గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, ఫిబ్రవరి 03, 2014

హైదరాబాదులో సీమాంధ్రులు


ఉత్సాహము:
హైద్రబాదులోన మేము హాయిగాను బ్రతుకఁగన్
క్షుద్రరాజకీయములతొ కుట్రఁ జేయవద్దయా!
భద్రముగనె యుంటిమయ్య భద్రత యిఁక నేలకో?
నిద్రలోన నున్నవారె? నేతలార మానుఁడీ!

తే.గీ.
ఈ తెలంగాణ ప్రజలు మాకింతవరకు
నెట్టి హానియుఁ దలపెట్ట రిందువలన
హైద్రబాదునందున శాంతి భద్రతలను
నవ్యరాష్ట్రమ్మునకె యీయ న్యాయమయ్య!

ఆ.వె.
సీమనేతృవర్గ గోముఖవ్యాఘ్రాలు,
పెత్తనంపు వర్గ పీడకులును
హైద్రబాదులోన హైడ్రామ నడుపంగ,
శాంతిభద్రతలిటఁ జక్కఁబడునె?

కం.
తెలగాణ రాష్ట్రమేర్పడి
నిలకడతోఁ బాలన మిట నేతల కిడఁగన్
దులకించును శాంతి యెపుడు
వెలుఁగును మన హైద్రబాదు విశ్వములోనన్!

ద్విపద:
ఏప్రాంత నేతలు నాప్రాంతమందె
సప్రజాస్వామ్య ప్రశస్తి నెఱింగి,
పాలన సేసినఁ బరమశాంతులును
క్షేమమెసంగును శ్రేయమ్ముఁ గల్గు!
కుట్రకుతంత్రాలు కోపతాపాల
చట్రమున్ వదలిన శాంతిసౌఖ్యాలు
హైదరాబాదులో నద్వితీయముగ
మోదమ్ముతోడ నామోదమ్మునందు!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

7 కామెంట్‌లు:

Kali Prasad Paluri చెప్పారు...

మరి హైదరాబాద్ పై రక్షణ అధికారాన్ని కేంద్రానికి కట్టబెట్టే బిల్లును మీరెందుకు సమర్దిస్తున్నారు? రెప్పొద్దున్న కేజ్రివాల్ లాగే మీ ముఖ్యమంత్రి కూడా పోలీసులతో పని చేయించటానికి రోడ్డు ఎక్కవలసి వస్తుంది.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

హైద్రాబాద్‍ రక్షణ అధికారాన్ని కేంద్రానికి కట్టబెట్టడానికి మేం ఎంతమాత్రమూ ఒప్పుకోం...సమర్థించం. మాకు ఆంక్షలులేని తెలంగాణ ఇవ్వాలని మాత్రమే ఉద్యమం చేస్తున్నాం. ఆంక్షలు పెడితే ఒప్పుకోం. ఆంక్షలు లేని తెలంగాణ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ముఖ్యమంత్రికిగానీ, ఇతర నేతలకుగానీ రోడ్డెక్కవలసిన పరిస్థితి రానేరాదు.

Kali Prasad Paluri చెప్పారు...

ఆ రహస్యమేదో కొంచెం మా వాళ్ళకి కూడా చెబుదురూ. మాక్కావలసినవన్ని సాధించుకొస్తారు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఆ రహస్యం నేను మీకెంత చెప్పినా బోధపడదు. అరవై ఏండ్లు ఉద్యమం చేసింతర్వాత దానంతటదే బోధపడుతుంది. అప్పుడు సాధించుకొందురుగానీ మీక్కావలసినవన్నీనూ. అప్పటిదాకా ఇలాంటి ప్రశ్నలు వేయకండి.

విశ్వరూప్ చెప్పారు...

మధుసుధన్ గారు,

హైదరాబాదులోని సీమాంధ్రులగురించి శాంతిభద్రతలగురించి మీరు వ్రాసిన పద్యాలు చక్కగా, అర్ధవంతంగా ఉన్నాయి.

నాదొక చిన్న సందేహం: అరసున్నా ఎప్పుడు వాడాలి? మరియూ అరసున్నా ఉన్నప్పుడు ఎలా పలకాలి చెప్పగలరా?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

విశ్వరూప్‍గారూ!

నమస్కారం. మన భాషలో అరసున్నాలు సహజసిద్ధంగా ఉన్న పదాలు చాలా ఉన్నాయి.(ఉదా. మూఁక, నేఁడు, మూఁడు, కూఁత మొ.) ఇవి నిఘంటువుల్లో చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. లేదా ప్రాచీన పద్యకావ్యాలలో అరసున్నా ఉన్న పదాలు చాలా కనిపిస్తాయి. వాటిని గమనించినట్లైతే బోధపడతాయి.

ఇక వ్యాకరణ సాధ్యాలు వ్యాకరణంపై పట్టుంటే సాధ్యపడతాయి. వ్యాకరణ శాస్త్రపఠనమే శరణ్యం. లేదా ప్రాచీన గ్రంథపఠనం దీనికి మార్గదర్శనం చేస్తుంది. ఉదాహరణకు...నకారం తర్వాత వచ్చే కచటతపలు గజడదబలవుతాయి...నకారం నిండుసున్నాగానో, అరసున్నాగానో మారుతుంది. (ఊరిలోన్+పిల్లలు=ఊరిలోఁ బిల్లలు).

పదప్రయోగాలకై నిఘంటువుల్నిగానీ, నేరుగా ప్రాచీన పద్యకావ్యాల్నిగానీ ఆశ్రయింపవలసిందే!

అరసున్నాను పలకడం వీలుకానిపని. దానికి ప్రత్యేక ధ్వని సంకేతం లేదు. అరసున్నా పలకదు. అరసున్నా ఉన్న పదాన్ని (ఉదా. ఏఁడు[=సంవత్సరం] దీన్ని ఏడు[=సంఖ్య] అనే పలకాలి) అరసున్నా లేకుండా రాసినట్టుగానే పలకాలి. అరసున్నా ఉన్న పదాలకు, లేని పదాలకు అర్థంలో తేడాలుంటాయి. ఇది అనుభవంలోనే తెలుస్తుంది. ప్రాచీనపద్యకావ్యపఠనమే మార్గదర్శకం.

స్పందించినందుకు ధన్యవాదాలు.

విశ్వరూప్ చెప్పారు...

ఇప్పుడు అర్ధం అయింది.ఈ సందేహం నాకు చాలాకాలంగా ఉంది.

ఓపిగ్గా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి