గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 21, 2015

అప్పుడు వినిపించని నిరసన స్వరాలు...ఇప్పుడెందుకు వినిపిస్తున్నాయి?

-టీడీపీ, కాంగ్రెస్‌ల హయాంలో యథేచ్ఛగా భూపందేరం
-ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు అడ్డదిడ్డంగా కేటాయింపు
-కబ్జాలకు.. అన్యాక్రాంతాలకు లెక్కేలేదు
-అయాచిత లబ్ధి పొందిన నాయకగణం
-కోర్టు కేసులలో వందల ఎకరాలు
-అప్పుడెన్నడూ నోరుమెదపని విపక్షాలు..
-పేదలకు ఇండ్లు కడతామంటే గగ్గోలు
అమానవీయ పరిస్థితుల మధ్య బతుకులు వెళ్లదీస్తున్న పేదలు గౌరవంగా బతికేందుకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొంత స్థలాన్ని తీసుకుంటామన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటనపై రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి! పరమపవిత్రమైన విద్యాసంస్థ భూమిని తీసుకోడానికి వీల్లేదని బల్లగుద్దుతున్నాయి! ఇంతవరకూ యూనివర్సిటీ భూములను ముట్టిందే లేదన్నంత స్థాయిలో చెలరేగుతున్నాయి! నిజానికి ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో అనేక ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అక్రమార్కుల కబ్జాల్లో చిక్కుకున్నాయి. ప్రత్యేకించి 1987 తర్వాత తమకు తోచినంత భూమిని తమకు కావలసిన ప్రైవేటు సంస్థలకు అప్పటి ప్రభుత్వాలు కట్టబెట్టడం మొదలుపెట్టాయి. అప్పుడు వినిపించని నిరసన స్వరాలు ఇప్పుడే ఎందుకు వినిపిస్తున్నాయనేది ఆసక్తిగొల్పుతున్న అంశం! గతంలో ప్రభుత్వాల్లో ఉండి పందేరం చేసిన నాయకులు.. ఇప్పుడు ప్రజోపయోగ కార్యక్రమానికి అతిస్వల్పంగా 11 ఎకరాల భూమి తీసుకుంటామంటే ఎందుకు రగడ చేస్తున్నాయన్నది ప్రశ్న!! నిజానికి కేసీఆర్ అడిగింది ఉస్మానియాకు ఉన్న వందల ఎకరాల్లో కేవలం 11 ఎకరాలు మాత్రమే!! అది కూడా పేదలకు ఇండ్లు కట్టించేందుకే! ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే విపక్ష లక్ష్యమని గుడ్డిగా నమ్మి.. అదే పద్ధతిలో వ్యవహరిస్తున్న ప్రతిపక్షాలకు సహజంగానే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమం రుచించదు!! సవాలక్ష లొసుగులు వెతుకుతాయి! ఈ పరిస్థితుల్లోనే.. ప్రజాపక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం తీరుతో ఇప్పటికే గుండెలు గుభేల్మంటున్న ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.


artscollege


ఇక్కడే కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వర్సిటీ స్థలాలను సెజ్‌ల పేరిట అమ్మేయాలని చూసిందెవరు? అయాచిత లబ్ధిని ఆర్జించడానికి చేసిన కుట్రలెన్ని? హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని వందల కోట్ల విలువైన స్థలాలపై కన్నేసిందెవరు? ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారమిచ్చిన సమైక్య రాష్ట్రంలో పాలకులెవరు? ఓ వైపు కబ్జాలు యథేచ్ఛగా సాగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు వ్యవహరించారు? ఇప్పుడు పేదలకు ఇండ్లు కట్టిస్తామంటే అడ్డుకుంటున్నవారే దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది? 1987 నుంచి వర్సిటీల భూములు పెద్ద ఎత్తున దుర్వినియోగమైన ఉదంతాలు కన్పిస్తాయి. సంస్థలకు, వ్యక్తులకు ఇష్టారాజ్యంగా భూములను కట్టబెట్టారు. లక్ష్యాలను మరిచి, నిబంధనలకు విరుద్ధంగా ఎన్నెన్నో సంస్థలకు ధారాదత్తం చేశారు. వందల ఎకరాలను మాయంచేశారు. 


ఆలనాపాలనా లేకపోవడంతో కబ్జా బాగోతాలు సాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే భూములపై ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలున్నాయి. రాజకీయ ప్రాబల్యంతోనే యూనివర్సిటీల భూములను కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 251.64 ఎకరాలపై పలు కోర్టు కేసులు నడుస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. దశాబ్దాల తరబడి అన్యులు, వర్సిటీలతో సంబంధం లేని సంస్థలు/వ్యక్తులకు స్థలాలను కట్టబెట్టినప్పుడు రాజకీయ పార్టీలు, సంఘా లు మౌనం వహించాయి. ఉద్యోగులకు ఇండ్లస్థలాల పేరిట భూము లు కేటాయించినా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ప్రభుత్వం పేదలకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇండ్ల నిర్మాణానికి కొంత స్థలాన్ని వినియోగించుకోవాలని ప్రతిపాదిస్తే గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


ఇతర సంస్థలకు కేటాయించిన భూములు: ఉస్మానియా ఎస్టేట్ సెల్ లెక్కల ప్రకారం యూనివర్సిటీలో మొత్తం భూమి 1627 ఎకరాలు. ఇందులో లీజుకు ఇచ్చినది 185 ఎకరాలు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ), ఫోరెన్సిక్ ల్యాబ్, హోమియో మెడికల్ కాలేజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) కేంద్రాలు యూనివర్సిటీ భూముల్లోనే కొనసాగుతున్నాయి. తార్నాకలోని బీఎస్‌ఎన్‌ఎల్, ఆర్టీసీ దవాఖాన, రామాంతాపూర్ దూరదర్శన్ కేంద్రానికి 30 ఎకరాలను విక్రయించారు. ఓయూ ఉద్యోగుల నివాసాలకు మాణికేశ్వరినగర్‌లో 35.30 ఎకరాలను ఉచితంగా ఇచ్చారు. ఇలా మొత్తం 250 ఎకరాలు కట్టబెట్టారు. మోహిని చెరువు, గార్డెన్‌కు 9 ఎకరాలు, జింకల సంరక్షణ పార్కుకు 60 ఎకరాలు (అదిప్పుడు విషసర్పాలకు నిలయంగా మారింది), హెర్బల్ గార్డెన్‌కు 5 ఎకరాలు, అరటి తోటకు 12 ఎకరాలు కేటాయించారు. సత్యసాయి స్కూల్(ట్రస్టు)కు 5 ఎకరాలు, సురభారతికి 500 చ.మీ. వంతున అనేక సంస్థలకు లీజుకు ఇచ్చారు. వాటిని అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో బీళ్లుగా మారాయి. నలు దిక్కులా సుమారు వంద ఎకరాల వరకు కబ్జాకు గురైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

UOFHYD


వీటిపై ఏనాడూ ఏ పాలకులూ సర్వే చేపట్టింది లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు మొలిపించాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇవన్నీ 1980 తర్వాత చోటు చేసుకోవడం విశేషం. మిగిలిన వందల ఎకరాల స్థలం కంపచెట్లు, పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం కళాశాలలకు, కార్యాలయాలకు, క్రీడా మైదానాలకు, అధ్యాపక, ఉద్యోగుల క్వార్టర్లకు 500 ఎకరాలు మాత్రమే వినియోగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రంగాపూర్‌లో నిజామియా అబ్జర్వేటరీ పేరుతో 265 ఎకరాల్లో ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. కానీ అందుకు కేటాయించిన స్థలంలో బహుళ అంతస్తులు వెలిశాయి. హోటళ్లు, లాడ్జీలు కూడా నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. లాలాపేట, అంబర్‌పేట, రామాంతాపూర్, జమిస్థాన్‌పూర్, హబ్సిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని ఉస్మానియా వర్సిటీ భూములు చాలా వరకు కబ్జాకు గురయ్యాయన్న ఫిర్యాదులు అనేకం ఉన్నాయి.


సెంట్రల్‌వర్సిటీ భూములు ఇలా వెళ్లాయి..:

రాష్ట్ర ప్రభుత్వం 1974లో గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 2,324 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. అదే స్థలంలో వివిధ సంస్థలకు 700 ఎకరాల వరకు కేటాయించారు. ఇందులోనే 537 ఎకరాల స్థలాన్ని ఐఎంజీకి కేటాయించగా, అందుకు యూనివర్సిటీకి ప్రత్యామ్నాయంగా చూపింది తక్కువే. ప్రత్యామ్నాయంగా గోపనపల్లిలో 397 ఎకరాలను వర్సిటీకి ఇవ్వా.. అందులో క్రషర్లు ఉండడం వల్ల నిర్మాణయోగ్యంగా లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. 1987నుంచి ఈ యూనివర్సిటీ స్థలాలను ఇతర సంస్థలకు కట్టబెడుతూ వచ్చారు. భూ పందేరంతో ప్రస్తుతం సెంట్రల్ యూనివర్సిటీ భూములు 1522 ఎకరాలకు కుదించుకుపోయాయి.


హైదరాబాద్ యూనివర్సిటీ భూములను ఇలా పంచేశారు:

1994లో నవోదయ స్కూల్‌కు 30 ఎకరాలు, 1990లో హెచ్‌సీయూ బస్‌డిపోకు 10 ఎకరాలు, 1991లో ఏపీఎస్‌ఈబీకి 6.02 ఎకరాలు, 1980లో ట్రిపుల్ ఐటీకి 62 ఎకరాలు, 1987లో తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు ఐదెకరాలు, 1998లో టెలీకమ్యూనికేషన్స్‌కు ఒక ఎకరం, 2000లో శాప్‌కు 108 ఎకరాలు, 2003లో శాప్ హాకీ స్టేడియానికి 14 ఎకరాలు, 2003లో శాప్ మిలిటరీ గేమ్స్ విలేజ్‌కు 14 ఎకరాలు, 2003లో శాప్ షూటింగ్ రేంజ్‌కు 20 ఎకరాలు, 2007లో ఏపీఎన్జీవోలకు 134 ఎకరాలు, 2004లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు 10 ఎకరాలు, 2005లో ఏఎండీఐఎస్‌ఏ సంస్థకు 2 ఎకరాలు, 2008లో సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్‌కు 5 ఎకరాలు, 2009లో టీఐఎఫ్‌ఆర్‌కు 210 ఎకరాలు, 2009లో టీఈఆర్‌ఐ సంస్థకు 40 ఎకరాలు, 2009లో సీడీఎఫ్‌డీకి 25 ఎకరాల వంతున కేటాయించారు.


ఆర్థిక మండలి పేరుతోనూ..:

కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సెంట్రల్ యూనివర్సిటీలో 200 ఎకరాలను ప్రత్యేక ఆర్థిక మండలిగా రూపొందించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. నాలెడ్జ్ ఇన్నోవేషన్ పార్కు పేరిట ప్రైవేటు కంపెనీలకు వేల కోట్ల విలువైన భూ పందేరానికి సిద్ధమయ్యారు. 2010 మార్చిలో అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్‌సిబల్ వర్సిటీ భూములను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదాయం పెంచుకునే నెపంతో 200 ఎకరాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు.


వ్యవసాయ వర్సిటీలో మిగిలిందెంత?:

ప్రభుత్వం 1964లో ఎన్జీ రంగా యూనివర్సిటీ(ప్రస్తుత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వ్యవసాయ వర్సిట్లీ)కి రాజేంద్రనగర్‌లో 2687.27 ఎకరాలు కేటాయించింది. దీంట్లో 25 ఎకరాలు రోడ్లకు పోయింది. 56 ఎకరాల్లో ఇండ్లు వెలిశాయి. బుద్వేలు, శివరాంపల్లి, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్, హిమాయత్‌సాగర్ గ్రామాల పరిధిలోని ఈ వర్సిటీ భూముల్లో వందల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఏనాడూ సర్వే చేసిన, చేయించిన పాపాన పోలేదు. అనేకమంది హద్దులు దాటి భూములను కలిపేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ఇతర సంస్థలకు, ఇన్‌స్టిట్యూట్స్‌కు కేటాయించారు.


ఇతర ప్రాంతాల్లోనైతే ఉపాధి మృగ్యం


గ్రేటర్ హైదరాబాద్‌లో దశాబ్దాలుగా కిరాయి ఇండ్లల్లో మగ్గుతున్న నిరుపేదలకు గృహ వసతి కల్పించాలన్న లక్ష్యసిద్ధికి అవరోధాలు ఎదురవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. 2006 నుంచి ఒక్క హైదరాబాద్ జిల్లా పరిధిలోనే 2.30 లక్షల మంది ఇండ్లకోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చి కూలీనాలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారే ఇందులో అధికం. అలాంటి వారికి గతంలో ఎక్కడో శివారు ప్రాంతాల్లో ఇండ్లు నిర్మించి ఇచ్చారు. ఎక్కడో సిటీకి దూరంగా అపార్టుమెంట్లు నిర్మించి ఫ్లాట్లను కట్టబెట్టడం ద్వారా తమ ఉపాధి దెబ్బ తింటున్నదని దరఖాస్తుదారులు చెబుతున్నారు. నగర శివార్లల్లో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్‌గృహకల్పవంటి పథకాలకింద నిర్మించిన ఇండ్లు నిరుపయోగంగా మారాయి. అందుకే నగరంలోనే ఉన్న ఖాళీ స్థలాల్లో అపార్టుమెంట్లను నిర్మించి పేదలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి