గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 07, 2015

ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటులో ఎందుకీ తాత్సారం?


రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్నా ఇంకా ఉమ్మడి హైకోర్టు కొనసాగడం విచిత్రంగా ఉన్నది. వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్‌సభలో మంగళవారం టీఆరెస్ ఎంపీలు ఆందోళన చేపట్టవలసి వచ్చింది. అయినా కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇవ్వకుండా దాట వేస్తున్నది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని...పదిహేను రోజుల్లో అన్ని పక్షాలతో చర్చలు జరుపుతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ యధాలాపంగా బదులిచ్చారు. వెంటనే ఆంధ్ర ప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలె తప్ప ఇంకా చర్చించేదేమున్నది? గతంలో ఇదే పార్లమెంటు వేదికపై టీఆరెస్ సభ్యుడు నిలదీసినప్పుడు కేంద్రం తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కాలయాపన చేయడం, పక్కవారిపైకి తోసేయడం తప్ప చేసిందేమీ లేదు. రాష్ట్ర విభజన తరువాత అన్ని విభాగాలు తదనుగుణంగా చీలిపోవాలె తప్ప మళ్ళా ప్రతి రంగానికి ఆందోళన చేయవలసిన పరిస్థితి రాకూడదు. 
ఆంధ్ర ప్రదేశ్‌కు విడిగా హైకోర్టు ఏర్పాటు చేయడం ఆచరణ సాధ్యం కాని పెద్ద విషయమేమీ కాదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాము ఎంపిక చేసుకున్న స్థలంలో వసతి సమకూరిస్తే సరిపోతుంది. వసతుల కల్పనలో తోడ్పాటు అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ విభజనను అడ్డుకోవడం క్షమార్హం కాదు. దీని వల్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కూడా ఎంతో నష్టం వాటిల్లుతున్నది. ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసుకుంటామని భావిస్తే అన్ని విధాలా సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవసరమైతే ఇప్పుడున్న వసతి వారికి ఇచ్చి తాము గచ్చిబౌలి ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటామని కూడా సూచించింది. 
అయితే హైదరాబాద్ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ సంసిద్ధతను ప్రశంసిస్తూనే, ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జాప్యానికి కారణం న్యాయశాఖదే అయినట్టుగా చెబుతున్న కేంద్రం వైఖరిని తప్పు పట్టింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం- నిధులు ఇవ్వాల్సింది కేంద్రం కాగా, ప్రకటన జారీ చేయాల్సింది రాష్ట్రపతి అని వివరించింది. ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేసే ప్రాంతం ఏదో చెబితే చాలదని, స్థలం చూపించి ఏర్పాట్లు చేయాలని కూడా హితవు చెప్పింది. అయినా మొద్దుబారిన ప్రభుత్వాలకు చలనం రావడం లేదు. 
రెండు రాష్ర్టాలలో ప్రజాభిప్రాయం హైకోర్టు విభజనకు అనుకూలంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమం ముందుకు తెచ్చిన ప్రధానాంశాలలో న్యాయ వ్యవస్థలో వివక్షను తొలగించడానికి సొంత హైకోర్టు ఏర్పాటు చేసుకోవడం ఒకటి. రాష్ట్ర విభజనే ఇటువంటి అన్ని సమస్యలకు పరిష్కారంగా గుర్తించి న్యాయవాదులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నారు. ఎన్నో ఉద్యమాలకు న్యాయస్థానాలు వేదికలయినాయి. రాష్ట్ర ఆవిర్భావం తరువాత కూడా తెలంగాణకు సొంతంగా హైకోర్టు ఉండాలని ఉమ్మడి పేర సాగే వివక్ష వద్దని న్యాయవాదులు ఉద్యమిస్తున్నారు. ఈ పరిస్థితి ఉద్రిక్తతలకు కూడా దారి తీసింది. సీమాంధ్రలో కూడా హైకోర్టు విభజనకు ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉన్నది. ఇటీవలనే విజయవాడలోని న్యాయవాదులు తమ రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు కావాలని ఆందోళన చేపట్టారు. 
తమకు హైకోర్టు బెంచి కావాలని గుంటూరు న్యాయవాదులు ఎంతో కాలంగా ఉద్యమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర విభజన అనివార్యమని వారు గ్రహించారు. దీంతో హైకోర్టు బెంచి అని కాకుండా సొంత హైకోర్టే కావాలని డిమాండ్‌ను మార్చుకున్నారు. దీనికి తెలంగాణవాదులు కూడా హర్షం వెలిబుచ్చారు. నిజానికి సీమాంధ్ర పెద్దలు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలనే డిమాండ్‌కు అన్ని ప్రాంతాల మద్దతు కూడగట్టడానికి కర్నూలులో రాజధానిని, గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని శ్రీబాగ్ ఒప్పందంలో అవగాహనకు వచ్చారు. 1953 అక్టోబరులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే 1954 జూలై కల్లా - ఏడాది తిరగక ముందే- తమకంటూ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసుకున్నారు. 
ఆ తరువాత రెండు ప్రాంతాల నెత్తి కొట్టి ఇటు తెలంగాణ ప్రజల అభిప్రాయాలను కాలరాచి హైదరాబాద్‌కు అడ్డా మార్చారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లోనే అడ్డా వేసిన సీమాంధ్ర పెద్దలు ఇంకా ఇక్కడే కొనసాగడానికి కుట్రలు పన్నుతున్నారు. హైకోర్టు విభజనలో జాప్యం జరిగే కొద్దీ ఆందోళనలు, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తక్షణం విభజన కోసం చర్యలు తీసుకోవాలె.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి