గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, నవంబర్ 12, 2013

హైదరాబాదు భద్రాద్రు లగును మావె!


శార్దూలవిక్రీడిత మాలిక:

మా రాష్ట్రమ్మును గోరఁ, గేంద్ర మిపుడున్ మా రాష్ట్ర మీఁ బూనఁగా,
మీ రీ హైదరబాదు ’యూటి’గను నిర్మింపంగఁ గోరన్, భలే
వారోయీ! బెజవాడనున్, దిరుపతిన్, వైజాగునున్ ’యూటి’ కాఁ
గోరం బోతిమె? మీర లిట్టు లనుచున్ గోరంగ సద్వాదమే?

మీరే యీ నగరంపు వృద్ధి నెచటన్, మించంగఁ జేపట్టిరో,
బీరాలన్ బలుకంగ మాని, చెపుడీ, పేరాస లేకుండఁగా!
నౌరా! కోట్లు పదేను వేల నట మీ యయ్యల్ దగం దెచ్చిరా?
మీ రే కష్టముఁ జేసి, పైస లిచటన్ మేలెంచి వెచ్చించిరే?

మా రాష్ట్రమ్మును గల్పు వేళ మిగులుం బడ్జెట్టు మా దౌటచే,
మీ రాష్ట్రమ్మున లోటు బడ్జె టగుటన్, మీ ఖర్చుకే లేకయున్,
మీ రా డబ్బును దోచి, ఖర్చు లిడి, “మేమే వృద్ధిఁ జేశా”మనన్,
ధీరమ్మే? యెవరైన మెచ్చెదరె? లేదే మీకు సిగ్గున్, శరం

బీ రో జిట్టి ఘనంపు మీ బ్రతుకు మా పేదల్ తెలంగాణులే 
యా రో జట్టుల భిక్ష నిడ్డ కతమే! యావ త్తెలంగాణులన్ 
మీ రీ రీతిని మోసగింపఁ దగునే? మేలౌనె మీ కిద్దియున్? 


స్వైరోచ్చారణ మీరు సేయఁ దగునే? భద్రాచల ప్రాభవ
ప్రారబ్ధుల్ తమరా? నిజాము తమరా? రామాలయ మ్మందునన్
మీ రొక్కమ్ములు, శిస్తు లెన్ని కలిసెన్? మీ రెక్క డున్నారలో?

కారోయీ యిట స్థానికాఖ్యు లనఁగన్! కంచెర్ల గోపన్న శ్రీ
కార మ్మిచ్చట నాలయమ్ము కొఱకై కావింప నిర్మాణమున్,
దా, రొక్కమ్మది రాజ ద్రవ్య మగుటన్, ద్రవ్యమ్ము వెచ్చించుచున్,

“నా రాముండు భరించు నన్ని” యనుచున్, ధన్యాత్ముఁడైనట్టి త
త్పౌరున్, భక్తుని, రామదాసుఁ జెఱనున్ బంధింపఁగాఁ దానిషా; 
మా రామయ్య మహోన్నతంపు మహిమన్ మన్నింపఁ దానీషఁ, దాఁ 
జేరం బోయియు, రొక్కమిచ్చి, విడిపించెన్ రామదాసున్ వెసన్! 

ఆ రాజప్పుడు తప్పు సైఁచు మని తా నా రాముఁ బూజింప, స
త్కారమ్ముల్, పలు రీతి సౌరు లమరన్, గళ్యాణ మింపారఁగన్,
జేరంగాఁ జని, మేలి ముత్యములఁ నిచ్చెన్ గాఁ దలంబ్రాలు! వే,
ధారాదత్తముఁ జేసె మాన్యముల సన్మాన్యాది సంసేవకై!

మా రామయ్యయు, రామదాసు, ప్రభువౌ మా తానిషల్ స్థానికుల్!
మీ రీ బంధము లేవి లేని పరులే! మీదైన భద్రాచలం
బౌరా! నోళ్ళును మూయ, వృద్ధిఁ గనకే, పర్వెత్తె షష్ట్యబ్దముల్!

మీ రీ వేళ మహాప్త భక్త తతి సంప్రీతాస్థ వాక్యమ్ములన్
గోరన్, మీ దిది యౌనె? యెట్టు లగునో? గోపన్న మీ వాఁడె? ప్రా
పా రాజన్యుఁడగున్ నిజాము ప్రభుఁడే భద్రాద్రిఁ బాలింపఁగా;

నా రాజెద్దియ రాజధాని యనెనో యా హైద్రబాదే యిటన్
సారాచార విచార సార్వజనియౌ భద్రాద్రిఁ దా నిమ్ముగా 
సారించెన్ బరిపాలనమ్ము! కనుకన్, సాగెన్ దెలంగాణలోఁ; 

బారమ్మిద్దియ! రాజ్య మిద్దియ కదా! భద్రాద్రి మాదే కదా! 
మీ రెట్లందురు మాదె యంచు నిపుడున్? మీ దెట్లు? మాదే కదా! 

జై తెలంగాణ!                  జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి