గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

ఇవి పిచ్చివాని చేతలే!


రెండు రాష్ట్రముల విభజన
పూర్తియైన తరుణంలో
నల్లికుట్ల నల్లారీ,
విషముకక్కగానేలా?

బ్రహ్మాస్త్రం అన్నావూ,
లాస్టుబాలు అన్నావూ,
కొత్తపార్టి అన్నావూ,
నీ పప్పులు ఉడికాయా?

కలిసియుండమనువారిని
యెట్లు కలిపి యుంచెదనని
కుట్రపన్నుతున్నావయ?
గడ్డిని తినుచున్నావా?

మానసికంగా విడిపో
యిన వారిని కలిపెదనని
స్వార్థంతో రంకె వేసి,
కుప్పిగంతు వేయనేల?

తెలంగాణలో దోచిన
దేదియు సరిపోలేదా?
ఇంకా దోచగ బూనిన
వక్రబుద్ధి మానవేల?

తెలంగాణ ఉసురుతాకి,
మట్టిగొట్టుకొనిపోదువు!
రాజకీయ జీవితమే
దక్కని సన్నాసవుదువు!!

ఇంత జరిగినా కూడా
తెలగాణకు అడ్డుపడగ
యోచించెడి నీకిప్పుడు
తెలగాణుల శాపమిదియె!

భవిష్యత్తు కానరాక,
నాశనమై పోదువయ్య!
ఎన్ని కుట్రలను పన్నిన
పనికిరాకపోవునయ్య!!

విభజనమ్ము ఖాయమనియు
ఇంకా గ్రహియింపనిచో,
ఎవరును కాపాడలేరు,
అసహ్యించుకొంద్రు నిన్ను!

పగటికలలు కనుచుండిన
రెంటికి జెడు రేవడివలె
సంకనాకి పోదువయా,
విలువ కోలుపోదువయా!

పిచ్చిచేష్టలను మానుము,
పిచ్చికూతలను మానుము!
అందరు మెచ్చే పనులకు
మంచి మనసుతో పూనుము!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!


గురువారం, ఫిబ్రవరి 27, 2014

విలీనమైతే...


విలీనమైతే స్వీయాస్తిత్వము
మంటగలియును సంపూర్ణముగా!
ఆంధ్రతోడుతను తెలంగాణమే
విలీనమై బానిస కాలేదా?

విలీనమ్ము చేయుటకంటెను మరి
పొత్తును గూడిన కొంతనయమ్మగు!
అయినా కూడా కార్యకర్తలకు
ఆశాభంగమె తప్పక కలుగును!!

విలీనమ్ములును పొత్తులు మరచియు
స్వతంత్రమ్ముగా పోటిచేయవలె!
బంగరు తెలగాణము నిర్మించియు,
తెలంగాణలో వెలుగు నింపవలె!!

విలీనమంటే తెలంగాణమే
ఒప్పుకొనదయా, ఆలోచింపుడు!
తెలంగాణ ఆకాంక్షల దీర్చగ
విలీనమ్మునే మానుకొనగవలె!!

విలీనయోచన చేయగవలదిక,
నవ తెలగాణము ధ్యేయమైనచో!
శీఘ్రముగా తెలగాణము వృద్ధిని
పొందగవలయును, వెల్గగవలయును!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

స్వాగత మో తెలగాణ సుపుత్రా!

తెలంగాణ కవి పండితులకు బ్లాగు వీక్షకులకు
మహాశివరాత్రి పర్వదిన
శుభాకాంక్షలు!



స్వాగత వృత్తము:
కామితమ్ము తెలగాణను వేగన్
క్షేమమెంచి మన కిచ్చియుఁ గేంద్ర
మ్మోమఁగా మనసు పొంగినవాఁడా!
సౌమనస్యవర! స్వాగతమయ్యా!!



రథోద్ధత వృత్తము:
కల్వకుంట్ల తెలగాణ యోధుఁడా!
విల్వఁ బెంచితివి స్వేచ్ఛ నిచ్చియున్!
నల్వవోలె నిను నవ్యగీతులన్
గొల్వఁ బూనితిమి, కొమ్ము కేసియార్!



తోటక వృత్తము:
ఘన మోదము నిచ్చితి! కాంక్షితమౌ
*త్రినగాంధ్రముఁ దెచ్చితి! తేజము హె
చ్చెను మోమున నిప్పుడు శీఘ్రగతిన్!
గొను మో ఘన వీరుఁడ, కూర్మినతుల్!!



ప్రియంవదా వృత్తము:
అరువదేండ్ల కల హంగుమీఱఁగన్,
విరుల వర్షములు ప్రేమతోడుతన్
గురియఁ జేతుమయ! క్రొత్త రాష్ట్రమున్
వరలఁ జేసితివి, వందనమ్మిదే!



వనమయూర వృత్తము:
ఎంత ఘన వీరుఁడవు, హేమనగధీరా!
చింత వలదంచు మముఁ జీరియును నీవున్
వంతలను దీర్చితివి! భారము తొలంగెన్!
సంతసము హెచ్చఁగను స్వాగతముఁ గొమ్మా!



మాలినీ వృత్తము:
విమత కుటిల ధ్వంసా! ప్రీతియుక్త ప్రశంసా!
నమిత జన విశేషా! నవ్య రాష్ట్ర ప్రభూషా!
శ్రమ దమన విశిష్టా! శాంతి కాంతి ప్రహృష్టా!
విమల సుగుణమూర్తీ! విశ్వవిఖ్యాతకీర్తీ!



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



(*త్రినగాంధ్రము = త్రిలింగాంధ్రము = త్రిలిఙ్గాన్ధ్రము > త్రిలింగాన్ధ్రము > తిలింగాన్దము > తెలంగాన్దము > తెలంగాణ్డము > తెలంగాణ్ణము > తెలంగాణము)

బుధవారం, ఫిబ్రవరి 26, 2014

ఓదార్పుల నాటకాలు కట్టిపెట్టవయ్యా!


తెలంగాణనిచ్చుటకును,
తెలంగాణనాపుటకును
తాను అశక్తుడనన్నది
జగన్ బాబు కాదాయేం?

అధికరణము మూడు ప్రకా
రమ్మె కేంద్రమునకు నాడు
అధికారమ్ముందనినది
జగన్ బాబు కాదాయేం?

మా పార్టీ తెలగాణకు
అనుకూలము! కేంద్రమిడిన
సమ్మతింతుమనియన్నది
విజయమ్మయె కాదాయేం?

పరకాలకు వచ్చినపుడు,
ఓట్లు కొల్లగొట్టనెంచి,
మాయమాట పలికినమ్మ
విజయమ్మయె కాదాయేం?

తెలంగాణ పాదయాత్ర
లోన, అమరవీరులంత
తన సోదరులన్నయమ్మ
షర్మిలమ్మ కాదాయేం?

అమరవీర బలిదానము
బాధాకరమంచు, ఇంక
యెట్టి బలియు వద్దనినది
షర్మిలమ్మ కాదాయేం?

తెలగాణకు అనుకూలము
అంటూనే, కేంద్రమిడగ
పూనినతరి నిందించుచు
"సమైక్యాంధ్ర" కోరలేదె?

తెలగాణులపైన నెట్టి
జాలి, కరుణ లేకున్నా,
ఓదార్పుల యాత్ర అనుచు
తెలగాణకు వచ్చుటేల?

తెలగాణ తిరస్కరించి,
కీడు చేయ సమకట్టిన
జగన్ బాబు తెలగాణలొ
ఏ ముఖముతొ అడుగిడునయ?

సిగ్గులేక తెలగాణలొ
అడుగుపెట్ట సమకట్టిన,
తెలగాణులు సహియింపరు!
తరిమి తరిమి కొట్టుదురయ!!

ఆంధ్రపార్టి మాకెందుకు?
ఆంధ్రబాబు మాకెందుకు?
మా పాలన మాకు వలయు!
జగన్ బాబు రావలదయ!!

తెలంగాణ సాధనమున
వైసీపీ విలనయ్యా!
ఈ విలనే తెలగాణలొ
ఎట్టులడుగుపెట్టునయ్య?

జగన్ బాబు మాకువద్దు!
చంద్రబాబు మాకువద్దు!
వైసీపీ, టీడీపీ
పార్టీలే మాకువద్దు!!

ఓదార్పులు మాకు వలదు!
కపట నాటకాలు వలదు!
తెలగాణలొ అడుగిడుచో,
తరిమి తరిమి కొడుదుమయ్య!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మంగళవారం, ఫిబ్రవరి 25, 2014

తెలంగాణలో అడుగుపెట్టే అర్హతలేదు!


"తెలంగాణ" అనెడు పదము
అసెంబ్లిలో వినిపింపగ
నిషేధించినట్టివాడు
చంద్రబాబు కాడాయేం?

ఓట్లకొరకు టీఆరెస్
పొత్తుగోరి తెలంగాణ
కనుకూలమ్మన్నవాడు
చంద్రబాబు కాడాయేం?

బిల్లుపెట్టు, మద్దతిత్తు
ననియు అఖిలపక్షమందు
ఎలుగెత్తినయట్టివాడు
చంద్రబాబు కాడాయేం?

కేంద్రమ్మిక రాష్ట్రమిడగ
ప్రకటనమును చేయగాను
దానినాపినట్టివాడు
చంద్రబాబు కాడాయేం?

రెండుకండ్ల సిద్ధాంతం,
సమన్యాయం, సమైక్యాంధ్ర
అనిపలికినయట్టివాడు
చంద్రబాబు కాడాయేం?

కేంద్ర్తం బిల్ పంపగాను
అనుకూలముగాను ఒక్క
మాట పలుకనట్టివాడు
చంద్రబాబు కాడాయేం?

బిల్లు పార్లమెంటుజేర,
నెగ్గకుండ ఇతర పార్టి
నేతల నుసిగొల్పినదియు
చంద్రబాబు కాడాయేం?

ఇన్ని చేసినట్టి యిట్టి
చంద్రబాబు తెలగాణలొ
ఏ ముఖమ్ముపెట్టుకొనియు
అడుగుపెట్టునయ్యనేడు?

సిగ్గులేక తెలగాణలొ
అడుగుపెట్ట సమకట్టిన,
తెలగాణులు సహియింపరు,
తరిమి తరిమి కొట్టుదురయ!

ఆంధ్రపార్టి మాకెందుకు?
ఆంధ్రబాబు మాకెందుకు?
మా పాలన మాకు వలయు!
చంద్రబాబు రావలదయ!!

తెలంగాణ సాధనమున
టీడీపీ విలనయ్యా!
ఈ విలనే విజయోత్సవ
ములనెట్టుల జరుపునయ్య?

విజయోత్సవములు జరుపగ
టీడీపీ అర్హతలను
కోల్పోయెను గాన యిచట
ఆ పార్టియె వలదయ్యా!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, ఫిబ్రవరి 24, 2014

సీమాంధ్ర ప్రజల అవసరాలు బొత్తిగా పట్టని సీమాంధ్ర నేతలు!


విభజనమ్ము తప్పదనియు
తెలిసికూడ సీమాంధ్రపు
ఒక్క నేత కూడ ప్రజల
అవసరములు అడుగడాయె!

ప్రజల మభ్యపెట్టుటకై
కపట ప్రేమ నటియించుచు,
సమైక్యాంధ్ర అను పాటయె
పాడిరయ్య ఓట్లకొరకు!

మనసులోన ఓట్లు సీట్లె,
ప్రజల క్షేమమే పట్టదు!
విభజనమ్ము జరుగు తరిని
’ఇవి కావలె’ నని యడిగిరె?

సమైక్యాంధ్ర పాట పాడ
పోటీపడె పార్టిలన్ని!
ప్రజావసరముల గురించి
కేంద్రమ్మును అడుగరైరి!!

బిల్లు సవరణములందున
ప్రజావసరముల జేర్చక,
సభలోపల వారలపుడు
నానా యాగీ చేసిరి!

వారల తన్లాట, వారి
ఆస్తులు రక్షించుకొరకె!
ప్రజల కొరకు కాదయ్యా,
పైకి ప్రేమ నటియించిరి!!

వారల తన్లాట, వారి
పెత్తనముల పెంపుకొరకె!
ప్రజల కొరకు కాదయ్యా,
పైకి ప్రేమ నటియించిరి!!

బిల్లు పాసు అయిన పిదప,
వారె మొసలి కన్నీరును
కార్చుచుండ్రి అన్యాయము
జరిగెననుచు ప్రజలముందు!

స్వార్థమునకె రాజధాని
ఇక్కడపెట్టుడని ఒకరు,
కాదిక్కడ యని యొక్కరు
తగవులాడుకొనుచుండిరి!

నిజముగ అభివృద్ధికోరు
వారలైన, పార్టీలను
ప్రక్కనిడియు చర్చచేసి,
ప్రణాళికలు వేయవలెను!

అట్లుకాక, ఓట్లు సీట్లు
పొంది కోట్లు గడియింపగ
జూచుచుండిరయ్య వారు!
ఎంత గొప్పవారు, వారు?

తెలగాణను దోచినారు,
సీమాంధ్రను దోచలేరె?
దోపిడిలో నాది, నీది
పట్టదు వారికి ఎపుడును!

నాటకములు నమ్మకుడయ,
దోపిడులకు తోడ్పడకుడు,
కపటమ్మును తెలిసికొనుడు,
నిస్స్వార్థుల నెన్నుకొనుడు!

జై తెలంగాణ!    జై ఆంధ్రప్రదేశ్!

ఆదివారం, ఫిబ్రవరి 23, 2014

ఆఱు నూఱూ కాదు...తెలంగాణ రానేరాదు అన్నారుగా...

దోపిడీకి సమకట్టిన
సీమాంధ్రుల ప్రతిన యిదే,
"ఆఱు నూఱుకాదు, తెలం
గాణ రాష్ట్రమే రా"దని!

తెలంగాణమేర్పడదని,
సమైక్యాంధ్ర శరణ్యమని,
దోపిడిదే పెద్దపీట,
మేమే పాలకులమనిరి!

సీమాంధ్రుల దౌష్ట్యమ్ములు
కేంద్రము గ్రహియించి నేడు
తెలంగాణ రాష్ట్రమిడెను,
ఆఱు నూఱు అయ్యెనయ్య!


నాడు అధర్మము వర్ధిల,
నేడు ధర్మమే గెలిచెను!
కాదన్నది జరిగితీరె!
అగునన్నది పారిపోయె!!

అహంకార ప్రకటనములు
నీరుగారి పోయెనయ్య!
"ధర్మమేవ జయతే"యను
సూక్తి నిలిచి వెలిగెనయ్య!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, ఫిబ్రవరి 22, 2014

ఏకపక్షం...

(కేంద్రం తెలంగాణ పట్ల ఏకపక్షంగా వ్యవహరించిన విషయం కేంద్రమంత్రి జై రాం రమేశ్‍గారి మాటలవల్ల సుస్పష్టమవుతోంది. సీమాంధ్రకు న్యాయం చేసి, తెలంగాణకు మొండి చేయి చూపడం ఏకపక్షం కాదా?)


అన్యాయము పొందినట్టి
తెలగాణకు న్యాయమిడక,
సీమాంధ్రకు న్యాయమ్మును
చేసితిమన నేమనవలె?

సీమాంధ్రకు న్యాయమిడిన,
తెలగాణకు న్యాయమేది?
కేంద్రమేకపక్షముగా
వ్యవహరించినట్టుకాదె?

తెలగాణులు తెలిపినట్టి
సవరణముల మాటెత్తక,
సీమాంధ్రకు న్యాయమ్మును
చేసితిమన నేమనవలె?

మన జై రాం రమేశ్‍గారు
పలికినట్టి మాటలన్ని
ఏకపక్షవ్యవహారము
నకు సాక్ష్యములగును కదా!

1. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూశాము.

న్యాయమిపుడు సీమాంధ్రకు
చేసిరి, కని, తెలగాణకు
అన్యాయము చేసినట్లు
కాదా మరి తెలుపుడయ్య!

2. విద్య, ఉద్యోగాలు, సాగునీటి విషయంలో సీమాంధ్రకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

విద్యా, ఉద్యోగమ్ములు,
సాగునీటి విషమ్మున
సీమాంధ్రకు ఎట్టివేని
ఇబ్బందులు ఉండవనిన,

విద్యా, ఉద్యోగమ్ములు,
సాగునీటి విషయమ్మున
తెలగాణకు ఇబ్బందులు
ఉండుననియు చెప్పినట్లె!

3. ఆర్థిక సాయంలోనూ సీమాంధ్రకు చాలా మేలు జరిగింది.

ఆర్థిక సాయమ్ములోన
సీమాంధ్రకు చాల మేలు
జరిగినదన, తెలగాణకు
కీడు జరిగినట్లేకద!

4. సీమాంధ్రకు ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉంటుంది.

సీమాంధ్రకు ఐదేడులు
ప్రత్యేకపు హోదానిడి,
తెలగాణకు ఈయకుంట
న్యాయమ్మెటులగునయ్యా?

5. తెలంగాణ, సీమాంధ్రలకు ఉద్యోగుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఉద్యోగుల పంపిణిలో
సీమాంధ్రకు ఇబ్బందులు
ఉండవు; మరి తెలగాణకు
ఇబ్బందులె...ఇబ్బందులె!

జనాభాను ప్రాతిపదిక
గా కొనుటే అన్యాయము!
స్థానికతను ప్రాతిపదిక
గా కొనుచో న్యాయమగును!

***      ***      ***      ***

ఈ రీతిగ కేంద్రమిపుడు
ఏకపక్షముగ నుండియు,
సీమాంధ్రకు న్యాయ మిడిన,
తెలగాణకు న్యాయమగునె?

రాజుగారి పెద్దభార్య
మంచిదియన, చిన్నభార్య
చెడ్డదనియు చెప్పినట్లు
కాదా మరి తెలుపుడయ్య!

సీమాంధ్రకు న్యాయమిడిన
అభ్యంతరమే లేదయ!
తెలగాణకు అన్యాయము
చేయుటె అభ్యంతరమయ!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

గురువారం, ఫిబ్రవరి 20, 2014

తెలంగాణ ఘనవిజయం

తెలంగాణ ప్రజలందరికీ
తెలంగాణ ఘనవిజయ
శుభాకాంక్షలు!

తెలంగాణ ప్రజలారా,
శుభాకాంక్షలందుకొనుడు!
స్వేచ్ఛావాయువులందరు
హాయిగాను పీల్చుకొనుడు!!

తెలంగాణ ద్రోహులంత
కలసికట్టుగా వ్యతిరే
కించగాను, ఎగసి ఎగసి
జయమునందె తెలంగాణ!

అమరవీర త్యాగఫలము,
సకల జనుల దీక్షఫలము,
ప్రతి హృదయము కదిలించిన
ఉద్యమ జయ కేతనమ్ము!

అరువదేండ్ల నిరీక్షణము
పూర్ణముగ ఫలించెనేడు!
అధర్మమ్ముపై ధర్మము
సాధించిన ఘనవిజయము!!

ఎదఎదలో వికసించిన
నవకోమల కుసుమమ్ము!
పరిమళాలు విరజిమ్మెడు
విశ్వవ్యాప్త మారుతమ్ము!!

మన కలలే ఫలియించెను!
మన ఆశలె చిగురించెను!
మనకు బానిసత్వమ్మిక
త్రెంచెను ఈ శుభదినమ్ము!!

రాదు అనిన తెలంగాణ
నడయాడుచు వచ్చెనహో!
రాదు అనిన తెలంగాణ
నర్తించుచు వచ్చెనహో!!

ఉత్సాహము నినదించిన
తెలంగాణ రాగమిదే!
వ్యక్తి వ్యక్తి శక్తియైన
తెలంగాణ స్వప్నమిదే!!

ఆటుపోట్లు తట్టుకొనియు,
ఈసడింపులను పొందియు,
అవమానాలెదుర్కొనియు
సాధించిన తెలంగాణ!

దోపిడీల రూపుమాపి,
దౌష్ట్యమ్ముల నుగ్గుసేసి,
అక్రమాలనాపుచేసి,
సాధించిన తెలంగాణ!

మనిషి మనిషిలోన ప్రేమ
పుష్పాలను పూయించియు,
సౌభ్రాత్రపు బంధనమును
వెలయించిన తెలంగాణ!

తరతరాల కడగండ్లను
రూపుమాపు తెలంగాణ!
మన పాలన, మన యోచన
వెలిగించెడి తెలంగాణ!!

తెలంగాణ ప్రజలారా,
శుభాకాంక్షలందుకొనుడు!
స్వేచ్ఛావాయువులందరు
హాయిగాను పీల్చుకొనుడు!!


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

మొన్న కోరనివారు...ఇవ్వాళ కోరడంలో అర్థం ఏమిటి?


మొన్న లోకసభలోపల
సవరణములు కోరనట్టి
బీజేపీ నేడెందుకు
కోరగ నుద్దేశమేమి?

మద్దతు ద్వారా పొందిన
ఘనతను తగ్గింపజేయు
దుష్ట ప్రణాళిక నెవ్వరు
సూచించిరి బిల్లుకిపుడు?

తెరవెనుకను చంద్రబాబు,
తెరముందట వెంకయ్యయు
దౌత్యమ్మును నెరపుచుండ్రి,
దౌష్ట్యమ్మును చేయుచుండ్రి!

లోకసభను ఒకతీరుగ,
రాజ్యసభను ఒకతీరుగ
బీజేపీ యుండుటేల?
మాటను మార్చంగనేల?

బేషరతుగ మద్దతిచ్చి,
షరతులిపుడు కోరనేల?
చరిత్రహీనులుగా మీ
రిప్పుడు నిలువంగనేల?

సుహృద్భావమును బూనియు,
బిల్లుకు మద్దతు దెలుపుడు!
మునుపు మీరలిచ్చినట్టి
మాటను నిలబెట్టుకొనుడు!!

మరిన్నివివరాలకై
ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బుధవారం, ఫిబ్రవరి 19, 2014

గాయం మానింది...మచ్చ మిగిలింది!

లోకసభను బిల్లు నెగ్గె,
సవరణములు అట్లె యుండె!
మిఠాయి పొట్లం ఇచ్చిరి,
మిఠాయిలే లేకయుండె!!

గాయమ్ములు తెలగాణకు,
మందునిడిరి సీమాంధ్రకు!
తెలంగాణనిత్తుమనిరి,
తెలంగాణయే యిచ్చిరి!!

లొసుగులతో కూడినట్టి
తెలంగాణ మన కిచ్చిరి!
చంద్రునిలో మచ్చలవలె
తెలగాణను మిగిలించిరి!!

చివరకు గాయము మానెను,
మచ్చలు మాత్రమె మిగిలెను!
కాలమ్మే యీ మచ్చల
నెటులొ మాన్పగా జాలును!!

కేంద్రమె మన కిత్తుమన్న
కానుకయే తెలంగాణ!
నిరంతరము శ్రమియించియు
బాగుచేయవలెనన్నా!!

బంగారపు తెలంగాణ
వలయునన్నచో మనమిక,
దోపిడులను ఆపవలెను,
స్వార్థమ్మును వీడవలెను!

లక్ష్యసాధనము గల్గిన,
నిబద్ధతను నిలుపుకొన్న,
అభివృద్ధియె ధ్యేయమైన
నాయకులను ఎన్నుకొనుడు!

భావి తెలంగాణమునకు
బంగరు బాటలు పఱచెడు
నాయకత్వముండవలెను!
న్యాయమ్మే చేయవలెను!!

సీమాంధ్రుల పాలనమే
తెలగాణకు గుణపాఠము!
నాడు చేసినట్టి తప్పు
అరువదేండ్ల శాపమాయె!!

సుఖశాంతులు మనకిచ్చెడు,
పురోగామిగా నిలిచెడు,
స్వర్ణయుగం తలపించెడు
నేతలనే ఎన్నుకొనుడు!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

తెలంగాణ అఖండ విజయం!!


అరువదేండ్ల తెలంగాణ
కల సాకారమ్మాయెను!
కేంద్ర మిపుడు పూనినట్టి
కార్యమ్మేనెరవేరెను!!

సీమాంధ్రులు సృష్టించిన
ఆటంకము లధిగమించి,
తెలంగాణ లక్ష్యముగా
విజయము సాధించెనుగా!

స్వేచ్ఛాకాశమ్ములోన
హృదయము తేలుచునున్నది!
మానస మానందముతో
పరవశించిపోతున్నది!!

కష్టాలే కడతేరెను!
దోపిడులే దూరమాయె!
తెలంగాణ కడ్డొచ్చిన
ఆటంకాల్ తొలగిపోయె!!

నేడే మన తెలగాణకు
నిజముగ స్వాతంత్ర్యమబ్బె!
బానిస సంకెళ్ళు తొలగి,
తెలగాణుల మేనులుబ్బె!!

ఇది అఖండవిజయమ్మయ!
ఉద్యమాల ఫలితమ్మయ!
సకల జనులు కోరినట్టి
స్వేచ్ఛాయుత తెలగాణయ!!

ఇదియె సకల తెలగాణులు
ఎత్తిన జయ కేతనమ్ము!
ఇదియె అధర్మమ్ము పైన
ధర్మ విజయమే సుమ్ము!!

ఇది అమరుల త్యాగఫలము!
అరువదేండ్ల తపఃఫలము!
మన బంగరు తెలంగాణ!
కలలుగన్న తెలంగాణ!!

తెలగాణకు స్వేచ్ఛనిడిన
కేంద్రమునకు కృతజ్ఞతలు!
విజయమునకు ఊతమిడిన
నేతల కివె కృతజ్ఞతలు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

బీజేపీ కుటిల రాజనీతి?


బీజేపీ కేంద్ర నాయకత్వం...చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుటిల బోధలు తలకెక్కించుకుని, సీమాంధ్రకు న్యాయం చేస్తేనే తెలంగాణకు మద్దతిస్తామనడం...నిజంగా బ్లాక్ మెయిలింగ్‍కు పాల్పడడమే. "తెలంగాణ బిల్లు పెట్టండి, మేం బేషరతుగా మద్దతిస్తాం" అన్న నాటి మాటలకూ, షరతులతో కూడిన మద్దతిస్తామన్న నేటి మాటలకూ ఏమాత్రం పొంతనలేకుండా ఉండడం బీజేపీ ద్వంద్వ రాజనీతికి నిదర్శనమని భావించక తప్పదు. అందరూ ఒకేమాటపై లేకుండా రకరకాల వ్యూహాలతో, మాటలతో తెలంగాణులను ఇరకాటంలో పెట్టడం, ఆచరణ సాధ్యంకాని సవరణలు ప్రతిపాదించడం వెనుక చంద్రబాబు, వెంకయ్య నాయుడుల పాత్ర ఉంది. చంద్రబాబుకూ, వెంకయ్యనాయుడుకూ సీమాంధ్రలో ఓట్లు పడవుగానీ,  రాళ్ళు పడడం ఖాయం. ఈసారి సీమాంధ్రలో వైయెస్సార్సీపీపై ఉన్న క్రేజీ వల్ల బీజేపీకీ, తెలుగుదేశానికీ ఓట్లు రాలవనడం అతిశయోక్తి కాదు. అలాంటి సీమాంధ్ర నాయుడు ద్వయాన్ని నమ్మి, అన్యాయానికి గురైన తెలంగాణకు...బీజేపీ కేంద్రనాయకత్వం...ఇంకా అన్యాయం చేయాలా? అనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా, అరవై ఏండ్లుగా తెలంగాణను  దోచుకున్న సీమాంధ్రకే న్యాయం చేయాలనడం...అలా చేస్తేనే మద్దతిస్తామనడం...వారి కుటిల రాజనీతికి దర్పణం పడుతుంది. ఇలాంటి అవకాశవాద రాజకీయానికి బీజేపీ పాల్పడుతుందని తెలంగాణులు ఏనాడూ ఊహించలేదు. బీజేపీ చెప్పినట్లుగా బేషరతుగానే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తుందని తెలంగాణులు ఇంకా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని బీజేపీ వమ్ముచేసుకోదనే ఆశిద్దాం.


ఈ అంశంతో సంబంధం ఉన్న ఈ క్రింది టపాలను కూడా చదవండి:
(చదవదలచిన టపాపై క్లిక్ చేయండి)






జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

సోమవారం, ఫిబ్రవరి 17, 2014

ఉదాత్త నేత!


అరువదేండ్ల తెలంగాణ
దాస్యశృంఖలములు ద్రెంప
నడుముకట్టినట్టి త్యాగ
శీలుడవయ కేసీయార్!

తెలంగాణ ప్రజలందరి
నొక్క త్రాటిపై దెచ్చిన
తెలంగాణ రాష్ట్ర సాధ
నోద్యుక్తుడ కేసీయార్!

ఏ అడ్డంకులు వచ్చిన
ఎందరు నిందించినా,
మొక్కవోని ధైర్యముతో
ఎదుర్కొన్న కేసీయార్!

"తెలంగాణ వచ్చుటయో,
కేసీయార్ చచ్చుటయో"
అను నినదముతో దీక్షను
చేసితివయ కేసీయార్!

తెలంగాణ అను మాటను
అసెంబ్లిలో నిషేధింప,
"తెలంగాణ" నామస్మరణ
దిక్కయ్యెను కేసీయార్!

తెలంగాణ రాష్ట్ర స్వప్న
సాకారమ్మగునట్లుగ
ఉద్యమమ్ము నడిపించిన
నేతవీవు కేసీయార్!

తెలగాణకు గుర్తింపును
భరతదేశమందు దెచ్చి,
తెలంగాణ ఔన్నత్యము
చాటించిన కేసీయార్!

బంగారపు తెలంగాణ
నిర్మింపగ బూని, పున
ర్నిర్మాణము చేయగాను
కృషిచేతువు కేసీయార్!

ఇంత ఉదాత్తుండవైన
నీదు జన్మదినమందున
తెలంగాణ శుభాకాంక్ష
లందుకొనుము కేసీయార్!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

ఆదివారం, ఫిబ్రవరి 16, 2014

ప్రజాస్వామ్య మెలా వుండాలి?


ఏ ప్రాంతం వారు వేరు రాష్ట్రం కోరుతున్నారో, వారి యిష్టానిష్టాలే ప్రభుత్వం కోరాలి గానీ, వేరే ప్రాంతం వారు వద్దంటే ప్రభుత్వం మానడం ప్రజాస్వామ్యం కాదు.

ఒక  ప్రాంతంలో నివసించే కొందరు ప్రజలు, తాము వేరు పడతామంటే, వేరుపడతామనేవాళ్ళనే అభిప్రాయం అడగాలి గానీ, మిగతా వాళ్ళు, విడిపోతామనేవాళ్ళకు ఇష్టం ఉన్నా లేకున్నా తమతోనే కలిసి ఉండాలని కోరటం అప్రజాస్వామికం.

అదే నేడు ఆంధ్రప్రదేశ్‍లో జరుగుతున్నది. గతంలో రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‍లో కలుపబడి, ఉపేక్షకు గురై, తిరిగి తన పూర్వ రాష్ట్ర హోదానే కోరుతుంటే, సీమాంధ్రులు తమకు ఇష్టం లేదంటున్నారు.

ఇక్కడ విడిపోయేవారి యిష్టమేగానీ, ఇతరుల యిష్టానిష్టాలతో పనిలేదని తెలుసుకోవడం లేదు. మైనారిటీ ప్రజల హక్కులకు మెజారిటీ ప్రజలు భంగం కలిగింపకుండటానికే అధికరణం "మూడు" ఏర్పాటయిన విషయాన్ని వాళ్ళు మరువరాదు.

ఈ ఆర్టికల్ లేకుంటే సీమాంధ్రులు ఇప్పటికీ మదరాసులోనే బానిసబతుకులు బతికేవారనేది అక్షర సత్యం.

ఒకనాటి అనుభవాన్ని మరచిపోయి, "అత్తా ఒకింటి కోడలే" ననే సామెతను మరచిపోయి, తెలంగాణను అడ్డుకుంటున్నారు సీమాంధ్రులు.

మదరాసు అత్తనుండి వేరుకాపురం పెట్టటానికి ఆంధ్రా కోడలు పోరాడి, విజయం సాధించింది. నేడు ఆ కోడలే అత్తగా మారింది. ఆ ఆంధ్రా అత్త, ఈ తెలంగాణ కోడల్ని వేరుకాపురం పెట్టకుండా అడ్డుపడుతోంది! గతం మరచిపోయింది. 

తెలంగాణుల హక్కును కాలరాయవద్దని ఎంత వేడినా, వ్యతిరేకించడం బాధాకరం.

ఈ సమయంలో ఉపయుక్తంగానూ, కొంత ఉపశమనంగానూ ఉంటుందనే ఊహతో  ఈ దిగువ తెలిపిన పత్రికా బ్లాగును చూడవలసిందిగా పాఠకులను కోరుచున్నాను. దయతో చదువగలరు.

ప్రజలు విడిపోవఁగాఁ గోర, వద్దనుటయె
యప్రజాస్వామ్య మగునయ! యదియ వారి
జీవనపు హక్కులఁ బగులఁ జీల్పఁ బూను
టగును! కావున నాపెద మనఁగ వలదు!

ఈ ప్రజాస్వామ్య దేశాన నెవ్వరైన
వేరుపడెదమనంగనె, వారి యిష్ట
మునకు వేరొక ప్రాంతంపు జనుల యిష్ట
మవసరమెలేదు! వారల మాన్పవలదు!

గత తెలంగాణ రాష్ట్రమ్ము గాన దీని
నాంధ్ర దేశానఁ గలుపంగ నైన నష్ట
ములను సహియింప నోపక, వలచి పూర్వ
రాష్ట్రమునె కోరఁగా, నాపరాదు కాదె!

ఎన్నియో యుదాహరణాలు నున్న కతన,
నీ ప్రజాస్వామ్య దేశాన నెవ్వరైన
వారి యిష్టాలు దెలుపంగ వారణమును
చేయఁగానౌనె? యాపుట న్యాయమగునె?

దేనినిం బ్రజాస్వామ్యమ్ముగాను జెప్పి
నారొ రాజ్యాంగమునఁ జూడ, నచటి ప్రజలు
దేనిఁ గోరుదురో దానిఁ దీర్పఁగాను,
ప్రభుత తలయూచి, చేయఁగా వలయునయ్య!

ప్రభుత తలపెట్టు కార్యాలఁ, బ్రజ తలనిడి,
తోడుపడఁగఁ, బ్రజాస్వామ్య మోడకుండు!
నీ పరస్పర సహకార మీయు కతన
నీ ప్రజాస్వామ్య దేశమ్ము హితముఁ గనును!

*     *     *     *     *

 ఈ క్రింది బ్రాకెట్లో ఇచ్చినదానిపై క్లిక్ చేయండి:


[ఈ పత్రికా నిర్వాహకులు శ్రీ "విశేఖర్"గారికి నా కృతజ్ఞతలు]


జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

చింతించవద్దు! సహనమే జయిస్తుంది!!


తెలంగాణ సోదరుడా,
చింతించుట మానుమయా!
సీమాంధ్రుల దుశ్చేష్టలు
హానిచేయలేవయ్యా!!

కేంద్రము సంకల్పించెను
తెలంగాణ మీయుటకై!
ఏ ఆటంకము వచ్చిన,
చలింపకయె రాష్ట్రమిడును!!

సీమాంధ్రుల కుతంత్రాలు
మననేమియు చేయలేవు!
మనల జెఱుప జూచినచో,
వారే చెడిపోదురయ్య!!

అరువదేండ్ల మన సహనము
దైవము మెచ్చెను కావున,
కేంద్రము మనసున జొచ్చియు,
తెలంగాణ మిడుచుండెను!

దైవము సంకల్పమిదియె,
తెలంగాణ మేర్పరచుటె!
దానవత్వమును ద్రుంచియు,
వేగమె తెలగాణమిడును!!

తాటాకుల చప్పుళ్ళకు
సింహాలము బెదరమయ్య!
సింహనాదములు చేసియు
నుద్యమములు చేసితిమయ!!

సంయమనము పాటింపుడు,
తెలగాణను సాధింపుడు!
వారు రెచ్చగొట్టినచో,
రెచ్చిపోవ వలదయ్యా!!

మన కోపమె మన శత్రువు!
మన శాంతమె మనకు రక్ష!!
కోపమ్మును వదలుమయ్య!
శాంతిని చేపట్టుమయ్య!!

సీమాంధ్రుల చెడు చేతలు,
తెలగాణుల మంచి పనులు,
కేంద్రము గమనించుచుండె!
అంతయు మన మంచికెయగు!!

తెలంగాణ సోదరుడా,
తెలంగాణ మేర్పడునయ!
అరువదేండ్ల స్వప్నఫలము
సకల జనుల కిడునయ్యా!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శనివారం, ఫిబ్రవరి 15, 2014

ఇదే తగిన శిక్ష!

[పార్లమెంటులో ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన చర్య అనైతికం, దుర్మార్గం, అప్రజాస్వామికం అని దేశంలోని న్యూస్ చానెల్స్, పత్రికలు అన్నీ ఘోషిస్తుంటే, సీమాంధ్ర పత్రికలూ, న్యూస్ చానెల్సూ నెత్తికెత్తుకోవడం నీతి బాహ్యం. ఇతని చర్య ఒక ఉగ్రవాదచర్య. ఇలాంటి దేశద్రోహిని తగిన విధంగా శిక్షించాలని కోరడం పోయి, ఒక వీరునిలా  సీమాంధ్ర మీడియా పొగడడం సహింపరాని విషయం. ఇవి ఇలా నైతికంగా, తెలంగాణులను రెచ్చగొట్టే విధంగా వార్తాప్రసారాలు చేయడాన్ని కేంద్రం అడ్డుకోవాలి. ఈ దోషిని తగినవిధంగా శిక్షించాలి.]


ప్రజాస్వామ్యమును మంటను
గలిపినట్టి లగడపాటి
పార్లమెంటు వర్తనమే
ఉన్మాదపు కృతమయ్యా!

ఎంపీలను లక్ష్యమ్ముగ
పెప్పర్ స్ప్రే చేసినట్టి
లగడపాటి శిక్షార్హుడు!
తక్షణమే వెలివేయుడు!!

పోలీసుల ఎంక్వయిరీ
తప్పకుండ జరుపవలెను!
జైలులోన చిప్పకూడు
తప్పక తినిపింపవలెను!!

ఎన్నికలలొ నిలువకుండ
జీవితాంతము వరకతని
సస్పెండును చేసి శిక్ష
వేసినచో తిక్కకుదురు!

ఎంపీయా, గూండానా?
ఏమి చూచుకొనిన పొగరు?
డబ్బు మదముతోడ నిట్లు
సభలోపల వర్తింతురె?

సభలోపల ఎవ్వరైన
మర్యాద నతిక్రమింప
స్పీకరపుడు తప్పకుండ
సస్పెండును చేయవలయు!

సభా విషయములలోపల
వ్యతిరిక్తతలేవియున్న
చర్చల ద్వారమున మాత్ర
మే నివృత్తి చేయవలయు!

ప్రజాస్వామ్య రక్షకులే,
ప్రజాస్వామ్య భక్షకులుగ
మారినచో తప్పకుండ
శిక్షింపగవలయు సుమ్ము!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

తెలంగాణ బిల్లు నెగ్గినట్టే...


తెలంగాణ బిల్లు గట్టెక్కినట్టే..


భాజపా మద్దతు లేకుండా తెలంగాణా బిల్లు నెగ్గుతుంది.


ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం నాటి పరిణామాలతో బిల్లు సభామోదం పొందుతుందా? లేదా? అన్న అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా ఇప్పటి వరకు సభలో పోటాపోటీగా ఉన్న సమీకరణాలు గురువారం నాటి పరిణామాలతో తారుమారయ్యాయి.


*బిల్లుకు అనుకూలంగా ...

238 మంది సభ్యులు

సస్పెండైన 2 మంది తెలంగాణా సభ్యులను మైనస్ చేయగా

238-2=236.



నిన్న భాజపాతో సీపీఐ కూడా స్పీకర్‌ను కలవడం జరిగింది. ఒకవేళ సీపీఐ 4ఎంపీలు వ్యతిరేకంగా ఓటువేసినా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.


అంటే మద్దతు దారుల సంఖ్య..236-4=232


*బిల్లుకు వ్యతిరేకంగా...


ఇందులో భాజపా కూడా ఉంది.

238 మంది సభ్యులు

సస్పెండైన 14 మంది సీమాంధ్ర సభ్యులను మైనస్ చేయగా

238-14=224




+ బిల్లుకు అనుకూలంగా=232 మంది


_ బిల్లుకు వ్యతిరేకంగా=224 మంది.



ఇక్కడొక విషయాన్ని వ్యతిరేకులు గుర్తించాలి. సోమవారం మరికొంతమంది సీమాంధ్ర సభ్యులను కూడా సస్పెండ్ చేయవచ్చు. తద్వారా బిల్లుని వ్యతిరేకించేవారి సంఖ్యను తగ్గించడం జరుగుతుంది. అంటే భాజపా మద్దతు లేకుండా కూడా తెలంగాణా బిల్లు పార్లమెంటులో నెగ్గుతుంది. అదే సమయంలో బిల్లుపై తటస్థంగా వ్యవహరిస్తాయని భావిస్తున్న డీఎంకే(18), నేషనల్ కాన్ఫరెన్స్(3) సభలో అదే వైఖరిని కొనసాగిస్తాయా లేదా అన్నది కీలకంగా మారనుంది. తెలంగాణ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ చాలు. బిల్లుపై ఓటింగ్ జరిగే సమయానికి సభలో ఉండే సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ మంది బిల్లుకు మద్దతిస్తే తెలంగాణ బిల్లు గట్టెక్కినట్టే..



జై తెలంగాణ!    జై జై తెలంగాణ!



("బహుజనబంధు"గారికి కృతజ్ఞతలతో...బహుజనబంధుగారి ఫేస్‍బుక్‍ను చూడండి)