- ఏపీ అధికారుల కుతంత్రాలు.. ట్రెజరీ ఉద్యోగుల విభజనలో జాప్యం
- కుంటుపడుతున్న అభివృద్ధి, నిధుల నిర్వహణ అస్తవ్యస్తం
- రాష్ట్ర ఉద్యోగ సంఘాల ఆందోళన
ఉమ్మడి రాష్ట్రంలో అధికారుల కుట్రలు, కుతంత్రాల కారణంగా ట్రెజరీ విభాగంలో ఉద్యోగుల విభజన కొరకరాని కొయ్యగా మారింది. ఉమ్మడి పాలనలో వివిధశాఖలలోని అకౌంట్స్ విభాగాల అధికారులను ట్రెజరీశాఖ అధికారుల జాబితాలో చూపించకపోవడంతో ఆ శాఖ ఉద్యోగుల విభజనలో అయోమయం, గందరగోళం నెలకొన్నది. దాదాపు 29 శాఖాధిపతుల కార్యాలయాలలోని అకౌంట్స్ విభాగం అధికారులను ట్రెజరీశాఖ అధికారులుగా గుర్తించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. - కుంటుపడుతున్న అభివృద్ధి, నిధుల నిర్వహణ అస్తవ్యస్తం
- రాష్ట్ర ఉద్యోగ సంఘాల ఆందోళన
ప్రభుత్వ ఖజానా విభాగంలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం కేటాయిస్తున్న నిధుల నిర్వహణ, నియంత్రణ, పరిపాలనా పనులు కుంటుపడుతున్నాయి. పేద ప్రజల సంక్షేమం, బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న వేలకోట్ల నిధుల నియంత్రణ అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్ర ఖజానా విభాగంలో నెలకొన్న పరిస్థితులపై ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీ విభాగంలో ఉద్ధేశపూర్వకంగా ఆంధ్ర అధికారులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి టీఎన్జీవో నేతలు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ పోస్టులన్ని గల్లంతవుతాయి..
ఉమ్మడి రాష్ట్రంలో ట్రెజరీ విభాగం డైరక్టర్‌గా వ్యవహరించిన అధికారి చేసిన పొరపాట్లతో వివిధశాఖలలో పనిచేస్తున్న 950 మంది అధికారులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వివిధశాఖలలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులందరినీ ట్రెజరీశాఖ ఉద్యోగులుగా లెక్కించాలి. తద్వారా మాత్రమే ఉద్యోగుల విభజన 58:42 నిష్పత్తిలో సాధ్యమవుతుంది. లేనిపక్షంలో తెలంగాణ పోస్టులన్నీ గల్లంతవుతాయి అని టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఎంఏ హమీద్‌లు పేర్కొన్నారు.
ఈ శాఖలో ఏపీ రీఆర్గనైజేషన్ సెల్ కుట్రలు చాలా స్పష్టంగా తేటతెల్లమయ్యాయని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డర్ టూ సర్వ్ నిబంధన ప్రకారం ఏపీకి కేటాయించిన ట్రెజరీ అడిషనల్ డైరెక్టర్ అధికారికి తెలంగాణ ట్రెజరీశాఖ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించారు. ఆయన జీతభత్యాలు ఏపీలోనే తీసుకోవడం గమనార్హం. రాష్ట్ర ఆడిట్ విభాగంలోకూడా ఇలానే అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ ట్రెజరీ డైరెక్టరేట్‌కు అడిషనల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులను కేటాయించకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులే మొత్తం తెలంగాణ ఖజానా వ్యవహారాలను నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉమ్మడి ఏపీలోని మెడికల్, హెల్త్ విభాగాల్లోని అకౌంట్ సెక్షన్లలో పనిచేస్తున్న 30 మంది అధికారులను ఏపీకి కేటాయించారో? లేక తెలంగాణకు ఇచ్చారో? అనే విషయం తెలియక అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఉద్యానవనశాఖ, పరిశ్రమలు, బీసీసంక్షేమం, గిరిజనసంక్షేమం, పశుసంవర్ధకశాఖ, ప్రింటింగ్‌ప్రెస్, మెడికల్ హెల్త్, స్కూల్‌ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, అగ్రికల్చర్, సమాచార, పౌరసంబంధాలశాఖ, ఉన్నత విద్య, ఇతర శాఖలలో అకౌంట్స్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆయా శాఖల ఉద్యోగులుగా కానీ, ట్రెజరీ ఉద్యోగులగా కానీ విభజన కమిటీ జాబితాలలో పేర్కొనలేదని టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధానకార్యదర్శి సత్యనారాయణలు పేర్కొన్నారు.
ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు పడుతుండగా రాష్ర్టానికి చెందిన సీనియర్ అధికారులను, ఉద్యోగులను ఏపీకి కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. వివిధ శాఖలలోని అకౌంట్స్ విభాగం ఉద్యోగులందరినీ ట్రెజరీ ఉద్యోగులుగా పరిగణించి శాస్త్రీయంగా విభజన జరుపాలని, అధికారులందరికీ న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి