గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, డిసెంబర్ 21, 2013

అల్పత్వం వీడండి!


ప్రజాస్వామ్య దేశంలో సీ.యం.
మాటలు నిరంకుశము కావా?
బీహారుత్తరప్రదేశు మధ్య
ప్రదేశు బిల్లులు వేరుకదా!

ఈ మూడు రాష్ట్రము లసెంబ్లీల్లో
తీర్మానమ్ముల కేంద్రముకున్
పంపుట మెజార్టి యుండుట వల్లే
సాధ్యమైనది వారలకున్!

తెలంగాణ సభ్యుల మెజారిటీ
తక్కువ యుండిన తీర్మాన
మ్మెట్టుల వీలగునయ్యా యిప్పుడు?
సాధ్యము కాదయ తీర్మానం!

మైనారిటీల కీయగ న్యాయము
నార్టికలు మూడు తీర్చునయా!
లేనిచొ సీమాంధ్రులె తెలగాణకు
నిరంకుశ ప్రభువులె కారా?

బిల్లిట వచ్చియు నారు రోజులయె,
సీ.యం. వచ్చిరె అసెంబ్లికిన్?
వచ్చుటతోడనె మెలికలు పెట్టుట
కుట్రలో భాగ మిది కాదా?

బీయెస్యేలో తీర్మానించిన
రీతినె చర్చలు చేపట్టన్
ఉపసభాపతియె ఆరంభింపగ
ప్రతిపక్షమె పెడచెవిబెట్టెన్!

దీనికి రికార్డులుండగ సీ.యం.
చర్చ మొదలు కాలేదనుటల్,
గొర్రెకు కార్జము లేదనుటేగా!
న్యాయమా? ఇదియు సబబేనా?

ప్రజలంటే సీమాంధ్రులె కానీ
తెలగాణులు ప్రజలేకారా?
ఆధిపత్య దర్పముతో వారల
బానిసలుగ జూచుట తగునా?

ముఖ్యమంత్రిగారూ!

అసత్యాలు దౌర్జన్యాల్ వీడియు
వాస్తవమ్ములను కనవయ్యా!
ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రివయ!
ఒక సీమాంధ్రకె కావయ్యా!

ఇక ఆలస్యము చేయక వెంటనె
బిల్లుపై చర్చ చేపట్టు!
భేదమే లేని ముఖ్యమంత్రిగా
గొప్పతనమ్మును చూపెట్టు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శుక్రవారం, డిసెంబర్ 20, 2013

ఇది నమ్మకద్రోహం కాదా?


తోటకము:
ఇది నమ్మకద్రోహ మిదేహ్యమగున్!
మదిలోపలఁ గుట్రల మానకయే,
వదనాయత  హాసిత వంచకులై
పదునైదు దినమ్ముల వాయిద సం
సదనమ్మునఁ దెల్పఁగ సభ్యతయా?

గీతాలంబనము:
బీయేసి విధానము వీడి యిఁకన్
మాయా సహితోక్తుల మానుఁడయా!
వేయేల? స్వరాష్ట్రపు వీక్షణయన్
మా యాశ నిరాశగ మార్చెదరా?

రథోద్ధతము:
మానుఁడోయి యసమర్థ వాక్యముల్!
మానుఁడోయి యసమాన దర్పముల్!
మానుఁడోయి యవమాన వేషముల్!
పూనుఁడోయి యశమొందు కృత్యముల్!!

ప్రియంవద:
ఇటను స్పీకరిఁక నేక పక్షమౌ
కుటిల మార్గుఁడయి క్రూరయోచనా
ఘటిత దృష్టిఁ దెలగాణ బిల్లుపై
నిటుల వాయిదల నీయ భావ్యమా?

స్రగ్విణి:
న్యాయమార్గమ్ములో నవ్య రాష్ట్రమ్ము వేం
చేయనుండంగ దుశ్శీల దుర్నీతి న
న్యాయకృత్యాలతో నాపఁగాఁ బూనుచో
మాయ ఛేదించి, సన్మాన్యతన్ బొందమే?

స్వాగతము:
స్వాగతింపుఁడయ సక్రమ చర్చల్
వేగఁ జేయుఁడయ వేడుకతోడన్
సాఁగఁజేయుఁడయ చక్కని రీతిన్
గాఁగలట్టి తెలగాణకు జేజే!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, డిసెంబర్ 19, 2013

సర్వం దెలిసి సన్నాసుల్లో కలుస్తారా?


చర్చలవెక్కడ అసెంబ్లీలోన?
టీడీపీ వైయెస్సార్సీపీ
అడ్డుచున్నవయ చర్చల నిప్పుడు!
చర్చ లేకుండ తిరిగి పోవునయ!!

టీ ఎమ్మెల్యేల్ లిఖితరూపముగ
అభిప్రాయమును అందజేతురయ!
సీమాంధ్ర నేతలు అఫిడవిట్లనిక
అందజేసినచొ చర్చలైనట్లె!!

సీమాంధ్ర వృద్ధి ప్యాకేజీలకు
చర్చలేకున్న అడ్డుకట్టయే!
చర్చల నడ్డిన జరుగునదేమిటి?
సీమాంధ్రులకిది నష్టమేకదా!!

సర్వం దెలిసీ సన్నాసుల్లో
కలువకండయా, తెలుసుకొండయా!
చర్చలు సేయకయున్న మీరలు
రెంటికిం జెడిన రేవళ్ళౌదురు!!

చర్చలు జరుగు పరిస్థితులున్నచొ
అవసరమగుచో పొడిగింతురయా!
చర్చల నడ్డిన, అవసరమేమిటి?
బిల్లును రాష్ట్రపతికి పంపెదరయ!!

మీడియ కల్పిత వాక్కులు నమ్మకు!
మసి పూసి మారేడుకాయ చేయకు!
జరుగనున్నదియె జరుగక మానదు!
చర్చల సజావుగా నడుపుడయా!!

తెలంగాణ యిక వచ్చుట ఖాయము!
జరుగునదంతా మా మంచికయా!
జై తెలంగాణ! జై తెలంగాణ!
జయము జయము తెలగాణా బిల్లుకు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, డిసెంబర్ 18, 2013

చర్చలు ఇలా సాగాలి...


(1)
చర్చలే సాఁగు కొఱకయి, చక్కఁగాను
నేక వారమ్ము నేతల కీయఁ దగును!
మార్పు చేర్పులు కేంద్ర సమ్మాన్య సభను
జర్చ సారానఁ దెలుపంగఁ జాలుదురయ!
సభ్య క్రమశిక్షణము మేలు సభ్యులకును!
శాంతి పూర్వక చర్చలే సభ్యత కద!!

(2)
ఒకరు మాట్లాడుచున్న, మఱొకరు నడుమ
తలను దూర్చంగవలదయ్య! తగిన రీతి
పక్ష నిమిషకాలము చాలు వాదనకును!
ఏ నినాదాలు సేయ రాదీక్షణమున!
శాంతి పూర్వక చర్చలే సభ్యత కద!!

(3)
శాంత వాతావరణమందుఁ జక్కఁగాను
చర్చ జరుగునప్పుడు భంగ పర్చఁగాను
బూను సభ్యుల "సస్పెండు" పొందఁ జేసి,
చర్చ సాఁగంగఁ జేయుఁడు సంతసమున!
సభను వాయిదా వేయుట జరుగరాదు!
 శాంతి పూర్వక చర్చలే సభ్యత కద!!

(4)
సభను నడ్డుట, యఱచుట సమ్మతమ్ము
కాదు! చర్య గైకొనఁగ, శిక్షను గనకయ
మునుపె బాధ్యతఁ దెలిసి, ప్రమోదకరపు
రీతి మెలఁగంగఁ దగునయ్య నేతలంత!
శాంతి పూర్వక చర్చలే సభ్యత కద!!

(5)
శుభకరమ్మగు చర్చలే శోభఁ గూర్చు!
నుభయ రాష్ట్ర జనులకును విభవ మొసఁగు!
లాభదాయకరీతిలోఁ బ్రమదమెసఁగఁ,
జర్చ జరిపి, రాష్ట్రపతికిఁ జప్పున నిది
పంపుఁ డోయయ్య, విజయోత్సవమ్ముకొఱకు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, డిసెంబర్ 17, 2013

స్వాగతం...సుస్వాగతం!


స్వాగత వృత్తము:
స్వాగతించిరయ సక్రమ బిల్లున్,
వేగ చర్చలిఁక విందులు సేయున్,
సాఁగిపోవునయ చక్కని త్రోవన్,
కాఁగలట్టి తెలగాణకు జే జే!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

తెలంగాణ తృతీయ విజయం!

కూళలు మూర్ఖులు బిల్లును చించుచు
త్రొక్కుచు అవమానించిరయా!
వీరు ప్రజాప్రతినిధులా? కారయ
దుశ్చేష్టల దుర్మార్గులయా!

రాష్ట్రపతియె పంపిన ఈ బిల్లును
అవమానించుట "నేత"పనా?
రాజద్రోహము కాదా? అట్టుల
దౌష్ట్యమ్మును జూపుట తగునా?

***

సచివాలయ సీమాంధ్రులు ఉత్త
ర్వులు న్నిబంధన జవదాటిరి!
రెచ్చగొట్టెడి సవాళ్ళను విసరుచు
వీరంగాన్నే సృష్టించిరి!

నిరసన ర్యాలీల్ ధర్నాల్ చేయగ
చోద్యం చూసిరి పోలీసుల్!
కౌటిల్యమ్మున కుయుక్తి తోడను
ఇట్టుల చేయుట సబబేనా?

***

తెలంగాణ నాయకులారా! మీ
స్పందన సౌమ్యత నందవలెన్!
బట్టగాల్చి పై వేతురు, జాగ్రత,
శాంతపు చేతల పోరవలెన్!

ఈనగాచి నక్కలపాల్ సేయక
జాగ్రతతో మెలగన్ శుభమౌ!
దుష్టుల దూరము నుంచియు వర్తన
సేసిన తెలగాణా మనదౌ!

తస్మాజ్జాగ్రత, జాగ్రత! వినుమా,
రాష్ట్ర ప్రయోజనమే కనుమా!
తెలంగాణ రాష్ట్రావతరణముకు
స్వాగత నాదము చేకొనుమా!

***

ఎట్టకేల కీ తెలగాణా బిల్
అసెంబ్లిలోపల చర్చకురాన్,
ప్రతిపక్ష నాయకుడు నోర్మూసెనహో!
వాయిదాపడెను రేపటికిన్!

చర్చలు జరిగిన జరుగక యున్నను
తెలంగాణ కడ్డేమున్నదయా?
పార్లమెంటులో తప్పక నెగ్గును!
ఇదియే "తృతీయ విజయ"మయా!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

సోమవారం, డిసెంబర్ 16, 2013

కుట్ర వద్దు!


రాష్ట్రపతియె పంపించిన
బిల్లు వచ్చు నేడు!
సకలామోదము తెల్పుట
జరిగేట్లుగ చూడు!

ఓటు లేదు, చర్చె యుండె,
సజావుగా సాగు!
మరల పంపగాను నీవు
చేయకయ్య జాగు!

కుట్రల నువు చేసితివా
తగిన శిక్ష యుండు!
శాంతిని సాధించితివా
మెప్పులె నీకుండు!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!



ఆదివారం, డిసెంబర్ 15, 2013

ఇదేనా నీ ఔన్నత్యం?


వచ్చెనసెంబ్లీముందుకు తెలంగాణ బిల్లు;
కేంద్ర విధేయుడవైతే కాకోయీ ముల్లు!

బిల్లునడ్డుతానంటే చూస్తూ ఊర్కుంటామా?
న్యాయమైన తెలంగాణ సాధింపక మానెదమా?

జగనుబాబు, చంద్రబాబుతోడ కలసిపోరినా;
కేంద్రం ప్రతిపాదనమ్ము వ్యర్థం అయిపోవునా?

కుక్కయె బెదరించి చెప్పునెత్తుకొనియు పోయినట్లు;
మీరలు బెదరించి యిపుడు తెలంగాణ నాపుదురా?

ఇప్పుడు కాకున్న రేపు తెలంగాణ వచ్చునయా!
కల్లు తాగినట్టి కోతివలె చిందులు వేయకయా!

ఔన్నత్యం ప్రదర్శించి ఘనతను సాధించుమయా!
ముఖ్యమంత్రి పదవికున్న గొప్పతనం పెంచుమయా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, డిసెంబర్ 14, 2013

న్యాయమైన తెలంగాణ!


న్యాయమైన తెలంగాణ
బిల్లు నణచివేయగాను
దౌష్ట్యమ్మును చూపుటేల?
కుతంత్రాలు పన్నుటేల?

నాడు చర్చసేయగాను
స్వల్పకాలమిచ్చినారు!
తెలిసికొనక వాదించుట
అల్పజ్ఞత కాదటోయి?

చిన్నమార్పు సూచింపగ
చర్చయుండవలెననిరయ!
నేతల అనుమతి తోడనె
చర్చసేయవలెననిరయ!

గతచరితను తెలిసికొనియు
వర్తింపగవలెనుకదా!
ఓటింగుకు రాదనియును
తెలిసియేల వాదింతురు?

అరువదేండ్ల తెలంగాణ
ప్రజాస్వామ్య విజయమిదే!
ఇది అందరి విజయమయా!
ప్రతి ఒక్కరు ధన్యులయా!!

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

ఇక దుష్టుల ఆటలు సాగవు!


(1) జలదము:
మా తెలగాణ రాష్ట్రమిట మానవతా
చేతముతోడ వెల్గఁగను; జిత్తులతో
భూతము వోలె మ్రింగఁగను బూనికతో
గోతులు త్రవ్వుచుండిరిటఁ గ్రూరతతోన్!

(2) తోవకము:
విసమును జిమ్మెడి వెఱ్ఱులతో, సం
తసముగ నుందురె నా తెలగాణుల్?
వెసఁ జెడుమాటల బీరము లేలా
గు సహన మూర్తుల కూర్మిని బెంచున్?

(3) స్రగ్విణి:
న్యాయ మార్గమ్ములో నవ్య రాష్ట్రమ్ము వేం
చేయ నుండంగ దుశ్శీల దుర్నీతి న
న్యాయ వృత్తుండ్రునై యాపఁగాఁ బూనుచో,
మాయ ఛేదించి, సన్మాన్యగాఁ జేయరా?

(4) వంశస్థము:
పరాకుతోఁ బల్కెడు పాడుమాటలే
స్వరాష్ట్ర కాంక్షోద్భవ సహ్యమయ్యె! స
త్పరీక్షలో నెగ్గును తత్సభన్ వెసన్!
విరాజిలున్ రాష్ట్రము వేగిరమ్ముగా!!

(5) తోటకము:
తెలగాణము వచ్చును తృప్తినిడున్!
బులకించెద రిచ్చటి పోరుజనుల్!
తులకించును రాష్ట్రము! దూరమగున్
పలుగాకుల దౌష్ట్య కుపాలనమే!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గురువారం, డిసెంబర్ 12, 2013

సాగదీత...కుట్రేనా?


అదిగో వచ్చెను తెలగాణా బిల్!
వచ్చెనసెంబ్లీ చర్చలకొరకై!
ఒకటో రెండో మూడు రోజులో
సమయం పట్టును చర్చలకొరకై!

కానీ, బిల్లుకు ప్రెసిడెంటిచ్చెను
ఆరువారముల సమయమ్మిప్పుడు!!
ఇంత సమయమ్ము నిచ్చుట కేదో
బలమైన కారణమ్ముండవలెనయా!

అనుమానమ్మెదొ పొడసూపెను మది!
కాలమిచ్చి యిక సాగదీయుటకె
కాదుగదా సీమాంధ్రుల కుట్రల
లాబీయింగుల మహిమమ్మిదియే?

కేంద్రము పూనిన కార్యము చక్కగ
సకాలమ్ములో నెరవేరును గద!
భేషు భేషనును తెలగాణమ్మే!
దీప్తిమంతమై కాంగ్రెసు వెలుగును!!

త్వరత్వరగా చర్చల జరిపించియు
కేంద్రముకంపగ యత్నించుటయే
ముందరనున్న మహత్కార్యమ్మిది!
తాత్సారమ్మిక చేయగనేలా?

కుట్రచేయుచో తిప్పికొట్టెదము!
మంచికేయైన కొనియాడెదము!
త్వరగా తేల్చుడు వారములోనే
త్వర త్వర త్వర త్వర త్వర త్వరగా!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మాయకుల నిలుపు! అమాయకుల గెలుపు!


అమర వీరుల తలపు
స్వీయ రాష్ట్రపు గెలుపు
ఘన చరిత్రకు మలుపు
నా తెలంగాణ!

మనకు స్వేచ్ఛను దెచ్చు
స్వీయ కాంక్షల నిచ్చు
సకల జనులును మెచ్చు
నా తెలంగాణ!

మనదె యిక పాలనము
సంస్కృతుల మేళనము
సన్మార్గ శోధనము
నా తెలంగాణ!

ఇచటి కొలువులు మనవె
ఇచటి నిధులును మనవె
ఇచటి నీళ్ళును మనవె
నా తెలంగాణ!

దౌర్జన్య నాశకము
సౌజన్య పోషకము
సందీప్త భాజకము
నా తెలంగాణ!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

బుధవారం, డిసెంబర్ 11, 2013

ఆశ...దోశ...అప్పడం...వడ...


సమైక్యాంధ్రయె వలయునంచును
తెలంగాణము బిల్లు వచ్చిన
అసెంబ్లీలో ఓడజేతుమ
టంచు పలుకకయా!

బిల్లు వచ్చిన చర్చ సేయుడు!
రాదు ఓటింగునకు నదియే!
ఆర్టికలు మూడునను నిదియే
చెప్పబడెనయ్యా!

అవిశ్వాసమదేమియైనను
పార్లమెంటున తెలంగాణము
బిల్లు పెట్టుట తథ్యమయ్యా!
కండ్లు తెరువుడయా!

గౌరవము కాపాడుకొని మీ
రిట్టి బిల్లును చర్చ సేయుడు!
పెద్దరికమును నిలుపుకొనుడయ!
వెలిగిపోవుడయా!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

మంగళవారం, డిసెంబర్ 10, 2013

గాలిని పిడికిట్లో బంధించగలరా?

  

సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర
సమైక్యాంధ్ర అనగానే
సమైక్యాంధ్ర అవుతుందా?
దీనర్థం మీకు తెలుస?

తెలంగాణ అరువదేండ్లు
కష్టాలను ఎదుర్కొంది!
రాష్ట్రం కావాలన్నది!
మీకందరికిది తెలుసును!

అజ్ఞానం కారణముగ
దోపిడీకి గురియైనది!
మోసాలను తెలుసుకొనీ
రాష్ట్రం కావాలన్నది!

దోపిడీకి రుచిమరిగిన
దొంగలు దోచగ దానిని
రాష్ట్రం కాకుండా అడ్డి,
దౌర్జన్యం చేయుచుండ్రి!

పోరాటం ఫలితంగా,
బలిదానం ఫలితంగా,
కేంద్రము ప్రకటించెను
తెలంగాణ నవరాష్ట్రము
త్వరలోనే చేసెదమని!

ఇంత చరిత్రము ఉన్న
తెలంగాణ ఈ దశలో
సమైక్యాంధ్ర అనగానే
తోక ఊపి వస్తుందా?

స్వార్థపరుల మోసాలకు
మరల మరల గురియౌనా?
మీ గారడి వేషాలకు
తెలంగాణ బలియౌనా?

రాష్ట్రం విడిపోవునయా,
రెండు రాష్ట్రములుగ మారు!
రెంటిని అభివృద్ధి పరుప
ప్రణాళికల రచియింపుడు!
ఉద్యమాలు మానుడు!
అభివృద్ధిని సాధింపుడు!!


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


సోమవారం, డిసెంబర్ 09, 2013

కర్రు కాల్చి వాత పెడతారు!



నాల్గు రాష్ట్రాలందు కాంగ్రెసు
శృంగ భంగమ్మాయె నిప్పుడు!
కారణమ్మెదియౌనొ తెలియగ
బూనుకొనుడయ్యా!

ఎన్నియో అభివృద్ధి కరమగు
సేవలను అందించినామని
జబ్బచరువకు! పేదప్రజకవి
అందలేదయ్యా!

అట్లె ఇప్పుడు తెలంగాణలొ
బడుగు ప్రజలిపుడడుగుతున్నది
ఆంక్షలేనిది అచ్చమైనది
తెలంగాణమ్మే!

హైదరాబాద్ పైని ఆంక్షలు
పెట్టకుండా, శాంతిభద్రత
తెలంగాణకు అప్పగించుట
సముచితమ్మయ్యా!

అప్పులను పంపకము ప్రాజె
క్టులకు చేసిన ఖర్చు ఆధా
రముగ జేయుడు! లేనిచో అది
దోషమే సుమ్మీ!

ఆస్తులవి నైజాము ప్రభువుల
కాలపువి మరి తెలంగాణవె!
ఢిల్లి ఏ.పీ. భవనమే మా
తెలంగాణదయా!

గతములో ఇట అక్రమముగా
కొలువులంది, రిటైరులందిన
ఆంధ్ర వారికి పెన్షనిచ్చుట
ఆంధ్రరాష్ట్రముదే!

నేడు కూడా అక్రమముగా
కొలువులందిన ఆంధ్రవారల
నాంధ్రకే బదిలీలు చేయగ
వలయునోయయ్యా!

ఇచటి ఉన్నత విద్యలందున
రిజర్వేషను పాతపద్ధతి
జరుపబూనుట అక్రమమ్మే!
మార్పుచేయుడయా!

ఆరు నూరైన నిక ఆంధ్రకు
తెలంగాణకు పొత్తు పెట్టుట
ఓర్చుకొనము, సహింపబోము!
పొత్తు వలదయ్యా!

ఎవరి హైకోర్ట్ వారికే యుం
డంగ వలెనయ! పొత్తులున్నచొ
తెలంగాణకు నష్టమగునయ!
వేరు చేయుడయా!

ఇర్వదెనిమిది రాష్ట్రములలో
కేంద్ర రాష్ట్రము బంధమెట్టుల
నుండెనో, తెలగాణకట్టుల
ఉండవలెనయ్యా!

అరువదేడుల నుండి ప్రజలిట
కోరుచుండిన తెలంగాణము
ఆంక్షలును లేకుండ నిత్తుర,
లేక ఓడుదురా?

తెలంగాణా ప్రజల కోరిక
తీర్చకుండిన ఓడిపోదురు!
న్యాయమీయుడు! గెలుపు పొందుడు!
వెలిగిపోవుడయా!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, డిసెంబర్ 08, 2013

మళ్ళీ అవే కూతలు!


తెలంగాణ రాష్ట్ర మిడగ
కేంద్రము సమకట్టగాను,
అసెంబ్లీకి బిల్లు రాగ
నోడింతుమనంగ నేల?

బిల్లు పైన చర్చ జరిపి,
కేంద్రమునకు పంపకుండ,
ఓటింగును జరిపెదనని
బీరమ్ములు పలుక నేల?

రాజ్యాంగములోని ఆర్టి
కలు మూడు ప్రకార మిపుడు
చర్చ చేయవలెను గాని,
ఓటింగ్ అనవసరమె కద!

తెలంగాణ రాష్ట్ర మిడిన
నక్సలైట్లు పెరిగెదరని
ప్రతి చోటను ప్రతి పూటను
మరల మరల వాగ నేల?

నీవుండే సొంత జిల్ల
చిత్తూరున ఉన్నయట్టి
పుత్తూరున ఉగ్రవాదు
లుండి తిష్ఠ వేయలేదె?

హైద్రబాదులోన బాంబు
ప్రేలుళ్ళరికట్టావా?
నీ పాలనలో జరిగిన
ఉగ్రవాదమాపావా?

తెలంగాణ నీళ్ళు దోచి, 
రాష్ట్రమేర్పడంగానే,
నీటి గొడవ లొస్తాయను
నంగనాచి కబుర్లేల?

తెలంగాణలో విద్యుత్
ప్లాంట్ల నేల పెట్టలేదు?
ఆంధ్రలోనె పెట్టగాను
మోసము చేయుట కాదా?

తెలంగాణ “కొలువు”లన్ని
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలంగాణ “వనరు”లన్ని
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలంగాణ “నిధు”లన్నియు
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలంగాణ “నీళ్ళ”న్నియు
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలంగాణ “భూము”లన్ని
దోచుకొనగ కుదుర దనియె
రాష్ట్ర మడ్డుకొందు నంచు
పలుకుచుంటి విది న్యాయమె?

తెలగాణను నష్టపరచి,
రాష్ట్రమేర్పడిన నష్టము
కలుగునంచు దొంగ ఏడ్పు
లేడ్వంగనె సరియౌనే?

సీమాంధ్రకు మేలుచేయు
పనులెన్నో చేయలేదె?
ఆరువేల కోట్లు నీవు
చిత్తూర్ కొనిపోలేదే?

ముఖ్యమంత్రి మాటలివా?
సీమాంధ్రుని మాట గాని!
నీతి గలుగు చేతలివా?
నీతి లేని పనులు గాని!

కల్లబొల్లి ఏడ్పులాపి,
అడ్డుపడే చేత లాపి,
అబద్ధాల కూత లాపి,
నీతిలేని కుట్ర లాపి,
అరువదేండ్ల కాంక్షయైన
తెలంగాణ రాష్ట్రానికి
స్వాగతమ్ము పలుకవయా!
హుందాగా ఉండవయా!
ఘనతను నువు పొందుమయా!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, డిసెంబర్ 07, 2013

ఉపేక్షిత వీణ!


 
(1)
ధన్యు లమర వీరుల ఘన త్యాగ జనిత
నవ్య తెలగాణ రాష్ట్ర మీ నాణ్య ఫలము!
శశ్వ దంచిత విభవ విశాల హ్రదము
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(2)
ఘనత నాంధ్ర ప్రదేశానఁ గలుపఁ బడియు,
మోసగింపఁగఁబడి, యెన్నొ యాసలఁ జెడి,
యణఁగి పోయియు, నెగసిన యాద్య వరము
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(3)
మన తెలంగాణ జే.ఏ.సి. ఘనత ఫలిత,
మీ తెలంగాణ రాష్ట్ర సమితి విశేష
కృషియు, బీ.జే.పి. వంటి నిశ్శ్రేణు లమర;
నిలిచి యెదిగిన దీప్త సుస్నిగ్ధ యశము
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(4)
అఱువ దేఁడుల త్యాగాల కాలవాల
మగుచుఁ జిర సుప్రతీక్షితమైన కృతము!
కాంగ్రెసున సోనియమ్మకు కలల పంట
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

(5)
సకల జనుల యుద్యమ సమాశ్రయమునందు
రూపు దిద్దిన తెలగాణ దీప మిపుడు
వెలుఁగు నింపుచు మన బ్రతుకులను దిద్దు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ!

జై తెలంగాణ!  జై జై తెలంగాణ!

శుక్రవారం, డిసెంబర్ 06, 2013

తెలంగాణ ద్వితీయ విజయం!



(1)
శ్రీలు పొంగెడి తెలగాణ సీమ నేఁడు
మోద వార్ధి నిర్మగ్నయై మురిసిపోయె!
దీర్ఘకాలిక స్వప్న ప్రదృష్టమాయె!
మన తెలంగాణ బిల్లు కేబినెటు మెచ్చె!! 



(2)
హైద్రబాదుతోఁ గూడిన యట్టి రాష్ట్ర
మీయఁగా సమ్మతిని దెల్పె న్యాయముగను! 
పదియు జిల్లాల తెలగాణ భద్రముగను 
వచ్చు నో సోదరా, వేగ వరము లిడఁగ! 



(3)
మా తెలంగాణ ప్రజలకు మన్ననమునఁ
బదియు జిల్లాల తెలగాణఁ ద్వరగ నిడఁగఁ 
బలు విధమ్ములఁ జర్చల వఱలు కతన, 
ధన్యవాదాలు జీవొయం మాన్యుల కివె! 



(4)
పదియు జిల్లాల తెలగాణఁ బఱఁగ నిడియు,
హైద్రబాద్ శాంతి భద్రతలన్ని కేంద్ర
హస్తమందుంచుకొన దుస్సహమ్ము మనకు!
శాంతి భద్రతల్ మనచేతఁ జక్కఁ బడవె?



(5)
విద్యలందు యథాస్థితి వెలయు ననఁగ,
మన తెలంగాణ కన్యాయ మగును గాన,
సత్వరముగను మన విద్య, శాంతి భద్ర
తలను గూర్చి పోరున కిప్డు తరలి రండు!



(6)
కేంద్ర ప్రకటన మాత్రాన గేహ మలికి,
పండుగలఁ జేసికొనఁగాను వల దటంచు 
మనసు బోధించుచున్నది! మనకు రాష్ట్ర 
మేర్పడెడు దాఁక నిత్యము హితముఁ గోరి, 
యెదిరి కదలికల్ దెలివితో నెఱుఁగ వలయు! 
దానఁ దెలగాణ రాష్ట్రావతరణ మగును!!



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

గురువారం, డిసెంబర్ 05, 2013

తెలివి మీ ఒక్కరి సొత్తా?




రాయల తెలగాణము ప్రతి
పాదనమును తెచ్చుటలో
సీమాంధ్రుల లాబీయింగ్
కుట్ర దాగి యున్నదయా!

***

రాజధాని రేసునుండి
కర్నూలును తప్పించుట!
సీమ మరియు తెలంగాణ
అస్తిత్వము కూల్చివేత!
తమ అధికారము నంతట
సుస్థిరమ్ము చేసికొనుట!
కృష్ణా జల దోపిడీని
అధికారికముగ జేయుట!
టీయారెస్ వైసీపీ
టీడీపీలను అణచుట!
కిరణ్ దూకుడరికట్టియు
మార్గము సుగమము చేయుట!
సీమాంధ్రుడ! తెలివి నీదు
ఒక్కని సొత్తా? చెప్పుము!

***

రాయల తెలగాణమిడిన
కాంగ్రెస్సే మరణించును!
తెలంగాణ మెడకదియే
గుదిబండగ మారిపోవు!
కావున ఓ కేంద్రమ్మా!
ఆపుమిట్టి అరాచకము!

***

ఏ ఆంక్షలు లేనియట్టి
భద్రాచల మునగాలల
హైద్రబాదులతొ గూడిన
పదిజిలాల తెలంగాణ
రాష్ట్రము ప్రకటించకున్న
కాంగ్రెస్ భూస్థాపితమ్ము
తథ్యము, తథ్యము, తథ్యము!
తెలంగాణమందు మరో
మహా ఉద్యమమ్ము సాగు!
ప్రతి ఒక్కడు కోటిమంది
సమానమై పోరాడును!
“తెలంగాణ, తెలంగాణ,
తెలంగాణ జై” అంటూ
ఎలుగెత్తియు నినదించుచు
ఉద్యమమును నడిపించును!

***

తెలంగాణమిస్తారా?
భూస్థాపితమౌతారా?
తేల్చుకొనుడు! తేల్చుకొనుడు!
వేగముగా తేల్చుకొనుడు!



జై తెలంగాణ! జై జై తెలంగాణ!


బుధవారం, డిసెంబర్ 04, 2013

అమ్మా! దుఃఖించకు తల్లీ!


ఉత్పలమాల:
నీతి నిజాయితిన్ విడచి నేతలు చేరి స్వలాభ కాములై
యీ తెలగాణ రాష్ట్ర సుజనేప్సితమున్ విడనాడి యిత్తఱిన్
మాతరొ! నీకు స్వేచ్ఛనిడ మానిరి! యెన్నడు స్వేచ్ఛనందుటో?
ఓ తెలగాణ మాత! మము నోమఁగఁ జూడు దయార్ద్ర చిత్తవై!

కందము:
ఘడియ కొక మాట మార్చుచు,
పిడివాదముతోడఁ గష్టపెట్టఁగఁ, గంటన్
దడిఁబెట్ట వలదు తల్లీ!
వడిగాఁ దెలగాణ వచ్చు! వచ్చును సుఖముల్!

ఆట వెలఁది:
మూర్ఖులుండి రచట! మోసమ్ముఁ గూర్పంగఁ
బూనఁగాను, మేము పోరు సలిపి,
నిన్ను వేగఁ దెచ్చు నిష్ఠతో నుంటిమి!
కంట నీరు పెట్టఁగాను వలదు!!

తేఁట గీతి:
మోసకారుల, నీచుల మూర్ధములను
నీదు పాదాల పైఁబడ నేర్పుఁ జూపి,
బుద్ధి నేర్పెద మో తల్లి పోరు సలిపి!
ఓటుతో నిన్నుఁ దెచ్చెద మోర్పు తోడ!!

పంచచామరము:
బిరాన రాఁగ నుంటివమ్మ! వేదనమ్ము మానుమా!
స్వరమ్ము మార్చువారిలోని స్వార్థమున్ బెకల్చియున్;
వరోగ్ర భీకరాకృతిన్, జవమ్ముఁ బూని, శీఘ్రమే
పరాక్రమోద్యమమ్ముఁ జేయ, భవ్య రాష్ట్ర సాధ్యమౌ!

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

మంగళవారం, డిసెంబర్ 03, 2013

మేమడిగింది ఇదా?


మొదటినుండి తెలంగాణ
అడుగునట్టిదౌ రాష్ట్రము
ఆత్మగౌరవ ప్రదమ్ము
తెలంగాణ నీయకుండ
కేంద్ర మొకటి తలచి యిపుడు
“రాయల తెలగాణ” యన్న
రాష్ట్రమ్మును ఈయబూన
గా నేమనగా వలెనయ?
*
కర్ర విరుగకుండ పాము
చచ్చుటెట్లు కుదురునయా?
కాలికేస్తె మెడకు వేసి,
మెడకేసిన కాలికేసి,
సమస్యను జటిలముగా
చేయబూన నేమనవలె?
*
ఎవరి ఉద్యమమ్ము వల్ల
కేంద్రమ్మిది పూనెనో,
ఆ ప్రత్యేకమ్మైన యట్టి
తెలంగాణ మీ దలచియు
సీ డబ్ల్యు సి మీటింగ్ లో
హైదరబాదుతొ గూడిన
పది జిలాల తెలంగాణ
ప్రకటనమ్ము జేసి యిపుడు
ప్రజలకాంక్ష ప్రక్కన నిడి,
రాజకీయమును జేతురు!
తాదూరగ కంత లేదు
మెడకో డోలన్నట్లుగ,
మా తెలగాణమ్మునకును
“రాయల” తగిలించుటేల?
*
ఇదియంతయు కోస్తాంధ్రుల
లాబీయింగ్ కుట్ర సుమా!
అటు రాయలసీమాంధ్రుల
ఇటు తెలగాణంపు జనుల
అస్తిత్వము కూల్చునట్టి
లాబీయింగ్ కుట్ర సుమా!
అడగనిదే అమ్మయైన
అన్నమునే పెట్ట దనగ,
అడుగనిదే యిట్లు సేత
కుట్రలోన భాగము కద!
*
అస్తిత్వము గూల్చునట్టి
ఈ చర్యను ఒప్పుకొనము!
“తెలంగాణ” మా కీయుడు,
అస్తిత్వము నిలబెట్టుడు!
మా అస్తిత్వమ్మిడనిచో
మీ అస్తిత్వము కూలును!
“తెలగాణ” మ్మీయనిచో
“కాంగ్రెస్” చచ్చుట ఖాయము!
*
తేల్చుకొనుడు, తేల్చుకొనుడు,
తెలంగాణొ? మరణమో?
తేల్చుకొనెడి తరుణమిదే,
తేల్చుకొనుడు, తేల్చుకొనుడు!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

సోమవారం, డిసెంబర్ 02, 2013

హైద్రాబాద్ పై పూర్తి అధికారం తెలంగాణకే ఉండాలి!


తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదే!
తాత్కాలిక రాజధాని హైదరబాదును చేసిన
ఐదేండ్లలొ సీమాంధ్రులు రాజధాని కట్టగవలె!
సీమాంధ్రుల రాజధాని అద్దెయిల్లె అగును సుమా!
హైదరబాద్ పైనను మరి ఆంధ్రవాళ్ళ కేహక్కులు,
అధికారము, అజమాయిషి ఉండరాదు, ఉండరాదు!(1)

సీమాంధ్రుల కుట్ర తెలిసికొని భగ్నము చేయుడయ్య!
కుతంత్రాల వలలో పడిపోక న్యాయ మిడుడయ్యా!
హైదరబాదును యూటీ చేసిన మేమొప్పుకొనము!
జీ.హెచ్.ఎం.సీ. పరిధి గవర్నర్ పాలన వలదయ!
సీమాంధ్రులతో మాకును ఎట్టి పొత్తు వలదయ్యా!
వేరు వేరు గవర్నర్ల నియమింపగ వలెనయ్యా! (2)

హైద్రబాదుపైన తెలంగాణకె హక్కుండాలి!
కేంద్రమో, గవర్నరో అజమాయిషి చేయరాదు!
పరుల పాలనమ్మునందు హైద్రబాదు ఎట్లుండును?
అరువదేండ్లు పోరాడిన దిందుకోసమేనా?
తెలంగాణ రాష్ట్రపు పరిపాలన మా హక్కయ్యా!
ఆత్మగౌరవము గల్గిన అధికారమ్మిడుడయ్యా! (3)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

ఆదివారం, డిసెంబర్ 01, 2013

రాయల తెలంగాణకు మేం ఒప్పుకొనే ప్రసక్తే లేదు!



“పది జిల్లాలతొ కూడిన కేవల
తెలగాణమ్మును ఇచ్చెదమయ్యా!
హైదరబాద్ మీ తెలంగాణదే!” 
అనుచును కేంద్రము ప్రకటన చేసియు, 
సీమాంధ్ర నాయకుల లాబీతో 
రాయల తెలగాణము నిచ్చెదమని 
మాయలు పన్నుట సబబేనా? 
మమ్ముల దోచిన వారినె మళ్ళా 
మాతో కలుపుట సబబేనా? 

మా అస్తిత్వము మాకు కావలెను!
మా ప్రాంతీయుల కోరిక యిదియే!

“అసెంబ్లీ పార్లమెంటు సీట్లను
రెండు వైపులా సమము చేయుటకు
రాయల తెలగాణమ్మే యుక్తము!”
అనగ తగదయా! నీతి కాదయా! 

భారతదేశమ్మందున నుండిన
యితర రాష్ట్రములతో సమమ్మగునె?
రాష్ట్రములన్నీ సమముగ నున్నవె?
సమము సమమ్మన, సమమే దిచ్చట? 

అఱువది యేడులు మ్రగ్గితిమయ్యా!
సీమాంధ్రులె మము దోచి రెంతయో!
అట్టివారలే మాతో కలియుట 
పాలించుటకే! దోచుకొనుటకే! 
మఱల మఱల ఇక మాకన్యాయము 
చేయుట కేంద్రమునకు తగదయ్యా! 

రాయల తెలగాణమ్ము పేరిటను
మాయలు చేయుట మానండయ్యా!
కుట్రలు చేయుట మానండయ్యా! 
తెలంగాణ అస్తిత్వము నిప్పుడు 
దెబ్బతీయుట తగదు తగదయా! 

హైద్రబాదుతో కూడినట్టిదౌ
పదియు జిల్లాల తెలంగాణమే
మాకు కావలెను! మాకు కావలెను! 
వేరే దేనిని ఒప్పుకోమయా! 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

రాయల తెలగాణమ్ము పేరిటను మాయలు చేయుట మానండయ్యా!



“పది జిల్లాలతొ కూడిన కేవల
తెలగాణమ్మును ఇచ్చెదమయ్యా!
హైదరబాద్ మీ తెలంగాణదే!” 
అనుచును కేంద్రము ప్రకటన చేసియు, 
సీమాంధ్ర నాయకుల లాబీతో 
రాయల తెలగాణము నిచ్చెదమని 
మాయలు పన్నుట సబబేనా? 
మమ్ముల దోచిన వారినె మళ్ళా 
మాతో కలుపుట సబబేనా? 

మా అస్తిత్వము మాకు కావలెను!
మా ప్రాంతీయుల కోరిక యిదియే!

“అసెంబ్లీ పార్లమెంటు సీట్లను
రెండు వైపులా సమము చేయుటకు
రాయల తెలగాణమ్మే యుక్తము!”
అనగ తగదయా! నీతి కాదయా! 

భారతదేశమ్మందున నుండిన
యితర రాష్ట్రములతో సమమ్మగునె?
రాష్ట్రములన్నీ సమముగ నున్నవె?
సమము సమమ్మన, సమమే దిచ్చట? 

అఱువది యేడులు మ్రగ్గితిమయ్యా!
సీమాంధ్రులె మము దోచి రెంతయో!
అట్టివారలే మాతో కలియుట 
పాలించుటకే! దోచుకొనుటకే! 
మఱల మఱల ఇక మాకన్యాయము 
చేయుట కేంద్రమునకు తగదయ్యా! 

రాయల తెలగాణమ్ము పేరిటను
మాయలు చేయుట మానండయ్యా!
కుట్రలు చేయుట మానండయ్యా! 
తెలంగాణ అస్తిత్వము నిప్పుడు 
దెబ్బతీయుట తగదు తగదయా! 

హైద్రబాదుతో కూడినట్టిదౌ
పదియు జిల్లాల తెలంగాణమే
మాకు కావలెను! మాకు కావలెను! 
వేరే దేనిని ఒప్పుకోమయా! 

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!