గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఏప్రిల్ 24, 2015

గలగలా గోదారి... వలవలా తెలగాణ...

godavaribesin
 
తెలంగాణలో పది జిల్లాలుంటే అందులో ఐదు జిల్లాలను తాకుతూ ప్రవహించే గోదావరి.. తెలంగాణ మాగాణాన్ని తడుపకుండానే తరలిపోయిన విషాద గాథ ఇది! ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన నాలుగు అనకట్టల్లో ఒకటిగా నిలువాల్సిన ఇచ్ఛంపల్లి అతీగతీలేకుండా పోయిన కుట్రలను అన్వేషించే ప్రయత్నమిది! ఎప్పుడో ప్రతిపాదనలు వచ్చిన ఇచ్ఛంపల్లి ఇంకా ఎందుకు కునారిల్లుతున్నదో.. దేవనూరు ఏమైందో.. లోయర్ పెన్‌గంగా చిరునామా ఎక్కడుందో కనిపెట్టే కథనమిది! రాష్ర్టానికి 1495 టీఎంసీల నీటి కేటాయింపులుంటే.. అత్యంత దయనీయంగా కేవలం 168.5 టీఎంసీల నీటినే నిల్వ చేసుకునే రిజర్వాయర్లు ఉండటం వెనుక పన్నాగాలేంటి? ఏటా 2783.6 టీఎంసీలు వృథాగా సముద్రం పాలువుతున్నా.. వాటిని నిలిపి.. పొలాలను తడిపి తెలంగాణను పండించాలన్న ఆలోచనే రాకపోవడం వెనుక నిర్లక్ష్యపూరిత కుట్రలేంటి? ఆంధ్రప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడానికి లేని పొరుగు రాష్ర్టాలతో వివాదాలు తెలంగాణ ప్రాజెక్టులను కట్టేటప్పుడే నాటి పాలకులకు ఎందుకు గుర్తొచ్చాయి? వరద వస్తే తప్ప పనికిరాని దేవాదుల లిఫ్టుతో తెలంగాణ బావుకునేదేంటి? మన ఖర్చుతో.. మన భూములు ముంచి.. మన నుంచి.. మన నీటిని మళ్లించుపోయేందుకు ఉద్దేశించిన దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ తోక కత్తిరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సవాలక్ష సందేహాలు.. ప్రతి సందేహానికి సమాధానం! తెలంగాణను ఎండబెట్టి.. ముంచి.. ఆంధ్రను పండించాలనే నాటి సమైక్య పాలకుల వివక్షాపూరిత విధానాల కుట్రల సమ్మేళనమిది! మన నేలపై గలగలా పారే గోదారమ్మ.. మనకు కాకుండా పోతే.. ఎండుతున్న నోళ్లు.. బీళ్ల అంతులేని వ్యథ ఇది!! 
 
-నీటి దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం
-గోదావరి తీరాన ఎండిపోయిన చేలు
-రాష్ర్టానికి1495 టీఎంసీల నీటి కేటాయింపులున్నా 
నిల్వ సామర్థ్యం కేవలం 168.5 టీఎంసీలే!
-ఏండ్లుగా కునారిల్లుతున్న పెండింగ్ ప్రాజెక్టులు
-పదుల సంఖ్యలో ఉపనదులు.. ఉధృతమైన వాగులు
-ఒక్క ఆదిలాబాద్ అడవులనుంచే 150 టీఎంసీలు
-సమైక్య రాష్ట్రంలో పట్టని తెలంగాణ నీటి అవసరాలు
-లెక్క సరిచేసేందుకు నడుం బిగించిన రాష్ట్ర ప్రభుత్వం
ఇది తెలంగాణలో గోదావరి కథ! దక్షిణ గంగ (Ganges of The South)గా ప్రసిద్ధిగాంచిన గోదారమ్మ గలగలాపారుతూ.. తెలంగాణ గొంతులను తడుపకుండానే ముందుకు సాగిపోయింది. దేశంలోనే అతి పెద్ద నదుల్లో రెండవది గోదావరి. దక్షిణ భారతదేశంలో ఇదే అతిపెద్ద నది. నాసిక్ వద్ద త్రయంబకేశ్వరం సమీపంలో సహ్యాద్రి పర్వతాల్లో జన్మించిన గోదావరి మహారాష్ట్రలో 695 కిలోమీటర్లు ప్రయాణించి మన రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తెలంగాణ గడ్డపై సుమారు 550 కిలోమీటర్లు ప్రయాణించి భద్రాచలం వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది.


BAYOFBENGAL

ఉత్తర తలాపున ఆదిలాబాద్, దక్షిణ తలాపున నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలను ఒరుసుకుని ప్రవహించే గోదావరి తెలంగాణ నేలలపై కరుణ చూపకుండానే తరలిపోయింది. గోదావరి ఐదున్నర దశాబ్దాల సమైక్య నిర్వాకాలకు, నిర్లక్ష్యాలకు మౌనసాక్షి. కృష్ణా నదిలో తెలుగు ప్రజలకు లభించే నీటికంటే రెండు రెట్లు అదనంగా నీరు లభించే గోదావరి బీళ్లు పడిన తెలంగాణ ముఖం చూడకుండానే బంగాళాఖాతంలో కలిసిపోయింది. దేవనూరు రాలేదు. ఇచ్ఛంపల్లి రాలేదు. లోయర్ పెన్‌గంగా కాలేదు. పోచంపాడు హైడ్యాం ప్రణాళికను తుంగలో తొక్కి, సగానికి సగం కుదించి నిర్మించారు. అది కూడా బక్క చిక్కి, నానాటికీ కుంచించుకుపోతున్నది. 

నిజాంసాగర్ ఎండిపోయింది. సమైక్య రాష్ర్టానికి 1495 టీఎంసీలు కేటాయిస్తే అందులో తెలంగాణలో ఈ ఐదున్నర దశాబ్దాల్లో నిర్మించిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం కేవలం 168.5 టీఎంసీలు. మైనర్ ఇరిగేషన్‌కింద మరో 175 టీఎంసీల వినియోగిస్తున్నట్టు గోదావరి ట్రిబ్యునల్ తన తీర్పులోనే గుర్తించింది. మైనర్ ఇరిగేషను కింద చూపించినవన్నీ చెరువులే. సమైక్య ప్రభుత్వ నేరపూరితమైన నిర్లక్ష్యం కారనంగా చెరువులు పూడిపోయి తగినంత నీటిని నిలుపుకోలేని పరిస్థితి తలెత్తింది. ట్రిబ్యునల్ రికార్డుల ప్రకారమే గోదావరిలో మొత్తం 854.7 టీఎంసీల నీటిని ఉపయోగించుకునే హక్కు తెలంగాణకు ఉంది. ఇవికాకుండ వరద జలాలు ఎంతయినా ఉపయోగించుకునే అవకాశం మన రాష్ర్టానికి ఉంది. 

గోదావరిలో నీటి లభ్యత ఉండేది శ్రీరాంసాగర్ దిగువ భాగంలోనే. ఆదిలాబాద్‌లో ఉపనదులు, వాగులు అనేకం వచ్చి గోదావరిని చేరతాయి. మానేరు పొంగినా చేరేది గోదావరికే. ప్రాణహిత జీవనది. మహారాష్ట్రలోని గడ్చిరోలి అభయారణ్యాలను, ఆదిలాబాద్ సిర్పూర్-చెన్నూరు అడవులను చీల్చుకుంటూ ప్రవహించే ప్రాణహితలో నీటికి కొదువలేదు. అక్కడ వేరే ప్రాజెక్టులు వచ్చే అవకాశం కూడా లేదు.

గోదావరి నిండుకుండ..


ప్రతిపాదిత ఇచ్ఛంపల్లి ప్రాజెక్టుకి పన్నెండు కిలోమీటర్ల ఎగువన గోదావరిలో కలిసే ఇంద్రావతి నది కూడా జీవనదే. దట్టమైన అబూజ్‌మాడ్ కొండలు, ఇంద్రావతి అభయారణ్యం, మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవులను చీల్చుకుంటూ ప్రవహించే ఈ నదిలో కూడా నీటి లభ్యత ఎక్కువే. ఇంకా దిగువన జంపన్నవాగు, తాలిపేరు కూడా గోదావరి నదికే వన్నెతెస్తాయి. ఇక్కడెక్కడా నీటి లభ్యతకు సంబంధించిన సమస్యలేదు. పైగా రాష్ర్టానికి కేటాయించిన నీటిని వాడుకోవలసిన వాటా చాలా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటికీ గోదావరి నుంచి బంగాళాఖాతంలో కలిసే నీరు సగటున ఏటా 1781 టీఎంసీలు. ఇది గత యాభైయ్యేళ్ల సగటు. 1999 నుంచి గత పదిహేనేండ్ల సగటును పరిశీలిస్తే ఏటా 2783.6 టీఎంసీలు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. నిజానికి 2012-13లో 3013 టీఎంసీలు, 2013-14లో 5069 టీఎంసీలు సముద్రం పాలయినట్టు సీడబ్ల్యూసీ లెక్కలు చెబుతున్నాయి.

మనసంతా ఆంధ్ర పైనే


ఎంత అడ్డగోలు అంటే పైన తెలంగాణకు అత్యంత అవసరమైన ప్రాజెక్టులపై శ్రద్ధ చూపించలేదు, సరికదా దిగువన దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్, పోలవరం-ప్రకాశం బరాజ్‌లకు ఆగమేఘాలపై అనుమతులు ఇవ్వడం, కాలువలు తవ్వించడం మొదలుపెట్టారు. గోదావరి నదినుంచి ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నదికి నీటిని మళ్లించి శ్రీశైలం నదిని మొత్తానికి మొత్తం కాజేయాలన్నది అప్పటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం కుతంత్రం. వాళ్ల పరిపాలన మాత్రమే హైదరాబాద్ నుంచి, మనుషులు, మనసులు అంతా ఆంధ్రాపైనే. ఇప్పటికే అధికారికంగా 224 టీఎంసీల నీటిని వాడుకుంటున్న గోదావరి డెల్టాకు అండగా పోలవరం వద్ద 194.6 నీటి నిల్వ సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించేందుకు ఇప్పటికే ఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఈ ప్రాజెక్టుద్వారా మొత్తం 301 టీఎంసీలను ఉపయోగించుకోవాలని, ఇందులో 80 టీఎంసీలు ప్రకాశం బరాజ్ వద్ద కృష్ణా నదికి చేర్చాలని, మొత్తం 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ఆంధ్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇది కాకుండా ఇప్పుడు పట్టిసీమ నుంచి గోదావరి నీటిని లిఫ్టు చేయడానికి అదనంగా మరో ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఒడిశాతో ఒప్పందం లేదు. ఛత్తీస్‌గఢ్‌తో చర్చించింది లేదు. తెలంగాణతో అంగీకారం లేదు. కానీ కేంద్రం ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తుంది. ఆంధ్ర ప్రభుత్వం ఆగమేఘాలపై నిర్మాణాలు చేపడుతుంది.

వాటానే ఉపయోగించుకోని తెలంగాణ


విషాదం ఏమంటే రెండు నదుల్లో తెలంగాణకు ఇప్పటికి కేటాయించిన వాటా జలాలనే వినియోగించలేదు. రాయలసీమవైపు కృష్ణా నదిపై ఆయన అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నారు. నీళ్లు మళ్లించుకుంటున్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. సమైక్యపాలకులు తెలంగాణ ప్రాజెక్టుల విషయం వచ్చే సరికి అన్ని అంతర్రాష్ట్ర వివాదాలు గుర్తుకు తెచ్చేవారు. అన్ని ఒప్పందాలు పూర్తయిన ఇచ్చంపల్లికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఒప్పుకోవడం లేదంటారు. ఏ ఒప్పందాలు లేకుండానే ప్రాణహిత-చేవెళ్లను ప్రారంభిస్తారు. ఇదంతా తెలంగాణ ప్రజలను మోసం చేసే కుట్రలో భాగమే.కానీ నీటి లభ్యత అధికంగా ఉండే ప్రాణహిత, ఇంద్రావతి నదీ సంగమాలకు దిగువన మరో ప్రాజెక్టు రాకుండా సమైక్య ప్రభుత్వం కుట్ర చేస్తూ వచ్చింది.

గోదావరి నది గలగలాపారుతూ ఆంధ్రలో ప్రవేశించాలన్నది వారి కుతంత్రం. ఇంజినీరింగ్ నిపుణుల సలహాలను పెడచెవినపెట్టి కాళేశ్వరాన్ని వదలి తుమ్మిడిహట్టిని ఎంచుకోవడంలో కూడా ఇదే కుట్ర దాగి ఉంది. 1955లోనే అంగీకారానికి వచ్చిన ఇచ్చంపల్లి ప్రాజెక్టును పనిగట్టుకుని తొక్కిపెట్టారు. సమైక్యాంధ్ర నాయకత్వం తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చింది. అవి ఏమంటే 
1.వీలైన మేరకు ప్రాజెక్టులు చేపట్టకుండా చూడడం.
2.ఒక వేళ తప్పనిసరై ప్రాజెక్టులు చేపట్టాల్సివస్తే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేట్టు చూడడం. 
3.ముందే వివాదాలు ఉంటే సంతోషం. లేకుంటే కొత్తగా వివాదాలు తలెత్తే విధంగా చర్యలు తీసుకోవడం.

ప్రాణహిత-చేవెళ్ల విషయంలో కూడా అదే జరిగింది. ప్రాణహిత నదిపై తుమ్మిడి హట్టి వద్ద బరాజ్ నిర్మిస్తే మహారాష్ట్రలో 25 గ్రామాలు మునుగుతాయి. అక్కడ ఒక సంరక్షణ కేంద్రం(శాంక్చువరీ) మునుగుతుంది. అటవీ భూములు మునుగుతాయి. మహారాష్ట్రతో కనీస చర్చలు జరుపలేదు. రెండు రాష్ర్టాల ఉన్నతాధికారులతో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ఒకసారి ముఖ్యమంత్రులు అంగీకారానికి వచ్చారు. కానీ బోర్డులు వేయడం కానీ, చర్చలు జరుపడం కానీ, అంగీకారానికి రావడం కానీ జరుగలేదు. పైగా వేల కోట్ల రూపాయలు వెచ్చించి పనులు మొదలు పెట్టారు. ఈ పనులేవీ నీళ్లిచ్చే ఉద్దేశంతో చేసినవి కాదు. వీలైనంత ఎక్కువకాలం కాలయాపన చేయడం. వీలైనంత ధనాన్ని కాజేయడం. ఇది చాలా ఇష్టంగా, శ్రద్ధగా, ఒక పద్ధతి ప్రకారం చేసిన మోసం.

అతీగతీలేని ఇచ్ఛంపల్లి


ఇచ్ఛంపల్లిని అంగీకారం జరిగిన తొలిరోజుల్లోనే నిర్మాణం చేపట్టి ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇచ్ఛంపల్లి ఎగువన గోదావరి పొడవున అప్పట్లో ఇన్ని గ్రామాలు లేవు. తెలంగాణ ప్రాజెక్టులు అనుకున్న సమయంలో చేపట్టకపోవడం వల్ల ఈలోపున మహారాష్ట్ర ఎడాపెడా ప్రాజెక్టులు, బరాజ్‌లు నిర్మించుకుని నీటి హక్కులు దక్కించుకుంది. దిగువన ఆంధ్రా ప్రాజెక్టుల విషయంలో కూడా అంతే హడావిడి జరిగింది. మధ్యలో తెలంగాణ ప్రాజెక్టులే ఇవ్వాళ నీటి హక్కులకోసం, అంతర్రాష్ట వివాదాల పరిష్కారం కోసం నానాతంటాలు పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇచ్ఛంపల్లి ప్రాజెక్టును ప్రపంచంలోనే అత్యంత అధికంగా నీటిని నిలువచేసే నాలుగవ డ్యాంగా నిర్మించాలని తలపెట్టారు.

125 మీటర్ల ఎత్తుతో డ్యాంను నిర్మించి 1000 టీఎంసీల నీటిని నిలువ చేయవచ్చునని తొలుత అంచనా వేశారు. ఈజిప్టులోని అశ్వాన్ డ్యాంను 4600 టీఎంసీలు, ఘనాలోని లేక్ ఓల్టా డ్యాంను 4200 టీఎంసీలు, చైనాలోని త్రీ గార్జెస్ డ్యాంను 1350 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఉదాహరణలున్నాయి. కానీ పెద్ద ఎత్తున అడవులు మునుగుతాయని, బొగ్గు నిక్షేపాలు మునిగిపోతాయని కారణం చూపి ఇక్కడ ఇచ్ఛపల్లి డ్యాం ఎ త్తును 122 మీటర్లకు, ఆ తర్వాత 90 మీటర్లకు తగ్గిం చి నిర్మించాలని సమైక్య ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. చివరకు 95 మీటర్ల ఎత్తుతో డ్యాం నిర్మించాలని నిర్ణయించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తూ సమైక్య ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఛత్తీస్‌గఢ్ మాత్రమే స్పందించాల్సి ఉంది. కానీ ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు.

అనేక నాగరికతలు వర్ధిల్లిన నదీ తీరం. జ్యోతిర్లింగ త్రయంబకేశ్వరుని సన్నిధిన జన్మించి, నాసిక్, కోపర్‌గాం, పైఠాన్, నాందేడ్‌ల ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించి నిజామాబాద్-ఆదిలాబాద్ సరిహద్దులో కందకుర్తి వద్ద తెలుగునేలను పునీతం చేస్తుంది. కందకుర్తి వద్ద మంజీర, హరిద్ర నదులు గోదావరి నదితో కలిసి త్రివేణి సంగమంగా ముందుకు సాగుతాయి. తెలుగునేలను పాలించిన శాతవాహనులు పుట్టిందీ, పెరిగింది, రాజధానులను నిర్మించిందీ, సామ్రాజ్యాన్ని విస్తరించిందీ ఈ నది తీరాన్ని అనుకునే. తొలుత ప్రతిష్ఠానపురం(నేటి పైఠాన్), ఆ తర్వాత కోటిలింగాల వర్ధిల్లిందీ ఈ నదీతీరం వెంబడే. మానేరు, ప్రాణహితలు గోదావరిలో లీనమై కాళేశ్వరుడిని అభిషేకం చేసే త్రివేణి సంగమం ఇక్కడే. నాగరికతలు, రాజులు, రాజ్యాలు నదీ జలాలు ఆలంబనగా చేసుకునే తమ పాలన సాగించారు.

దండగమారి టెయిల్‌పాండ్


దుమ్ముగూడెం-టెయిల్‌పాండ్ తెలంగాణకు అత్యంత దండగమారి ప్రాజెక్టు. నాగార్జునసాగర్‌నుంచి ఎడమకాలువ ఖమ్మం జిల్లా చివరి భూములదాకా నీటిని కొనిపోతుంటే, దానికి రివర్సులో దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కు దిగువన అడవిదేవులపల్లి సమీపంలో కృష్ణానదిలో నిర్మించి టెయిల్‌పాండ్‌కు నీళ్లు మళ్లించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం సేకరించే భూములు మనవి. దీని నిర్మాణం ఖర్చు మనది. అప్పుమనది. ఈ ప్రాజెక్టుద్వారా ఏకంగా 135 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించాలని రాజశేఖర్‌రెడ్డి ప్లాన్ వేశారు. అంటే భారం తెలంగాణది, నీరు ఆంధ్రకు. అంటే మొత్తం 215 టీఎంసీలు కృష్ణాకు మళ్లించాలన్నది ప్రణాళిక. ఈ నీటిని మళ్లిస్తే రాయలసీమ-తెలంగాణలకు సాగర్, శ్రీశైలంలో 175 టీఎంసీలు అదనంగా నికర జలాలు వస్తాయని ఆయన ఆశ చూపారు. 

సమైక్య పాలకుల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంసమైక్య ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే గోదావరిపై ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాయి. పోచంపాడు ప్రాజెక్టువద్ద 330 టీఎంసీల నీటిని నిల్వచేసే హైడ్యాం నిర్మించాలని తొలుత ప్రతిపాదించగా దానిని కుదించి, కుదించి 110 టీఎంసీలకు తగ్గించి నిర్మించారు. ఇసుక మేట వేసి డ్యాం నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా 90 టీఎంసీలకు, ఇప్పుడు 76టీఎంసీలకు తగ్గిపోయిందని నీటిపారుదల ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. పోచంపాడు తర్వాత గోదావరి నదిపై ఇంకే ప్రాజెక్టు రాకుండా చూడాలన్న కుట్రలో భాగంగానే ఇంతకాలం మరో భారీ ప్రాజెక్టు ఏదీ చేపట్టలేదు.

ప్రాణహిత-చేవెళ్ల పథకంలో భాగంగా చేపట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక విధంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. పరిమిత నీటి నిల్వ సామర్థ్యం కలిగినది. ప్రాణహిత నీరు మొత్తం 70 కిలోమీటర్లకు దిగువన కాళేశ్వరంవద్ద గోదావరి నదికే వచ్చి చేరుతుండగా కావాలని అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికించి ప్రాజెక్టును పూర్తి చేయకుండా సతాయించడంకోసం తుమ్మిడిహట్టినుంచి నీటిని తరలించాలని ప్రాజెక్టును రూపొందించారు. గోదావరిపై నిర్మిస్తే పోలవరానికి, గోదావరి డెల్టాకు అడ్డం అవుతుందని భావించి ఇటువంటి ఎత్తులు జిత్తులు ఎన్నో సమైక్య ప్రభుత్వాలు చేశాయి. ఎంత విడ్డూరమంటే గోదావరి నదిపై దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. కానీ నదీ ప్రవాహం నుంచి ఎవరూ లిఫ్టు చేయరు. నది నిండుగా ప్రవహించిన రోజులలో అలా లిఫ్టు చేయడం సాధ్యం కావచ్చు. కానీ కనీస మట్టాల్లో ప్రవహించే రోజుల్లో అలా చేయడం సాధ్యం కాదు. నదిపై బరాజ్ నిర్మించి నీటిని నిల్వచేసి, అందులోనుంచి నీటిని లిఫ్టు చేస్తారు. అటువంటి ఆలోచన కూడా గత ప్రభుత్వాలు చేయలేదు. 
 
 
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో) 
 
 జై తెలంగాణ! జై జై తెలంగాణ!
 
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి