(డెబ్రిస్) సగంవరకూ ఉంటున్నాయి.


డెబ్రిస్ రీసైక్లింగ్‌కు బాటలు


ఇటీవల స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా తరలించిన 80వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాల్లో 50వేల టన్నులు నిర్మాణ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. స్వచ్ఛ హైదరాబాద్ బృందం ఢిల్లీలో పర్యటించి డెబ్రిస్ రీసైక్లింగ్‌పై అధ్యయనం చేసింది. 


Dieselfromtheworst

అక్కడ డెబ్రిస్‌తో టైల్స్, ఇటుకలు తదితర వస్తువులు తయారుచేయడమే కాకుండా ఇసుకను కూడా మళ్లీ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీనిని మన నగరంలోనూ ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు బోరబండలోని సుమారు 10ఎకరాల విస్తీర్ణంలో విస్తరించివున్న ప్రభుత్వ స్థలాన్ని డెబ్రిస్ పునర్వినియోగానికి ఉపయోగించాలని నిర్ణయించారు. డెబ్రిస్ నిర్వహణకు ఆసక్తిగలవారు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా ప్రైవేటు భాగస్వామ్యంతో డెబ్రిస్ రీసైక్లింగ్‌కు చర్యలు ప్రారంభమయ్యే అవకాశముంది.


ప్లాస్టిక్‌తో డీజిల్ తయారీపై దృష్టి


ప్లాస్టిక్ పునర్వినియోగంపై ఇటీవల జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ చెర్లపల్లిలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ అధికారులతో సమావేశమయ్యారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో డీజిల్ తయారుచేయవచ్చని, ఇది మార్కెట్‌లో దొరికే డీజిల్‌తో పోలిస్తే సగం ధరకే లభ్యమవుతుందని వారు తెలిపారు. ఈ డీజిల్‌ను ఎక్కువగా ఫ్యాక్టరీల్లో ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇండ్లవద్దే ప్లాస్టిక్ వ్యర్థాలను విడిగా సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. నగరంలో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు వెలువడుతుండడంతో ఇందులో మళ్లీ వస్తువుల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్‌పోగా మిగిలిన వ్యర్థాలను డీజిల్ తయారీకి ఉపయోగించవచ్చన్నది అధికారుల భావన. 


ఇతర వ్యర్థాల సేకరణకూ చర్యలు


తడి, పొడి చెత్తను ఇండ్లవద్ద విడివిడిగా సేకరించే క్రమంలో కాగితం, గాజు, ఇనుము తదితర వ్యర్థాలను కూడా విడివిడిగా సేకరించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. వీటిని కూడా క్రమపద్ధతిలో పునర్వినియోగానికి తరలించాలని యోచిస్తున్నారు. ఈ బాధ్యతను నేరుగా చెత్త తరలించే ఆటో డ్రైవర్లకే అప్పగించాలని నిర్ణయించారు. 


వ్యర్థాలతో విద్యుత్ తయారీకి ఒప్పందం


బీబీనగర్‌లోని చెత్త విద్యుత్ ప్లాంటుకు రోజుకు 1100మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తరలించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఒప్పందం చేసుకున్నారు. త్వరలోనే ఈ ప్లాంటు ఉత్పత్తి ప్రారంభం కానున్నది. ఇటువంటి ప్లాంట్లు మరిన్ని ఏర్పాటుచేయడమా? లేక ఉన్నదాని సామర్థ్యాన్ని విస్తరించడమా..? అనేదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. 


భూమి, కాలుష్య సమస్యలు తగ్గే అవకాశం


వ్యర్థాలను పూర్తిస్థాయిలో పునర్వినియోగానికి తరలిస్తే డంపింగ్‌యార్డుల అవసరం ఉండదు. వాటితో వెలువడుతున్న కాలుష్య సమస్య కూడా చాలావరకు తగ్గుతుంది. ప్లాస్టిక్, కాగితం, గాజు, ఇనుము తదితరాలను పునర్వినియోగానికి తరలిస్తే పలువురికి ఉపాధి లభించడమే కాకుండా కాలుష్య సమస్య కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. 


ఇండ్లవద్దే చెత్త విభజనకు ప్రణాళికలు


త్వరలో రోడ్లపై చెత్త కుండీలు లేకుండాచేసి ఇండ్లనుంచి చెత్తను సేకరించేందుకు 2500 ఆటోటిప్పర్లను వినియోగించేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. దీంతోపాటే ఇండ్లవద్దే తడి-పొడి చెత్తను సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆటో టిప్పర్లు, చెత్త బుట్టల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఇండ్లనుంచి వెలువడే చెత్తను పూర్తిస్థాయిలో పునర్వినియోగం చేసుకునేలా బల్దియా అధికారులు పక్కా ప్రణాళికలు సిద్ధంచేశారు. దీంతోపాటే వ్యర్థాల పునర్వినియోగానికి కూడా తగిన ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే భవిష్యత్తులో వ్యర్థాల రీసైక్లింగ్ భారీస్థాయిలో జరిగే వీలుందని చెప్పవచ్చు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి