తెలంగాణ పట్ల బాబుకు అంత ప్రేమే ఉంటే.. తాజాగా కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని ఎలా చెపుతున్నారో? కృష్ణపట్నం థర్మల్ విద్యుత్, హిందూజా విద్యుత్‌పై పీపీఏలను ఈఆర్సీ ఆమోదించలేదంటున్నారు. కానీ ఆ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం డబ్బులతో, అనుమతులతో నిర్మాణమయ్యాయనే విషయం బాబుకు తెలియదందామా?
కొత్త రాష్ట్రం. సూటిగా చెప్పాలంటే కొత్త సంసారం. అంతేకాదు గత కాలపు పాలనలో అనేక విధ్వంసాలు. విభజనలో సవాలక్ష అన్యాయాలు. ఈ అవరోధాలన్నిటినీ అర్థం చేసుకొని అడుగులేయాలంటే, ఎంతటి గొప్ప నాయకుడికైనా కొంత కాలమైనా పడుతుంది. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వమొచ్చి 130 రోజులైంది. ఇంత చిన్న కాలంలో ఏదో చేయలేదని విపక్షాల గావుకేకలు! ఇంతకాలం సాగిన విధ్వంసానికి, అన్యాయాలకు కారకులే విమర్శకులైన ఈ విపక్షాలను చూసినపుడు ఇవి విపక్షాలా? ఆంధ్రాపక్షాలా?అన్న సందేహం కలగడం సహజం. ఇపుడు కొత్తగా బస్సు యాత్రల అవతారం కూడా అందులో భాగంగానే చూడకతప్పదు. ఒకటి కాంగ్రెస్ బస్సు. ఇంకొకటి తెలుగుదేశం బస్సు. మూడో పక్షం నేనూ ఉన్నానంటూ బీజేపీ ఆందోళనలు!
కాంగ్రెస్ వాళ్లది రైతు భరోసా యాత్ర. గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పవర్ ప్రాజెక్టులు స్థాపించారో ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా చెప్పేస్థితిలో ఉన్నాడా?
కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్ ప్రాజెక్టులు బోలెడు వచ్చాయి. తెలంగాణలో డిమాండ్‌ను చూసైనా ఎన్ని పవర్ ప్రాజెక్టులు స్థాపించారో చెప్పగలరా? ఆంధ్రాలో విద్యుత్ ప్రాజెక్టులకు తెలంగాణ మంత్రుల చేతనే అనుమతులిప్పించిన ఘనత కాంగ్రెస్‌ది. విద్యుత్ డిమాండ్ తెలంగాణలో ఉండగా, సీమాంధ్రలో పవర్ ప్రాజెక్టులు స్థాపిస్తుంటే ఇదే కాంగ్రెస్ నేతలు అప్పుడు కళ్లు మూసుకున్నారు. విద్యుత్, నీటి దోపిడీలు తెలంగాణ మంత్రుల చేతనే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిది నిజం. నీటిపారుదల మంత్రిగా పొన్నాల ఏడేళ్లు పనిచేశారు. పొన్నాల చేతనే వైయస్ పోతిరెడ్డిపాడుకు మరిన్ని పొక్కలు కొట్టించాడు. 44 వేల క్యూసెక్కుల నీటి దోపిడీకి ఆయన చేతనే జీవో జారీ చేయించాడు. తెలంగాణ రైతు బతుకులో మట్టికొట్టిన వారే, ఇపుడు తగుదునమ్మా అంటూ రైతు భరోసా యాత్ర చేయడాన్ని ఏమందాం?
ఇతర రాష్ర్టాల నుంచి కరెంటు కొనాలన్నా కనీసం ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం చేసిన పాపాన పోలేదు. ఇవాళ ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినా, ట్రాన్స్మిషన్ కారిడార్ లేదు. దాని నిర్మాణానికి ఏడాది కాలం పడుతుంది. అప్పటి దాకా ఛత్తీస్‌గఢ్ విద్యుత్ మనకు లభ్యంకాదు. ఆ పాపం ఎవరిదందాం? నాలుగు నెలల టీఆర్ఎస్ ప్రభుత్వానిది అందామా? గత 35 ఏళ్ల కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలదందామా? పోనీ, గత 5 ఏళ్లు గా తెలంగాణలో తుఫాను, వర్షాభావాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారమైనా ఇచ్చారా? 5 ఏళ్ల కాంగ్రెస్ కాలంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇపుడు కేసీఆర్ ప్రభుత్వం రూ.480 కోట్ల పంట నష్టం విడుదల చేసింది. రైతులకు భరోసా కల్పిస్తామంటూ బస్సులో బయలుదేరిన కాంగ్రెస్ నేతలను, రైతులోకమే పైన పేర్కొన్న ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెబుతారు?
ఇక తెలుగుదేశం బస్సు రాజకీయం చూద్దాం. తెలంగాణ సకల దరిద్రాలకు తెలుగుదేశం పుట్టుకే కారణమని తెలియని వారు ఎవరూ ఉండి ఉండరు. దాని పుట్టుకతోనే తెలంగాణ దోపిడీ, నిధుల మళ్లింపులు, ఉద్యోగాల ఆక్రమణ, ఆక్రమ డిప్యూటేషన్లు, హైదరాబాద్‌కు పెరిగిన సీమాంధ్ర వలసలు, భూముల ఆక్రమణలు, ల్యాండ్ మాఫియాలు.. ఎన్నని చెప్పగలం? ఇక చంద్రబాబు కుర్చీ చేపట్టిన నాటి నుంచి మొదలైన తెలంగాణ రైతు కష్టాలు తిరుగులేకుండా నేటికీ కొనసాగుతున్నాయి. వ్యవసాయం దండగ అన్న పాలకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే నని చరిత్ర చెపుతున్నది.
దేశంలో రైతుల ఆత్మహత్యల పరంపరకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు పాలనను ఏ రైతైనా ఎలా మర్చిపోగలడు? అలాంటి చంద్రబాబు సైగలతో ఇపుడు టీ-టీడీపీ నేతలు రైతు పేర బస్సు యాత్ర చేపడితే నవ్వుకోవడం తప్ప మరేమైనా ఉంటుందా? ఉద్యమకాలంలో, తన పొలం దగ్గరకు వచ్చిన చంద్రబాబును ఫణికర మల్లయ్య(వరంగల్జిల్లా)అనే ఒక సాధారణరైతు ఏమడిగాడో తెలంగాణ టీడీపీ నేతలకు గుర్తుందో లేదో తెలియదు. కానీ తెలంగాణను ఎందుకు అడ్డుకుంటున్నావని ఆరోజు మల్లయ్య వేసిన ప్రశ్న ఈరోజుకూ మిగిలే ఉంది. తెలంగాణను తన ఆధిపత్యంలో ఉంచుకొని తిరిగి దోపిడీ సాగించాలనే చంద్రబాబు తీరే ఫణికర మల్లయ్య ప్రశ్న సజీవంగా ఉందని చెపుతుంది. తెలంగాణను అడ్డుకోలేకపోయి నా.. దాని మూలాలను దెబ్బతీసే తంత్రాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే సమస్యలొస్తాయని నేను ముందే చెప్పాను అని బాబు ఇపుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. విభజన జరిపినపుడు సమస్యలను జోడించిన ఘనత బాబు గారిదే కదా! రాష్ట్రం ఇచ్చినా తమ ఆధిపత్యంలోనే తెలంగాణ బతకాలనే బాబు గారి కుతంత్రాలకు విభజన పర్వంలోనే బీజం వేశారు.
ఉమ్మడి రాజధాని, ఉమ్మడి విద్య, పోలవరం ముంపు మండలాలు, రెండు జీవనదులపై ఆంక్షలు.. ఇవన్నీ బాబు గారి పుణ్యమే కదా! అలాగే తామే సృష్టించిపెట్టిన విద్యుత్ సమస్యపై ఇవాళ తెలంగాణ తమ్ముళ్లను ఎగదోయడంలోని మర్మం తెలియంది కాదు. నిజానికి సీమాంధ్రలో డిమాండ్‌కు మించి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. అదేదో ఇవాళ తన పాలనా సామర్థ్యం తోనే తన రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తనలాగ చేయలేకపోయారని, తనకు మించినోడు లేడన్నట్లు చెప్పుకున్నారు.కనీసం ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు ఉండాలి. అలాంటి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్లు కూడా తెలంగాణకు లేకుండా చేసిన ఘనత చంద్రబాబు పుణ్యం మూలాన్నే కదా... ఇవాళ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వెంటనే విద్యుత్ పొందలేకపోతున్నది! పైగా మావద్ద మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామని గొప్పగా చెపుతున్నారు.
నిజంగా తెలంగాణ పట్ల బాబుకు అంత ప్రేమే ఉంటే.. తాజాగా, కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని ఎలా చెపుతున్నారో? కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ,హిందూజా విద్యుత్‌పై పీపీఏలను ఈఆర్సీ ఆమోదించలేదంటున్నారు. కానీ ఆ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రం డబ్బులతో, అనుమతులతో నిర్మాణమయ్యాయనే విషయం బాబుకు తెలియదందామా? ఉమ్మడి రాష్ట్రంలో అనుమతించబడిన ఏ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తిలోనైనా తెలంగాణ రాష్ట్రంవాటా కలిగి వుంటది. విభజన బిల్లులో ఉన్న 54 శాతం విద్యుత్ వాటాకే ఎగనామాలు పెడుతున్న చంద్రబాబు, మిగులు విద్యుత్ ఉంటే తెలంగాణకే ఇస్తామనడం చూసి వినే వారే సిగ్గు పడాలేమో!
ఇక బీజేపీ చేపడుతున్న రైతుల పేర ఆందోళనల వైపు చూద్దాం. పోలవరం ముంపు మండలాలు, ఉమ్మడి రాజధానిలో గవర్నర్ అధికారాలపై బిల్లులో ఉన్నట్లుగానే అమలు చేస్తున్నామని బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి మొదలుకుంటే, హైదరాబాద్ దాకా చెపుతూవస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి విద్యుత్ విషయంలోనూ బిల్లులో ఉన్నట్లుగానే ఎందుకు అమలు చేయడంలేదో బీజేపీ నేతలు చెప్పడం లేదెందుకు?
బిల్లులో తెలంగాణకు రావలసిన 54 శాతం విద్యుత్ వాటాను ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానిదనే సోయి బీజేపీ నేతలకు లేదెందుకు? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని బతిమిలాడితే విద్యుత్ వాటా ఇప్పిస్తాం అనే రీతిలో బీజేపీ నేతల మాటలు అపుడపుడు వినబడుతున్నాయి. నిజానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 4 రోజులకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి చెప్పారు. మరోసారి ఆమధ్య వెళ్లారు. ఇపుడు మళ్లీ వెళ్ళి వచ్చారు. న్యాయమైన విద్యుత్ వాటా కోసం ఇన్ని సార్లు మొర పెట్టుకున్నా ఇప్పించలేకపోతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అడగకుండానే పోలవరం ముంపు మండలాలను మాత్రం ఏపీలో ఎలా విలీనం చేయగలిగింది?
బిల్లులో ఉన్న అంశాలనే అమలు చేస్తున్నామని పదే పదే చెపుతున్న బీజేపీ నేతలు.. విద్యుత్ విషయంలోనూ బిల్లులో ఉన్న వాటానే ఎందుకు ఇప్పించడంలేదో చెప్పాలి. చట్టబద్ధమైన న్యాయం కూడా చేయలేని బీజేపీ ఇవాళ తెలంగాణ రైతుల పేరిట ఆందోళనలు చేపట్టడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. తెలంగాణ విద్యుత్ కొరత తీర్చడం ఒక్క తెలంగాణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా. ఆ బాధ్యతను మరిచి ఆందోళనలు చేపట్టి రైతులనే మోసం చేయాలనుకోవడం సరికాదు. తెలంగాణ రైతుల పట్ల నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణకు రావలసిన 54 శాతం విద్యుత్ వాటా ఇప్పించాలి. ఎన్టీపీసీ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ రాష్ర్టానికి ఇస్తామని కేంద్రం చెప్పిన మాటను అమలు చేయించాలి.
రైతులు వర్షాలు లేక, విద్యుత్ కోతలతో సతమతమవుతున్న మాట నిజం. అయితే కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వానికి ఉన్న సమస్యల తోరణాలు ప్రజలకు తెలియనివి కావు. ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధిని ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారు తప్ప, ఆంధ్రాపక్షాల వలె గావుకేకలు పెడుతున్న విపక్షాల మాటలను ప్రజలు లెక్కలోకి తీసుకోరనేది కూడా నిజం. కొత్త ప్రభుత్వం చిత్తశుద్ధిని, దాని పనితీరును కొంతకాలం గమనిస్తే ప్రజలకు ఈ ప్రభుత్వం పట్ల ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. నిజానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవసరమనుకుంటే ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు తప్ప, ఆంధ్రా అధిష్ఠానం, ఢిల్లీ ఆధిష్ఠానం కలిగిన బయటిపార్టీల ప్రతిపక్ష పాత్రలకు తెలంగాణలో అర్థమేలేదని చెప్పాలి.
-కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
kallurisreddy@gmail.com
kallurisreddy@gmail.com
2 కామెంట్లు:
Padindae pata raaa.. pasi palla ......
Njoy :):):)
నీ యేడుపుగొట్టు రాతకు తోడు ఇంగ్లీషుభాషొకటా? తప్పుడు తడకలతో...
నీలాంటి చెవిటిమాలోకాలు (మహాబధిరులు) ఉండబట్టే మా యీ శంఖారావాలు మళ్ళీ మళ్ళీ వినిపించాల్సివస్తున్నది.
మా తెలంగాణను ఆంధ్రలో కలుపుకొన్నప్పటినుండీ ఇప్పటివరకూ...మీ ఆంధ్రా అక్రమార్కులు...
"చేసిందే (దోపిడీ) చేతరా అక్రమార్క ఆంధ్రులు"
అని మేం అనాలి...
నువ్వు అంధుడివీ, బధిరుడివీ కాబట్టి, ఈ అక్రమాల్ని కనలేవు, వినలేవు. కానీ, వెధవ పాచిపండ్లరాతలు మాత్రం రాస్తావు. నువ్వు కళ్ళున్న కబోదివికదా! చెవులున్న చెవిటిమాలోకానివి కదా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి