గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 31, 2015

నువ్వు సృష్టించిన సంపదను ఎవరి చేతుల్లో పెట్టావు బాబూ?


నీ సంపద సృష్టికి ప్రజల చేతుల్లో వనరులు పెట్టాలి. చెరువులు బాగుచెయ్యాలి. పొలాలకు నీరివ్వాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. సంపద పెరగాలి. కానీ అది సమాజ సంపద కావాలి. సంపద పెరగాలి కానీ అది ప్రజల కోసం పెరగాలి. ప్రజల పరం కావాలి. అంతేకానీ విసిరేస్తే రాలే గింజలు కాదు. జనమంటే అడుక్కుతినేవాళ్లో నువు పారేసింది ఏరుకు తినే వాళ్లో కాదు. సృష్టించింది చాల్లే గానీ, అది కరిగి జనంలోకి ప్రవహించే...
చిత్తశుద్ధి చూపియ్యండి బాబు గోరూ!
చేతి మంత్రదండముతో ఎంతెంత సంపద సృష్టించినావు బాబూ. దొర గారూ. దొరలబాబుగారూ. సంపద. ఎటుచూసినా సంపద. కళ్లు తిరిగిపోయే సంపద. మల్టీ ప్లెక్సులు, మెగామాల్‌లు, రిసార్టులు, గోల్ఫ్‌లు, నోవోటెల్‌లు, పబ్బులు కళ్లు మబ్బులు పట్టే ప్లేబోయ్ క్లబ్బులు. క్లబ్బుల్లో మెరుపువెలుగుల మసకచాటు జీవితాలు. రోడ్డు మీద బియండబ్ల్యులు, పార్టీ ఆఫీసుల ముందు పోర్ష్‌కార్లు, కాఫీ షాపుల ముందు కిడ్స్ పార్క్ చేసే మినీ కూపర్‌లు. ద్యావుడా... ఏం సంపదరా బాబూ. వర్టిగో వచ్చి కళ్లు తిరిగేంత సంపద. ఈ భోగభాగ్యవైభవ చంద్రిక గురించి ఒక చిన్న ప్రశ్న వేసుకొని బ్రేక్ తీసుకుని, బ్రీత్ తీసుకుని మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. కొంచెం వాటర్ తాగండి.
సంపద సృష్టించా! అనే మహానాటి ప్రకటన చూసి ఆ స్థాయిలో కాకపోయినా ఏదో మనకున్నంత బుర్రలో ఓ చిన్నప్రశ్న మొలిచింది. అదేమనగా....ఎవరి చేతిలో?. ఈ అనంత సంపద. షాంపేన్ నురగలా ఆగకుండా పొంగే సంపద ఎవరి చేత ఎవరి కోసం ఎలా సృష్టించబడింది. దాన్ని అనుబగిస్తున్న రాజాలెవరు. ఈ సంపద గుట్టలు పెరిగి పెద్దయిపోతుండగా వాటివైపు ఆశగా తలెత్తి చూస్తూ మిగి లిపోయే బతుకులెవరివి.

ఓ సీను. మీరే ఇమేజిన్ చేసుకోండి. ఒకాయన. సకల సిరిసంపదలతో ఊగితూ లిసోలిపోయేటాయన. 
ఆయన తనకు చవగ్గా దొరికిన భూములు, ఫీజు లేకుండా దొరికిన లైసెన్సులు, భారీగా దొరికిన రాయితీల ద్వారా వచ్చిపడిన సంపద లోంచి కొంత తీసి ఇంట్లో జలపాతం కట్టుకున్నాడు. దాని నుంచి ఫోర్సుగా ఎగసిపడ్డ నీటి తుంపరలు ఆయన ఇంటి గోడవతల నివాసముంటున్న గుడిసెవాసుల మీద కూడా పడ్డాయి. వారు నాలుకలు బయటపెట్టి నిలబడితే వారి దాహం తీర్చాయి. దీన్ని ట్రికిల్ డౌన్ అంటారు. సృష్టించబడిన జలసంపద ఎంత ఎక్కువైతే నాలుకలు చాచి దాహం దాహం అంటున్న వారి గొంతు అంత ఎక్కువగా తడుస్తుంది.

రాశుల రాశుల సంపద నాటి నైజాము సర్కరోడికీ ఉంది. నేటి సుభ్రతో రాయ్‌కీ ఉంది. బ్రూనే సుల్తాను వరకూ ఎందుకు సుజనులు, నానీలు, జగనులు, మాట్రిక్సులు, గాలి రామలింగడులు...వీరందరికీ సంపద ఉంది. భారతదేశములో వలే తెలుగు రాజ్యాలలో కూడా గత ఇరవై ఏళ్లలో నియోరిచ్ బాబులు పుట్టలు పుట్టలుగా పెరిగారు. సంపద పెంచుకున్నారు. ఆర్థిక అసమానతలు గత ఇరవై ఏళ్లకాలంలో రెండొందల శాతం పెరిగాయి. ఉన్నోడికీ లేనోడికీ మధ్య దూరం కొన్ని కాంతి సంవత్సరాలంత పెరిగిపోతున్నది. కనుక, సంపద నిజం. కానీ, అది రాను రానూ కొందరిచేతిలోనే పేరుకుపోతున్నది. ఇది చేదునిజం.

ప్రపంచబ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్- ఎవరి లక్ష్యమైనా ఒకటే. సంపద సృష్టించడం. పెద్ద కెరటం వచ్చినపుడు అన్ని పడవలూ పైకి లేస్తాయని చెప్పడమే ఆ విధాన సారాంశం. మొదట చంద్రబాబూ ఆపై రాజశేఖరరెడ్డి సంపద సృష్టి సిద్ధాంతాన్ని బాగా నమ్మారు. ఒకోసారి వాళ్లు తెలియక నమ్మారేమో అని కూడా అనుమానం వచ్చేది. కానీ మొన్నటి మహాప్రకటనతో ఆ అనుమానం పోయింది. కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు వైద్యమంత్రులూ కార్పొరేట్ కళాశాలల యజమానులు విద్యామంత్రులూ అవుతున్న వైనం చూసినా రాజధాని నిర్మాణంలో ఎంచుకున్న విధానం చూసినా, సంపద సృష్టి మోజు ఎంత పీక్‌లో ఉందో వెర్రీవీజీగా అర్ధమైపోతుంది.

ఉన్నతాదాయ వనరులకూ వ్యాపారులకూ కల్పించే ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా పోగుపడే సంపదలు పరోక్షంగా సమాజంలోని పేదవర్గాలకు మేలు చేస్తాయని ఒక వాదన. ఇదే ట్రికిల్ డౌన్. మహామాంద్యం కాలంలో విల్‌రోజర్స్ అనే ఒక అమెరికన్ వ్యంగ్యవ్యాఖ్యాత కాయిన్ చేసిన పదమిది. ఇది వాడుకున్నోడికి వాడుకున్నంత. ట్రికిల్ డౌన్ సిద్ధాంతం అధికారికంగా ఒక అర్ధశాస్త్ర పారిభాషికపదం కాకపోయినా, కేపిటలిస్టు రాజకీయాలు ఈ కాన్సెప్టును బాగా వాడుకున్నాయి. సంక్షేమపద్దులపై కోతలు విధించడానికి ధనికులకు కార్పొరేట్లకు మేళ్లు చేసే రాయితీలు కల్పించడానికి, కేటాయింపులు జరపడానికీ ఇదొక బహానాగా పనికొచ్చింది. పనికొస్తూనే ఉంది. దురదృష్టవశాత్తూ ఇదొక విఫల విధానమనీ, దీని ఫలితాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపించాయనీ అనేక ప్రభుత్వాల అనుభవం నిరూపించింది. అయినంక కూడా సంపద సృష్టి నినాదం ప్రవచిస్తున్నారంటే, దాని వెనుక వర్గప్రయోజనాన్ని చూడాల్సిరాక తప్పదు తమ్ముళ్లూ.

నిజానికి ఇది చాలా పాతది. అమెరికాలో పంతొమ్మిదో శతాబ్దం కాలంలోనే దీన్ని పరీక్షించారు. దాన్నే హార్స్ అండ్ స్పారో సిద్ధాంతమని వెటకరించారు. గుర్రా నికి బాగా గుగ్గిళ్లు తినిపిస్తే అది రోడ్డు మీద విసర్జించే ఫీకల్ మేటర్‌తో కాకులకు ఆహారం దండిగా దొరుకుద్దని దాని సారము. ఏం చేస్తే ఏం. మార్కెట్ లేవాలి. ఎవరు మునిగినా. కార్పొరేట్ల మీద పన్నుభారం తగ్గించి వాళ్ల లాభాలు పెంచితే ముందుగా అవి ఉద్యోగులకిచ్చే జీతాల్లో రిఫ్లెక్టవుతాయనే ఆశతో (ఆశపెట్టి) పాతికేళ్ల క్రితమే రీగనామిక్స్ పెట్టుబడిదారీ దేశాలను ఆకర్షించాయి. రీగన్ అడ్మిన్‌లో బడ్జెట్ ఎడ్వయిజర్ డేవిడ్‌స్టాక్‌మన్ ఆలోచన ఇది. కానీ, కొంతకాలానికి ఆయనే ఈ విధానం ప్రయోజనం మీద అనుమానంలో పడిపోయాడు.

అయినా ఆ తర్వాత మార్గరెట్ థాచర్‌తో సహా ఎంతోమంది దేశాధినేతలు ఆ మార్గంలో నడిచారు. ఒబామా బెయిలవుట్లు ఈ సిద్ధాంతం వెలుగులోవే! గత కొన్ని దశాబ్దాలుగా వాస్తవిక అర్థంలో ఉద్యోగకల్పన తరిగిపోతున్నది. నిజ వేతనాలు తరిగిపోతున్నవి. దీనంతటికీ కారణం ఈ విధానాల కారణంగా సంపద కొద్దిమంది దగ్గర కేంద్రీకృతమైపోవడం. 2012లో టాక్స్ జస్టిస్ నెట్‌వర్క్ జరిపిన అధ్యయనం ఇలాంటి సంపదసృష్టివాదుల నెత్తిన ఒకటి పీకింది. సూపర్‌రిచ్ చేతుల్లో పోగుపడ్డ సంపద నుంచి బొట్లేమీ కారడం లేదనీ, నిజానికి ఆ అపార సంపదంతా టాక్స్ హెవెన్స్‌లో దాచి పెట్టడమో నిజమైన డిక్లరేషన్స్ నుంచి తప్పించుకోవడమో జరిగింది కానీ, ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు తద్వారా పేదలకూ ఒరిగిందేమీ లేదని క్లియర్ పిక్చర్ తేల్చేసింది. ఏ సూచిక చూసినా ప్రపంచవ్యాప్తంగా ధనికులకూ పేదలకూ మధ్య అంతరాలు శరవేగంగా పెరిగిపోతున్నాయేగానీ, ఎక్కడా తగ్గడం లేదని చెబుతూనే ఉన్నాయి.

సాటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ అంతరం మరీ ఎక్కువ. అది పెరుగుతున్న వేగం ఎక్కువ. ఈ అంతరాలు ఇదే వేగంతో సాగితే ఈ సంపద మరింత వారి చేతిలో పోగుపడటం ఖాయం. అభివృద్ధీ అది పోగుచేసిన సంపదల్లో భూమిపుత్రులకు భాగం దొరకనపుడే పోరాటాలు రగులుతాయి. లాటినమెరికా నుంచి తెలంగాణ వరకూ రుజువైంది ఇదే. బాబు గారిలాంటోళ్లు నేర్చుకోలేని పాఠమూ ఇదే.

చంద్రబాబు వంటి నేతలు రాష్ర్టాల్లోనూ, మోడీగారు దేశంలోనూ కార్పొరేట్ల రుణం తీర్చుకునే పనిలో ఈ సంపద సృష్టి సిద్ధాంతపు దొంగజపం చేస్తున్నారు. చంద్రబాబు విధానాలు ఈపాటికే సంపదను కేంద్రీకృతం చేశాయి. ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో నియోరిచ్‌లు విపరీతంగా పెరిగిపోయారు. వాళ్లే ఆ తర్వాత రకరకాల స్కాముల్లో ఆర్థికనేరాల్లో నిందితులయ్యారు. సింగపూర్‌లు కడతారు సరే ఆ ఆకాశహర్మ్యాల్లో నివసించేదెవరు? ఆ రహదారులపై రివ్వున దూసుకుపోయే ఖరీదైన కార్లెవరివి? సంపద సృష్టించా అంటూ-ఆయన డబ్బా కొట్టకోడమూ, వీళ్లు తాటికాయ లైన్లు బేనర్ పెట్టడమూ. హుహ్.

సంపద సృష్టికి ప్రజల చేతుల్లో వనరులు పెట్టాలి. చెరువులు బాగుచెయ్యాలి. పొలాలకు నీరివ్వాలి. విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. సంపద పెరగాలి. కానీ అది సమాజ సంపద కావాలి. సంపద పెరగాలి కానీ, అది ప్రజల కోసం పెరగాలి. ప్రజల పరం కావాలి. అంతేకానీ విసిరేస్తే రాలే గింజలు కాదు. జనమంటే అడుక్కుతినేవాళ్లో, నువు పారేసింది ఏరుకునే వాళ్లో కాదు. సృష్టించింది చాల్లే గానీ, అది కరిగి జనంలోకి ప్రవహించే చిత్తశుద్ధి చూపియ్యండి బాబు గోరూ! ఆఫ్టర్ ఆల్ మనది 20 కోట్ల మందికి తిండే దొరకని దేశం.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి