"మార లేదయ్య నా మాట! తీరు కూడ!
రాష్ట్ర మది సమైక్యమ్ముగా రాజిలఁ గను
వృద్ధి యెసఁగును! విడిపోవ వృద్ధి లేదు!
నక్సలిజము పెరుఁగును కనంగ మనము!
కాన, కలిసి యుండుఁ డటంచు నేను చెపితి!!"
ననుచు ముఖ్యమంత్రిగఁ బల్కఁ గను నసత్య
వచనుఁ డనుటకు సందేహ మిచట వలదు!
నాఁడు నీవు వల్కిన మాట నమ్మితి మయ!
కాని, యాడి తప్పిన, గొప్ప యౌనె నీకు?
’కేంద్ర మే నిర్ణయముఁ గొన్నఁ గిరణుఁ డద్ది
తలను దాల్చు’ నటంచును బలికి నట్టి
మాట, కేంద్రంపు నిర్ణయమైన పిదప,
దాని తలఁదాల్చకయె, యసత్యంపు మాట
"నే సమైక్య వాదిని" నంచు నిక్కముగను
పల్కి, "నే మార లేదయ్య! పలుకు కూడ
మార లే" దని, తెలగాణ మౌనముగను
వినఁగఁ, జెవిఁ బువ్వుఁ బెట్టెదో పెద్ద సారు?
విలువ కాపాడుకోవయ్య! తెలిసి తెలిసి
మాట మార్చంగ నొప్పునే? మాన్యతగునె?
"ఇట్టి స్థితిలో సమైక్యతే యిమ్ము లొసఁగు!
రెండు వేల పద్నాలుగు దండిఁ గనెడు
నెన్నికల దాఁక నట్టులే మిన్నకుండుఁ
గేంద్ర" మంచుఁ బల్కంగను; గేంద్ర మిపుడు
చేయు కృతములు వట్టివే? చిత్రముగను
బల్కు పల్కులు కేంద్రమున్ బరిహసించు
నట్టివే, ముఖ్యమంత్రీ? వినంగ మేము
తెలివి లేనట్టి వారమా? స్థిరత గలుగు
మా తెలంగాణ చేఁతలు మఱచినావె?
విభజనము చేయకున్ననే, వేగముగను
నక్సలిజము హెచ్చును! నిద్ది నమ్మి, నీవు
విభజనమ్ముకై తోడ్పడి, ప్రేమ లెసఁగు
నెడఁద తోడుత, విడిపోవ నొడఁబఱచియు
సహకరించిన మెప్పు నొసంగెద మయ!
లేనిచోఁ గేంద్రమే నిన్ను హీన పఱచు!!
మాట దక్కించుకోవయ్య మాన్య వర్య!
విలువ దక్కించుకోవయ్య ప్రేమ పంచి!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి