గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 09, 2013

కొనఁగ మదరాసు నగరమ్ము

కవిపండిత మిత్రులకు, వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!!
కొనఁగ మదరాసు నగరమ్ముఁ గోరి, యాంధ్ర
రాష్ట్రము నిడ నొప్పుకొనఁగ; భ్రాంతి విడక,
యాంధ్ర రాష్ట్రమ్ము కోసమై యాస పడిన
పొట్టి శ్రీరాములుం గోలు పోయితి రయ! (1)


ఆత్మ బలిదాన ఫలితమ్మె యాంధ్ర రాష్ట్ర
మేర్పడుట కాదె! కర్నూలు మీకు రాజ
ధానియౌట సంతృప్తిని నీని కతన;
హైదరాబాదుపైఁ బ్రేమ లవతరించె! (2)

దుష్ట చింతన తోడుత దుర్జనులయి,
రహిని భాషాప్రయుక్త రాష్ట్రమ్ము పేర,
మాయచేఁ దెలగాణమున్ మంత్రబలిమిఁ
గలిపి, రాంధ్రప్రదేశమౌ కాంక్ష మెయిని! (3)


అన్నదమ్ముల వలె నుందు మనిన
నాఁటి యొప్పందములును మున్నీటఁ గలిసె;
స్వార్థ పరతయు హెచ్చఁగ స్వాగతించి,
యన్ని యధికారములు పొంది రయ్య మీరు! (4)


నీరు, విద్య, విద్యుచ్ఛక్తి, నేలబొగ్గు,
కొలువులును, భూమి, యభివృద్ధి, కూర్మి ధనముఁ
గొల్లఁగొట్టియు, వ్యాపార కూటములుగఁ
దిష్ఠ వేసియు, ధనములఁ దేలి రయ్య! (5)


మా తెలంగాణ జనుల నమాయకులుగఁ
జేసి, దోపిడీల్ సేసియు, శీఘ్రముగను
ధనములార్జించి, మిగుల నధఃకరించి,
బానిసలఁ జేసినారు సత్వరిత గతిని! (6)


ఆ దురంతాల ధాటికి నాఁగలేక,
యుద్యమమ్ములు సేసిరి యుక్త రీతి!
నెందఱో యాత్మ బలిదాన మిడియు, నాంధ్ర
పాలకుల దౌష్ట్యముల మాన్పఁ జాల రైరి!! (7)


అఱువ దేండ్లుగ సాఁగిన యట్టి పాల
నమ్ము నేఁడు మాన్పంగఁ గేంద్రమ్ము వెసను,
వేఱు రాష్ట్రమ్ముగాఁ జేసి తీఱఁగాను
దలఁచి, ప్రకటించె తెలగాణ, దయను బూని!! (8)


2 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

భావాన్ని ఏ ఛందంలో నైనా మృదుమధుర పదాలతో చక్కని ధారతో మనోహరంగా చెప్పే నైపుణ్యం మీకుంది. సంతోషం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు శంకరయ్యగారూ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి