గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, నవంబర్ 02, 2013

సీమాంధ్రుల అభియోగాలు - తెలగాణుల సమాధానాలు (2)


రెండవ భాగము (నిన్నటి టపా తరువాయి భాగము)

5.అన్నదమ్ములను విడదీశారు…

సమాధానము:
ఈ సమాజము నందున నెవ్వరైన
యన్నదమ్ములు కలిసియు నున్నవారె?
యిట సమిష్టి కుటుంబమ్ము లెటుల నుండుఁ?
బెండ్లి కాఁగానె వారలు వేరు కాపు
రమ్ము వెట్టుచు నుండంగ, మమ్ము మీర
“లన్నదమ్ముల విడదీసి”రన్న మాట
యెటులఁ దలఁదాల్చఁ గల మయ్య యీ దినమున?
నొక్క తల్లికిఁ బుట్టియు నున్న యన్న
దమ్ము లెప్పుడు విడిపోయెద మ్మటంచుఁ
జూచుచుండంగఁ గనలేదె? సోదరు లన
నెట్టి సోదరులము మేము? నెవరు తల్లి?

దితికిఁ బుత్రులు మీ! రదితికిఁ బుత్రు
లమ్ము మేమయ్య! రాక్షసులకును, దేవ
తలకు నెట్టి బాంధవ్యము కలదొ? మీకు
మాకు నట్టి బాంధవ్య మీ లోకమందుఁ
గలదు! కావున, మీ తోడఁ గలసి యుంట,
సర్ప నివసిత గేహ వాసమ్మె మాకు!

6.చిన్న రాష్ట్రాల డిమాండు పెరుగుతుంది…

సమాధానం:
పెరుగ నీవయ్య! యభివృద్ధి పెరుగు సుమ్ము!
మా తెలంగాణ కన్న సూక్ష్మాతి సూక్ష్మ
మౌ జపానును గనుమయ్య! మహితమైన
దేశ మదియ! ఢిల్లి, గోవ దిటముగాను
వృద్ధిఁ గనలేదె? యతి చిన్నవి యవి కావె?
యమెరికాలో వసించు జనము గణింప
ముప్పదియ కోట్లు! మన దేశ మున్న దయ్య
నూఁట యిరువది కోటులు! నేఁటి దాని
రాష్ట్ర సంఖ్య యేఁబది యయ్యె! రాష్ట్రము లిట
నిరువ దెనిమిది! యమెరికా నెంచి చూడ
వంద రాష్ట్రాల పయి నుండవలయు నిచట!
నిరువ దెనిమిది సరియౌనె? నింక నబ్బ
ర నధికార వికేంద్రీకరణము జరిగి,
సులభ పరిపాలన మ్మబ్బు! సుకరముగను
వృద్ధి శీఘ్రగతినిఁ గూడు! వెతలుఁ దొలఁగు!

7.కలిసి ఉంటే కలదు సుఖం…

సమాధానం:
కలిసి యుండిన సుఖములు కలుగు ననిన,
నెవ్వరికి సుఖములు కల్గు? నెవ్వరి కిటఁ
గలుగు నన్యాయములు? తెల్పఁగలరె మీర
లిపుడు? తెలగాణకును దుఃఖ మిపుడుఁ గలిగె!
సుఖము సీమాంధ్ర వారిది! సుఖముఁ గనక
యఱువ దేఁడుల నుండియు నఱచి యఱచి,
కలిసియే యుంటి మోయయ్య! కలిసియున్న
మాకు సుఖములు కలిగెనే? మమ్ము దోచు
కోర్కి తోడనే కలిసున్న కల్మి గల్గు
నంచు నీతులు చెప్పుచు, మంచి వీడి,
మోసగించుచు నుంటిరి! వీసమైన
నీతి కలదె మీ సీమాంధ్ర నేతలకును,
దోపిడీదార్ల, కవకాశ దుర్మతులకు?
దోపిడీదార్లచే మేము దోపిడులకు
నెంత కాలమ్ము గుఱియైన నేమి ఫలము?
కనుక, విడిపోయి సుఖములఁ గనెద మయ్య!

8.ఇక్కడ కూడా ఉద్యమం ఉంది…

సమాధానం:
ఉన్నచో నుండనిమ్ము! మహోన్నత మగు
నట్టి ప్యాకేజి మీ కబ్బు! నదియె మీకు
మేలుఁ గలిగించు! నభివృద్ధి చాలినంతఁ
గలుగు! నుద్యమాల్ జనులకుఁ గలుము లిడును!

“మాది మాకు, మీయది మీకు” మా మతమున;
“మీది మాకె, మాయది మాకె” మీ మతమున!
మాది సహజోద్యమమ్మోయి! మీది కృత్రి
మోద్యమమ్ము! నిజాయితీ మూర్తిమత్వ
మిచట! నన్యాయ రూపమ్ము లచటఁ! గాన,
నుద్యమము పేర బెదిరించ, నొదిగి యొదిగి,
బెదరి దాసోహ మందుమే? హృదయ మందు
మా తెలంగాణ రాష్ట్రంపు మహితమైన
రూప మెసలారుచున్నది! కోప మేల?
మాను మో యయ్య! యడ్డుట మాను మయ్య!

9.గుండెపోటుతో పలువురి మృతి…

సమాధానం:
“సహజ” మరణాల మీర “లసహజ”ముగను
మరణ మంది రటంచును దఱచి తఱచి,
తెలుపఁగా నేల? తెలగాణ తెచ్చుట కయి
యమర వీరుల బలిదాన మమరె! వేయి
మంది యువతీ యువకుల యాత్మలనుఁ గించ
పఱుపఁగా నెంచి, యిట్టుల వదరెదోయి?

గుండెపోటుతో మరణించ, వెండి యదియ
యాత్మహత్యయె? తెలగాణ యమర వీరుఁ
డొక్క శ్రీకాంతచారిచా లక్కడ మృతి
నందినట్టి సీమాంధ్రవా రందఱకును!

మా యమరవీరు లొక్కరి మరణము వలె
మీ మృతులు మరణించిరే? మీది “సహజ
మరణము”! తెలగాణ యమర వర మరణ “మ
సహజ”మోయి! సహస్రాక జనను
ల కిటఁ బుత్రశోకమ్ము కలఁచె హృదయము!
కడుపు కోఁతతో నిత్యమ్ము గనలి కనలి,
దుఃఖపడుచుండి రిట! వారి దుఃఖ మెవఁడు
తీర్చఁగలఁ డోయి? యనవల దిట్లు నీవు
మా యమర వీర వరుల సామాన్యులనుగఁ
జేసి,యాత్మహత్యలఁ జిన్నఁ జేసి, యిపుడు!
రాష్ట్రమునకయి యెవఁడైనఁ బ్రాణ మిడెడు
వాఁడు కలఁడె సీమాంధ్రను? వల దమరులఁ
దక్కువగఁ జేసి మాట్లాడఁ దగదు మీకు!


జై తెలంగాణ!               జై జై తెలంగాణ!


(సీమాంధ్రుల అభియోగాలు-తెలగాణుల సమాధానాలు సమాప్తం)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

super ga unnayi sir mee samdhaanalu.
inka valal thika prashnalaku vetakaaralu add chesthe inka bagundedhi. vallaku ala cheppithene arthmu avutehundhi.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు అజ్ఞాతగారూ! వాళ్ళకు ఉన్నవిషయాలు ఉన్నట్టే చెబితే చాలు! వాళ్ళు మనల్ని దోచుకున్నది తెలియదా? అన్నీ తెలిసే సమైక్యాంధ్ర కావాలంటున్నారంటే, వాళ్ళకు మనం అవసరం లేదని స్పష్టమవుతోంది. మన హైదరాబాద్ కావాలి, కాని, మనం అవసరం లేదు. కారణం దోపిడీయే. కా బట్టి వెటకారాల కన్నా నిజాలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి...దొంగకు తేలుకుట్టినట్టు...నోరు మూసుకుంటారు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి