గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మే 26, 2015

ఇప్పటికైనా ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేనా....???!!!

land


ప్రభుత్వ భూములకు కంచెవేశారు!

నిరుపేద ప్రజలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉన్న మొయినాబాద్ మండలంలోని కోట్ల విలువ చేసే ప్రభుత్వ(అసైన్డ్) భూములు చాలావరకు పరాధీనం పాలయ్యాయి. రెవెన్యూ అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బోర్డులు పెట్టినా వాటిని పీకేసీ మరీ హార్స్‌రైడింగ్ క్లబ్ ఆక్రమించింది. లావణీ చట్టాలను, 111 జీవోను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ భూ మాయ హైదరాబాద్‌లోని అప్పా సమీపంలో, హైదరాబాద్-బీజీపూర్ రహదారికి ఆనుకొని ఉన్న అజీజ్‌నగర్ రెవెన్యూలో చోటు చేసుకుంది. హైదరాబాద్ మహానగరానికి, ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామ రెవెన్యూలో దాదాపు 146.13 ఎకరాలను 1961లో ప్రభుత్వం 46 మంది రైతులకు లావణీ చట్టం కింద పంపిణీ చేసింది. 



-మొయినాబాద్‌లో బోర్డు పీకేసీ మరీ అక్రమ నిర్మాణాలు
-హార్స్ రైడింగ్ క్లబ్ ఆధీనంలో 12 ఎకరాలు
-కబ్జా భూమి విలువ రూ.50 కోట్లు
-చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

అట్టి భూములను పంటల సాగుకు వినియోగించుకోవాలి తప్ప క్రయవిక్రయాలు జరపరాదు. కొందరు లబ్ధిదారులు ఇతరులకు విక్రయించడంతో 1996లో పీవోటీ చట్టం కింద 112.31 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇందులో 12 ఎకరాలు తమవేనంటూ కొందరు ఆర్డీవో కోర్టుకు వెళ్లారు. 2010లో నాటి చేవెళ్ల స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఇది ప్రభుత్వ భూమి కాదని, పట్టా(ప్రైవేటు భూమి) అంటూ ఆదేశాలిచ్చారు. 2011లో దీనిపై సమగ్ర విచారణ జరిపిన జాయింట్ కలెక్టర్ ఇది ప్రభుత్వ భూమి అని తిరిగి ఆదేశాలిచ్చారు. తక్షణమే ఆ భూమిని పరిశీలించాలని అప్పటి మొయినాబాద్ తహసీల్దార్‌ను ఆదేశించారు. అప్పటికే క్లబ్ చేపట్టిన నిర్మాణాలను అధికారులు తొలగించి ప్రభుత్వ భూమి అని బోర్డుఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ పోలో అండ్ హార్స్ రైడింగ్ క్లబ్ ప్రతినిధులు ఆ బోర్డును పీకేసీ రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కంచె వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.


వందల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతం


అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 176, 177లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. 177సర్వేలోని మొత్తం 162.08 ఎకరాల్లో 146.13 ఎకరాలను గతంలోనే ప్రభుత్వం నిరుపేద రైతులకు పంపిణీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జరగడంతో రెవెన్యూ అధికారులు 112.31 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబర్ 176లో 220.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ..అందులో 209 ఎకరాలను అసైన్డ్ చేశారు. ఇక్కడా క్రయవిక్రయాలు జరగడంతో అప్పటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని 126.29 ఎకరాలను అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దిల్ సంస్థకు కేటాయించింది. అక్కడా భారీగా కబ్జాలు చోటుచేసుకున్నాయి. అన్యాక్రాంతమైన విలువైన భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చని స్థానికులు అంటున్నారు.


జేసీ ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటాం


-మండల తహసీల్దార్ పీఎల్ గంగాధర్ హైదరాబాద్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ నిర్వాహకులు ప్రభుత్వ భూమిలోనే క్లబ్‌ను ఏర్పాటు చేశారు. పక్కా ప్రభుత్వ భూమి అని గుర్తించాం. ఆ భూమికి సంబంధించిన నివేదికను జేసీకి నివేదించాం. అట్టి నివేదికను జేసీ విచారిస్తున్నారు. జేసీ జారీ చేసే ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదు. చట్టపర చర్యలు తీసుకుంటాం...అంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వభూములకు స్వేచ్ఛ దొరికేనా...అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి