(ఈ వ్యాస ప్రచురణకు అనుమతించిన వ్యాసకర్త శ్రీ మల్లెగోడ గంగాప్రసాద్ గారికి కృతజ్ఞతలతో...)
మందహెచ్చుల పుట్టుక గురించి చాలా కథనాలు ఉన్నాయి. శారదకాండ్ర స్త్రీ , గొల్ల పురుషుడు ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఆ కలయికలో ఒక బాలుడు జన్మించాడట. ఈ విషయం పసిగట్టిన శారదకాండ్రు ఆ స్త్రీని వారి బృందం, కులం నుంచి కూడా వెలివేశారట, ఆ స్త్రీ ఏం చేయాలో తెలియక ఆ గొల్లవాని దగ్గరకు వెళ్లిందట. గొల్లవారు ఆవిడకు ఆశ్రయమైతే ఇచ్చారు కానీ ఆమెకు కలిగిన సంతానాన్ని తమ కులంగా గుర్తించలేదట. అలా గొర్రెల మంద దగ్గర పెరిగిన శారదకాండ్ర స్త్రీ సంతానం మందెచ్చుల వారై బుడగజంగాలు అనే కొత్త కులంగా పుట్టుకొచ్చారు.
మందపిచ్చోళ్ళు, మందెచ్చోళ్ళు, పోగడపోళ్ళు, పొడపొత్రపోళ్ళు అంటూ రకరకాల పేర్లతో వీరిని పిలుస్తారు. వీరు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైద్రాబాద్, నల్గొండ జిల్లాల్లోనే ఉన్నారు. మంద-హెచ్చు రెండు దేశీపదాల కలయిక. మంద-దేశీ నామవాచకం, హెచ్చు- దేశీ క్రియారూపం. మంద అంటే పశు సమూహం. హెచ్చు అంటే పెరగటం. ఈ కళారూపం గొల్లల ఆశ్రిత కులం వారైన జంగం లేదా బుడగ జంగం కులస్థులు ప్రదర్శిస్తుంటారు. వీరిని షెడ్యుల్డ్ కులాల జాబితాలో గుర్తించారు. గొల్లలు నివసిస్తున్న పల్లెలకు వెళ్లి వారి కులపెద్ద దగ్గర అనుమతి పొంది, త్యాగం కుదుర్చుకుంటారు. త్యాగం అంటే ఆట ఆడినందుకు ప్రతిఫలం. వీరు ఒప్పందం చేసుకున్న గ్రామాలను మిరాశీ గ్రామాలంటారు. వీరు సంచార జీవులు.
మంద హెచ్చుల పుట్టుక గురించి చాలా కథనాలు ఉన్నాయి. శారదకాండ్ర స్త్రీ , గొల్ల పురుషుడు ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఆ కలయికలో ఒక బాలుడు జన్మించాడట. ఈ విషయం పసిగట్టిన శారదకాండ్రు ఆ స్త్రీని వారి బృందం, కులం నుంచి కూడా వెలివేశారట, ఆ స్త్రీ ఏం చేయాలో తెలియక ఆ గొల్లవాని దగ్గరకు వెళ్లిందట. గొల్లవారు ఆవిడకు ఆశ్రయమైతే ఇచ్చారు కానీ ఆమెకు కలిగిన సంతానాన్ని తమ కులంగా గుర్తించలేదట. అలా గొర్రెల మంద దగ్గర పెరిగిన శారదకాండ్ర స్త్రీ సంతానం మందెచ్చుల వారై బుడగజంగాలు అనే కొత్త కులంగా పుట్టుకొచ్చారు.
గొల్ల కులస్థుల ప్రస్తావన, వారి వీరోచిత పోరాటాలు, వారి దేవతల ప్రాశస్త్యం ఉన్న కథలనే చెబుతారు. ముఖ్యంగా యాదవ భారతంగా పేరు పొందిన కాటమ రాజు కథను ఎక్కువగా చెబుతారు. వీరి బృందంలో స్త్రీలు కూడా ఉంటారు. వీరు కాటమ రాజు కథల్లో గంగురాజు కథ, వలురాజు కథ, కరియావు రాజు కథ, పోలురాజు కథ, బత్తిరన్న కథ, బొల్లావు యుద్ధం కథ, కాటమరాజు యుద్ధం కథ ప్రధానంగా చెబుతారు. ఇంకా సారంగదర కథ, మండోదరి కథ, భూనాంచారి కథలను కూడా చెబుతూ ఉంటారు.
యాదవుల కుల దేవతగా భావించబడే గంగాదేవి ప్రార్థనతో కథను ప్రారంభిస్తారు. వీరి కథా ప్రదర్శనలో గంగు రాజు కథను తప్పకుండా చెబుతారు. గంగురాజు కాటమ రాజుకు తాత. గంగు రాజే గొల్లలకు మూలాధార మని వీరి నమ్మకం.
ఒగ్గుకథలో ఉపయోగించే వాయిద్యాలే వీరు ఉపయోగిస్తారు. అందులో డోలు చాలా ముఖ్యమైనది. దీనిని రఢవీర అని కూడా అంటారు. ఇది గంభీర నాదాన్ని చేస్తుంది అందుకే దానిని ఆ పేరుతో పిలుస్తుంటారు. వీరి మరో వాయిద్యం ఢమరుకం. దీనిని ఈ కళాకారులు జగ్గుఅని అంటారు. వీరు ఉపయోగించే వాయిద్యంలో ముఖ్యమైనవి తాళాలు. మంద హెచ్చుల ప్రధాన కళాకారుని చేతిలో ఉండే వాయిద్యం అనుసుల కర్ర. ఇంకా ప్రధాన కథకుని కాళ్లకు గజ్జెలుంటాయి.
గొల్లల ఇండ్లలో కథాప్రదర్శనకు ముందురోజు బొమ్మల కొలువులాగా అన్ని బొమ్మలను వరుసగా ఉంచి గంగా దేవి ప్రార్థన చేస్తారు. ఆయా కుటుంబాలకు ఆశీర్వచనాలు ఇస్తారు. ఎవరైనా చనిపోయిన వారుంటే వారి ఆత్మ శాంతికోసం పార్థన చేస్తారు. ప్రదర్శన చేసే రోజు వీరు నిష్ఠగా ఉంటారు. ఉదయాన్నే చాపలు, గొంగళ్ళు పరిచి చనిపోయిన వ్యక్తి ఫోటోను ఎదురుగా పెట్టి ప్రదర్శన చేస్తారు. పూలు, కుంకుమ, పసుపు పెట్టుకుని సాంబ్రాణి పొగ వేసి ఒక్కొక్క బొమ్మను బయటకు తీసి కథా ఘట్టాన్ని వర్ణిస్తారు.
వర్ణన పాట రూపంలో లేదా వచన రూపంలో ఉంటుంది. ప్రార్థనయ్యాక గంగాదేవి బొమ్మను తీసేటప్పుడు గొల్ల ఇల్లాలు బియ్యం , పసుపు కలిపి వండిన బోనాన్ని అలంకరణతో తీసుకువచ్చి కథకుని ముందు ఉంచుతుంది. ఆ బోనం మీద ఒక గిన్నెను ఉంచి అందులో నూనె పోసి వత్తి వెలిగిస్తారు. మోదుగాకులో పసుపు కలిపిన బియ్యం అక్షింతలుగా ఉపయోగిస్తారు. కొబ్బరికాయ, పెరుగు గంగముందు ఉంచుతారు. అందరికి బండారును పెడతారు.
ఒప్పందం చేసుకున్నట్లు వడ్లు, జొన్నలు, చనిపోయిన వ్యక్తి దుస్తులు లేదా, ఒక గొర్రెపిల్ల, ఇంకా బోలుకడియం, కాలుబేడి, వెండికంటె... ఒక్కోరీతిలో త్యాగంగా తీసుకుంటారు. బొమ్మలన్నీ ఆయా కథలలోని పాత్రలే. గంగురాజు, వలురాజు, పెద్దిరాజు, సింహాద్రిరాజు, ఎరనూకరాజు, నలనూకరాజు ఇలా దాదాపు అరవై బొమ్మల్ని ప్రదర్శన లో ఉంచుతారు. ఈ బొమ్మలను తెలంగాణ ప్రాంతంలో ఉన్న నకాషి కులం వారు చేస్తారు. వీరు నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, జనగాం, వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. తెల్లని పునికి కర్రతో బొమ్మను చేసి చింతంబలి, రంపంపొట్టు కలిపిన మిశ్రమాన్ని పూసి ఆ బొమ్మకు పరిపూర్ణత్వాన్ని తీసుకొస్తారు.
వీరు చేసే మరో ప్రత్యేకమైన ప్రదర్శన గావుపట్టి బలి చల్లటం. గొర్ల మందకు దిష్టి తగలకుండా రోగాలు రాకుండా, చీడపీడల నివారణకు, పిశాచాల బారి నుంచి మందను రక్షించేందుకు, పంటలు సమృద్ధిగా ఉండేందుకు ఎంపిక చేసిన ఒక గొర్రెనుగాని మేకనుగానీ గావుపట్టి బలిస్తారు.
ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. బలి ప్రదేశంలో తొలుత బొమ్మల ప్రదర్శన చేస్తారు. తరువాత గావు పట్టేవ్యక్తి దిగంబరంగా మారి మొలకు వేపకొమ్మలు కట్టుకుంటాడు. గొర్రెను భుజంమీద పెట్టకుని కాసేపు విన్యాసం చేసి దాని మెడను నోటితో కొరుకుతూ మందచుట్టూ తిరిగి దాని రక్తాన్ని ఒక గిన్నెలో పట్టి, అందులో మొక్కజొన్న, పసుపు, నల్లవాయిలి, నిమ్మ, గుమ్మడికాయ ముక్కలు, కల్లు ఇతరేతరాలను కలిపి మందచుట్టూ చల్లుతారు. దీన్నే బలి అంటారు. బలి అయ్యాక అందరూ మద్యం, మాంసాలతో విందు జరుపుకొంటారు. మందహెచ్చుల వారు ఎక్కువగా గొల్లల వేషధారణను అనుకరిస్తారు.
వీరు ఎక్కువగా తెల్లని దోతి, అంగి, భుజంపై తువ్వాల, కాళ్లకు కాకరకాయ బేడి కడియాన్ని ధరించి తోలు చెప్పులు వేసుకుంటారు. చేతులకు వెండి కడియాలు, వేళ్లకు ఉంగరాలు ధరిస్తారు. ప్రధాన కథకులు, సహాయకులు కూడా కొందరు జుట్టుని పెంచుకుంటారు. స్త్రీ వేషం వేయడానికి ఈ జుత్తు ఉపకరిస్తుంది. స్త్రీ పాత్రదారులు ఆభరణాలు ధరించడానికి ముక్కు చెవులు కూడా కుట్టించుకుంటారు. స్త్రీలు చెవులకు గంటీలు, పల్లేరు పువ్వు అనే సొమ్ములను ధరిస్తారు. చేతులకు మణికట్టు కడియాలు, దండ కడియాలు, కాళ్లకు వెండి కడియాలు వేసుకుంటారు. మెడలో నల్ల పూసలు, గంటె పూసలు, కాళ్లకు మట్టెలు, ముక్కుకు పుల్లలు, ముక్కు పోగులు, చేతులకు గాజులు నిత్యం ఉండాల్సిందే.
ముక్కు పుడక ఎర్రగొల్లలు ధరించరు. మందహెచ్చులు పాకనాటి గొల్లలు అందుకే వారి వేషధారణను ఎక్కువగా అనుసరిస్తారు. వీరి కులదైవం గంగ. వీరు పోశమ్మ(ప్రోచు అమ్మ), ఎల్లమ్మ(ఎల్ల అమ్మ) లను కూడా భక్తితో ఆరాధిస్తారు. ఎవరన్నా తప్పు చేసినచో, వారి దగ్గర సాక్ష్యం రాబట్టడానికి ఇమానం అంటే ప్రమాణాలని ఎక్కువగా నమ్ముతారు. తెలంగాణలో పురుడుపోసుకున్న జానపద కళలో ఇది ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది.
- మల్లెగోడ గంగాప్రసాద్
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!