(1)
అఱువ దేండ్ల నిరీక్షణ మ్మంతరింప,
స్వేచ్ఛ నందియు, వెలుఁగుచుఁ, జిత్రముగను
బది జిలాల ప్రజలుఁ బిల్వ, వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!
(2)
హైదరాబాదుతోఁ గూడి, యంచితముగ,
నాంక్షలే లేని రాష్ట్ర బంధమ్ముఁ గొనియుఁ,
బ్రజల నానంద పఱుపంగ వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!
(3)
రామదాస నిర్మితము భద్రాద్రి రామ
సహిత భద్రాచలముఁ గూడి, సరగున నిటఁ
బ్రజలు సంతోషమునఁ బిల్వ, వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!
(4)
సకల జనముల కోటి యాశలు చిగుర్పఁ
జేయు నవరాష్ట్ర యుక్త సంచిత శుభాలఁ
బంపకముఁ జేయఁగాఁ దాను వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!
(5)
ఇర్వ దెన్మిది రాష్ట్రాల కెంతయుఁ దగు
రమ్య రాష్ట్రమ్ము కేంద్ర మలంకరింపఁ;
బరుగు లెత్తుచు, వేగమే వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!
(6)
సకల జనుల కష్టముల సమయఁ జేసి,
సంతసముఁ గూర్చి, తఱుఁగని సంపద లిడి,
పావన మొనర్చి, కావఁగ వచ్చుచుండె,
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి