(1)
మా తెలంగాణమ్ము నాంధ్రను
గలిపి నప్పటి పెద్ద మనుషుల
అగ్రిమెంటును ఆచరించక,
మంటగలిపిరయా!
(2)
లోటు బడ్జెటు మీది కాగా,
అధిక బడ్జెటు మాది కాగా,
మమ్ము దోచియు లోటు పూడ్చిన
ఘనులు మీరయ్యా!
(3)
ముల్కి రూల్సు నతిక్రమించియు,
మా కొలువులను దోచి, మీరలు
మమ్మమాయకులనుగ మార్చియు,
మాయ జేసిరయా!
(4)
నీటి వనరుల వాట లేకయె,
అక్రమమ్ముగ మఱల జేసియు,
తెలంగాణము నెండ బెట్టిన
కీర్తిమీ దయ్యా!
(5)
ఆరువందల పదియు జీవో
తుంగలో దొక్కియును, కొలువులు
స్వవశమందున బెట్టుకొనియును,
వెక్కిరించిరయా!
(6)
వలస రాజ్యము పాదుకొనగా,
కొల్లగొట్టిరి భూములెన్నియొ!
ఏ బినామీ పేర్లతోడనొ
వ్యవహరించిరయా!
(7)
వనరు లుండిన తెలంగాణనె
విద్యు దుత్పత్తులవి యుండగ
వలెను! కానీ, ఆంధ్రలోపల
వెలయజేసిరయా!
(8)
కలిసి యుండిన కలవు సుఖముల
టంచు బలుకుచు, మోసగించియు,
మాకు సుఖములు! మీకు దుఃఖము
లనుచు పంచిరయా!
(9)
ఒక్క పైసా నీయ నంటూ,
నిధులు సీమాంధ్రమునకే యిడి,
మొండి చెయ్యే తెలంగాణకు
చూపుచుండిరయా!
(10)
మాయ మాటలు చెప్పి చెప్పీ,
అరువదేండ్లుగ దోచుచుండిరి!
తెలంగాణము నీయు మనగా
అడ్డుపడిరయ్యా!
(11)
మా తెలంగాణమును తిట్టుచు,
సమైక్యాంధ్రమ్మంచు పలుకుచు,
కలిసి జీవించుటయు నెట్లో
చెప్పకుండిరయా!
(12)
కేంద్ర మిప్పుడు తెలంగాణను
ఈయబూనగ, సమైక్యాంధ్రను
ముందు నిలిపీ, లాబియింగును
జేయబూనిరయా!
(13)
అన్నదమ్ములటంచు బలుకుచు,
కలుములన్నకు, లేమి తమ్ముల
కీయ దలచిన యట్టివారలు
అన్నదమ్ము లెటుల్?
(14)
వేరు పడిననె మేలు కలుగును!
మీది మీరే, మాది మేమే!
తెలంగాణకు అడ్డుపడినను
కేంద్ర మిడునయ్యా!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి