గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 22, 2015

భూదాన్ అక్రమార్కులకు బిగుస్తున్న ఉచ్చు!!!


భూదాన్ బోర్డుకు చెందిన అత్యంత విలువైన భూములను అయినవారికి అడ్డగోలుగా కట్టబెట్టిన సంస్థ చైర్మన్, సభ్యుల మెడకు ఉచ్చు బిగుస్తున్నది. అక్రమాల్లో కీలక పాత్ర పోషించిన చైర్మన్ రాజేందర్‌రెడ్డితోపాటు వైస్ చైర్మన్ ఇతర సభ్యులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు తమకున్న పలుకుబడిని ఉపయోగించి వారు భారీ మోసానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపట్టాలని భావిస్తున్నది. అంతులేని వారి అక్రమాకు అండగా నిలిచిన నాటి కాంగ్రెస్ సర్కారు పెద్దలు ఎవ్వరనేదానిపై కూడా విచారణ చేయిస్తున్నట్లు తెలిసింది. భూదాన్ బోర్డును ఇప్పటికే రద్దుచేసిన ప్రభుత్వం తదుపరి చర్యలపై వేగం పెంచింది.


25 వేల ఎకరాల భూమి అన్యాక్రాంతం: 

నాటి కాంగ్రెస్ పెద్దల అండదండలతో అక్రమంగా భూదాన్ యజ్ఞబోర్డు చైర్మన్ పదవిని దక్కించుకొన్న రాజేందర్‌రెడ్డి భూదాన్ భూములను భారీఎత్తున చట్టవిరుద్ధంగా విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఆయన హయాంలో దాదాపు 25 వేల ఎకరాల భూమిని అనర్హులకు అప్పగించారని సమాచారం. విలువైన భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించారనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. అనేక సంస్థలు, సొసైటీలు, కొంతమంది బడాబాబులకు ఆ భూములను రాజేందర్‌రెడ్డి అప్పనంగా అప్పగించారని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా బినామీ పేర్లతో 140 ఎకరాల భూదాన్ భూమిని ఆయన కాజేరని సమాచారం. భూదాన్ భూములకు ఎన్‌ఓసీలు ఇవ్వడం రాజేందర్‌రెడ్డి హయాంలో ఒక దందాగా నడిచిందని ప్రభుత్వ విచారణలో తేలింది. కావలికారుగా జీవితాన్ని ప్రారంభించిన రాజేందర్‌రెడ్డి భూదాన్ బోర్డు చైర్మన్ దక్కించుకొని భారీగా ఆస్తులు కూడబెట్టడం వెనుక నాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల పాత్ర ఎంతో ఉందని తెలంగాణవాదులు పేర్కొంటున్నారు. 


ఫోర్జరీ లేఖతో బోర్డు నియామకం: 

భూదాన్ యజ్ఞబోర్డుకు చైర్మన్‌గా రాజేందర్‌రెడ్డితోపాటు మొత్తం 11 మందిని నియమిస్తూ నాటి కాంగ్రెస్ సర్కారు 2012, డిసెంబర్ 14వ తేదీన జీవో 687 విడుదల చేసింది. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మహిళా కేంద్ర అధ్యక్షురాలు వీణా బెహన్ సిఫారసు మేరకు వారిని నియమిస్తున్నట్లు జీవోలో ఆనాటి రెవెన్యూ కార్యదర్శి అనిల్‌చంద్ర తెలిపారు. భూదాన్ చట్టం ప్రకారం ఆచార్య వినోబా భావే సిఫారసు చేసినవారినే బోర్డు సభ్యులుగా నియమించాలి. ఆయన తదనంతరం అయితే ఆయనకు నామినీగా ఉన్నవారు సిఫారసు చేస్తే ప్రభుత్వం నియమించాలి. కానీ రాజేందర్‌రెడ్డితోపాటు ఇతర సభ్యులను వినోబాభావే నామినీ అయిన సర్వసేవా సంఘ్ సిఫారసు చేయలేదు. వీణా బెహన్ రాసినట్లుగా ఉన్న ఓ లేఖ ఆధారంగా ఆనాడు రాజేందర్‌రెడ్డి తదితరులను నియమించారు. బోర్డు అక్రమాలపై ప్రభుత్వం జరిపిన విచారణలో వీణా బెహన్ లేఖ కూడా ఫోర్జరీదేనని తేలటంతో అందరూ అవాక్కయ్యారు. ఇంత జరిగినా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పరిశీలించకుండా గుడ్డిగా బోర్డును నియమించటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీణా బెహన్ లేఖపై అధికారులు విచారణ చేపట్టగా తాను అలాంటి లేఖ ఎవ్వరికీ రాయలేదని ఆమె చెప్పడంతో రాజేందర్‌రెడ్డి ముఠా అక్రమాల పుట్ట బద్దలయ్యింది.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ! జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి