గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 02, 2015

ఆంధ్రా పోలీస్ అడ్డదారి!

police


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వివాదానికి తెరలేపింది. ఇరు రాష్ర్టాల మధ్య పోలీసు క్యాడర్ విభజన పూర్తికాకముందే ఏక పక్షంగా 2014 సంవత్సరానికి కన్ఫర్డ్ ఐపీఎస్‌ల పదోన్నతి కోసం జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జారీచేసిన సర్క్యులర్ పోలీసు శాఖలో కలకలం రేపుతున్నది. వాస్తవానికి ప్రతిఏటా ఇలాంటి జాబితా తయారుచేయడం ఆనవాయితీయే అయినా ఇప్పటి పరిస్థితి వేరు. ఇంకా పూర్తిస్థాయిలో ఉద్యోగుల విభజన జరుగలేదు. 


-ఏకపక్షంగా కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతుల జాబితా
-క్యాడర్ పోస్టుల విభజన కాకముందే తొందరపాటు
-తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం
-ఇదే సీనియారిటీ జాబితా నాడుతప్పుల తడక అన్న ఆంధ్రా డీజీపీ
రెండు రాష్ర్టాలు విభజన పూర్తి చేసుకున్నాక ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్రం తమ క్యాడర్ అధికారుల పేర్లతో కేంద్రా నికి పదోన్నతి ఫైలు పంపించాల్సి ఉంటుంది. కానీ తెలంగాణకు చెందిన అధికారులు ఆంధ్రాలో ఉన్నా, వారికి అర్హత ఉన్నా వారి పేర్లను కాదని కేవలం ఆంధ్రా అధికారులు, ఆ ప్రాంతానికి చెందిన వారి పేర్లనే సీనియారిటీ జాబితాగా పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించేందుకు పావులు కదుపుతున్నారు. ఇలా ఏపీ మాత్రమే తమ అధికారుల పేర్లతో లిస్ట్ పంపిస్తే అక్కడ పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు, తెలంగాణలో పనిచేస్తున్న డైరెక్ట్, ప్రమోటీ అధికారులు కన్ఫర్డ్ ఐపీఎస్‌రాకుండా నష్టపోవాల్సి ఉంటుంది. 


క్యాడర్ సంగతి తేల్చకముందే ఐపీఎస్ పదోన్నతా?


నిజానికి ఇందులో అనేక సమస్యలు ఇమిడి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తమకు కావలిసిన అధికారులకు ఆంధ్ర పోలీస్‌బాస్‌లు ఎడాపెడా ప్రమోషన్లు ఇచ్చుకున్నారు. పైగా గత పాలకుల తయారుచేసిన సీనియారిటీ లిస్ట్ వివాదాస్పదమైంది. అర్హులైన అధికారులను వెనక్కి నెట్టి, ఆంధ్రా అధికారులను, తమ అనుంగులైన వారిని మొదటి స్థానాల్లో పెట్టి 108, 54 సీనియారిటీ జీవోలు రూపొందించారని విమర్శలు వెల్లువెత్తాయి. డీఎస్పీ టూ అడిషనల్ ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీకి సంబంధించి సీనియారిటీ జాబితా తప్పుల తడకగా ఉందని విమర్శలు రావడంతో ఏపీ పోలీస్ పెద్దలు దాన్ని సమీక్షించి సరిదిద్దడానికి రెండు రాష్ర్టాల అధికారులతో ఓ కమిటీ వేశారు. 


సదరు కమిటీ రెండు నెలలు గడిచినా ఇంతవరకు సీనియారిటీ జాబితాను కూడా పరిశీలించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బాధిత అధికారులు తమ బాధలు చెప్పుకోవడానికి వెళితే అమర్యాదగా వ్యవహరించారని పోలీసు శాఖలో చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఆ విషయం పరిష్కారం కాకుండానే ఆంధ్రా ప్రభుత్వం ఐపీఎస్ పదోన్నతులను తెరమీదికి తీసుకురావడం దురుద్దేశపూరితమేనంటున్నారు. రెండు రాష్ర్టాలు ఉద్యోగుల విభజన పూర్తి చేసుకున్నాక ఏ రాష్ర్టానికారాష్ట్రం తమ క్యాడర్ అధికారుల పేర్లతో కేంద్ర ప్రభుత్వానికి పదోన్నతి ఫైలు పంపించుకోవాలి. ఇది పద్ధతి. అయితే విభజనే పూర్తికాకుండా ఈ అధికారమేదో తమకే ఉన్నట్టు ఏపీ ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదనలు సిద్ధంచేయడం ఏమిటని తెలంగాణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 


ఆంధ్రా డీజీపీయే తప్పన్నారు


ఇక్కడ గమనార్హమైన విషయం ఏమిటంటే 108, 54 జీవోల్లో పలువురు పోలీస్ అధికారులకు అన్యాయం జరిగిందని నిబంధనలు, జీవోలు, రేషియో ఇలా అన్ని అంశాలను విస్మరించి సీనియారిటీ జాబితా రూపొందించారని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అప్పట్లో ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ప్రసాదరావుకు లేఖ కూడా రాశారు. మరి తెలిసి తెలిసి అదే సీనియారిటీ జాబితా ఆధారంగా కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతులకు ఎందుకు ఆత్రుత పడుతున్నట్టో అర్థంకావడంలేదని పలువురు ఐపీఎస్‌లు అంటున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి