కనులు మూసిన కనులు తెఱచిన
కేసియారే మెదలుచుండెను
వామనుండని తలచినందుకు
విశ్వరూపుడయెన్!
ఇక తెలంగాణమ్ము రాదని
హాయిగా కనుమూసియుండగ
కేంద్రమిచ్చెను తెలంగాణము
కలయె చెదరెనుగా!
ముఖ్యమంత్రిగ కేసియారే
యేలుచున్ పదకొండు నెలలయె
నేమి చేసితి నింతవరకును
వెంట్రుకైనను కదలదే?
ఆంధ్రజ్యోతిలొ నేను రాసితి
తప్పు రాతలు తప్పు కూతలు
అట్టి రాతలవేమి చేసెను?
చెఱుపగలిగినవా?
గెలిచె టీయారెస్సు ప్రజలను
మనములందున నిలిచిపోయెను
గొప్పపనులను చేయుచుండెను
ఏమి చేతును నే?
మనసు నందున నిట్టి యూహలు
ముసరుచున్నవి, నిదుర రాదే!
పెఱుకుటకు అది చిన్న మొక్కయె?
వృక్షమాయెనుగా!
చిత్రమందున కథానాయకు
నకును దెబ్బయె తాకినప్పుడు
గతము గుర్తుకు వచ్చినట్టుల
నాకు జరిగె గదా!
ఈ టియారెస్ దెబ్బ తగిలియు
గతము మఱచిన నాకు నిప్పుడు
అన్ని జ్ఞప్తికి వచ్చుచున్నవి
ఒక్కటొక్కటిగా!
ఎదుటివారల తప్పులెన్నితి
నాదు తప్పుల నెఱుగకుంటిని
మంచివాడనొ చెడ్డవాడనొ
యెఱుగకుంటినిగా!
ఏదొ చెప్పగబోయి తప్పునె
చెప్పినాడను ఒడలు మఱచియు
పెద్ద వ్యాసమె వ్రాసితినను నా
గర్వమే తొలగెన్!
ఉద్యమము బలపడినయప్పుడు
ఉద్యమమ్మే చల్లబడెనని
మాయమాటలు పలికినాడను
ద్రోహబుద్ధిని ఐ!
కేసియారే దీక్షబూనగ
ఉద్యమమ్మే యెగసిపడగా
నీళ్ళుచల్లగ దలచితిని నే
దుష్ట యోచనతో!
ప్రజలు నాయకులందఱొకటై
"జై తెలంగాణా"యటంచును
ఉద్యమించగ నీళ్ళు చల్లితి
తప్పువ్రాతలతో!
నీళ్ళు చల్లినకొద్ది యెగసెను
ఉద్యమజ్వాలలు మఱింతగ
మాట మూగగ, కనులు గ్రుడ్డిగ
నాకు అనిపించెన్!
ఈ టియారెస్ ప్రజలలోపల
పాతుకొనె వృక్షమ్ము మాదిరి
నా వశమ్మే కూల్చివేయగ
ననక యత్నిస్తిన్!
ఈ టియారెస్‍పైన నాకును
ఎందుకో కలిగేను ద్వేషము
మందమతినై తిట్టుచుంటిని
కేసియారును నే!
బీజెపీ కాంగ్రెస్సువారలు
పదవికమ్ముడు పోదురంచును
చవకబారు విమర్శచేసితి
నోటి దూలకు నే!
కేసియారుతొ పడకనే కో
దండరామే వెడలిపోయె న
నెడి పుకారును సృష్టిచేసితి!
నమ్మలేదెవరున్!!
పోటిచేయుట కిష్టపడకయె
మిన్నకుండిన అతని చేతను
నేను ఉపయోగింపజూచితి
నమ్మలేదెవరున్!
కేసియారుకు జేయెసీకిని
మనః స్పర్థలు వచ్చెనంచును
కుటిల వచనములెన్నొ పలికితి
కల్లలాయెనుగా!
గతమునందలి నాయకులకును
కేసియారుకు పోలికెక్కడ?
గొప్పమాటలు, గొప్పచేతలు!
ఎటుల పొగడెద నే?
పథకములనన్నింటి నెపుడును
తప్పుపట్టితి, దెప్పిపొడిచితి!
కేంద్రమే మెచ్చుకొని భేషనె
కేసియారెదుటన్!!
అట్టి మెప్పుకు నోరు పెగలదె!
కనులు మండుచు నుండె కాదే!
ఒంటిపై జెర్రులే పాకెను!
ఏమి రాతును నే?
కేసియారు నియంత కాడని
ప్రజకు వ్యతిరేకియును కాడని
నాకు తెలిసియు కుళ్ళుచుంటిని
వ్యర్థ యత్నముచే!
రాజకీయము బాగ తెలిసియు
భవిష్యత్తుకు బాటవేసియు
ప్రజల నమ్మకములను పొందియు
కేసియార్ గెలిచెన్!
కేసియార్ ఏ మంచి చేసిన
చెడు కనంబడె నాదు కండ్లకు!
వెఱ్ఱికూతల వలన నష్టము
కేసియార్ కగునే?
మహోత్తుంగ సముద్రమందున
కాకి రెట్టను వేయగా ఇక
గొప్పతనముకు భంగమగునే?
నాకు తెలియదయెన్!
మహోదధియే కేసియారయె!
కాకి రెట్టయె నాదు చేతలు!
నా కుచేష్టలు కేసియారును
తక్కువెటు చేయున్?
నాకు జ్ఞానోదయమ్మెప్పుడు
కలుగునో యని వేచియుంటిని!
కేసియార్‍పై ఈర్ష్య యెప్పుడు
నాకు తగ్గెడినో?
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి