గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఆగస్టు 29, 2015

ఏపీ పుస్తకాల్లో తెలంగాణ నిషేధం

AP-txt


సమైక్యాంధ్ర నినాదాల డొల్లతనం వెల్లడైంది. తెలుగుతల్లి అంటూ వాదనలు చేసినవారి బండారం నగ్నంగా బయటపడింది. నిన్నటిదాకా తెలంగాణ-ఆంధ్ర రెండు కండ్లు అన్న పెద్దమనిషి నేతృత్వంలోని అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని 6నుంచి 10 వ తరగతి పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ గుర్తులన్నీ చెరిపివేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అవశేష ఆంధ్రప్రదేశ్‌గా మారిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో తొలగించవలసిన పాఠాలు, పాఠ్యాంశాల జాబితా ఒకటి విడుదల చేసింది.


-ఇక్కడి కవులు, సంస్కృతుల పాఠాలకు మంగళం
-హైదరాబాద్ చరిత్ర కూడా తొలగింపు
-రెండు కండ్ల రాజ్యంలో ఇక ఒంటి కన్ను చదువే!
సదరు జాబితాలో ఉన్నవన్నీ తెలంగాణ అంశాలే కావడం గమనార్హం. వీటి ప్రకారం నిన్నటిదాకా తెలుగు వైతాళికులు అని తామే కీర్తించిన తెలంగాణ నాయకుల పాఠాలను తొలగించారు. విశాలాంధ్ర కోసం పదవీత్యాగం చేసిన బూర్గుల పాఠం అవసరం లేదన్నారు. కవులకు ప్రాంతీయభేదాలా? అంటూ రచ్చరచ్చ చేసిన పెద్దలు తెలంగాణవాడన్న కారణంగా బసవేశ్వరుడి పాఠం నిష్కర్షగా తీసేశారు. చివరికి నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పేరుపొందిన సరోజినీనాయుడు రాసిన ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ పద్యానికి సైతం అదే దుస్థితి ఏర్పడింది. 19వ శతాబ్దం తొలిపాదంలో పాశ్చాత్య దేశాలను సైతం ముగ్ధులను చేసిన ఈ గీతం ఏపీకి కేవలం హైదరాబాద్ స్థానికంగా కనిపించింది. 


ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీలు, మన దేశంలోని సివిల్ సర్వీస్ సిలబస్‌లోనూ చోటు చేసుకున్న ఈ పద్యరాజం వాళ్లకు పనికి రావడం లేదు. ఒక్క తల్లి బిడ్డలం అంటూ ఆరు దశాబ్దాలు చెప్పుకుంటూ బతికినవాళ్లకు ఇపుడు తెలంగాణ మాండలికం అర్థం కావడం లేదట. అందుకని సదరు పాఠాలు వద్దట. ఆఖరుకు సింగరేణి గనుల ప్రస్తావన కూడా వాళ్లు సహించమని అంటున్నారు. 


ఏపీ తొలిగించిన తెలంగాణ పాఠాలు..ఏపీ పదవ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో అలిశెట్టి ప్రభాకర్ రాసిన నగరగీతం, పీపీ నరసింహారావు రచించిన నేనెరిగిన బూర్గుల, పాలకుర్తి సోమన రచించిన బసవకళ్యాణం తొలగించారు. తొమ్మిదో తరగతిలో వట్టికోట అళ్వార్‌స్వామి రాసిన చిన్నప్పుడే అనే పాఠం ఎత్తేశారు. అలాగే తెలంగాణ కవులు రాసిన మన సంస్కృతి, బాల్య క్రీడలు అనే పాఠాలు రద్దు చేశారు. ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో ఖనిజాలు, గనుల తవ్వకం అనే పాఠంలో సింగరేణి బొగ్గు గనులు పాఠం తీసివేశారు. సింగరేణి బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదకు సంబంధించినది కాదు అనే కారణాన్ని చూపించారు.


బ్రిటిష్, నిజాంల పాలనలో భూస్వాములు, కౌలుదారులు అనే పాఠంలో హైదరాబాద్ దొరల ప్రస్తావన ఉందంటూ దాన్ని తొలగించారు. తెలంగాణ ఉద్యమం గుర్తుకు తెస్తుందనేమో వలసపాలిత ప్రాంతాలలో విముక్తి ఉద్యమాలు అనే సార్వజనీన పాఠం కూడా తీసేశారు. ఎనిమిదవ తరగతి తెలుగు వాచకంలో చిన్నప్పుడే అనే పాఠాన్ని ఏపీ స్థానికతకు సంబంధం లేదని కారణం చూపుతూ తొలిగించారు. ఎనిమిదవ తరగతి ఉపవాచకంలో హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం తమ రాష్ర్టానికి సంబంధం లేదంటూ పక్కనబెట్టారు. ఇక తొమ్మిదవ తరగతి ఉపవాచకంలో ఉన్న కాపు రాజయ్య, మిద్దెరాములు పాఠాలు కూడా తీసేశారు. అరవ తరగతి ఇంగ్లీష్‌లో ఉన్న ఇన్ ది బజార్ ఆఫ్ హైదరాబాద్ అనే సరోజినీ నాయుడు పద్యాన్ని కూడా తొలిగించినట్లు ఏపీ ఎస్‌సీఈఆర్‌టీ తయారు చేసిన నివేదికలో పేర్కొన్నారు. 


తెలంగాణ సిలబస్‌లో సార్వజనీనత..తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్యాంశాల్లో మార్పులు తెచ్చింది. అయితే ఈ విషయంలో విశాల దృక్పథాన్ని చూపించింది. తెలుగు భాష అంశానికి సంబంధించి మహా కవుల ఎంపికలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని విస్మరించలేదు. ఆ ప్రాంతానికి చెందిన కవులు, వారి రచనలను కూడా తెలంగాణ పాఠ్యాంశాల్లో చేర్చారు. మన తెలుగు పుస్తకాల్లో నన్నయ్య, గుర్రం జాషువా, గురజాడ అప్పారావు, చేమకూర వేంకట కవి, శ్రీనాథుడు, వేమన, సుమతి తదితర శతకాలనుంచి పద్యాలు, గద్యభాగాలు తెలంగాణ పాఠాల్లో చోటు దక్కించుకున్నాయి.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



గురువారం, ఆగస్టు 27, 2015

తెలంగాణ వాదన వింటాం...!!!

supreme.court


కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణ వాదనలు, అభిప్రాయాలను తప్పక వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. అందుకు అవకాశం తప్పక ఇస్తామని తెలిపింది. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి.


-కృష్ణా జలాల పిటిషన్లపై సుప్రీంకోర్టు..
  తెలంగాణ పిటిషన్‌పై స్పందించాలని కేంద్రానికి ఆదేశం
- నాలుగు రాష్ర్టాల మధ్య వాదనలు జరగాలి..
  లేదంటే రాష్ట్రం ఏర్పడి ప్రయోజనమేమున్నది?
-రాష్ట్ర న్యాయవాది వైద్యనాథన్ వాదనలు
-వ్యతిరేకించిన మహారాష్ట్ర న్యాయవాది
- విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా
-బ్రిజేశ్ ట్రిబ్యునల్‌లో ఖాళీ పోస్టును
  కేంద్రం భర్తీ చేయకపోవడంపై సుప్రీం ఆగ్రహం
అందరి వాదనలు విన్న జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ భానుమతితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలంగాణ తనకు జరిగిన అన్యాయం గురించి అడుగడంలో తప్పు లేదని అయితే, ప్రస్తుతం నీటి కేటాయింపులపై వెలువడిన ట్రిబ్యునల్ ఉత్తర్వుల లోతుల్లోకి వెళ్లడం లేదని వ్యాఖ్యానించింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, అలా ఏర్పడితే మళ్లీ నాలుగు రాష్ర్టాల వాదనలు మొదటినుంచి ప్రారంభించాల్సి ఉంటుందని జస్టిస్ దీపక్‌మిశ్రా అభిప్రాయపడ్డారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఖాళీ అయిన పోస్టును భర్తీ చేయడంపై సమాధానం ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి కేంద్రాన్ని ఆదేశించారు.


తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానాన్ని, ట్రిబ్యునల్‌లో పోస్టు భర్తీపై వివరణను వచ్చే నెల 10వ తేదీకల్లా కోర్టుకు తెలియజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేశారు. కృష్ణా జలాల పంపిణీపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2013లో ఇచ్చిన తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు, తెలంగాణ దాఖలు చేసిన రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు, కర్ణాటక దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్, తెలంగాణ తాజాగా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. 



తొలుత తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం (1956)లోని సెక్షన్ 3 ప్రకారం కేంద్ర జలవనరుల శాఖకు గత సంవత్సరం జూలై 14వ తేదీన ఫిర్యాదు చేశామని, సంవత్సరంలోగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నదని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఆ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం సుప్రీంకోర్టులో ఇటీవలనే మరో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశామని కోర్టు దృష్టికి తెచ్చారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని చెప్పారు. రాష్ట్ర అవసరాల గురించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎప్పుడూ వాదనలు వినిపించే అవకాశమే రాలేదని పేర్కొన్నారు. 


అందువల్ల జలాల పంపిణీపై నాలుగు రాష్ర్టాల మధ్య వాదనలు జరగాలని, ఆ తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని వాదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కూడా తమ రాష్ట్రం తరఫున వాదనలను బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు ఉంచామని, విచారణ సందర్భంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. దీనికి జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ, సెక్షన్ 89 ప్రకారం జరగాల్సిన ప్రక్రియ కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు సంబంధించినది మాత్రమేనని, కానీ మహారాష్ట్ర, కర్ణాటక అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయని అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకకు కేటాయించిన నీటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటాను డిమాండ్ చేయరాదని వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన రాష్ట్ర న్యాయవాది వైద్యనాథన్, కేంద్ర ప్రభుత్వం తమ ఫిర్యాదుకు ఇప్పటివరకూ సమాధానాన్ని ఇవ్వలేదని గుర్తుచేస్తూనే, 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంగనాథన్ ఉన్న సమయంలో నదీ జలాల వివాదాలకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు, వెలువరించిన ఉత్తర్వులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఏకే సంఘీ బదులిస్తూ, త్వరలోనే సమాధానమిస్తామని తెలిపారు.


ఉమ్మడి రాష్ట్ర జలాలను పంచుకోవాలి..


బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది ఉత్తర్వులను ఇచ్చి రెండేండ్లవుతున్నా అమలులోకి రాకుండా పిటిషన్ల రూపంలో ఆటంకాలు ఎదురవుతుండడం దురదృష్టకరమని మహారాష్ట్ర తరఫున వాదనలు చేసిన సీనియర్ న్యాయవాది అంద్యార్జున అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే రెండు ట్రిబ్యునళ్ల ఉత్తర్వులు వెలువడ్డాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో ఈ అంశాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిశీలించిందన్నారు. అందువల్లనే పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 89ని పేర్కొన్నదని, దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటినే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు పంచుకోవాల్సి ఉంటుందన్నారు. 


ఈ కారణంగానే ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేండ్లు పొడిగించిందని, ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులను కూడా రెండో ట్రిబ్యునల్ చేసిందని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం జలాల పంపిణీకి సంబంధించి మళ్లీ నాలుగు రాష్ర్టాల మధ్య వాదనలు జరగాలని, పునః పంపకాలు జరగాలని కోరితే.. మళ్లీ మొదటికి వస్తుందని అన్నారు. నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్ 5(2), (3) కేవలం మూడు రాష్ర్టాలకు సంబంధించినదేనని, ఎక్కువ కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికే వెళ్లాయని, తెలంగాణ వాదనను ఎప్పుడూ వినలేదని, ఇప్పుడు తెలంగాణ వాదించడం సమంజసం కాదని అన్నారు. రెండు వాదనలను విన్న జస్టిస్ దీపక్ మిశ్రా, వివిధ రాష్ర్టాలు (తెలంగాణ) వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లు విచారణార్హం కాదని గత విచారణ సందర్భంగా మహారాష్ట్ర వాదించిందని, అయితే ఈ పిటిషన్లను వేసిన రాష్ర్టాలకు వాటివాటి అభ్యంతరాలు, వాదనలు ఉన్నాయని, ఇవి విచారణకు అర్హమైనవేనని వ్యాఖ్యానించారు.


ఖాళీ పోస్టును భర్తీ చేయండి..


ముగ్గురు సభ్యులున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఒకరు రాజీనామా చేశారని.. ఇంకా ఆ పోస్టును కేంద్రం భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సంఘీని ప్రశ్నిస్తూ, ట్రిబ్యునల్‌లో ఖాళీ పోస్టును ఎప్పటిలోగా భర్తీ చేస్తారో వివరణ ఇవ్వాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ, ఈ విషయం తనకు తెలియదని, ప్రభుత్వంను అడిగి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను ధర్మాసనానికి తెలియజేస్తానని పేర్కొన్నారు. ఖాళీ పోస్టు భర్తీపై స్పష్టత ఇచ్చేందుకు గడువు ఇవ్వాలని కోరారు.


తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ తన వాదన కొనసాగిస్తూ.. నదీ వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తాము ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. గెజిట్‌లో పేర్కొనడంగానీ, ట్రిబ్యునల్‌కు ఆదేశాలు ఇవ్వడంగానీ, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు చొరవ తీసుకోవాల్సి ఉన్నా.. ఆ పని చేయలేదని అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన సెక్షన్-3 ఫిర్యాదుకుగానీ, ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న సెక్షన్ 89 పిటిషన్‌గానీ, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్లుగానీ ఇంకా ఎలాంటి ఉత్తర్వులు వెలువరించలేదని గుర్తు చేశారు. దీనికి జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ.. సెక్షన్-3లో చాలా పరిమితులు ఉన్నాయి. 41 ఏండ్ల క్రితం బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పుడు మళ్లీ వాదనలు నాలుగు రాష్ర్టాల మధ్య కొనసాగించాలని అంటే.. చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే మళ్లీ నాలుగు రాష్ర్టాల మధ్య వాదనలు జరగాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడ్డారు. 


రద్దయిన పాత షెడ్యూలు


ఇరు పక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. షెడ్యూలు ప్రకారం బుధవారం, గురువారం రెండు రాష్ర్టాలు వాటి అభిప్రాయాలు, వాదనలు వినిపించిన తర్వాత మరో రెండు రాష్ర్టాలు వచ్చే నెల 9, 10 తేదీల్లో వినిపించాల్సి ఉంది. బుధవారం విచారణ అనంతరం పాత షెడ్యూలు రద్దయింది. తదుపరి విచారణ వచ్చే నెల 10వ తేదీకి వాయిదా పడింది. ఆ విచారణకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేయడంపై సుప్రీంకోర్టుకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 


రాష్ట్రం ఏర్పడి ప్రయోజనం ఏమిటి..?


కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని, న్యాయమైన వాటా దక్కలేదని, అన్యాయాన్ని న్యాయస్థానాల్లో చెప్పుకోక మరెక్కడికి వెళ్తామని వైద్యనాథన్ ధర్మాసనానికి విన్నవించారు. రాష్ట్ర ఏర్పాటులో జలం ప్రధానమైన అంశమని, నీటి కేటాయింపులో న్యాయం జరగనప్పుడు, జరిగిన అన్యాయానికి పరిష్కారం ఎక్కడుందని ప్రశ్నించారు. ఇలా ఉంటే.. రాష్ట్రం ఏర్పడినా ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాలు చేయడంలేదని, కానీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తప్పనిసరిగా చెప్పుకోవాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా స్పందిస్తూ, తప్పనిసరిగా తెలంగాణ అభిప్రాయాలను న్యాయస్థానం వింటుందని, ఆ అవకాశం ఇస్తుందని, అయితే ప్రస్తుతం నీటి కేటాయింపులపై వెలువడిన ఉత్తర్వుల లోతుల్లోకి వెళ్ళడం లేదని వ్యాఖ్యానించారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పడితే నాలుగు రాష్ర్టాల మధ్య తొలినుంచి వాదనలు జరగాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!




మంగళవారం, ఆగస్టు 25, 2015

తెలంగాణ చైతన్య దీపిక...!!!


డాక్టర్ దేవులపల్లి రామానుజరావు 20వ శతాబ్దిలో ఐదు దశాబ్దాల కాలం భాషా సాంస్కృతిక వికాస యుగాన్ని శాసించారు. రేయింబవళ్లు పాటుపడ్డారు. తెలుగునాట రామానుజరావు కవి, రచయితలకు, పండితులకు తలలోని నాలుకగా మసలుకున్నారు. ఎక్కిన ప్రతీ వేదిక మీద కంచుకంఠంతో సారభూతమైన ప్రసంగాలు చేసి విమర్శకులను మెప్పించారు. కవిగా, వక్తగా, పత్రికా సంపాదకునిగా, బహుభాషావేత్తగా, విద్యావేత్తగా నిరంతరం బహుకార్యమగ్నులై సఫలజీవనం గడిపారు.


1942లో తెలంగాణ పేరుతో దినపత్రిక హైదరాబాద్ నుంచి వెలువడింది. ఆ పత్రిక సంపాదకవర్గంలో చేరమని కోరుతూ మాడపాటి హనుమంతరావు రామానుజరావుకు లేఖ రాశారు. అయితే అప్పటికే నాగపూర్‌లో న్యాయకళాశాలలో చేరడంవల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు.


నిజాం కాలంలో పాఠశాలలు తక్కువ. అక్షరాస్యత మరీ తక్కువ. మొత్తం జనాభాలో ఉర్దూ భాషీయులు పదిశాతమే అయినా నిజాం ఉర్దూను అధికార భాషగా అమలు పరిచారు. తెలుగు చదివే అవకాశాలులేవు. పైగా తెలుగు చదవడం, మాట్లాడటం నేరమన్నట్లు చూసేవారు. హిందువులు సైతం షేర్వానీ, పైజామా ధరించేవారు. ఇళ్ళలో, బంధుమిత్రులు, ఇతరులతో ఉర్దూలోనే మాట్లాడేవారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగును నిలబెట్టడానికి 1943మే 23న ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింది. తొలి అధ్యక్షులు లోకనంది శంకరనారాయణరావు. మలి అధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డి. దేవులపల్లి రామానుజరావు నాగపూర్‌లో న్యాయశాస్త్ర పట్టభద్రులై తిరిగిరాగానే ఆంధ్ర సారస్వత పరిషత్తులో సభ్యునిగా చేరారు. 


పరిషత్తు మొదటి వార్షిక సభలు వరంగల్ కోటలో తెలంగాణ తెలుగు ఆత్మగౌరవ ప్రదర్శకంగా జరిగాయి. ఉదయరాజు రాజేశ్వరరావు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా, కాళోజీ నారాయణరావు కార్యదర్శిగా ఉన్నారు. కోటలో కవి సమ్మేళనం కోసం వేసిన పందిరిని రజాకార్లు తగులబెట్టారు. అయినప్పటికీ జంకక యథావిధిగా కార్యక్రమం నిర్వహించుకోవటంలో రామానుజరావు చేసిన కృషి కీలకమైంది. ఆ సభల్లో ఆయన తెలంగాణలోని ప్రాచీన ఆధునిక సాహిత్యానికి సంబంధించిన పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాశరథి అక్కడే రామానుజరావుకు తొలిసారి పరిచయం కావడమే గాక ప్రదర్శనను ప్రారంభించి అభినందించారు.


నాగపూర్‌లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం చేస్తున్నకాలంలో పి.వి.నరసింహారావు రామానుజరావుకు సహాధ్యాయి. ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు, అవధానాలు, గ్రంథాలయాలు, నవలలు, పత్రికలు రామానుజరావును తెలుగు సాహిత్యం వైపు ఆకర్షించాయి. సికింద్రాబాద్‌లో సత్యహరిచంద్ర నాటక కర్త బలిజేపల్లి లక్ష్మీకాంతం గారిని కలుసుకున్నారు. ఆయన స్వయంగా ఒక పాత్ర ధరించి ప్రదర్శించిన ఆ నాటకాన్ని రామానుజరావు మిత్రులతో కలిసి వీక్షించారు. 1943లో ఆంధ్ర సారస్వత పరిషతుకు అనతికాలంలోనే రామానుజరావు కార్యవర్గ సభ్యుడై, 1949లో ఉపాధ్యక్షుడయ్యారు. పరిషత్తు పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా యావజ్జీవితం పరిషత్తు కోసం, తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం వెచ్చించారు. సారస్వత పరిషత్తు శాఖోపశాఖలుగా విస్తరించింది. రాష్ట్రేతర ప్రాంతాల్లో పరిషత్తు పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 


పరిషత్తు ఎన్నో గొప్ప గ్రంథాలను ప్రచురించింది. నిరంతరం సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. ప్రాచ్యకళాశాల, పండితశిక్షణ కళాశాల ఏర్పాటైంది.1953 జనవరిలో పరిషత్తు సప్తమ వార్షిక సభలు మూడు రోజులపాటు ఆలంపురంలో జరిగాయి. దేవులపల్లి రామానుజరావు పరిషత్తు అధ్యక్షుల హోదాలో సభలకు అధ్యక్షులయ్యారు. నాటి ఉప రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నుంచి శ్రీశ్రీ వరకు మహామహులైన కవి పండితులు సభల్లో పాల్గొన్నారు. చూడటానికి పొట్టివాడైనా సాహిత్యకృషిలో విరాణ్మూర్తిగా పేరుపొందిన రామానుజరావుకు ఈ కృషిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ రెండు భుజాలుగా, రెండు అద్భుత వేదికలుగా ఉన్నాయి.


దేశానికి స్వాతంత్య్రం రాగానే అన్ని రాష్ర్టాల్లో వలెనే 1957లో ఆంధ్రప్రదేశ్‌లోనూ సాహిత్య అకాడమీ ఏర్పడింది. మొట్టమొదట బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులుగా, విశ్వనాథ సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా, దేవులపల్లి రామానుజరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అధ్యక్షులు గొప్ప సాహితీవేత్త అయినా జాతీయస్థాయిలో బహుకార్య నిమగ్నులైవుండటం వల్ల ఆయన పనులను, తమ పనులను రామానుజరావే చూసేవారు. అకాడమీ పక్షాన శతాధిక గ్రంథాలు ముద్రించారు. ప్రముఖుల జయంతులు,వర్ధంతులు నిర్వహించారు. రచయితలు తమ పుస్తకాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సహాయం అందించేవారు. 


ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు బహూకరించేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే గోపాలరెడ్డి, రామానుజరావుల సారథ్యంలో సాహిత్యానికి నిత్యకళ్యాణం పచ్చతోరణంలా పండుగలు చేసేవారు. ఆయన తలపెట్టిన, నిర్వహించిన ఏ కార్యక్రమమైనా దిగ్విజయం కావలసిందే. విజయం కోసం రామానుజరావు చూపిన పట్టుదల, చేసిన పరిశ్రమ అలాంటిది. స్వయంగా ఏ సభలోనైనా, ఏ విషయం మీదనయినా క్లుప్తంగా, సారభూతంగా ప్రసంగించి పండితుల మెప్పుపొందే శక్తిమంతులు. 


తెలుగు, ఆంగ్లం, ఉర్దూ తదితర అనేక భాషల్లో పండితులు. సాహిత్యమే గాక రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాల గురించి సమగ్రమైన అవగాహన కలిగినవారు. స్వతంత్ర వ్యక్తిత్వం. ఎవరికీ లొంగేవారు కారు. ప్రజాస్వామ్యవాది. అధికారాన్ని ఎవరిపైనా చెలాయించక వస్త్వాశ్రయదృష్టితో వ్యవహరించేవారు. సాహిత్యంలో ఆనాటి పరిణామాలు, ధోరణులన్నీ ఆయనకు కరతలామలకం. కవి రచయితల కృషిపై ఎవరూ చెప్పనవసరం లేకుండా సొంతంగా అంచనా కలిగి ఉండేవారు. అందువల్లనే ప్రతిభకు తగిన గుర్తింపు అడగకనే అందేలా చూసేవారు.


రామానుజరావుకు తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితి, జిల్లా గ్రంథాలయ సంస్థ వంటి అనేక ఇతర సంస్థలు, వ్యవస్థలతో సన్నిహిత సంబంధం ఉన్నది. ఆయా సంస్థల కార్యకలాపాల విస్తృతిలో ఆయన ప్రత్యక్ష పాత్రవుంది. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యులుగా పదేళ్లు సేవలందిచారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సిండికేటు, సెనేట్ సభ్యునిగా వైస్ ఛాన్స్‌లర్‌గా విశ్వవిద్యాలయ విద్యా కార్యక్రమాలపై ప్రభావం చూపారు.


ఐదు దశాబ్దాల పాటు తెలంగాణను కేంద్రంగా చేసుకొని యావత్ తెలుగు నేలలో సమున్నత వ్యక్తిత్వంతో భాసించారు దేవులపల్లి రామానుజరావు. ఆధునిక తెలుగు సాహిత్యానికి 20వ శతాబ్ది స్వర్ణయుగమైతే ఆ బంగారం పండటంలో నీరుపోసి పెంపు చేసిన రైతుపాత్ర రామానుజరావుది. తెలంగాణ వైతాళికుల్లో అగ్రాసనాన నిలపదగిన అతికొద్ది మందిలో రామానుజరావు ఒకరు. తెలంగాణ సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేసిన వారిలో అగ్రగణ్యులు రామానుజరావు. ఆయన పెంచి పెద్ద చేసిన ఆంధ్ర సారస్వత పరిషత్తు నేటికీ వర్ధిల్లుతూ వారి స్మృతిని పచ్చగా కాపాడుతున్నది.


వ్యాస రచయిత:
- డాక్టర్ జె.చెన్నయ్య


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


ఆదివారం, ఆగస్టు 23, 2015

డొల్ల నాయకత్వం, చిల్లు వాదనలు...!!!

తెలంగాణకోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా ఇప్పుడు కొత్త జెండాలు ఎజెండాలు పెట్టుకుని ఏదో ఉద్ధరిస్తామని చెబుతుంటే విస్మయం కలుగుతున్నది. ఇప్పటికీ మేము తెలంగాణపక్షం అని చెప్పుకోలేని రాజకీయ పరాన్నజీవులు పొద్దున లేస్తే తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఆధిపత్యశక్తులకు పాదపూజ చేస్తూ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం సుభాషితాలు వల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జయాపజయాలను అంచనా వేయడానికి చాలా సమయం ఉంది. తెలంగాణ ప్రభు త్వం పనితీరును అంచనావేయడానికి ముందుగా తెలంగాణ ప్రతిపక్షాలు తమ క్రెడిబిలిటీని పెంచుకోవాలి. తెలంగాణ సమస్యలపై తమ నిజాయితీని ప్రకటించాలి.


నాయకుల్లో డొల్లతనం ఉంటే అది రాష్ర్టానికి నష్టం. నాయకులను చూసే జనం కదులుతారు. నాయకులు మార్గదర్శకులు కావాలని జనం ఆశిస్తారు. నాయకులు తమకంటే జ్ఞానవంతులై ఉండాలని జనం కోరుకుంటారు. తెలంగాణ విజయం సాధించింది అక్కడే. స్వరాష్ట్ర నినాదానికి దేశం మొత్తం ఆమోదాన్ని సాధించడం అంటే అది భావజాల విజయమే. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రాష్ర్టాన్ని సాధించి ప్రజామోదంతో పాలన పగ్గాలు చేపట్టిందీ ఈ భావజాలానికి నాయకుడుగానే. తెలుసుకునే సాధన ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నిరంతరం శోధించేవారు, తెలుసుకునేవారు మిగిలినవారి కంటే ఉన్నతంగా ఉంటారు. మంచి వినవద్దు, మంచి తెలుసుకోవద్దు, మంచి మాట్లాడవద్దు అని భీష్మించుకునే నాయకులు ఇప్పుడే కాదు ఎప్పుడూ కొరగాకుండాపోతారు. 


kattashekar

తెలంగాణ ధన రాజకీయాల కాలాన్ని జయించి జ్ఞాన రాజకీయాలకు పట్టంగట్టింది. తెలంగాణ సమాజం గురించి తెలిసినవాళ్లు, తెలంగాణ సమస్యల గురించి అవగాహన ఉన్నవాళ్లు, ఆ సమస్యలకు పరిష్కారం తెలిసినవాళ్లు ఇవ్వాళ అత్యధికశాతం మంది ప్రజాప్రతినిధులుగా వచ్చారు. అయినా తెలంగాణ ఉద్యమం నుంచి కానీ, ఈ పద్నాలుగు మాసాల పాలన నుంచి కానీ ప్రతిపక్షాలు ఒక్క గుణపాఠం కూడా నేర్చుకోలేదు. అదే డొల్లతనం. అదే రాజకీయ పిపాస. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శించడం. కొందరు నాయకుల్లో ఇది ఉన్మాదస్థాయికి చేరుకుంది. వారి ఉన్మాదం ఎవరికి మేలుచేస్తుందో, చివరికి వారికయినా మేలు చేస్తుందో లేదో తెలియని దుస్థితికి వారు జారిపోతున్నారు. తన మన గుర్తించలేని రాజకీయ అంధత్వం, వంధ్యత్వం వారిని కమ్ముకున్నది. ఇంకొందరు ఎందుకు మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతున్నారు. 


వారు ఎంత యాంత్రికంగా రాజకీయాలు నడుపుతున్నారో ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన ఒక ఘటన తెలియజేస్తుంది. రవీంద్రనాథ్ టాగూర్ వర్ధంతి అని ఎవరో చెప్పారట. పీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభాపక్షం నాయకుడు...ఒక్కరేమిటి ముఖ్య నాయకులంతా హాజరై ఆఫీసులో టాగూర్ ఫొటో పెట్టి పూలమాలలు వేశారు. భక్తి శ్రద్ధలతో అంజలి ఘటించారు. ఆ తర్వాత ఎవరో గుర్తించి టాగూర్ వర్ధంతి ఎప్పుడో ఆగస్టులోనే జరిగిపోయిందని చెప్పారట. అప్పుడు ఒకరిపై మరొకరు తప్పును నెట్టుకునే ప్రయత్నం చేశారట. ఇదొక్కటే కాదు. ఇప్పుడే కాదు. ఉత్సవాలయినా, సమస్యలయినా వారిది ఎప్పుడూ యాంత్రిక స్పంద నే. అర్థం చేసుకుని, ఫీలయ్యి చేసింది చేసేది ఒక్కటీ కనిపించదు. ఒక తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు నీటిపారుదల మంత్రిగా పోతిరెడ్డిపాడుకు జెండా ఊపి వస్తాడు. అదే నాయకుడు తెలంగాణకు ఎందుకూ పనికిరాని దుమ్ముగూడెం-టెయిల్‌పాండు ప్రాజెక్టుకు డూడూ బసవన్న లాగా తలూపివస్తాడు. మరో నాయకురాలు హంద్రీ-నీవా ప్రాజెక్టుకు వచ్చిన మహానాయకులకు నివాళి పడుతుంది. 


తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నీటిపారుదల ప్రాజెక్టులంటే కాంట్రాక్టులు, ప్యాకేజీల భాష తప్ప, ఎంత నీరు తేవాలి? ఎన్ని ఎకరాలు పారించాలి? ఎంత తొందరగా పూర్తి చేయాలి? అన్న ధ్యాస లేకుండాపోయింది. మహామహా నాయకులమని రొమ్ము విరుచుకునే నాయకులు ఒక్కరు కూడా తెలంగాణపైన, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంపైన దాడులు చేస్తుంటే రాజశేఖర్‌రెడ్డిని లేదా కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎదిరించిన పాపాన పోలేదు. ఆంధ్ర నాయకత్వం సచివాలయం అడ్డాగా అనేక కుట్రలు చేస్తున్నా వారు మాట్లాడలేదు. వందలాదిమంది పిల్లలు ఆత్మత్యాగాలు చేస్తున్నా వారు స్పందించలేదు. వారం తా ఇలా చేయడానికి వారి రాజకీయ అవకాశవాదం ఒక కారణం అయితే భావజాలానికి సంబంధించిన డొల్లతనం మరో కారణం. వారు ఈ ప్రాంతానికి జరుగబోయే నష్టాలను గుర్తించలేదు. చివరికి తమకు జరుగబోయే నష్టాన్ని కూడా వారు గుర్తించలేకపోయారు. 


అందుకే ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎత్తిన జెండా దించకుండా పోరాడిన కేసీఆర్‌కు ప్రజలు వరమాల వేశారు.తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు మాసాల్లోనే మన ప్రభుత్వానికి, మంది ప్రభుత్వానికి తేడా ఏమిటో చూపించగలిగింది. నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో అద్భుతాలు జరుగవు. కానీ కేసీఆర్ కొన్ని అద్భుతాలు చేసి చూపించారు. కరెంటు కోత అనేమాట వినిపించకుండా చేశారు. ఎంత కష్టమైనా నష్టమైనా ఇచ్చే విద్యుత్ నాణ్యంగా, ఒక పద్ధతి ప్రకారం సరఫరా అయ్యేట్టు చూడాలని టెక్నోక్రాట్స్ అయిన మన విద్యుత్ అధికారులకు చెప్పారు. తెలంగాణ వచ్చినంతనే విద్యుత్ ఉత్పత్తి పెరగలేదు. కేవలం నాయకుడి చిత్తశుద్ధి, మన అధికారుల అంకితభావం కారణంగానే ఇది సాధ్యమైంది. విద్యుత్ సర్‌ప్లస్ రాష్ట్రమని చెప్పుకుంటున్న ఆంధ్రాలో ఇప్పటికీ విద్యుత్ కోతలు ఉన్నట్టు అనంతపురం, విశాఖపట్నం జిల్లాల మిత్రులు ఇటీవల కలిసినప్పుడు చెప్పారు. 


కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభం, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఆధునీకరణ, ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. మన రాష్ట్రం మనదైంది కాబట్టి మన కష్టం మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాము. ఇంతమాత్రానే తెలంగాణ కష్టాలన్నీ తొలగిపోయాయని చెప్పడం లేదు. సంక్షేమ పింఛన్లపై సమైక్యాంధ్ర ప్రభుత్వంలో ఖర్చు చేసిన దానికంటే నాలుగు రెట్లు నిధులు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సమైక్యాంధ్ర ప్రభుత్వం పెండింగులో పెట్టిపోయిన ఫీజుల బకాయిలనూ తెలంగాణ ప్రభుత్వమే చెల్లించింది. అడిగిన వారికి అడగని వారికి అందరికీ అన్నీ ఇస్తున్నారు. చెప్పినవి, చెప్పనివీ అన్నీ ముఖ్యమంత్రి చేసుకుంటూ పోతున్నారు. చేయాల్సినవి ఇంకా చాలా ఉన్న మాట వాస్తవమే. అయినా అరవయ్యేళ్లుగా జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి సమయం పడుతుంది. 


ఆలోచనలు, ప్రణాళికలు, ప్రాజెక్టులు పట్టాలపైకి రావడానికి సమయం పడుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులపై రీడిజైనింగ్ అంటే అదేదో అర్థం కానట్టు కాంగ్రెస్, టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పోలవరం వద్ద చేసింది రీడిజైనింగ్‌లో భాగమే. తక్షణం నీటిని తీసుకోవడానికి వీలుగా ఆయన పట్టిసీమ పథకాన్ని చేపట్టారు. పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆచరణాత్మకంగా ఆలోచించి ఆయన ఆ నిర్ణయం చేసి ఉంటారు. రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం కూడా రీడిజైనింగులో భాగమే. తక్కువ వ్యవధిలో ఎక్కువ నీటిని తీసుకోవడం కోసం 11000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన పోతిరెడ్డిపాడు కాలువను వెడల్పు, లోతుతో 55000 క్యూసెక్కులకు పెంచారు. అంతకు ముందు పెన్నా నదిపై నిర్మించుకున్న రిజర్వాయర్లన్నింటినీ శ్రీశైలం జలాలతో నింపుకునే విధంగా ప్రాజెక్టులు, పనులు పూర్తి చేశారు. వీటన్నింటికీ దగ్గరుండి దరువేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తప్పుబట్టడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.


తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆచరణయోగ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల రీడిజైనింగుకు పూనుకుంటున్నారు. అందుకు పదవీ విరమణ చేసిన నీటిపారుదల ఇంజనీర్ల సహకారం తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ప్రాణహిత- చేవెళ్ల కాంట్రాక్టర్ల కోసం, రాజశేఖర్‌రెడ్డి ఉద్యమంలో ఉన్న తెలంగాణ ప్రజలను మోసం చేయడంకోసం రూపొందించిన ప్రాజెక్టు. ప్రాణహిత నుంచి చేవెళ్ల దాకా నీరు రావడానికి ముందు మధ్యలో చాలా మతలబు ఉంది. శ్రీరాంసాగర్‌లో నీటిలభ్యత దెబ్బతిని చాలా కాలమైంది. శ్రీరాంసాగర్ మొద టి దశ కాలువలకే నీరు సరిగా అందని పరిస్థితి. వరంగల్ జిల్లా కొడకండ్ల ప్రాంతం నుంచి సూర్యాపేట దాకా, అటు మహబూబాబాద్ దాకా రెండో దశ కాలువలు తవ్వి కూడా పదేళ్లు దాటింది. 


కానీ ఆ కాలువల్లో ఒకటి రెండు సార్లకు మినహా నీరు రాలేదు. గోదావరి నదిలో శ్రీరాంసాగర్ ఎగువ నుంచి సమృద్ధిగా జలాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 64 ప్రాజెక్టులు కానీ, బరాజ్‌లు కానీ నిర్మించి నీటిని నిలుపుకుంటున్నది. అంటే గోదావరిలో మనకు నీరు లభించేది ప్రాణహిత కలిసే చోటు నుంచి కిందికే. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన ఎంత చెండాలంగా జరిగిందంటే శ్రీరాంసాగర్ కాలువ, వరద కాలువలను దాటుకుని చేవెళ్లకు తీసుకువస్తామని చెప్పేంత. శ్రీరాంసాగర్‌కు ముందే ఆయకట్టును నిర్ధారించారు. వరద కాలువ కింద కూడా ఆయకట్టును నిర్ణయించి, కాలువలు తవ్వారు. కొన్ని చోట్ల రిజర్వాయర్లు నిర్మించారు. కానీ ఈ ఆయకట్టుకు, ఈ రిజర్వాయర్లకే నీరు అందించే ప్రయత్నాలు జరుగలేదు. ఈ రెండు కాలువలను పారించకుండా, ఆ కాలువల మీదుగా చేవెళ్ల దాకా నీరు తెస్తారని కాంగ్రెస్ నాయకులు ఎలా భావించారో అర్థం కాదు. 


ఇదంతా తెలంగాణ సమస్యతో రాజశేఖర్‌రెడ్డి ఆడిన మాయాజూదంలో భాగంగా జరిగింది. ఇప్పటికీ ఆ మాయా జూదాన్ని అర్థం చేసుకోలేక కాంగ్రెస్ నాయకత్వం ఏదేదో మాట్లాడుతున్నది. చేవెళ్లకు నీరు తీసుకురావాలి. మూసీ, ఈసీ నదులను పునరుజ్జీవింప జేయాలి. కృష్ణా నదీ జలాలను ఇదే నదీ పరివాహక ప్రాంతాలైన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు మళ్లించాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులకోసం కొట్లాడినా, మాట్లాడినా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులపై రాజకీయ కయ్యాలు రాజేయాలని చూడడమే వైపరీత్యం.


మరో విపరీతవాదం ఏమంటే... ఇన్నేండ్ల కష్టాలన్నీ ఒక్కేడుతో తీరిపోలేదే అని లాజిక్కులు తీయడం. తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని అడ్డగోలుగా మాట్లాడడం. కొందరు నాయకులయితే బచావో ఉద్యమాలే మొదలుపెట్టారు. తెలంగాణకోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా ఇప్పుడు కొత్త జెండాలు ఎజెండాలు పెట్టుకుని ఏదో ఉద్ధరిస్తామని చెబుతుంటే విస్మయం కలుగుతున్నది. ఇప్పటికీ మేము తెలంగాణపక్షం అని చెప్పుకోలేని రాజకీయ పరాన్నజీవులు పొద్దున లేస్తే తెలంగాణపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. 


తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఆధిపత్యశక్తులకు పాదపూజ చేస్తూ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి మాత్రం సుభాషితాలు వల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం జయాపజయాలను అంచనా వేయడానికి చాలా సమయం ఉంది. తెలంగాణ ప్రభుత్వం పనితీరును అంచనావేయడానికి ముందుగా తెలంగాణ ప్రతిపక్షాలు తమ క్రెడిబిలిటీని పెంచుకోవాలి. తెలంగాణ సమస్యలపై తమ నిజాయితీని ప్రకటించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై విచక్షణతో కూడిన విమర్శలు చేయాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే వేళాపాళా లేకుండా టాగూర్ వర్ధంతి సభ నిర్వహించినట్టే ఉంటుంది.
వ్యాస రచయిత:
-kattashekar@gmail.com



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


శనివారం, ఆగస్టు 22, 2015

టీఎస్‌పీఎస్సీలో...దొంగలు పడ్డారు!!!

TSPSC


రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ అక్రమాలు, అన్యాయాలనుంచి సొంత అస్తిత్వం దిశగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు సాగుతున్నాయి. ఒకవైపు ఒప్పందాలు చేసుకుంటూనే మరోవైపు వాటిని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారు. తెలంగాణ నిరుద్యోగుల కలలు నెరవేర్చే కేంద్రంగా ఉన్న టీఎస్‌పీఎస్సీలో ఏపీపీఎస్సీ సిబ్బంది కొందరు తాజాగా అరాచకానికి దిగారు.

-డూప్లికేట్ కీతో కాన్ఫిడెన్షియల్ రూమ్‌లోకి చొరబడ్డ ఏపీపీఎస్సీ ఉద్యోగులు
-ఫైళ్లు, కుర్చీలు చిందరవందర.. పలు కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లు మాయం!
-తెలంగాణ ఉద్యోగ భర్తీ ప్రక్రియపై అక్కసుతోనే?
-పోలీసులకు కమిషన్ కార్యదర్శి ఫిర్యాదు
-ఇక సహించబోమంటున్న ఉద్యోగ నేతలు


టీఎస్‌పీఎస్సీలోని అత్యంత కీలకమైన కాన్ఫిడెన్షియల్ రూమ్ తలుపులను దొంగల్లా డూప్లికేట్ తాళంతో తెరిచి చొరబడిన ఏపీపీఎస్సీ ఉద్యోగులు అక్కడి ఫైళ్లు చిందరవందర చేశారు. కుర్చీలు లాగిపడేశారు. కమిషన్ అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి విధులు నిర్వర్తించే స్థలాన్ని ఆక్రమించారు. కొన్ని కీలకమైన ఫైళ్లు సైతం అజాలేకుండా పోయాయని తెలుస్తున్నది. తెలంగాణ ఉద్యమ నినాదాల్లో ఒకటైన నియామకాల విషయంలో వేగంగా దూసుకుపోతూ తొలి నోటిఫికేషన్‌ను విడుదల చేసిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపైనా ఏపీ కుట్రలకు దిగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

TSPSC01


ఇంత వరకూ ఏపీపీఎస్సీ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయని నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ వరస నోటిఫికేషన్లకు సిద్ధమవడమే కాకుండా.. రెండు రోజుల క్రితమే తన తొలి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గ్రూప్స్ సిలబస్ సిద్ధం చేస్తున్నది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రానున్న రోజుల్లో నోటిఫికేషన్లను జారీ చేయనున్న నేపథ్యంలో దీనిపై అక్కసుతోనే ఏపీపీఎస్సీలోని కొందరు అధికారులు, సిబ్బంది ఆటంకాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏఈఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా కార్యాలయంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన అసిస్టెంట్ సెక్రటరీ సీతాదేవి అక్కడ వాతావరణం చూసి కంగుతిన్నారు.


ఏపీ ఉద్యోగులు అక్కడినుంచి కదిలేందుకు ససేమిరా అన్న పరిస్థితిని చైర్మన్ ఘంటా చక్రపాణికి వివరించారు. చైర్మన్ సూచన మేరకు కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అయితే అప్పటికే ఏపీ ఉద్యోగులు కాన్ఫిడెన్షియల్ గదిలోనుంచి వెళ్లిపోయారు. టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ రూమ్‌లో ఏపీ ఉద్యోగులు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు చైర్మన్ ఘంటా చక్రపాణి నివేదించారని అనంతరం మీడియాతో మాట్లాడిన టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సీ విఠల్ తెలిపారు. త్వరలో గవర్నర్‌ను కమిషన్ ఉన్నతవర్గాలు కలవనున్నట్లు చెప్పారు.


ఏపీపీఎస్సీని తమ కార్యాలయంనుంచి ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసిందని ఆయన వివరించారు. ఇదిలాఉండగా శుక్రవారం సాయంత్రం సైతం టీఎస్‌పీఎస్సీకి చెందిన గదులకు ఏపీపీఎస్సీ ఉద్యోగులు తాళాలు వేసినట్లు సమాచారం. ఏపీపీఎస్సీ దుందుడుకు చర్యల నేపథ్యంలో ప్రస్తుత భవనం నుంచి ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని వేరేచోటికి తరలించాలన్న డిమాండ్ ముందుకు వస్తున్నది. 


మంచితనమే తప్పయింది...


రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఐదు అంతస్తుల భవనంలోనే టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం ఏపీపీఎఎస్సీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తాత్కాలికంగా స్థలం ఇచ్చేందుకు తెలంగాణ కమిషన్ వర్గాలు అంగీకరించాయి. ఈ మేరకు రెండు కమిషన్ల కార్యదర్శుల సమక్షంలో ఇరు కమిషన్ల ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది.


మొదటి ఫ్లోర్‌ను పార్కింగ్‌కు వాడుకోవాలని, 2, 3 ఫ్లోర్‌లను టీఎస్‌పీఎఎస్సీ, 4, 5 ఫ్లోర్‌లను ఏపీపీఎఎస్సీ ఉపయోగించుకోవాలని స్పష్టంచేశారు. ఈ ఒప్పందాన్ని ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సైతం అభినందించారు. అయితే 2, 3వ అంతస్తులలో గల ఏపీపీఎఎస్సీ వర్గాలు తమకు కేటాయించిన ఫ్లోర్‌లలోకి వెళ్లడం లేదు. అయినప్పటికీ టీఎస్‌పీఎఎస్సీ వర్గాలు సహకరిస్తూనే వారితో తమ 34 సెక్షన్‌లను కలిపి ఉంచుకొని పనిచేసుకుంటున్నాయి. మరోవైపు కేటాయించిన స్థలం ఖాళీ చేయకపోవడం వల్ల 5వ అంతస్తులోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌నుంచే టీఎస్‌పీఎస్సీ తన కార్యకలాపాలు నిర్వర్తించుకోవాల్సి వస్తున్నది. ఈ క్రమంలో తాజాగా నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాతి రోజు అయిన శుక్రవారం ఏపీపీఎస్సీ ఉద్యోగులు కొందరు టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ గదిని డూప్లికేట్ తాళంతో తెరవడం అనేక అనుమానాలు లేవనెత్తుతున్నది.


కొలువుల ప్రకటనతో కుట్రకు తెర


ఏపీపీఎస్సీ కొలువుల నియామకానికి ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. మరోవైపు టీఎస్‌పీఎస్సీ కొత్త కొలువుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తున్నది. అదే క్రమంలో కొత్త సిలబస్ రూపొందించడం, విస్తృత స్థాయిలో నిపుణులతో చర్చలు జరపడం, వేగంగా డిపార్ట్‌మెంట్ పరీక్షలు నిర్వహించడంవంటి పనుల్లో బిజీగా ఉంది. తక్కువ మంది సిబ్బందే ఉన్నా.. అంతా కలిసికట్టుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, నియామక ప్రక్రియలో ఆటంకాలు కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే కీలకపత్రాలు ఉండే రహస్య గదిలోకి ఏపీ ఉద్యోగులు చొచ్చుకువచ్చారని టీఎస్‌పీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి.


కమిషన్‌లు నడుస్తున్న భవనంలో ఉన్న ఏకైక స్ట్రాంగ్ రూం కూడా ఏపీపీఎస్సీ కస్టడీలోనే ఉంది. ఒప్పందం ప్రకారం భవనాన్ని వాడుకోవాలని కమిషన్ ఉన్నతవర్గాలు ఒప్పందం చేసుకున్నా.. కిందిస్థాయి ఉద్యోగులు దాన్ని బేఖాతరు చేయడం ఏపీ ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని చాటుతున్నదని తెలంగాణ కమిషన్ ఉద్యోగులు అంటున్నారు. ఇపుడు నోటిఫికేషన్లు ప్రారంభదశలోనే ఉన్నాయని అయితే.. గ్రూప్స్, ఇతర నోటిఫికేషన్లు వచ్చిన సమయంలో భారీ స్థాయిలో రహస్య సమాచారం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఏపీ ఉద్యోగులు దురుద్దేశపూర్వకంగా ఇదే తరహా చర్యలకు దిగితే తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఘటన వివరాలను వివరిస్తూ, ఏపీపీఎస్‌స్సీని తమ భవనం నుంచి వేరే పంపించాలని కోరుతూ అతి త్వరలో పునర్విభజన కమిటీకి లేఖ రాయాలని టీఎస్‌పీఎస్సీ ఉన్నతవర్గాలు యోచిస్తున్నాయి.


దర్యాప్తు చేస్తున్న పోలీసులు


టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ కార్యదర్శి సీతాదేవి చాంబర్‌ను ఏపీపీఎస్సీ సిబ్బంది అక్రమంగా నకిలీ తాళంతో తెరిచి గదిని స్వాధీనం చేసుకున్నారని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణ్యన్ శుక్రవారం బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చాంబర్‌లో ఇటీవల టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ ఫైల్స్‌తో పాటు కార్యాలయానికి సంబందించిన విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా 5వ అంతస్తులోని తమ చాంబర్‌ను అక్రమంగా తెరవడమే కాకుండా అందులోని విలువైన పత్రాలను కూడా మాయం చేసి ఉంటారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 5వ అంతస్తులోని తమ చాంబర్‌ను అప్పగించాలని ఏపీపీఎస్సీ అధికారులను కోరినా అప్పగించడంలేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ గంగసాని శ్రీధర్ తెలిపారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, ఆగస్టు 20, 2015

తెలంగాణకూ ప్యాకేజీ ఇవ్వాలె...!!!

1200 టీఎంసీలపై హక్కులు కలిగి ఉండి కూడా తెలంగాణ సాగునీరు లేక వ్యవసాయం దండగై ఎంత నష్టపోయిందో లెక్కగట్టగలమా? ఇలా అక్షరాస్యత విషయంలో, వ్యవసాయం విషయంలో, వైద్యం విషయంలో, అభివృద్ధి విషయంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని పూరించాలంటే కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చితీరాలి. 

discriptionప్రధాని మోదీ బీహార్ రాష్ర్టానికి లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. దీని ద్వారా ఏపీ విషయంలోనూ కేంద్రం ఓ నిర్ణయం తీసుకునే ఉండి వుంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ కాబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదానే కావాలని డిమాండ్ చేయబోతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని ఇచ్చే వాళ్లకే కాదు, అడిగే వాళ్లకూ తెలుసు. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఏపీ రాజధాని శుంకుస్థాపనకు వచ్చినపుడు స్వయాన ప్రధాని మోదీయే ప్యాకేజీని ప్రకటిస్తారని తెలుస్తోంది. 


ప్రత్యేక హోదా అనేది అప్పట్లో వెంకయ్యకు, చంద్రబాబులకు ఎన్నికల అస్త్రంగా పనిచేసింది. వారే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు. ఎన్నికల్లో గెలిచారు. ఎప్పటి రాజకీయ అవసరం అప్పుడే అనేందుకు నిలువెత్తు సాక్ష్యం స్వయాన వెంకయ్యనే అనడంలో అనుమానంలేదు. ఇపుడు ఎటూ పాలుపోని చంద్రబాబు రాష్ర్టాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజించిందంటూ మళ్లీ పాత మాటలనే వినిపిస్తున్నారు. 


ఒక రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఆ రాష్ర్టానికి ప్రత్యేక భౌగోళిక, సామాజిక పరిస్థితులు ఉండాలి. ముఖ్యంగా ఆ రాష్ట్రం దేశ సరిహద్దులలో పొరుగు దేశాలకు భౌగోళిక సరిహద్దు గలిగి ఉండటం, పర్వత ప్రాంతమై ఉండటం, సామాజికంగా బాగా వెనుకబడి ఉండటం లాంటి ప్రత్యేక లక్షణాలను కలిగివున్నపుడే ఆ రాష్ట్రం ప్రత్యేక హోదాకు అర్హత పొందుతుంది. మరి అవశేష ఆంధ్రప్రదేశ్‌కు అందులో ఒక్క లక్షణమైనా ఉన్నదా? 972 కి.మీ కోస్తా తీరం ఉంది తప్ప పొరుగు దేశం సరిహద్దులంటూ ఏమీ లేవు. ఇకపోతే, సామాజికంగా బాగా వెనుకబడిన ప్రాంతమని కూడా చెప్పడానికి బలమైన ఆధారాలు కనిపించవు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి విభజన చట్టంలోనే కొన్ని ప్యాకేజీలు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలున్నాయి. 


ఏపీలో ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా తప్ప మరే ప్యాకేజీ అక్కరలేదంటున్నాయి. ప్రత్యేక హోదా పేరున ఎన్నికల్లో లబ్ధిపొందిన టీడీపీ, బీజేపీలను ఇరుకున పెట్టడంలో విపక్షాల తప్పేమీలేదు. ఆ రోజు రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన వెంకయ్యకు ఎన్నికలు కనిపించాయి తప్ప ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏపీకి అన్ని అర్హతలు ఉన్నాయా అనేది పట్టలేదు. అదే ఇపుడు విపక్షాలకు బ్రహ్మాస్త్రంగా మారింది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అంటే ఇదే. నిజానికి ఏపీ లోటు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని దానికి ప్యాకేజీ ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదని అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులు కూడా చెప్పారు. అలాగే, ఉమ్మడి పాలనలో నష్టపోయిన తెలంగాణకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినా, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ సమైక్య రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణకు న్యాయం చేయకపోతే అంతకంటే దారుణం మరోటి ఉండదు.


నిజానికి ఏపీకి రాజధాని లేకపోవడం తప్ప ఆ రాష్ట్రం ఎందులోనూ వెనుకబడిలేదు. ఐదు మెట్రోనగరాలు, డజనుకు పైగా ఓడ రేవులు, ఏడు జిల్లాల్లో కనీసం రెండు లేదా మూడు పంటల వ్యవసాయం, గనుల పరిశ్రమలు కలిగి ఉన్న ఏపీని ఎవరైనా వెనుకబడిన రాష్ట్రమని అనగలరా? ఇన్ని ఉన్న ఏపీ లోటు బడ్జెట్ కూడా తీరని సమస్య ఏమీ కాదు. ఉమ్మడి రాష్ట్రం కొనసాగినంత కాలం అక్కడ నాటుకుపోయిన జీరో వ్యాపారాల జోరును ఇప్పటికైనా కట్టడి చేస్తే.. చాలామేరకు ఆ రాష్ట్ర బడ్జెట్ లోటు సమస్య తీరే అవకాశాలుంటాయి. కానీ ఏపీలో ఎవరి ప్రభుత్వం ఏర్పడినా జీరో వ్యాపార వర్గాల సంబంధీకులే పాలకులవుతుంటారు. కాబట్టి ఏపీ బడ్జెట్ లోటు సమస్య తీరడమనేది పాలకుడి నిజాయితీపై ఆధారపడివుంటుంది. కాబట్టి ఏపీ ప్రభుత్వ పరంగా పేదది కావచ్చు తప్ప క్యాపిటలిస్టుల పరంగా అది ఎప్పుడూ పేదది కాదు. ఈ విషయంలో తెలంగాణ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. తెలంగాణ దశాబ్దాలుగా మిగులు బడ్జెట్‌ను కలిగివున్నమాట నిజం. కాబట్టి తెలంగాణ వెనుకబడ లేదు, వలసపాలనలో వెనుకవేయబడిన ప్రాంతం.


రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించారు. ఏపీకి తీరని నష్టం జరిగిందని చంద్రబాబు ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలు ఉల్టాచోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్లున్నది. నిజంగానే అడ్డగోలుగా విభజించి ఉన్నట్లయితే.. జనాభా ఆధారంగా ఉద్యోగుల పంపకం చేయాలని, అప్పులు, ఆస్తులను జనాభా ఆధారంగా పంచాలని, గోదావరి, కృష్ణా నదుల మీద అజమాయిషీ బోర్డులు ఉంటాయిని.. విభజన చట్టంలో పెట్టి ఎవరికి అన్యాయం చేశారో చంద్రబాబు చెప్పగలరా? ఫక్తూ.. అడ్డగోలుగా విభజించి ఏపీకి ఆన్యాయం చేశారని గోబెల్స్ ప్రచారం చేస్తూ.. పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు ఇంకా తూట్లు పొడవాలనుకుంటున్న చంద్రబాబు అతి తెలివికి జోహార్లు చెప్పకతప్పదు. రెండు జీవిత కాలాలు కోల్పోయి లెక్కలేనంత నష్టపోయిన తెలంగాణ రాష్ర్టానికి ఏమీ ఇవ్వకుండా పక్క రాష్ర్టానికి మాత్రమే ప్యాకేజీ ఇవ్వడాన్ని ప్రజలు హర్షించరు. అదేదో ఏపీకి ఇస్తున్నారని తెలంగాణకు అడగటం కాదు. 


ఈ డిమాండ్‌లో పూర్తి నిజాయితీ ఉందని గమనించాలి. ప్రభుత్వం మిగులు బడ్జెట్‌లో ఉన్నా.. జరిగిన అన్యాయాలను పూరించడం ఒక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే జరిగేది కాదు. ఉదాహరణకు అక్షరాస్యత విషయంలో తెలంగాణ దేశంలో 25వ స్థానంలో ఉన్నది. విద్యలో తెలంగాణ ఇంతగా వెనుకబడి ఉండటానికి సమైక్య పాలనే కారణం. దేశ అక్షరాస్యత సగటు 74 శాతం ఉండగా తెలంగాణ గ్రామీణ అక్షరాస్యత 58 శాతం మాత్రమే ఉన్నది. దీన్ని బట్టి తెలంగాణ ఎంత మిగులు బడ్జెట్ రాష్ట్రమైనా జరిగిన నష్టాన్ని పూరించడం ఎలా సాధ్యం? 1200 టీఎంసీలపై హక్కులు కలిగి ఉండి కూడా తెలంగాణ సాగునీరు లేక వ్యవసాయం దండగై ఎంత నష్టపోయిందో లెక్కగట్టగలమా? ఇలా అక్షరాస్యత విషయంలో, వ్యవసాయం విషయంలో, వైద్యం విషయంలో, అభివృద్ధి విషయంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని పూరించాలంటే కేంద్రం తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చితీరాలి. 


ఉద్యోగాల విభజనను కనీసం రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగానైనా పంపకం చేస్తామని చెప్పకుండా, కేవలం జనాభా అధారంగా పంపకం జరగడం వల్ల ఎవరికి అన్యాయమో చంద్రబాబు చెప్పగలరా? తెలంగాణ ఆశలు పెంచుకున్న రెండు జీవనదులపై అజమాయిషీ బోర్డులు పెట్టి ఎవరికి అన్యాయం చేశారో చెప్పగలరా? సమైక్య రాష్ర్టానికి 55 శాతం రెవెన్యూ ఆదాయం తెలంగాణ నుంచి వచ్చేది. అందులో 29 శాతం వెచ్చించి అన్యాయం చేసింది పక్కన పెట్టి.. ఇపుడు ఆస్తులు, అప్పుల పంపకం జనాభా ఆధారంగా 42 శాతం అప్పులు అంటగడుతుంటే ఎవరు నష్టపోతున్నారో చెప్పగలరా? ఒక్క రాజధాని లేదనే విషయాన్ని అడ్డం పెట్టుకొని.. తెలంగాణకు విభజన చట్టంలో కావలసినంత అన్యాయం చేశారు.


విభజన చట్టంలో ఉన్న అన్యాయాలను అప్పుడే వ్యతిరేకించి ఉంటే, వచ్చే తెలంగాణ ఆగిపోతుందేమోనని భయం అప్పట్లో అందరిలో ఉన్నది. తెలంగాణ ఏర్పడ్డాక ఆ అన్యాయాలను సరిదిద్దుకోవచ్చని అందరూ భావించారు. ఆ దిశగా కేసీఆర్ ప్రభుత్వం కూడా పనిచేస్తున్నది. కానీ, ఏ న్యాయాన్నీ కేంద్రం చేస్తున్నది లేదు. ఉదాహరణకు ఉమ్మడి హైకోర్టు విభజన చట్టబద్ధ హామీ. ప్రత్యేక హోదా అనేది నోటి మాట హామీ. ఉమ్మడి హైకోర్టును విభజించడంలో కాలయాపన చేస్తున్న కేంద్రం ప్రత్యేక హోదా వంటి నోటిమాట హామీని మరో రకంగా ప్రత్యేక ప్యాకేజీ రూపంలోనైనా నెరవేర్చడానికి సిధ్ధం కావడం గమనార్హం. ఇది కేంద్రం చూపుతున్న పక్షపాత ధోరణి. కేంద్రానిది పక్షపాత ధోరణి కానట్లయితే.. ఏపీకి మాత్రమే కాకుండా అనేక రకాల నష్టపోయిన తెలంగాణకు కూడా భారీ ప్యాకేజీని ప్రకటించాలి. 


తెలంగాణలోని విపక్షాలకు కూడా ఇదొక పరిక్ష అని చెప్పాలి. రోజూ కేసీఆర్‌పై దుమ్మెత్తి పోయడం తప్ప తెలంగాణకు జరిగిన అన్యాయాల పట్ల అవి ఎంత శ్రద్ధ చూపెడుతున్నాయో ప్రజలు ఇప్పటికే గమనిస్తున్నారు. ప్రాజెక్టుల డిజైన్లపై మాట్లాడే ప్రతిపక్షాలు.. అవే ప్రాజెక్టులను నిరంతరం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుపై ఏ ఒక్క ప్రతిపక్షమూ మాట్లాడదు. అందుకే 15 నెలలు గడిచినా ప్రతిపక్షాలు ప్రజల మన్ననలు పొందలేకపోతున్నాయి. ఇప్పటికైనా, తెలంగాణకు ఏపీతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ రాబట్టడంలో తెలంగాణ ప్రతిపక్షాలు తమ వంతు పాత్ర పోషించాలి. ప్రజల్లో తమ నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రతిపక్షాలు.. తెలంగాణకు జరిగిన అన్యాయాలను తుడిచేయడంలోగానీ, ప్రత్యేక ప్యాకేజీని రాబట్టడంలోగానీ అధికార పక్షంతో కలిసి పనిచేస్తేనే ప్రజల మన్ననలు పొందగలుగాయని మర్చిపోవద్దు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


మంగళవారం, ఆగస్టు 18, 2015

ఓటుకు నోటు కేసులో కొత్తముఖాలు...!!!

-టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులునాయుడు కుమారుడు
  శ్రీనివాసనాయుడికి ఏసీబీ నోటీసులు
- అతడి సహాయకుడు విష్ణుచైతన్యకు కూడా..
- నేడు విచారణకు రావాలని ఆదేశం
- ప్రస్తుతం స్విట్జర్‌లాండ్‌లో ఉన్న శ్రీనివాసనాయుడు
- కుట్రకు నగదు సరఫరాపై విచారించనున్న ఏసీబీ
- మొదటి చార్జిషీట్‌లో చంద్రబాబు ప్రమేయంపై ప్రస్తావన
- తమను పంపింది చంద్రబాబేనని రేవంత్, సెబాస్టియన్ వెల్లడి!
తీగలాగితే డొంకంతా కదులుతున్నట్లు ఓటుకు నోటు కేసులో ఊహించని విధంగా కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఏసీబీ దర్యాప్తులో తెలంగాణ నేతల పేర్లు దుమారం సృష్టించగా, తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులునాయుడు కుమారుడు డీకే శ్రీనివాసనాయుడికి అనూహ్యంగా సీఆర్పీసీ 160 ప్రకారం ఏసీబీ నోటీసులు జారీచేయడం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. కాగా, మొదటి చార్జిషీట్‌లో పదేపదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను ఏసీబీ పేర్కొన్నది. ఈ కేసులో చంద్రబాబు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనటాన్ని స్పష్టంగా పొందుపరిచింది.


srinivanaidu

బాగోతం బయటపడ్డ తర్వాత టీడీపీ నాయకులు అప్రమత్తమైన తీరును కూడా అందులో వివరించింది. ఆ తర్వాత సెల్‌ఫోన్లతో వ్యవహారం నడిపిస్తే క్షేమం కాదని భావించిన టీడీపీ నాయకులు ఎస్సెమ్మెస్, వాట్సాప్‌ను వినియోగించినట్లు పక్కా ఆధారాలతో ఏసీబీ చార్జిషీట్ దాఖలుచేసింది. రేవంత్‌రెడ్డి, సెబాస్టయన్ సంభాషణల ఉదంతాన్ని పూసగుచ్చినట్టు వివరించిన ఏసీబీ.. మత్తయ్య కథ వెలుగులోకి వచ్చిన తర్వాత అతడిని రక్షించిన ఉదంతాన్ని కూడా స్పష్టంగా వివరించింది. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసు సరికొత్త మలుపు తిరుగుతున్నది. 


కర్ణాటక బేవరేజెస్ అండ్ డిస్టిలరీస్ సంస్థకు ఎండీగా ఉన్న శ్రీనివాసనాయుడికి ఏసీబీ సోమవారం బెంగుళూరులోని ఆయన కార్యాలయంలో నోటీసులు అందజేసింది. ప్రస్తుతం శ్రీనివాసనాయుడు స్విట్జర్లాండ్‌లో ఉన్నారని, దీంతో ఆయన కార్యాలయంలో నోటీసులు అందించామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. శ్రీనివాసనాయుడుతోపాటు ఆయన సహాయకుడు విష్ణుచైతన్యకు కూడా నోటీసులు జారీచేసినట్లు ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు.


మంగళవారం సాయంత్రం 5గంటలకల్లా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించామని తెలిపారు. రెండ్రోజుల్లో ఏసీబీ ఎదుట తాను విచారణకు హాజరవుతానని సన్నిహితులకు శ్రీనివాసనాయుడు ఫోన్‌లో చెప్పారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు అనూహ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాకు చెందిన శ్రీనివాసనాయుడుకు నోటీసులివ్వడంతో టీడీపీ వర్గాలు సందిగ్ధంలో పడినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న వారు సైతం కంగుతిన్నట్టు తెలిసింది. కర్ణాటకలో మద్యం వ్యాపారంలో ఊపు మీదున్న డీకే శ్రీనివాసనాయుడుడికి పక్కా ఆధారాలతోనే ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. విచారణలో శ్రీనివాసనాయుడు వెల్లడించే విషయాలతో రూ.50లక్షల వ్యవహారంతో పాటు రూ.4.5కోట్ల సంగతి కూడా తేలిపోతుందని ఏసీబీ దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.


నగదు ఆయన కంపెనీ నుంచేనా?


ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను కొనాలన్న టీడీపీకుట్రకు శ్రీనివాసనాయుడు కంపెనీ నుంచే నగదు సరఫరా జరిగిందన్న కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈమేరకు టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య కాల్‌డేటాతోపాటు లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి ఫోన్ డాటాలో శ్రీనివాసనాయుడుకు సంబంధించిన ఫోన్ నంబర్లు ఉండటంపై ఏసీబీ ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కుట్రలో నగదు వ్యవహారాన్ని ఛేదించేందుకు శ్రీనివాసనాయుడుతోపాటు ఆయన అసిస్టెంట్ విష్ణుచైతన్యను విచారించాలని ఏసీబీ నిర్ణయించింది. 



ఏసీబీ చార్జిషీటులో చంద్రబాబు పేరు


ఓటుకు నోటు కేసులో కోర్టుకు దాఖలు చేసిన ఏసీబీ చార్జిషీటులోని అంశాలు కొన్ని బయటకువచ్చాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు పలుమార్లు ప్రస్తావించడంతో టీడీపీ వర్గాల్లో కలకలం రేగుతున్నది. తొలుత ఈ కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాల సెల్‌ఫోన్ సంభాషణలు, నిఘా కెమెరా దృశ్యాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ వాటిని పరీక్షల నిమిత్తం కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరెటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)కి పంపించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. వీటి ఆధారంగా ఏసీబీ పలు కీలక ఆధారాలు సేకరించింది. 


మరికొందరిని విచారణ చేయగా.. వారిచ్చిన సమాచారంతో మరిన్ని ఆధారాలు సేకరించిన ఏసీబీ, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించిన మొదటి చార్జిషీట్‌ను వారం రోజుల కిందట కోర్టుకు సమర్పించింది. అయితే, సప్లమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాతే మొదటి చార్జిషీట్‌ను పరిశీలిస్తామంటూ కోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా, ఏసీబీ చార్జిషీట్‌లో పేర్కొన్న ఆంశాలు కొన్ని బయటకు వచ్చాయి. అవి ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ఏసీబీ అధికారులు పలుమార్లు చార్జిషీట్‌లో ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డిని విచారించగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయించే బాధ్యత చంద్రబాబు అప్పగించిట్లు వెల్లడించారు. చంద్రబాబు తరుఫున తానే బేరసారాలు చేస్తానని, అవసరమైతే ఆయన వద్దకు తీసుకువెళుతానంటూ రేవంత్‌రెడ్డి తెలిపారు. 


ఒకరోజు స్టీఫెన్‌సన్ వద్దకు వెళ్లిన సెబాస్టియన్ తనను చంద్రబాబు పంపించనట్టు వెల్లడించాడని, మే 30వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో సెబాస్టియన్ తన సెల్‌ఫోన్‌లో చంద్రబాబునాయుడిని స్టీఫెన్‌సన్‌తో మాట్లాడించినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ విధంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయాన్ని చార్జిషీట్‌లో స్పష్టంగా వివరించారు. మే 30వ తేదీన నిందితులు మాట్లాడిన సెల్‌ఫోన్ సంభాషణలను వివరంగా పేర్కొన్నారు. దీనిని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికతోపాటు చార్జిషీట్‌లో పొందుపరిచారు. జూన్ 1వ తేదీన మత్తయ్య ఉదంతం వెలుగుచూసిన వెంటనే కొంతమంది టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. రెండో తేదీన టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు మత్తయ్య తన సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ చేశాడు. ఫోన్ ఆఫ్ చేసిన విషయాన్ని ఆ తర్వాత ఎస్సెమ్మెస్ ద్వారా తనకు సహకరిస్తున్న వారికి మత్తయ్య వివరించాడు.


సెల్‌ఫోన్ సంభాషణలపై ఏసీబీ గురి పెట్టిన విషయం గుర్తించిన నిందితులు, ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులందరితో ఎస్సెమ్మెస్, వాట్సాప్‌తోనే నడిపించారు. మత్తయ్యకు బెయిల్ ఇప్పించే పథకాన్ని కూడా వాటి ద్వారానే పథకం ప్రకారం నిర్వహించారు అని ఏసీబీ పూర్తి వివరాలతో చార్జిషీటును రూపొందించింది. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా, మత్తయ్య నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు ఏసీబీ స్పష్టంగా పేర్కొంది. 



రాష్ట్ర ఇంటెలిజెన్స్ వింగ్‌కు ఏపీ సీఐడీ నోటీసులు


మత్తయ్య జెరూసలెంను బెదిరించారన్న ఆరోపణల కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులు తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో నోటీసులు అందించినట్టు తెలిసింది. వారం రోజులుగా గన్‌మెన్ జానకీరాం, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులివ్వాలని ప్రయత్నించి.. విఫలం కావవడంతో వారి హెడ్‌క్వార్టర్ అయిన ఖైరతాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో అందించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రంలోగా అప్పాలోని తమ ప్రధాన కార్యాలయమైన సీఐడీకి రావాలని, సీఆర్పీసీ 160 కింద ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నోటీసులను తాము పరిగణలోకి తీసుకోలేమని, నేరుగా సంబంధిత వ్యక్తులకు ఇవ్వాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు తేల్చిచెప్పారు. అప్పటివరకు విచారణకు హాజరయ్యేలా గన్‌మెన్, డ్రైవర్‌కు తాము ఆదేశివ్వలేమన్నారు. ఇలా ఇచ్చిన నోటీసులు చెల్లవని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.




జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

 

ఆదివారం, ఆగస్టు 16, 2015

ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్ట్...!!!

-ఏపీ పోలీసులకు త్వరలో సమన్లు?
-పలువురు టీడీపీ నేతలకు కూడా!
-అజాలేని మత్తయ్య, జిమ్మీ, కొండల్‌రెడ్డి
-వారికి షెల్టర్ ఇస్తున్న ఏపీ పోలీసులు!
-పక్కా ఆధారాలు సంపాదించిన ఏసీబీ
-నిందితుల కాల్‌డాటా ఆధారంగా చర్యలు!
ఓటుకు నోటు కేసులో తప్పించుకుని తిరుగుతున్న నిందితులు మత్తయ్య, జిమ్మీ, కొండల్‌రెడ్డిలకు ఏపీ పోలీసులు షెల్టర్ ఇచ్చినట్టు ఏసీబీ దర్యాప్తు అధికారులు పక్కా ఆధారాలు సంపాదించారని తెలుస్తున్నది. నిందితుల కాల్‌డాటాను పరిశీలించిన ఏసీబీ అధికారులు.. వాటి ఆధారంగా పలువురు ఏపీ పోలీసులకు విచారణకు రావాలంటూ సమన్లు పంపించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఓటుకు నోటు కేసులో ఏ 4గా ఉన్న మత్తయ్య నుంచి తాజాగా లోకేశ్ డ్రైవర్ కొండల్‌రెడ్డి వరకూ విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే.


kondalreddy

వీరిపై దృష్టిసారించిన ఏసీబీ దర్యాప్తు బృందం.. నిందితులు తరచూ ఏపీ పోలీసు అధికారులు, టీడీపీ నాయకులతో మాట్లాడుతున్నారని గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు టీడీపీ నేతలకూ సమన్లు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. కేసు ప్రారంభమైనప్పటినుంచి రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌తోపాటు జిమ్మీబాబుతో టీడీపీలోని కీలక హోదాలో ఉన్న నలుగురు నేతలు మాట్లాడినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని ఏసీబీ వర్గాలు చెప్తున్నాయి.


కేసును నీరుగార్చేందుకు టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న ఓ ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లు కూడా వీరితో ఫోన్‌లో మాట్లాడినట్టు కాల్‌డాటాలో తేలిందని ఓ కీలక అధికారి స్పష్టంచేశారు. ఒక కేసులో నిందితులను రాష్ట్రం దాటించేయడంపై ఏసీబీ సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఏపీ అధికారులకు నోటీసులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అవసరమైతే కోర్టుదృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందుతామని కీలక అధికారి తెలిపారు. ఏపీ పోలీస్ అధికారులకు కోర్టు ద్వారానే నోటీసులిప్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. రెండు మూడు రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. 


మొదటి నుంచీ ఏసీబీకి అనుమానం


ఓటుకు నోటు కేసు తెరమీదకు వచ్చినప్పటి నుంచి టీడీపీ పెద్దలు నిందితులకు, ఆరోపణలెదుర్కుంటున్న వారికి ఆశ్రయం ఇస్తున్నారని ఏసీబీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ4 నిందితునిగా ఉన్న మత్తయ్య అరెస్టు కాకుండా తప్పించుకోవడంతోపాటు విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కేసు కూడా పెట్టారు. అయితే ఒక సంచలనాత్మక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వెళ్లి ఫిర్యాదు చేస్తే కేసు నమోదుచేయడమే కాకుండా ఆ కేసును అక్కడి పోలీస్ పెద్దలు ప్రత్యేకంగా సీఐడీకి బదిలీ చేశారు.


ఒక కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తిని సంబంధిత దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న విషయాన్ని విస్మరించారు. పైగా కేసును నీరుగార్చేందుకు పోలీసులే మత్తయ్యకు విజయవాడలో షెల్టర్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌తోపాటు ఓటుకు నోటు కుట్రలో భాగస్వామ్యం వహించిన జిమ్మీబాబును కూడా ఏపీ పోలీస్ పెద్దలు తప్పించారని, అతనికి విజయవాడ, గుంటూరులో షెల్టర్ ఇచ్చినట్టు తమ వద్ద కాల్‌డాటా ఆధారాలున్నాయని ఏసీబీ చెప్తున్నది. విచారణకు హాజరుకావాలని జిమ్మీబాబుకు నోటీసులిచ్చినా అతడు హాజరుకాకుండా తప్పించుకుంటున్నాడు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌బాబుకు డ్రైవర్‌గా పనిచేస్తున్న కొండల్‌రెడ్డి కూడా ఏసీబీ నోటీసులను పట్టించుకోకుండా విశాఖలో మకాం వేశాడని తెలిసింది.



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


శనివారం, ఆగస్టు 15, 2015

ఇదీ.. గంగదేవిపల్లి పిల్లల మాట...!!!

తెలంగాణ కవి పండిత మేధావులకు, ప్రజలకు, వీక్షకులకు
భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!


గ్రామ ప్రజలంతా వూరును తీర్చిదిద్దుకుని ప్రగతిబాటలో నడిపిస్తుంటే దాని ప్రభావం వూర్లోని ఈ తరం పిల్లలపై ఏ విధంగా ప్రసరిస్తుందో ఈ ఆదర్శ గ్రామాన్ని చూస్తే తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి పిల్లలు గ్రామాల అభివృద్ధిలో పాల్గొంటే వాళ్లు పెరిగి పెద్దయిన తర్వాత వివిధ వృత్తుల్లో చేరిన తర్వాత ఎంతో స్ఫూర్తివంతంగా పనిచేయగలుగుతారు. చిన్నప్పుడు పిల్లల మనస్సుల్లో నాటుకున్న భావాలు అవి వారితోపాటే పెరిగి పెద్దవుతాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి వెళితే ఈతరం పిల్లలు ఏం మాట్లాడతారో అర్థమవుతుంది. గంగదేవిపల్లి ఆదర్శ గ్రామంగా అది రాష్ట్రంలో, దేశంలో పేరుగడించింది. ఆ వూరు ఎలా ఆదర్శగ్రామమైంది? గ్రామ ప్రజల ఐక్యత ఎలా ఉంది? ఆ వూరు ఆదర్శంగా నిలవటానికి వాళ్లేం చేశారు? ఆదర్శ గ్రామం నిర్మించాలంటే ఆ వూరు చెబుతున్న పాఠాలేమిటి?..అన్న కోణంలో ప్రపంచమంతా గంగదేవిపల్లి గ్రామం వైపు చూస్తుంది. 

villeges


అందునా రాష్ట్ర ప్రభుత్వం 2015 ఆగస్టు 17 నుంచి గ్రామాలను తీర్చిదిద్దేందుకు, గ్రామాభివృద్ధికి గ్రామజ్యోతి పథకం ప్రవేశపెట్టే కసరత్తు ఒక పక్క ముమ్మరంగా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రామానందతీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కిశోర్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పర్సనల్ సెక్రెటరీ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కొందరు సర్పంచ్‌లు ఆగస్టు 3వ తేదీన గంగదేవిపల్లిని సందర్శించారు. గ్రామమంతా కలియ తిరిగారు. గ్రామంలోని రోడ్లను, నీటి సరఫరా విధానాన్ని, విద్యుత్ పంపిణీ, పాఠశాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగునీటి నిర్వహణ విధానాల్ని పరిశీలించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల పాత్ర గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగదేవిపల్లిలోని హైస్కూల్‌కు వెళ్లారు. అక్కడ స్కూల్ నిర్వహణ పద్ధతి, పిల్లల ప్రగతి గురించి హెడ్‌మాస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. 9వ తరగతి గతికి వెళ్ళి కాసేపు పిల్లలతో మాట్లాడారు. మీ వూరు ఆదర్శ గ్రామం అని ప్రపంచమంతా చెప్పుకుంటున్నది. మీ వూరు ఆదర్శగ్రామం కావటానికి ఏం చేశారు? మీ వూరెందుకు ఆదర్శ గ్రామమయ్యింది? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పిల్లల అభిప్రాయాన్ని అప్పటికప్పుడు కాగితంపై రాసి ఇవ్వమని అడిగారు. దీనిపై కొందరు పిల్లలు రాసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

మావూరు ఆదర్శగ్రామం. ఎందుకనగా మా వూరిలో మద్యనిషేధం అమలు జరుగుతున్నది. మలవిసర్జనకోసం ఎవరూ బయటకు వెళ్లకుండా మరుగుదొడ్లను కట్టించారు. అయినా ఎవరైనా బయటికి వెళ్తే జరిమానా తప్పదు. ఆదర్శగ్రామం కావడానికి ప్రజలందరూ భాగాస్వాములయ్యారు. రాజమౌళి సార్ ఆదర్శ గ్రామాన్ని చేయడానికి చాలా కృషి చేశారు. పగలనక, రాత్రనక కృషి చేశారు. ఆదర్శ గ్రామంగా చేయడానికి ఇంకా కృషి చేస్తూనే వున్నారు. అతని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కృషి చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఆ చుట్టు పక్కల పరిశుభ్రంగా వుండేటట్లు చేయడం. పరిశుభ్రంగా లేకపోతే ఆ రోజు వాటర్ క్యాన్ బంద్. మాకు ప్రతి ఇంటికి మంచినీరు సదుపాయం ఉంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉన్నాయి. చెత్త చెదారం లేకుండా చూసుకుంటారు. చెత్త చెదారం వుంటే జరిమానా వేస్తారు. చెట్లను చాల బాగా చూసుకొంటాము. ప్రతి చెట్టును ఒక మనిషిలా భావిస్తాము.


మల విసర్జన కోసం బయటికి వెళ్తే 500 రూ.లు జరిమానా వేస్తారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటి వాటికి నీరు పోసి పెంచి పెద్ద చేశాము. చెత్త చెదారం బయట వేయరు. ఎవరి యింటి ముందు వారే శుభ్రపరుస్తారు. ఎవరి ఇంటి ముందు చెట్టుకు వారే శుభ్రపరుచుకొని నీరు పోస్తారు. మద్యం సేవించడం అనేది లేకుండా చేశారు. మా ఊరి సర్పంచ్ కృషి చేతే ఇవన్నీ జరిగాయి. ఒక రోజు చెట్టుకు నీరు పోయకపోతే ఫిల్టర్ నీళ్లు ఇవ్వరు. మా ఊరి బడిలో పిల్లలు వూరంతా తిరిగి బడి ఈడు పిల్లలంతా బడికి రావాలని చెప్తాం. ఇతర ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌లు ఊరిలోకి రాకుండా చేశారు. అందుకనే గంగదేవిపల్లి గ్రామం ఆదర్శ గ్రామం అయింది.


మా గ్రామంలో మలమూత్ర విసర్జనకు బయటకు వెళ్లరు. మద్య నిషేధ పథకం ఉన్నది. ఎవరు మద్యం సేవించకుండా చేశాము. ప్లాస్టిక్ నిషేధం చేశాము. రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటి వాటిని బ్రతికించడం. ఇంటి చుట్టూ మరియు పరిసరాలను శుభ్రం చేయడం. నీటి యాజమాన్య కమిటీలున్నాయి. వాటికి అధ్యక్షులను పెట్టడం జరిగింది. అందరు కలిసి గ్రామ పంచాయతీని జాగ్రత్తగా నిర్వహిస్తారు. వచ్చిన వనరులను జాగ్రత్తగా వాడుకోవడం. అందరికి అన్ని వసతులను అందించడం. వాతావరణం కాలుష్యం చేయకుండా ఇంటి చుట్టు చెట్లు నాటడం కారులో సీఎన్‌జీని వాడడం. అందరి కోసం వికాస శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం.


మా గ్రామంలో మద్యపానాన్ని నిషేధించారు. ఇంటికొక చెట్టును పెంచేందుకు పురిగొల్పారు. రోడ్లపైన చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా వుంచుకుంటాం. చెత్తను కుండీలో వేస్తారు తప్ప రోడ్లపైన వెయ్యరు. మా వూరిలో వాటర్ ట్యాంకు ద్వారా మంచి నీటి సౌకర్యం ఉంది. మా వూరు పచ్చగా ఉంటుంది.



మా గ్రామం ఎందుకు అభివృద్ధి అయింది అంటే?-మా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను పెంచడం వల్ల.
-బయట మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటంవల్ల.
-అలా వెళ్లిన వారికి 500 రూ.లు జరిమానా వేయవలసి ఉంటుంది.
-మద్యనిషేధం అమలులో ఉంది.
-మా గ్రామంలో 28 కమిటీలున్నాయి. ఆ కమిటీ ఇచ్చిన పనిని వారు పూర్తి  చేయాలి.
-అలా చేయకపోతే వారికి వాటర్ ఇవ్వరు.
-రోడ్డుకు ఇరువైపులా పెట్టిన చెట్లకు, నీరు పోసి దాని చుట్టు చెత్త  చెదారంలేకుండా చూడాలి.
-మా గ్రామం అభివృద్ధి చెందటానికి మరొక కారకుడు సర్పంచ్ గారు. మరియు  హెడ్‌మాస్టర్ గారు. వారు చేసిన సహాయం మేము మరచిపోము.



మా వూరు ఆదర్శ గ్రామం. ఎందుకనగా మద్యం సేవించరాదు. మల మూత్ర విసర్జనకు బయటకు వెళ్లరు. ప్రతి ఇంటికి కుళాయి, మరుగుదొడ్లు ఉన్నాయి. మా గ్రామ పెద్దలందరూ కలిసి కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కమిటీకి ప్రాధాన్యత ఉంటుంది. ప్లాస్టిక్ సంచులు ఎక్కడ బడితే అక్కడ వేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంటికి ఒక్కొక్క చెట్టు యిచ్చారు. చెట్టును మన ఇంట్లో ఒక మనిషిలా భావిస్తారు. ఆ చెట్టు చుట్టుపక్కల శుభ్రంగా ఉండాలి. ఆదర్శ గ్రామం కావటానికి ప్రజలు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ఊరిలో, గుట్కా, పాన్, అంబర్ వంటివి తినకూడదు.


రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటి వూరిని హరితవనంగా మార్చారు. చెత్త, చెదారం బయట వేయము. ఎవరి ఇంటి ముందు వారే శుభ్రపరుస్తారు. మద్యం సేవించడం అనేది లేకుండా చేశారు. మా ఊరి సర్పంచ్ చేత ఇవన్నీ జరిగాయి. మా ఊరి బడిలో పిల్లలు ఎక్కువ మంది లేకపోతే సర్పంచ్‌గారు, హెడ్‌మాస్టర్ గారు ఇల్లు ఇల్లు తిరిగి పిల్లలు రావాలని హెచ్చరించారు.


ఇంటి ప్రక్కల చెత్త చెదారం వేయరు. ఇంటి చుట్టు ప్రక్కల చెట్లు నాటుకున్నాం. లెట్రిన్‌కు బయటకు వెళితే 500 రూపాయలు జరిమానా కట్టాలి. ప్రతి చెట్టుకు మేమే నీరు పోయాలి. నీళ్లు పోయకపోతే శిక్ష వేస్తారు. ఎవరి ఇంటిముందు వారు శుభ్రంగా వుంచుకోవాలి. మా వూరికి మేము రక్షకులుగా నిలిచాం.


మా ఊరిలో అందరు కలిసి మెలిసి ఉంటారు. ఎవరికి ఏది కావాలన్నా మా ఊరి సర్పంచ్‌గారు అందుబాటులో ఉంటారు. మా ఊరికి ఇరువైపుల చెట్లు నాటాము. మా వూరిలో దాతల సాయంతో సిమెంట్ రోడ్లు నిర్మించుకోవటం జరిగింది. మా ఊరు చెత్తలేకుండా పరిశుభ్రంగా ఉంటుంది. బయట మూత్రం పోస్తే 500 రూపాయలు కట్టాలి. మా ఊరిలో అందరి ఇళ్లల్లో మరుగుదొడ్డి ఉంది. ఊరిలో ఇంకా బాలవికాస్ కమిటీ, డ్వాక్రాగ్రూప్ వంటివి అనేక గ్రూపులు ఉన్నాయి. మా గ్రామంలో ఏ సమస్య అయినా చెప్పాలని అనుకుంటే వారు తమ గ్రూప్ లీడర్‌కు చెప్పి అందరిని పిలుచుకుని రమ్మని చెపుతారు. సభ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. గ్రామసభలు మా గంగదేవిపల్లిని తీర్చిదిద్దుతున్నాయి.


రాజమౌళిగారు మా గ్రామాన్ని అభివృద్ధి చేశారు. బయట మలమూత్ర విసర్జన చేస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారు. మా వూరిలో 24 కమిటీలు వున్నవి. ఆ కమిటి వాటికి ఇచ్చిన పని చేస్తారు. మా గ్రామం ప్రపంచంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాడు రాజమౌళిగారు. మద్యం ఇక్కడ అమ్మరు. త్రాగరు. అలా చేస్తే ఫైన్ వేస్తారు. ఇక్కడ రోడ్డుకు ఇరువైపుల చెట్లు ఉంటాయి. అందరు కలిసి ఉంటారు. బడిలో కూడా చెట్లు నాటించారు. మా బడిలో మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంది. మా బడిని కూడా ఆదర్శబడిగా చేయాలన్నదే మా ఊరి లక్ష్యం. ప్రపంచమంతటి నుంచి ఈ ఊరికి వస్తున్నారు. దీనికి కారణం రాజమౌళి టీచర్.


మా గ్రామంలో ఇంటికొక చెట్టు పెంచాము. దానికి ప్రతి వారం వారం నీరు పోసి చెత్త చెదారం లేకుండా చేస్తాము. బయట మల మూత్ర విసర్జన చేయకుండా ఉంటాము. అందరికి మరుగుదొడ్లు ఉన్నాయి. మంచి నీరు. ఇంటి చుట్టుప్రక్కల చెత్త చెదారం లేకుండా చూసుకుంటాము. ప్లాస్టిక్ చెత్త చెదారం బయట వేయకుండా చెత్తకుండీలో వేస్తాము. రోడ్లను శుభ్రంగా ఉంచుతాము. ఊరిలో వాటర్ ట్యాంక్ ఉంది. అందరు వాటర్ క్యాన్ తెచ్చుకుంటారు. మంచి నీటి సౌకర్యం ఉంటుంది. ఊరిలో స్కూల్ ఉంది.




(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



గురువారం, ఆగస్టు 13, 2015

బాబుకు నోట్ల దడ...!!!

-ఓటుకు నోటు కేసు తప్పించుకునేందుకు కొత్త కుట్ర!
-లోకేశ్ డ్రైవర్‌కు తెలంగాణ ఏసీబీ తాఖీదులతోప్రతీకార చర్యలకు దిగిన ఏపీ యంత్రాంగం!
-మంత్రి కేటీఆర్ గన్‌మెన్, డ్రైవర్‌కు నోటీసుల జారీకి యత్నం
-సీఎం క్యాంప్ ఆఫీస్, ఇంటి వద్ద ఏపీ అధికారుల హైడ్రామా
-టీ న్యూస్‌కు నోటీసులు ఇచ్చి భంగపడిన తీరులో మరోసారి దుస్సాహసానికి ఒడిగట్టిన ఏపీ సీఐడీ

ఓటుకు నోటుకు కేసులో ఏసీబీ చర్యలతో ఏపీ సీఎం చంద్రబాబుకు గుండె దడ పట్టుకున్నట్టుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌తో నేరుగా మాట్లాడి ప్రలోభపెట్టిన చంద్రబాబు.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు మతిలేని చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు రేవంత్‌రెడ్డి తెచ్చిన యాభై లక్షల రూపాయలు చంద్రబాబు కుమారుడు లోకేశ్ వద్ద డ్రైవర్‌గా పని చేసే కానిస్టేబుల్ కొండయ్య ద్వారా వచ్చినట్లు ధ్రువీకరించుకున్న ఏసీబీ దర్యాప్తు అధికారులు ఆయనకు బుధవారం నోటీసులు ఇచ్చారు.


babu


కొండల్‌రెడ్డిని విచారిస్తే లోకేశ్ పాత్రపై ఆధారాలు బయటికి వచ్చే అవకాశం ఉండటంతో కంగారెత్తిన ఏపీ సీఎం.. తమ రాష్ట్ర సీఐడీని తెలంగాణపైకి ఎగదోశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీ రామారావు డ్రైవర్, గన్‌మెన్‌లకు ఏపీ సీఐడీ నోటీసులు అందించేందుకు అర్ధరాత్రి పూట హైదరాబాద్‌లో అలజడి చేసిందని అంటున్నారు. గతంలో చంద్రబాబు ఆడియో టేపులను ప్రసారం చేసిన టీ న్యూస్ చానల్‌కు అత్యుత్సాహంతో నోటీసులు ఇచ్చి భంగపాటుకు గురైన చంద్రబాబు యంత్రాంగం.. ఇదే పద్ధతిలో ఇప్పుడు కేటీఆర్ డ్రైవర్, గన్‌మెన్‌లకు నోటీసులు ఇచ్చే దుస్సాహసానికిపాల్పడిందని అంటున్నారు. 


అర్ధరాత్రి ఏపీ అధికారుల హల్‌చల్


చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్‌వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న కొండల్‌రెడ్డి అనే కానిస్టేబుల్‌కు డబ్బు రవాణాలో లింక్ ఉన్నదని అనుమానించిన తెలంగాణ ఏసీబీ అధికారులు.. అతడికి నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రతీకారంగానే.. మత్తయ్య ఫిర్యాదు మేరకు అని చెప్తూ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు గన్‌మెన్ జానకీ రాం, డ్రైవర్ సత్యనారాయణకు బుధవారం రాత్రి సీఆర్‌పీసీ 160 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ సీఐడీ బృందం, విశాఖ సీఐడీ బృందం హైదరాబాద్ వచ్చాయి. 


babu1


సీఎం క్యాంప్ కార్యాయలంలో కేటీఆర్ గన్‌మెన్ జానకీరాం, డ్రైవర్ సత్యనారాయణకు ఇచ్చేందుకు బుధవారం రాత్రి చేరుకున్నారు. అయితే సీఎం క్యాంప్ కార్యాయలంలోకి అనుమతి లేదని, జానకీరాం, సత్యనారాయణ అనే పేర్లతో ఇక్కడ ఎవరూ పనిచేయడం లేదని బందోబస్తులో ఉన్న పోలీస్ అధికారులు సీఐడీ అధికారులకు తేల్చిచెప్పారు. దీంతో అక్కడినుంచి వెనుదిరిగిన సీఐడీ బృందాలు నేరుగా బంజారాహిల్స్‌లోని కేసీఆర్ పాత ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూడా ఆ పేర్లతో ఎవరూ పనిచేయడం లేదని సమాధానం రావడంతో విజయవాడ సీఐడీ బృందం వెనుతిరిగింది. మరోవైపు విశాఖనుంచి వచ్చిన సీఐడీ బృందం పీఎస్ ప్రకాశ్ పేరుతో ఇక్కడ ఎవరైనా పనిచేస్తున్నారా? అంటూ బందోబస్తులో ఉన్న అధికారులను అడిగింది. 


అలాంటి వారు ఎవరూ లేరని చెప్పడంలో ఆ బృందం కూడా తిరిగి వెళ్లిపోయింది. విజయవాడ బృందానికి నేతృత్వం వహిస్తున్న డీఎస్పీ షావలీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తాము కేటీఆర్ గన్‌మెన్‌తో పాటు డ్రైవర్‌కు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. విశాఖ సీఐడీ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ తాము కేటీఆర్ పీఎస్ ప్రకాశ్ అనే వ్యక్తితో పాటు మరో గన్‌మెన్‌కు నోటీసులిచ్చేందుకు వచ్చామని తెలిపారు. దీనితో రెండు బృందాలుగా వచ్చిన అధికారులు.. మొత్తం నలుగురికి నోటీసులిచ్చేందుకు వచ్చినట్టు స్పష్టమైంది. 


అయితే.. ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయానికి వెళ్లిన ఏపీ బృందాలు.. అక్కడి విభాగపు ఉన్నతాధికారులతో మాట్లాడి, వెనుదిరిగాయి. ఓటుకు నోటు కేసులో నాలుగవ నిందితుడిగా ఉన్న మత్తయ్య జెరూసలేంను బెదిరించారన్న ఆరోపణలపై తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ ఆ నోటీసులలో పేర్కొన్నట్టు తెలిసింది. శుక్రవారం సాయంత్రం 5గంటలోపు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో ఉన్నట్లు సమాచారం.


లోకేశ్ డ్రైవర్‌కు నోటీసులతోనే!


ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇచ్చిన డబ్బులెక్కడివి? ఎవరి నుంచి వచ్చాయి? ఎవరి ఖాతాల నుంచి డ్రా చేశారు? అనే కీలక అంశాలు తేల్చేపనిలో ఉన్న ఏసీబీ.. ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత తనయుడు లోకేశ్‌బాబు వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న కానిస్టేబుల్ కొండల్‌రెడ్డిపై నజర్ వేసింది. 


రేవంత్‌రెడ్డికి 50 లక్షల నగదు కొండల్‌రెడ్డి అందించినట్లు గుర్తించామని, అందుకే ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యామని ఏసీబీలోని కీలక అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పదిన్నరకల్లా తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ యూసఫ్‌గూడలోని కొండల్‌రెడ్డి ఇంటికి ఏసీబీ దర్యాప్తు అధికారులు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు అతికించారు. కొండల్‌రెడ్డిని విచారిస్తే చినబాబు పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు స్పష్టంచేస్తున్నారు.


లోకేశ్‌పై ఏసీబీ నజర్?


చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఓటుకు నోటు కేసులో పాత్రధారుడేనన్న అనుమానాలు ఏసీబీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి గన్‌మెన్లతో కొండల్‌రెడ్డి ఎందుకు మాట్లాడాడు? లోకేశ్‌ను రేవంత్ ఎప్పుడెప్పుడు కలిశాడు? కలిసిన సమయంలో మాట్లాడిన అంశాలేంటి? లోకేశ్ ఎప్పుడైనా కుట్ర సమయంలో రేవంత్‌తో మాట్లాడాడా? మాట్లాడితే కుట్రలో లోకేశ్ పాత్ర ఏంటి? అన్న అంశాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్నట్టు ఆ విభాగపు అధికారులద్వారా తెలిసింది. అయితే ఈ కేసులో అరెస్టయిన వారి విచారణను కూడా ఏసీబీ ఇదే రీతిలో టైట్ చేసింది. సండ్ర గన్‌మెన్లు, రేవంత్ డ్రైవర్, గన్‌మెన్లు ఇలా ఏ చిన్న ఆధారాన్నీ ఏసీబీ అధికారులు వదిలిపెట్టకుండా సేకరించారు. ఈ క్రమంలో ఇప్పుడు లోకేశ్‌పై ఏసీబీ దృష్టిసారించినట్లు అర్థమవుతున్నదని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 


చంద్రబాబు డోర్ కొట్టిన ఏసీబీ


-కొండల్‌రెడ్డి అక్కడ లేకపోవడంతో ఎన్టీఆర్ భవన్‌కు
-అటు నుంచి యూసఫ్‌గూడలోని కొండల్‌రావు ఇంటికి
ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు చంద్రబాబు ఇంటి డోర్ కొట్టారు. చంద్రబాబు ఇంటికి వెళ్లాలంటే పోలీసు పెద్దలూ ముందూ వెనుకా ఆలోచించే నేపథ్యంలో నేరుగా ఆయన ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లటం విశేషం. అయితే.. వారు వెళ్లింది చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు కాదు! 


చంద్రబాబు తనయుడు లోకేశ్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న కొండల్‌రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు! అక్కడ కొండల్‌రెడ్డి లేకపోవడంతో ఆ వెంటనే టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్‌కు ఏసీబీ అధికారులు వెళ్లారు. అక్కడా ఆయన జాడ లేకపోవడంతో యూసఫ్‌గూడలో ఆయన నివసించే ఇంటికి వెళ్లి.. గోడకు నోటీసులు అతికించి వచ్చారు. తగిన ఆధారాలు దొరికితే ఈసారి చంద్రబాబు ఇంటికి వెళ్లి, ఆయనకు, ఆయన కుమారుడికి నోటీసులు అందజేయడానికీ వెనుకాడబోమని అధికారులు నిరూపించారు.



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!