గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 09, 2015

శాస్త్రీయ దోపిడీ, అశాస్త్రీయ విభజన!


తెలంగాణను అయిదున్నర దశాబ్దాలకుపైగా శాస్త్రీయంగా దోపిడీ చేసిన వర్గానికి ప్రతినిధి అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, తమ శాస్త్రీయ దోపిడీ ఇక కొనసాగే అవకాశం లేకుండా రాష్ట్రం విడిపోవడం జీవితాంతం జీర్ణం కాని పీడ కలగా మారింది. దోపిడీకి అవకాశం ఉంటే అది శాస్త్రీయ సమైక్యత అవుతుంది. అవకాశం లేకుండాపోతే అశాస్త్రీయ విభజన అవుతుంది. అందుకే ఆయన మంత్రివర్గం ఈ నెల నాల్గవ తేదీన సమావేశమై, తమ కొత్త రాష్ట్రం ఏర్పడి సంవత్సరం పూర్తయ్యే సందర్భంగా జూన్ 2న నవనిర్మాణ దీక్ష తీసుకోవడంతో పాటు, విభజన అన్యాయంగా, అసంతృప్తికరంగా జరిగిందంటూ ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ విధమైన ప్రచారంలో ఆయనకు వేరే ఉద్దేశాలు ఉన్నాయని ఎవరైనా అనవచ్చు. తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం, కేంద్ర ప్రభుత్వ వాగ్దాన భంగాలను ఎత్తి చూపడం అనే ఎత్తుగడలు అందులో కలిసి ఉంటే ఉండవచ్చు. కానీ చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు ముందే గాక, ఏర్పాటైన తర్వాత కూడా తీసుకున్న వైఖరిని, చేస్తున్న చర్యలను గమనించినప్పుడు, లేడి పిల్లను పులి వలె తెలంగాణను సీమాంధ్ర దోపిడీ వర్గం శాస్త్రీయంగా భుజించే అవకాశం ఇక లేకపోయిందన్న దుగ్ద, కక్ష అడుగడుగునా కన్పిస్తాయి. కనుక, జూన్ 2 నుంచి నవ నిర్మాణ దీక్షతో పాటు, అన్యాయమైన, అసంతృప్తికరమైన విభజన పేరిట తెలంగాణ వ్యతిరేక భావనలను సీమాంధ్ర సాధారణ ప్రజలలో మరొక మారు రెచ్చగొట్టేందుకు ఆయన ప్రయత్నించే అవకాశం ఎంతైనా ఉన్నది. ఆ పని ఆయన చేయకపోతే ఆశ్చర్యపడాలి.


రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరుగుతున్నదని, జరిగిందని గత ఏడాది కాలంగా ఎంతో వేదనను నటిస్తున్న చంద్రబాబు, గత అయిదున్నర దశాబ్దాలుగా తమ ప్రాంతపు ధనికవర్గం తెలంగాణను ఎంత శాస్త్రీయంగా, ఎంత చట్టబద్ధంగా, ఎంత వ్యవస్థీకృత రూపంలో దోపిడీ చేసిందో చెప్పగలరా? ఆ నీతి నిజాయితీలు ఆయనకున్నాయా? ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి రోజు నుంచి వారు ఒప్పందాలను, చట్టాలను బాహాటంగా ఉల్లంఘించడమే కాదు, తమకు అనుకూలమైన చట్టాలను, నిబంధనలను కొత్తగా చేసుకుని దోపిడీని శాస్త్రబద్ధంగా మార్చారు. తమకు రాజకీయం గా మెజారిటీ ఉండటం, అధికార యంత్రాంగం తమ గుప్పెట్లో ఉండటం, తాము విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి తెలంగాణ ద్రోహులు కొందరు సహకరించడం అనే మూడు అంశాలను ఆధారం చేసుకుని తమ శాస్త్రీయ దోపిడీని నిరాఘాటంగా కొనసాగించారు. తమ ఆర్థిక శక్తి అందుకు తోడు కాగా తెలంగాణను తమ అంతర్గత కాలనీగా కూడా శాస్త్రీయంగానే మార్చుకున్నారు. వీటన్నింటి బలంతో కేంద్ర నాయకత్వాలకు, అధికార గణాలకు ఆకర్షణీయమైన వలలు విసిరి, అక్కడి ఆమోదముద్రలు కూడా శాస్త్రీయంగా వేయించుకున్నారు.


చంద్రబాబు బయటకు ఒప్పుకోకపోవచ్చు గాని, పరిపాలనలో ఆయన వంటి అనుభవజ్ఞునికి, పైగా ఆర్థికశాస్త్రం చదివిన వ్యక్తికి ఒక రహస్యం తెలియకపోదు. ఎక్కడైనా, ఎప్పుడైనా అశాస్త్రీయంగా జరిగే దోపిడీ కన్నా శాస్త్రీయంగా-చట్టబద్ధంగా- వ్యవస్థీకృత రూపంలో జరిగే దోపిడీయే అనేకానేక రెట్లు ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అదే అసలు దోపిడీ అని ప్రపంచ రాజకీయ చరిత్రలు, చంద్రబాబు చదివిన ఆర్థిక చరిత్రలు చెప్తాయి. అందుకే మనం బ్రిటిష్ వలస పాలనా వ్యవస్థ అనే శాస్త్రీయ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాము తప్ప, ఎవరో గవర్నర్ జనరల్ అక్రమార్జనలకు వ్యతిరేకంగా కాదు గదా. అదేవిధంగా తెలంగాణ ప్రజలు సీమాంధ్ర ధనిక వర్గాల శాస్త్రీయ దోపిడీపై ఉద్యమించారు గాని, అక్కడి అధికారులు లంచాలు తిన్నారని కాదు. కనుక ఎప్పుడైనా శాస్త్రీయమైన-చట్టబద్ధమైన-వ్యవస్థీకృతమైన దోపిడీ అన్నదే అజెండాలోని విషయమవుతుంది. దానిని కొనసాగించడం దోపిడీదారుల అజెండా. కూల్చివేయడం బాధితుల అజెండా. నిరుడు జూన్ 2 నాడు తమ అజెండా ఓడిపోయి తెలంగాణ ప్రజల అజెండా గెలవడం చంద్రబాబుకు, పార్టీలకు అతీతంగా సీమాంధ్ర ధనిక వర్గానికి, వారి ఆశ్రితులకు, తెలంగాణకు చెందిన తమ భృత్య తరగతికి చెప్పలేనంత వేదనను కలిగిస్తున్నది. 


ఇందువల్ల తమ వర్తమాన తరానికి, రానున్న తరాలకు వాటిల్ల గల ఆర్థిక-రాజకీయ నష్టాలను ఆర్థికశాస్త్ర విద్యార్థి అయిన చంద్రబాబు ఎన్నటికీ లెక్కవేయలేరు. అటువంటి నష్టాలకు కారకులైన భారతీయులను బ్రిటిష్ వారు మన్నించలేనట్లు, తెలంగాణ ప్రజలను చంద్రబాబు ఎన్నటికీ క్షమించలేరు. కానీ చంద్రబాబు కన్న బ్రిటిష్ వారు కొంత నాగరికులనాలి. భారతీయులు తమ వలస పాలనను కూలదోయడం అశాస్త్రీయమనలేదు వారు. పైగా, తమ దుర్మార్గాలకు అమృతసర్ ప్రజల నుంచి మొదలుకొని మాజీ వలస దేశాలలో పలువురిని క్షమాపణలు కోరుతున్నారు. కొన్ని సందర్భాలలో పరిహారాలు కూడా చెల్లిస్తున్నారు. చంద్రబాబు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సీమాంధ్ర ధనికవర్గం, తమ ఇన్నేళ్ల శాస్త్రీయ దోపిడీకి తెలంగాణతల్లికి క్షమాపణలు చెప్పగలరా? పరిహారం చెల్లించగలరా?


మెర్కంటైల్ సామ్రాజ్యవాద దశ నుంచి పారిశ్రామిక విప్లవానంతర సామ్రాజ్యవాద దశ వరకు పాశ్చాత్య దేశాలు ఆర్థిక చరిత్రను అధ్యయనం చేసిన వారు, పాశ్చాత్య దేశాల సంపదలకు ఒక ముఖ్యకారణం లాటిన్ అమెరికన్ సహజ వనరులతో ఆరంభించి పదులకొద్దీ దేశాల వనరులను, మార్కెట్లను కొల్లగొట్టడమని చెప్తారు. అదంతా ఆ పాశ్చాత్య దేశాల శాస్ర్తాలు, ఎథిక్స్ ప్రకారమే జరిగింది. అయితే, అటువంటి దోపిడీ తమ సంపదలకు ఒక ముఖ్య కారణమని అంగీకరించే నిజాయితీని వలసలు అంతమైన తర్వాత అక్కడి నాయకత్వాలు, మేధావి వర్గాలు చూపుతూ వస్తున్నాయి. తెలంగాణ విషయంలో సీమాంధ్ర నాయకత్వాలు, ధనిక వర్గాలు, మేధావి వర్గాలు అటువంటి నిజాయితీని ఎప్పటికైనా చూపగలవా?తెలంగాణను హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేసినట్లు అలుపెరుగక రాత్రింబవళ్లు కలవరించే చంద్రబాబు, ఈ ప్రాంతాన్ని తాము ఇన్ని దశాబ్దాలు చేసిన దోపిడీ ఎంత, బాగుపడింది ఎంత, హైదరాబాద్ బాగు అనేది ఏమిటి, ఎంత, ఏ వర్గాల కోసం అన్నది పాశ్చాత్యులు చూపుతున్న నిజాయితీ, అనుసరించి అయినా వివరించగలరా?


చంద్రబాబు వర్గపు ఇదే విధమైన శాస్త్రీయ దోపిడీకి, అశాస్త్రీయమైన పలవరింతలకు ఇంకా నడుస్తున్న పోలవరం కథ ఒక గొప్ప ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తీరు తనకు బాధాకరంగా ఉందని ఆయన ఇప్పటికి కొన్ని వందల సార్లు అన్నారు. పోలవరం నిర్మాణంలో ఈ దేశపు రాజ్యాంగంతో సహా, బాహాటంగా ఉల్లంఘనకు గురికాని సంబంధిత చట్టం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. అందువల్ల లక్షలాదిమంది గిరిజనులు, దళితులు, మత్స్యకారులతో పాటు ఇతర బీసీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. తెలంగాణకు చెందిన వేలకు వేల ఎకరాలు సాగుభూములు, అడవులు, జంతుజాలం, పర్యావరణం ధ్వంసమవుతున్నాయి. మధ్య రాతియుగ కాలం నుంచి అక్కడి ఆవాసముంటున్న కొన్ని తెగల సంస్కృతులు, సామూహిక జీవనాలు నామరూపాలు లేకుండా పోతున్నాయి. కానీ, పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు వల్ల తమ వారికి కలిగే ప్రయోజనాలను లెక్కలు గడుతూ ఎద ఉప్పొంగుతున్న చంద్రబాబుకు, ఈ నష్టాలన్నీ అశాస్త్రీయంగా, రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఎన్నడూ కన్పించలేదు. ఈ నష్టాలు తనకు బాధను కలిగిస్తున్నాయని ఆయన ఒక్కసారైనా, నటన కోసమైనా, మొసలి కన్నీరు అయినా కార్చినట్టు లేరు.


రాజ్యాంగంలోని అయిదవ షెడ్యూల్, ఆర్టికల్ 338(9), పంచాయతీరాజ్, పెసా, పునరావాస నియమాలు, జాతీయ గిరిజన విధానం (ముసాయిదా) 2006, భూసేకరణ చట్టం, ఏజెన్సీ చట్టాలలో పోలవరం కోసం ఉల్లంఘించనివి ఏవీ లేవు. అదీగాక అక్కడి గిరిజనులను, ఇతర ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసగించేందుకు, బెదిరించేందుకు, అక్రమంగా కేసుల పాలు చేసేందుకు, భయపెట్టి పారదోలేందుకు, సీమాంధ్ర నుంచి వచ్చి షెడ్యూల్డ్ ప్రాంతంలో అక్రమంగా సెటిలైన వారికి స్థానిక గిరిజనులకు మధ్య వివక్ష చూపేందుకు అనుసరించని పద్ధతులంటూ లేవు. అయినప్పటికీ చంద్రబాబుకు ఇదేదీ అశాస్త్రీయంగా కన్పించడం లేదు. తన మనస్సుకు ఏ బాధా కలగడం లేదు. దేశంలోకెల్లా గొప్ప పునరావాస పథకమంటున్న ఆయనకు, రాజశేఖరరెడ్డి కాలం నుంచే ఆరంభించి విచ్చలవిడిగా సాగుతున్న పునరావాస మోసాలు కంటికి ఆనటం లేదు. 


జరుగుతున్నదేమిటో తెలిసి కూడా నోరు పెగలటం లేదు. రాష్ట్రం విడీవిడకముందు నుంచే పోలవరం కోసం తపించిపోయిన ఆ సీమాంధ్ర సంపన్న వర్గ ప్రతినిధికి, ఖమ్మం మండలాలను శరవేగంతో కలుపుకోవడం, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపజేసుకోవడం, నిధులు తగినన్ని ఇవ్వలేదని కేంద్రంపై కినుక వహించడం వంటివి బాగానే తెలిశాయి. కానీ ఆ బాధితుల గురించి అనేకానేక చట్ట ఉల్లంఘనల గురించి ఏ బాధా కలగలేదు. కానీ అందులో ఆశ్చర్యపడదగింది ఏదీ లేదు. ఎందుకంటే ఇతరులను బాధించ్డం, తాము లాభపడటం దోపిడీదారుల శాస్త్రంలో విడదీయరాని భాగం. తమను బాధించవద్దని బాధితులు అనడం అశాస్త్రీయం. ఇది తెలంగాణకు మాత్రం ఎందుకు వర్తించదు?


టీడీపీ అధ్యక్షుని ప్రచార ఎత్తుగడలు యథాతథంగా బాగానే ఉన్నాయి. కానీ వాటికి కాలం చెల్లిపోయిందని ఆయన గ్రహించినట్లు లేరు. సీమాంధ్ర ప్రాంత సాధారణ ప్రజలు విభజన జరిగిన కొత్తలో కొద్దినెలల పాటు ఆ తరహా ప్రచారంతో కొట్టుకుపోయిన మాట నిజం. కానీ క్రమంగా ఎంత కాలం ఇవే ప్రచారాలు అనే ఆలోచన మొదలైంది. క్రమంగా ఈ ఆలోచన వారిలో పెరుగుతున్నది. ఇది ఏ అంశంలోనైనా, ఎవరికైనా సహజమన్నది ఒకటి కాగా, అంతకన్న ముఖ్యంగా చంద్రబాబు పరిపాలన తీరు ప్రజలకు నెమ్మదిగా ఆవిష్కారమవుతున్నది. దానిపై ఒక్కొక్కటిగా విమర్శలు వినవస్తున్నాయి. జరుగుతున్నది, జరగబోయేది ప్రధానం గాని, జరిగిపోయిన దాని గురించే ఎంత మాట్లాడినా ప్రయోజనమేమిటనే వ్యాఖ్యలు చేస్తున్నారు. అది సమర్థుడైన నాయకుడు చేయవలసిన పని కాదంటున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నవ నిర్మాణ దీక్షపై దృష్టిని పూర్తిగా కేంద్రీకరించి, తెలంగాణ వ్యతిరేక ప్రచారం, విభజన వ్యతిరేక ప్రచారమనే బలహీనపు ఎత్తుగడలను మానుకోవడం సరైన శాస్త్రీయ రాజకీయమవుతుంది.


(వార్తకై దీనిపై క్లిక్ చేయండి)




(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!  జై జై తెలంగాణ!





2 కామెంట్‌లు:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నీలి కేకు ఏడుపు నాకు అలవాటే! సొల్లువాగుడు వాగే ఏడుపు! పనిగట్టుకుని పిలవని పేరంటానికి వచ్చి... ఏడుపులూ పెడబొబ్బలూనూ...అర్ధరాత్రి అంకమ్మ శివాల్లాగా...! :-(

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఇది ఎవరికి వర్తిస్తుందో వారికి...

పబ్లిక్‍గా పోస్ట్ పెట్టినంతమాత్రాన కుళ్ళుకుంటూ దరిద్రమైన వ్యాఖ్య పెట్టవచ్చునా? ఈ పోస్టులోని యాథార్థ్యాన్ని గమనించైనా వెధవరాతలు రాయకుండా ఉండాలి గానీ, మళ్ళీ కుళ్ళుకుంటూ సొల్లువాగుడు వాగుతూ పబ్లిక్‍గా పోస్ట్ పెట్టవద్దంటే ఏమిటి దానర్థం? అనడానికి అర్హత ఉండాలి...మేం అణచివేతకు గురికావడానికి కారణం ఇలాంటి స్వార్థపరులే కారణం! అర్థం చేసుకొని మిన్నకుండాలి గానీ ఉడుక్కుంటూ వెధవ వ్యాఖ్యలు పెట్టవద్దు. ఇలాంటి వ్యాఖ్యలు నీలాంటివాళ్ళు పెడుతున్నందుకే నేను వాటిని పరిశీలించిన మీదటే ప్రచురణ యోగ్యమైన వాటినే ప్రచురిస్తున్నాను. నీలాంటి చెత్తవ్యాఖ్యలను స్పాం లోకి నెడుతున్నాను. అర్థం చేసుకో.

కామెంట్‌ను పోస్ట్ చేయండి