ఏ ప్రాంతం వారు వేరు రాష్ట్రం కోరుతున్నారో, వారి యిష్టానిష్టాలే ప్రభుత్వం కోరాలి గానీ, వేరే ప్రాంతం వారు వద్దంటే ప్రభుత్వం మానడం ప్రజాస్వామ్యం కాదు.
ఒక ప్రాంతంలో నివసించే కొందరు ప్రజలు, తాము వేరు పడతామంటే, వేరుపడతామనేవాళ్ళనే అభిప్రాయం అడగాలి గానీ, మిగతా వాళ్ళు, విడిపోతామనేవాళ్ళకు ఇష్టం ఉన్నా లేకున్నా తమతోనే కలిసి ఉండాలని కోరటం అప్రజాస్వామికం.
అదే నేడు ఆంధ్రప్రదేశ్‍లో జరుగుతున్నది. గతంలో రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‍లో కలుపబడి, ఉపేక్షకు గురై, తిరిగి తన పూర్వ రాష్ట్ర హోదానే కోరుతుంటే, సీమాంధ్రులు తమకు ఇష్టం లేదంటున్నారు.
ఇక్కడ విడిపోయేవారి యిష్టమేగానీ, ఇతరుల యిష్టానిష్టాలతో పనిలేదని తెలుసుకోవడం లేదు. మైనారిటీ ప్రజల హక్కులకు మెజారిటీ ప్రజలు భంగం కలిగింపకుండటానికే అధికరణం "మూడు" ఏర్పాటయిన విషయాన్ని వాళ్ళు మరువరాదు.
ఈ ఆర్టికల్ లేకుంటే సీమాంధ్రులు ఇప్పటికీ మదరాసులోనే బానిసబతుకులు బతికేవారనేది అక్షర సత్యం.
ఒకనాటి అనుభవాన్ని మరచిపోయి, "అత్తా ఒకింటి కోడలే" ననే సామెతను మరచిపోయి, తెలంగాణను అడ్డుకుంటున్నారు సీమాంధ్రులు.
మదరాసు అత్తనుండి వేరుకాపురం పెట్టటానికి ఆంధ్రా కోడలు పోరాడి, విజయం సాధించింది. నేడు ఆ కోడలే అత్తగా మారింది. ఆ ఆంధ్రా అత్త, ఈ తెలంగాణ కోడల్ని వేరుకాపురం పెట్టకుండా అడ్డుపడుతోంది! గతం మరచిపోయింది.
తెలంగాణుల హక్కును కాలరాయవద్దని ఎంత వేడినా, వ్యతిరేకించడం బాధాకరం.
ఈ సమయంలో ఉపయుక్తంగానూ, కొంత ఉపశమనంగానూ ఉంటుందనే ఊహతో ఈ దిగువ తెలిపిన పత్రికా బ్లాగును చూడవలసిందిగా పాఠకులను కోరుచున్నాను. దయతో చదువగలరు.
ప్రజలు విడిపోవఁగాఁ గోర, వద్దనుటయె
యప్రజాస్వామ్య మగునయ! యదియ వారి
జీవనపు హక్కులఁ బగులఁ జీల్పఁ బూను
టగును! కావున నాపెద మనఁగ వలదు!
ఈ ప్రజాస్వామ్య దేశాన నెవ్వరైన
వేరుపడెదమనంగనె, వారి యిష్ట
మునకు వేరొక ప్రాంతంపు జనుల యిష్ట
మవసరమెలేదు! వారల మాన్పవలదు!
గత తెలంగాణ రాష్ట్రమ్ము గాన దీని
నాంధ్ర దేశానఁ గలుపంగ నైన నష్ట
ములను సహియింప నోపక, వలచి పూర్వ
రాష్ట్రమునె కోరఁగా, నాపరాదు కాదె!
ఎన్నియో యుదాహరణాలు నున్న కతన,
నీ ప్రజాస్వామ్య దేశాన నెవ్వరైన
వారి యిష్టాలు దెలుపంగ వారణమును
చేయఁగానౌనె? యాపుట న్యాయమగునె?
దేనినిం బ్రజాస్వామ్యమ్ముగాను జెప్పి
నారొ రాజ్యాంగమునఁ జూడ, నచటి ప్రజలు
దేనిఁ గోరుదురో దానిఁ దీర్పఁగాను,
ప్రభుత తలయూచి, చేయఁగా వలయునయ్య!
ప్రభుత తలపెట్టు కార్యాలఁ, బ్రజ తలనిడి,
తోడుపడఁగఁ, బ్రజాస్వామ్య మోడకుండు!
నీ పరస్పర సహకార మీయు కతన
నీ ప్రజాస్వామ్య దేశమ్ము హితముఁ గనును!
* * * * *
ఈ క్రింది బ్రాకెట్లో ఇచ్చినదానిపై క్లిక్ చేయండి:
[ఈ పత్రికా నిర్వాహకులు శ్రీ "విశేఖర్"గారికి నా కృతజ్ఞతలు]
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి