1200 టీఎంసీలపై హక్కులు కలిగి ఉండి కూడా తెలంగాణ సాగునీరు లేక వ్యవసాయం దండగై ఎంత నష్టపోయిందో లెక్కగట్టగలమా? ఇలా అక్షరాస్యత విషయంలో, వ్యవసాయం విషయంలో, వైద్యం విషయంలో, అభివృద్ధి విషయంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని పూరించాలంటే కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చితీరాలి.
ప్రధాని మోదీ బీహార్ రాష్ర్టానికి లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. దీని ద్వారా ఏపీ విషయంలోనూ కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే ఉండి వుంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదానే కావాలని డిమాండ్ చేయబోతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఇచ్చే వాళ్లకే కాదు, అడిగే వాళ్లకూ తెలుసు. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఏపీ రాజధాని శుంకుస్థాపనకు వచ్చినపుడు స్వయాన ప్రధాని మోదీయే ప్యాకేజీని ప్రకటిస్తారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా అనేది అప్పట్లో వెంకయ్యకు, చంద్రబాబులకు ఎన్నికల అస్త్రంగా పనిచేసింది. వారే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు. ఎన్నికల్లో గెలిచారు. ఎప్పటి రాజకీయ అవసరం అప్పుడే అనేందుకు నిలువెత్తు సాక్ష్యం స్వయాన వెంకయ్యనే అనడంలో అనుమానంలేదు. ఇపుడు ఎటూ పాలుపోని చంద్రబాబు రాష్ర్టాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందంటూ మళ్లీ పాత మాటలనే వినిపిస్తున్నారు.
ఒక రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆ రాష్ర్టానికి ప్రత్యేక భౌగోళిక, సామాజిక పరిస్థితులు ఉండాలి. ముఖ్యంగా ఆ రాష్ట్రం దేశ సరిహద్దులలో పొరుగు దేశాలకు భౌగోళిక సరిహద్దు గలిగి ఉండటం, పర్వత ప్రాంతమై ఉండటం, సామాజికంగా బాగా వెనుకబడి ఉండటం లాంటి ప్రత్యేక లక్షణాలను కలిగివున్నపుడే ఆ రాష్ట్రం ప్రత్యేక హోదాకు అర్హత పొందుతుంది. మరి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అందులో ఒక్క లక్షణమైనా ఉన్నదా? 972 కి.మీ కోస్తా తీరం ఉంది తప్ప పొరుగు దేశం సరిహద్దులంటూ ఏమీ లేవు. ఇకపోతే, సామాజికంగా బాగా వెనుకబడిన ప్రాంతమని కూడా చెప్పడానికి బలమైన ఆధారాలు కనిపించవు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి విభజన చట్టంలోనే కొన్ని ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలున్నాయి.
ఏపీలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా తప్ప మరే ప్యాకేజీ అక్కరలేదంటున్నాయి. ప్రత్యేక హోదా పేరున ఎన్నికల్లో లబ్ధిపొందిన టీడీపీ, బీజేపీలను ఇరుకున పెట్టడంలో విపక్షాల తప్పేమీలేదు. ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన వెంకయ్యకు ఎన్నికలు కనిపించాయి తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏపీకి అన్ని అర్హతలు ఉన్నాయా అనేది పట్టలేదు. అదే ఇపుడు విపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే ఇదే. నిజానికి ఏపీ లోటు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని దానికి ప్యాకేజీ ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులు కూడా చెప్పారు. అలాగే, ఉమ్మడి పాలనలో నష్టపోయిన తెలంగాణకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు న్యాయం చేయకపోతే అంతకంటే దారుణం మరోటి ఉండదు.
నిజానికి ఏపీకి రాజధాని లేకపోవడం తప్ప ఆ రాష్ట్రం ఎందులోనూ వెనుకబడిలేదు. ఐదు మెట్రోనగరాలు, డజనుకు పైగా ఓడ రేవులు, ఏడు జిల్లాల్లో కనీసం రెండు లేదా మూడు పంటల వ్యవసాయం, గనుల పరిశ్రమలు కలిగి ఉన్న ఏపీని ఎవరైనా వెనుకబడిన రాష్ట్రమని అనగలరా? ఇన్ని ఉన్న ఏపీ లోటు బడ్జెట్ కూడా తీరని సమస్య ఏమీ కాదు. ఉమ్మడి రాష్ట్రం కొనసాగినంత కాలం అక్కడ నాటుకుపోయిన జీరో వ్యాపారాల జోరును ఇప్పటికైనా కట్టడి చేస్తే.. చాలామేరకు ఆ రాష్ట్ర బడ్జెట్ లోటు సమస్య తీరే అవకాశాలుంటాయి. కానీ ఏపీలో ఎవరి ప్రభుత్వం ఏర్పడినా జీరో వ్యాపార వర్గాల సంబంధీకులే పాలకులవుతుంటారు. కాబట్టి ఏపీ బడ్జెట్ లోటు సమస్య తీరడమనేది పాలకుడి నిజాయితీపై ఆధారపడివుంటుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వ పరంగా పేదది కావచ్చు తప్ప క్యాపిటలిస్టుల పరంగా అది ఎప్పుడూ పేదది కాదు. ఈ విషయంలో తెలంగాణ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. తెలంగాణ దశాబ్దాలుగా మిగులు బడ్జెట్‌ను కలిగివున్నమాట నిజం. కాబట్టి తెలంగాణ వెనుకబడ లేదు, వలసపాలనలో వెనుకవేయబడిన ప్రాంతం.
రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించారు. ఏపీకి తీరని నష్టం జరిగిందని చంద్రబాబు ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్లున్నది. నిజంగానే అడ్డగోలుగా విభజించి ఉన్నట్లయితే.. జనాభా ఆధారంగా ఉద్యోగుల పంపకం చేయాలని, అప్పులు, ఆస్తులను జనాభా ఆధారంగా పంచాలని, గోదావరి, కృష్ణా నదుల మీద అజమాయిషీ బోర్డులు ఉంటాయిని.. విభజన చట్టంలో పెట్టి ఎవరికి అన్యాయం చేశారో చంద్రబాబు చెప్పగలరా? ఫక్తూ.. అడ్డగోలుగా విభజించి ఏపీకి ఆన్యాయం చేశారని గోబెల్స్ ప్రచారం చేస్తూ.. పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు ఇంకా తూట్లు పొడవాలనుకుంటున్న చంద్రబాబు అతి తెలివికి జోహార్లు చెప్పకతప్పదు. రెండు జీవిత కాలాలు కోల్పోయి లెక్కలేనంత నష్టపోయిన తెలంగాణ రాష్ర్టానికి ఏమీ ఇవ్వకుండా పక్క రాష్ర్టానికి మాత్రమే ప్యాకేజీ ఇవ్వడాన్ని ప్రజలు హర్షించరు. అదేదో ఏపీకి ఇస్తున్నారని తెలంగాణకు అడగటం కాదు.
ఈ డిమాండ్‌లో పూర్తి నిజాయితీ ఉందని గమనించాలి. ప్రభుత్వం మిగులు బడ్జెట్‌లో ఉన్నా.. జరిగిన అన్యాయాలను పూరించడం ఒక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే జరిగేది కాదు. ఉదాహరణకు అక్షరాస్యత విషయంలో తెలంగాణ దేశంలో 25వ స్థానంలో ఉన్నది. విద్యలో తెలంగాణ ఇంతగా వెనుకబడి ఉండటానికి సమైక్య పాలనే కారణం. దేశ అక్షరాస్యత సగటు 74 శాతం ఉండగా తెలంగాణ గ్రామీణ అక్షరాస్యత 58 శాతం మాత్రమే ఉన్నది. దీన్ని బట్టి తెలంగాణ ఎంత మిగులు బడ్జెట్ రాష్ట్రమైనా జరిగిన నష్టాన్ని పూరించడం ఎలా సాధ్యం? 1200 టీఎంసీలపై హక్కులు కలిగి ఉండి కూడా తెలంగాణ సాగునీరు లేక వ్యవసాయం దండగై ఎంత నష్టపోయిందో లెక్కగట్టగలమా? ఇలా అక్షరాస్యత విషయంలో, వ్యవసాయం విషయంలో, వైద్యం విషయంలో, అభివృద్ధి విషయంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని పూరించాలంటే కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చితీరాలి.
ఉద్యోగాల విభజనను కనీసం రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానైనా పంపకం చేస్తామని చెప్పకుండా, కేవలం జనాభా అధారంగా పంపకం జరగడం వల్ల ఎవరికి అన్యాయమో చంద్రబాబు చెప్పగలరా? తెలంగాణ ఆశలు పెంచుకున్న రెండు జీవనదులపై అజమాయిషీ బోర్డులు పెట్టి ఎవరికి అన్యాయం చేశారో చెప్పగలరా? సమైక్య రాష్ర్టానికి 55 శాతం రెవెన్యూ ఆదాయం తెలంగాణ నుంచి వచ్చేది. అందులో 29 శాతం వెచ్చించి అన్యాయం చేసింది పక్కన పెట్టి.. ఇపుడు ఆస్తులు, అప్పుల పంపకం జనాభా ఆధారంగా 42 శాతం అప్పులు అంటగడుతుంటే ఎవరు నష్టపోతున్నారో చెప్పగలరా? ఒక్క రాజధాని లేదనే విషయాన్ని అడ్డం పెట్టుకొని.. తెలంగాణకు విభజన చట్టంలో కావలసినంత అన్యాయం చేశారు.
విభజన చట్టంలో ఉన్న అన్యాయాలను అప్పుడే వ్యతిరేకించి ఉంటే, వచ్చే తెలంగాణ ఆగిపోతుందేమోనని భయం అప్పట్లో అందరిలో ఉన్నది. తెలంగాణ ఏర్పడ్డాక ఆ అన్యాయాలను సరిదిద్దుకోవచ్చని అందరూ భావించారు. ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నది. కానీ, ఏ న్యాయాన్నీ కేంద్రం చేస్తున్నది లేదు. ఉదాహరణకు ఉమ్మడి హైకోర్టు విభజన చట్టబద్ధ హామీ. ప్రత్యేక హోదా అనేది నోటి మాట హామీ. ఉమ్మడి హైకోర్టును విభజించడంలో కాలయాపన చేస్తున్న కేంద్రం ప్రత్యేక హోదా వంటి నోటిమాట హామీని మరో రకంగా ప్రత్యేక ప్యాకేజీ రూపంలోనైనా నెరవేర్చడానికి సిధ్ధం కావడం గమనార్హం. ఇది కేంద్రం చూపుతున్న పక్షపాత ధోరణి. కేంద్రానిది పక్షపాత ధోరణి కానట్లయితే.. ఏపీకి మాత్రమే కాకుండా అనేక రకాల నష్టపోయిన తెలంగాణకు కూడా భారీ ప్యాకేజీని ప్రకటించాలి.
తెలంగాణలోని విపక్షాలకు కూడా ఇదొక పరిక్ష అని చెప్పాలి. రోజూ కేసీఆర్‌పై దుమ్మెత్తి పోయడం తప్ప తెలంగాణకు జరిగిన అన్యాయాల పట్ల అవి ఎంత శ్రద్ధ చూపెడుతున్నాయో ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు. ప్రాజెక్టుల డిజైన్లపై మాట్లాడే ప్రతిపక్షాలు.. అవే ప్రాజెక్టులను నిరంతరం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుపై ఏ ఒక్క ప్రతిపక్షమూ మాట్లాడదు. అందుకే 15 నెలలు గడిచినా ప్రతిపక్షాలు ప్రజల మన్ననలు పొందలేకపోతున్నాయి. ఇప్పటికైనా, తెలంగాణకు ఏపీతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడంలో తెలంగాణ ప్రతిపక్షాలు తమ వంతు పాత్ర పోషించాలి. ప్రజల్లో తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రతిపక్షాలు.. తెలంగాణకు జరిగిన అన్యాయాలను తుడిచేయడంలోగానీ, ప్రత్యేక ప్యాకేజీని రాబట్టడంలోగానీ అధికార పక్షంతో కలిసి పనిచేస్తేనే ప్రజల మన్ననలు పొందగలుగాయని మర్చిపోవద్దు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి