నాఁడు తెలగాణ వీరుల నణచి పట్టి,
కట్టి, బలవంతముగఁ దెలంగాణ లోన
నుద్యమము నాపి నందున, నొచ్చి నట్టి
వీరవరు లంత, నక్సలైట్ పేర నడచు
దళమునందునఁ గలిసిరి! తప్పు మీది!
నేఁడు తెలగాణ నాపుచో, నిక్కముగను,
నక్సలైట్ దళము లవెన్నొ నడచు నోయి!
పిల్లి నింట బంధించినఁ బెనఁగి, యదియుఁ
దిరుగఁబడుఁ గాదె! తెలగాణ ధీరు లంతె!
నక్సలిజ మెంతయో హెచ్చు ననుట మాని,
దాని నాపఁగఁ, దెలగాణఁ దగిన రీతి,
రాష్ట్రముగఁ బ్రకటింప, శీఘ్రగతిని నది
రూపు మాయును; శాంతియే రూపుఁ గొనును!
"విభజనము వల్లఁ దెలగాణ పెద్ద నష్ట
మందఁ గలదయ! విద్యుత్తు మందగించు;
జలవివాదాలు చెలరేఁగు; సత్య" మనుచు
మొసలి కన్నీరు కార్చుచు, ముంగిస వలె
నంగి మాటల కపటమ్ము నమ్మ మయ్య!
దొంగ ప్రేమను నటియించి, దోచుకొనఁగ,
నెత్తుగడఁ బన్నఁ, దెలియమే, నీదు మాయ?
నష్టపోయినఁ, దెలగాణ నష్టపోవు!
దాన, మీ కేమి కష్టమ్ము? తరలి పొండు!
తరలి పోయి, లాభమ్ముల నరసికొనుఁడు!
మీరు మా తోడఁ గలువక, మిడుకు నాఁడు,
తిరుపతి బెజవాడయు మరి విశాఖ
పట్టణా లెట్టులుండె? నేఁ డెట్టు లుండె?
నట్టి యభివృద్ధి, తెలగాణ నష్ట పఱచి
నట్టి ధనముతోఁ గాదె? మానవత వీడి;
ఆశ పడుట కెంతైన హద్దు లుండ
వలయు! వట్టి మాటల నాపి, వచ్చి నట్టి
సదవకాశమ్ము నందినఁ జాలు మీకు!
కల్లబొల్లి మాటల నిఁకఁ గట్టిపెట్టి,
బాగుపడు బాట పట్టుఁడు! వలదు వలదు
మొసలి కన్నీరు, కపటప్రే మసలె వలదు!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి