విభజనమ్ము తప్పదనియు
తెలిసికూడ సీమాంధ్రపు
ఒక్క నేత కూడ ప్రజల
అవసరములు అడుగడాయె!
ప్రజల మభ్యపెట్టుటకై
కపట ప్రేమ నటియించుచు,
సమైక్యాంధ్ర అను పాటయె
పాడిరయ్య ఓట్లకొరకు!
మనసులోన ఓట్లు సీట్లె,
ప్రజల క్షేమమే పట్టదు!
విభజనమ్ము జరుగు తరిని
’ఇవి కావలె’ నని యడిగిరె?
సమైక్యాంధ్ర పాట పాడ
పోటీపడె పార్టిలన్ని!
ప్రజావసరముల గురించి
కేంద్రమ్మును అడుగరైరి!!
బిల్లు సవరణములందున
ప్రజావసరముల జేర్చక,
సభలోపల వారలపుడు
నానా యాగీ చేసిరి!
వారల తన్లాట, వారి
ఆస్తులు రక్షించుకొరకె!
ప్రజల కొరకు కాదయ్యా,
పైకి ప్రేమ నటియించిరి!!
వారల తన్లాట, వారి
పెత్తనముల పెంపుకొరకె!
ప్రజల కొరకు కాదయ్యా,
పైకి ప్రేమ నటియించిరి!!
బిల్లు పాసు అయిన పిదప,
వారె మొసలి కన్నీరును
కార్చుచుండ్రి అన్యాయము
జరిగెననుచు ప్రజలముందు!
స్వార్థమునకె రాజధాని
ఇక్కడపెట్టుడని ఒకరు,
కాదిక్కడ యని యొక్కరు
తగవులాడుకొనుచుండిరి!
నిజముగ అభివృద్ధికోరు
వారలైన, పార్టీలను
ప్రక్కనిడియు చర్చచేసి,
ప్రణాళికలు వేయవలెను!
అట్లుకాక, ఓట్లు సీట్లు
పొంది కోట్లు గడియింపగ
జూచుచుండిరయ్య వారు!
ఎంత గొప్పవారు, వారు?
తెలగాణను దోచినారు,
సీమాంధ్రను దోచలేరె?
దోపిడిలో నాది, నీది
పట్టదు వారికి ఎపుడును!
నాటకములు నమ్మకుడయ,
దోపిడులకు తోడ్పడకుడు,
కపటమ్మును తెలిసికొనుడు,
నిస్స్వార్థుల నెన్నుకొనుడు!
జై తెలంగాణ! జై ఆంధ్రప్రదేశ్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి