పూర్వ కాలమ్ము నుండియుఁ బూర్తిగాను
భద్రగిరి తెలంగాణలో భాగమోయి!
యెందఱో రాజవంశాల కందఱకును
బూజనీయ మ్మిదౌచు సమున్నతిఁ గనె!
కుతుబు షాహీల్, నిజాములు కూర్మితోడఁ
బాలనము సేసి, ప్రగతితో వఱలఁ జేయఁ,
దానిషా బంటు గోపన్న తనరు నట్టి
యాలయమ్మును గట్టించి, యర్చ సేసె!
నాంగ్ల పాలకుల్ గోరంగ నట్టి దాని
నిచ్చె మద్రాసు ప్రెసిడెన్సి యేలుబడికి!
భారతావని స్వాతంత్ర్య భాసమాన
మూర్తి కాఁగాను, నేఁబది మూఁడు వఱకు
నదియ మద్రాసు రాష్ట్రాన నటులె యుండె!
ఆంధ్రరాష్ట్ర మేర్పడిన సందర్భమందు
నేఁబదాఱున తూ.గో.జి. కిడిన పిదప,
నేఁబదియుఁ దొమ్మిదిన దాని నిడిరి ఖమ్మ
మునకు! నాఁటి నుండియు నది పూర్తిగాను
మా తెలంగాణ మందున మాకుఁ జెందె!
ఆంధ్రవారల పాలన యందు నదియ
కేవల మ్మాఱు వత్సరాల్ కిరికిరిఁ బడె!
నిట్టి కాలమ్ము నందున నిడుము లందె!
జిల్ల కేంద్రమ్మునకుఁ బోవఁ జిక్కు లెన్నొ?
ఐదు వందల మైళ్ళ ప్రయాణమునకు
లేవు రహదారులు! వరద లిచట రాఁగ,
నాదుకొనువారు లేక యున్నార లిచట!
వైద్య సౌకర్యములు లేవు! విద్య లేదు!
ఏఁబ దెన్మిదిలో గుడి కేగి, రాము
దర్శనము సేయఁగా నెంచి, తరలి వచ్చు
రెండు పడవల నున్నట్టి రెండు నూర్ల
జనులు, పడవలున్ మున్గఁగాఁ జచ్చినారు!
ఇన్ని బాధలఁ బడుచుండ నేమి కతనొ,
విడిచి, ఖమ్మ మందునఁ జేర్చి, పీడ వదలె
నంచుఁ జేతులు దులుపుకొన్నారు మీరు!
అట్టి వారలౌ మీ రిప్పు డాదరమున
"భద్రగిరి మాది" యన్నచో, ఫక్కున నగి,
మూతి మీఁదొక్క టిత్తురు! మూర్ఖు లయ్యు
నిట్టి భద్రాద్రి విడిచియు, నేఁడు పోల
వరము ప్రాజెక్టు నిర్మాణ వరము నందఁ
గోరి, భద్రాద్రి మునిఁగినన్ గూడ లెక్క
సేయకయె యుందురయ్య విచ్చేసి యిటకు?
పోలవరము వలన నెంత ముంపు కలుగు
నో తెలిసియును భద్రాద్రి నోరి కొలఁదిఁ
గోరుచుండి రనంగనుఁ, జేరి యడుగు
టిద్ది ప్రేమతోఁ గాదయ్య! హితముఁ గాదు!
దీని దుర్బుద్ధి తోడనే, తెలిసి తెలిసి,
యడుగు చుంటిరి! దీని, దుఃఖార్తిఁ ద్రోచి,
ముంపునకు గుఱిసేయు తలంపు తోడ
నే యటంచు మే మెఱుఁగమే? నీచ బుద్ధి
బయటఁ బెట్టితి రోయయ్య! వగలమారి
కోర్కి మీదయ్య! భద్రాద్రి, కూర్మిఁ బంచు
నట్టి మాదయ్య! మా హక్కు! నటులె మీకు
హక్కు లెటు లబ్బు? నాఱేండ్ల హక్కె మీది!
వంద లేండ్లుగ మాదెయౌ భద్రగిరిని
మీకు నెట్టుల నిత్తుము మేలు విడిచి?
దుష్ట చింతన తోడుత నిష్ట మనుచు
ననఁగనే, మీకు నిత్తుమే యాంధ్రవాఁడ?
మూఁడు వత్సరా లాంధ్రలో, మూఁడు వత్స
రమ్ము లాంధ్రప్రదేశానఁ గ్రాఁగి, క్రాఁగి,
చివరి కీ తెలంగాణమ్ముఁ జేరి, సుఖము
లందు భద్రాద్రి, వేఱుచేయంగఁ బూను
హక్కు లేదోయి నీ కిప్పు డాంధ్రవాఁడ!
భద్రగిరి తెలంగాణదే! బాధ యేల?
జై తెలంగాణ! జై జై తెలంగాణ!