[కేంద్రం తెలంగాణ విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణి సహింపరానిది. అన్యాయం జరిగింది తెలంగాణకు. కేంద్రం బుజ్జగిస్తున్నది సీమాంధ్రను. గాయం ఒకచోట ఉంటే, మందు ఒకచోట పెడుతోంది కేంద్రం! తెలంగాణ నేతలు సూచించిన సవరణములు పక్కన పెట్టడమే దానికి నిదర్శనం. బిల్లులో సవరణలు చేయకుండా తెలంగాణ ఇవ్వడం వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదు. ఉత్తుత్తి తెలంగాణ ఇచ్చినట్టే! కాబట్టి సత్వరమే తాడో, పేడో తేల్చుకోవాలి. వ్యతిరేకంగా ఉంటే, ఉద్యమమే మన బాట! తెలంగాణ వచ్చేదాక తెగించి కొట్లాడుడే!! ]
కేంద్ర మిత్తునన్న దేమి?
తెలంగాణ మిత్తు మనెను!
ఎట్టి తెలంగాణ మదియె?
ఏదైతేం? తెలంగాణ!!
బీజేపీ ఏమి యనెను?
బిల్లు పెట్టు! మద్దతిత్తు!
ఎట్టి బిల్లు కిత్తుమనిరి?
ఏదైతేం? బిల్లు బిల్లె!!
కేంద్రము తెలగాణ మిడిన,
బీజేపీ మద్దతిడిన,
వోట్లకొరకె, సీట్లకొరకె
అని తోచుచు నున్నదయ్య!!
ముఖ్యమంత్రి వ్యతిరేకత
కేంద్రమెట్లు సహియించెను?
సీమాంధ్రలొ కాంగ్రెసును
నిలుపుకొనుట కొరకు కాదె?
దగాపడిన తెలగాణకు
వృద్ధి పథకముల గూర్చక,
సీమాంధ్రను బుజ్జగించు
ప్రయత్నాలు ఎందుకయ్య?
తెలగాణులు తెలిపినట్టి
సవరణములు ప్రక్కనుంచి,
సీమాంధ్రుల మెప్పులకై
యత్నించుట నేమనవలె?
తెలంగాణపై కేంద్రము
చిత్తశుద్ధి లేకయుండె!
తెలంగాణ నిత్తు మనియు
అణచివేయుచుండిరయ్య!!
సవరణములు చేయకున్న,
తెలంగాణ వ్యర్థమయా!
ఆంక్షలన్ని విధియించియు,
రాష్ట్రమిడిన వ్యర్థమయా!!
తెలంగాణ నాంక్షలతో
ఇచ్చుట సరికాదయ్యా!
తెలంగాణ ప్రజలుకోరు
తెలంగాణ మీయుడయా!!
గత నష్టాల్ పూడ్చునట్టి
తెలంగాణ మీయుడయా!
మరల నష్టపరచునట్టి
తెలంగాణ మెందుకయా?
తెలంగాణ బిల్లును పాస్
చేతుమనియు చెప్పుటేల?
పాసగుట సమస్యకాదు!
సవరింపక యౌ సమస్య!!
ఉమ్మడిగా రాజధాని
యేల యుండవలయునయ్య?
ఆ విశాఖపట్టణమును
తాత్కాలికముగ జేయుడు!!
రాష్ట్రాలిర్వదియెన్మిది
యెట్టి హక్కులను పొందెనొ,
అవియె తెలగాణకిండు!
హక్కులేని రాష్ట్రమేల?
ప్రత్యేకత వలయు ననగ,
పొత్తులేల పెడుదురయ్య?
హైకోర్టు గవర్నరు లిక
ఉమ్మడిగా మాకెందుకు??
పోలవర డిజైను మార్చ
కుండ, భద్రగిరిన ముంపు
గ్రామములను సీమాంధ్రకు
ఇచ్చుటేల? ఈయ వలదు!
అక్రమ ఉద్యోగస్థుల
పెన్షనర్ల వల్ల తెలం
గాణ నష్టపోయెనయ్య!
ఇంక నష్టపోవలెనా?
ఉద్యోగుల, పెన్షనర్ల
స్థానికతను గుర్తించియు
పంపకమ్ము చేయకుండ,
జనాభాను కొనుట యేల?
కామన్ ఎంట్రెన్స్ వలదయ!
ఏ రాష్ట్రము కా రాష్ట్రము
విడిపోయిన తరి విద్యా
లయములందు పొత్తేలయ?
నదుల నీటి పర్యవేక్ష
ణా బోర్డులవల్ల నష్ట
మొదవుచుండ, మరల యేల
నియమింతురు? నష్టమె కద!
ఢిల్లీలో నిజాంరాజు
నిర్మించిన భవనమ్మును
సీమాంధ్రుల కిచ్చుటేల?
తెలంగాణ దది కాదా??
ఇన్ని విధములుగ కేంద్రము
తెలగాణను నష్టపరచు
అంశమ్ములు సవరింపక
బిల్లు పాసు చేయుటేల?
సవరణములు చేయకున్న,
తెలంగాణ వచ్చి సున్న!
ఏ లక్ష్యముతో కేంద్రము
పూనెనొ, అది నెరవేరదు!!
ఆంక్షలేని తెలంగాణ,
సంపూర్ణపు తెలంగాణ,
స్వేచ్ఛయున్న తెలంగాణ
మాకు కావలయునయ్యా!
కంటి తుడుపు చర్య వలదు!
పై పై ప్రేమయె వలదయ!
వట్టి తెలంగాణ మాకు
వలదు వలదు వలదయ్యా!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్లు:
> కేంద్రం బుజ్జగిస్తున్నది సీమాంధ్రను.
అదేమీ లేదు. బుజ్జగించబడుతున్నది బీజేపీ.
వారి సమ్మతి లేనిదే తెలంగాణా బిల్లు గట్టేక్కేది లేదు కదా?
కంటినీటి తుడుపు సవరణలతో సీమాంధ్ర ఒళ్ళో పడేది సున్నా అన్న సంగతి అందరికీ తెలుసు.
అవసరమైతే సీమాంధ్రులందరికీ మరణశిక్ష వేసి భూభాగం అంతా తెలంగాణాకే ఇవ్వాలనీ కోరేలా ఉన్నారు తెలంగాణా వాదులు!
>అవసరమైతే సీమాంధ్రులందరికీ మరణశిక్ష వేసి భూభాగం అంతా తెలంగాణాకే ఇవ్వాలనీ కోరేలా ఉన్నారు తెలంగాణా వాదులు!
ఎవరు ఎవరికి మరణశిక్ష వేస్తున్నారో, ఎవరి భూభాగం ముంపుకుగురౌతుందని ఎవరు లాక్కుంటున్నారో కళ్ళారా చూస్తూ కూడా అసత్యాలు మాట్లాడటం తగదు.
మేం ఎవరి మరణాన్నీ కోరం. మా తెలంగాణకు మీ సీమాంధ్ర భూభాగంలో పూచిక పుల్లంతైనా భూమి అవసరంలేదు.
పోలవరం ముంపుగ్రామాలు ఇవ్వడం,
ఢిల్లీలో ఏపీ భవన్ ఇవ్వడం,
హైదరాబాదును పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా చేయడం,
శాంతి భద్రతలను గవర్నరుకు ఇవ్వడం,
ఉమ్మడిగా గవర్నరును, హైకోర్టును కొనసాగించడం,
జనాభా ప్రాతిపదికన ఉద్యోగులను, పెన్షనరులను పంచడం,
మా విద్యాలయాల్లో కామన్ ఎంట్రెన్స్ పెట్టి మీ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించడం…
ఇవన్నీ సీమాంధ్రను బుజ్జగించడం కోసం కాక మరెందుకనుకున్నారు? అన్యాయానికి గురైన తెలంగాణకే మళ్ళీ అన్యాయంచేస్తూ, సీమాంధ్రకే అవకాశాలు కల్పించడం బుజ్జగింపుకాదా?
బిల్లులో తెలంగాణకు సంబంధించిన ఏ సవరణలూ చేయకుండా, తెలంగాణ ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత? అంతోటి దానికి బీజేపీని బుజ్జగించడం అనవసరం.
బీజేపీ మద్దతిస్తానని ఎప్పుడో చెప్పింది. దానికి తెలంగాణలోనే బ్రతుకు ఉంది. కాబట్టి అది మద్దతు ఇవ్వకుండా ఉండే ప్రసక్తే లేదు.
సీమాంధ్రుల దొంగ ఏడుపులు చూసి, అక్కడ కాంగ్రెస్ స్థానం పడిపోకూడదని కేంద్రం సీమాంధ్రను బుజ్జగిస్తున్న విషయం జగమెరిగిన సత్యం.
ఆరు నూరైనా మేం అన్యాయానికి గురికావడానికి ఒప్పుకోం. ఉద్యమిస్తాం. సాధించుకుంటాం.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి