గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఆగస్టు 18, 2015

ఓటుకు నోటు కేసులో కొత్తముఖాలు...!!!

-టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులునాయుడు కుమారుడు
  శ్రీనివాసనాయుడికి ఏసీబీ నోటీసులు
- అతడి సహాయకుడు విష్ణుచైతన్యకు కూడా..
- నేడు విచారణకు రావాలని ఆదేశం
- ప్రస్తుతం స్విట్జర్‌లాండ్‌లో ఉన్న శ్రీనివాసనాయుడు
- కుట్రకు నగదు సరఫరాపై విచారించనున్న ఏసీబీ
- మొదటి చార్జిషీట్‌లో చంద్రబాబు ప్రమేయంపై ప్రస్తావన
- తమను పంపింది చంద్రబాబేనని రేవంత్, సెబాస్టియన్ వెల్లడి!
తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు ఓటుకు నోటు కేసులో ఊహించని విధంగా కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఏసీబీ దర్యాప్తులో తెలంగాణ నేతల పేర్లు దుమారం సృష్టించగా, తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులునాయుడు కుమారుడు డీకే శ్రీనివాసనాయుడికి అనూహ్యంగా సీఆర్పీసీ 160 ప్రకారం ఏసీబీ నోటీసులు జారీచేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. కాగా, మొదటి చార్జిషీట్‌లో పదేపదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను ఏసీబీ పేర్కొన్నది. ఈ కేసులో చంద్రబాబు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనటాన్ని స్పష్టంగా పొందుపరిచింది.


srinivanaidu

బాగోతం బయటపడ్డ తర్వాత టీడీపీ నాయకులు అప్రమత్తమైన తీరును కూడా అందులో వివరించింది. ఆ తర్వాత సెల్‌ఫోన్లతో వ్యవహారం నడిపిస్తే క్షేమం కాదని భావించిన టీడీపీ నాయకులు ఎస్సెమ్మెస్, వాట్సాప్‌ను వినియోగించినట్లు పక్కా ఆధారాలతో ఏసీబీ చార్జిషీట్ దాఖలుచేసింది. రేవంత్‌రెడ్డి, సెబాస్టయన్ సంభాషణల ఉదంతాన్ని పూసగుచ్చినట్టు వివరించిన ఏసీబీ.. మత్తయ్య కథ వెలుగులోకి వచ్చిన తర్వాత అతడిని రక్షించిన ఉదంతాన్ని కూడా స్పష్టంగా వివరించింది. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసు సరికొత్త మలుపు తిరుగుతున్నది. 


కర్ణాటక బేవరేజెస్ అండ్ డిస్టిలరీస్ సంస్థకు ఎండీగా ఉన్న శ్రీనివాసనాయుడికి ఏసీబీ సోమవారం బెంగుళూరులోని ఆయన కార్యాలయంలో నోటీసులు అందజేసింది. ప్రస్తుతం శ్రీనివాసనాయుడు స్విట్జర్లాండ్‌లో ఉన్నారని, దీంతో ఆయన కార్యాలయంలో నోటీసులు అందించామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. శ్రీనివాసనాయుడుతోపాటు ఆయన సహాయకుడు విష్ణుచైతన్యకు కూడా నోటీసులు జారీచేసినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.


మంగళవారం సాయంత్రం 5గంటలకల్లా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించామని తెలిపారు. రెండ్రోజుల్లో ఏసీబీ ఎదుట తాను విచారణకు హాజరవుతానని సన్నిహితులకు శ్రీనివాసనాయుడు ఫోన్‌లో చెప్పారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు అనూహ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాకు చెందిన శ్రీనివాసనాయుడుకు నోటీసులివ్వడంతో టీడీపీ వర్గాలు సందిగ్ధంలో పడినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న వారు సైతం కంగుతిన్నట్టు తెలిసింది. కర్ణాటకలో మద్యం వ్యాపారంలో ఊపు మీదున్న డీకే శ్రీనివాసనాయుడుడికి పక్కా ఆధారాలతోనే ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. విచారణలో శ్రీనివాసనాయుడు వెల్లడించే విషయాలతో రూ.50లక్షల వ్యవహారంతో పాటు రూ.4.5కోట్ల సంగతి కూడా తేలిపోతుందని ఏసీబీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.


నగదు ఆయన కంపెనీ నుంచేనా?


ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను కొనాలన్న టీడీపీకుట్రకు శ్రీనివాసనాయుడు కంపెనీ నుంచే నగదు సరఫరా జరిగిందన్న కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈమేరకు టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య కాల్‌డేటాతోపాటు లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి ఫోన్ డాటాలో శ్రీనివాసనాయుడుకు సంబంధించిన ఫోన్ నంబర్లు ఉండటంపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కుట్రలో నగదు వ్యవహారాన్ని ఛేదించేందుకు శ్రీనివాసనాయుడుతోపాటు ఆయన అసిస్టెంట్ విష్ణుచైతన్యను విచారించాలని ఏసీబీ నిర్ణయించింది. 



ఏసీబీ చార్జిషీటులో చంద్రబాబు పేరు


ఓటుకు నోటు కేసులో కోర్టుకు దాఖలు చేసిన ఏసీబీ చార్జిషీటులోని అంశాలు కొన్ని బయటకువచ్చాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు పలుమార్లు ప్రస్తావించడంతో టీడీపీ వర్గాల్లో కలకలం రేగుతున్నది. తొలుత ఈ కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాల సెల్‌ఫోన్ సంభాషణలు, నిఘా కెమెరా దృశ్యాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ వాటిని పరీక్షల నిమిత్తం కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరెటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. వీటి ఆధారంగా ఏసీబీ పలు కీలక ఆధారాలు సేకరించింది. 


మరికొందరిని విచారణ చేయగా.. వారిచ్చిన సమాచారంతో మరిన్ని ఆధారాలు సేకరించిన ఏసీబీ, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించిన మొదటి చార్జిషీట్‌ను వారం రోజుల కిందట కోర్టుకు సమర్పించింది. అయితే, సప్లమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాతే మొదటి చార్జిషీట్‌ను పరిశీలిస్తామంటూ కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా, ఏసీబీ చార్జిషీట్‌లో పేర్కొన్న ఆంశాలు కొన్ని బయటకు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ఏసీబీ అధికారులు పలుమార్లు చార్జిషీట్‌లో ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డిని విచారించగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయించే బాధ్యత చంద్రబాబు అప్పగించిట్లు వెల్లడించారు. చంద్రబాబు తరుఫున తానే బేరసారాలు చేస్తానని, అవసరమైతే ఆయన వద్దకు తీసుకువెళుతానంటూ రేవంత్‌రెడ్డి తెలిపారు. 


ఒకరోజు స్టీఫెన్‌సన్ వద్దకు వెళ్లిన సెబాస్టియన్ తనను చంద్రబాబు పంపించనట్టు వెల్లడించాడని, మే 30వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో సెబాస్టియన్ తన సెల్‌ఫోన్‌లో చంద్రబాబునాయుడిని స్టీఫెన్‌సన్‌తో మాట్లాడించినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ విధంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయాన్ని చార్జిషీట్‌లో స్పష్టంగా వివరించారు. మే 30వ తేదీన నిందితులు మాట్లాడిన సెల్‌ఫోన్ సంభాషణలను వివరంగా పేర్కొన్నారు. దీనిని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికతోపాటు చార్జిషీట్‌లో పొందుపరిచారు. జూన్ 1వ తేదీన మత్తయ్య ఉదంతం వెలుగుచూసిన వెంటనే కొంతమంది టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. రెండో తేదీన టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు మత్తయ్య తన సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. ఫోన్ ఆఫ్ చేసిన విషయాన్ని ఆ తర్వాత ఎస్సెమ్మెస్ ద్వారా తనకు సహకరిస్తున్న వారికి మత్తయ్య వివరించాడు.


సెల్‌ఫోన్ సంభాషణలపై ఏసీబీ గురి పెట్టిన విషయం గుర్తించిన నిందితులు, ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులందరితో ఎస్సెమ్మెస్, వాట్సాప్‌తోనే నడిపించారు. మత్తయ్యకు బెయిల్ ఇప్పించే పథకాన్ని కూడా వాటి ద్వారానే పథకం ప్రకారం నిర్వహించారు అని ఏసీబీ పూర్తి వివరాలతో చార్జిషీటును రూపొందించింది. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా, మత్తయ్య నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఏసీబీ స్పష్టంగా పేర్కొంది. 



రాష్ట్ర ఇంటెలిజెన్స్ వింగ్‌కు ఏపీ సీఐడీ నోటీసులు


మత్తయ్య జెరూసలెంను బెదిరించారన్న ఆరోపణల కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో నోటీసులు అందించినట్టు తెలిసింది. వారం రోజులుగా గన్‌మెన్ జానకీరాం, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులివ్వాలని ప్రయత్నించి.. విఫలం కావవడంతో వారి హెడ్‌క్వార్టర్ అయిన ఖైరతాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో అందించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రంలోగా అప్పాలోని తమ ప్రధాన కార్యాలయమైన సీఐడీకి రావాలని, సీఆర్పీసీ 160 కింద ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నోటీసులను తాము పరిగణలోకి తీసుకోలేమని, నేరుగా సంబంధిత వ్యక్తులకు ఇవ్వాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు తేల్చిచెప్పారు. అప్పటివరకు విచారణకు హాజరయ్యేలా గన్‌మెన్, డ్రైవర్‌కు తాము ఆదేశివ్వలేమన్నారు. ఇలా ఇచ్చిన నోటీసులు చెల్లవని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

 

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

త్వరలో రైతులకు 9 గంటల విద్యుత్: మంత్రి కేటీఆర్
రైతులకు త్వరలో 9 గంటల పాటు విద్యుత్ అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్.15 వేల కోట్లతో రహదారులు నిర్మిస్తామని స్పష్టం చేశారు.మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆలయన పాల్గొన్నారు.find more Telangana political updates on http://spiceandhra.com/

కామెంట్‌ను పోస్ట్ చేయండి